ఏప్రిల్ నుంచి రూ. 5 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల బాదుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏప్రిల్ నుంచి రూ. 5 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల బాదుడు

ఏప్రిల్ నుంచి రూ. 5 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల బాదుడు

Written By ysrcongress on Wednesday, January 18, 2012 | 1/18/2012

విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్
వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం
ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ వసూలు
పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై యూనిట్ విద్యుత్‌కు 78.38 పైసలు అదనంగా వసూలు 
గృహ వినియోగదారులపై 33.88 పైసల భారం
గతంలో గృహాలపై భారాన్ని తగ్గించిన వైఎస్
వైఎస్ తరహాలో భరించలేమన్న కిరణ్ సర్కార్
ఏప్రిల్ నుంచి రూ. 5 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల బాదుడు
 రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ చార్జీల మోత మోగిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ విద్యుత్ చార్జీలను పెంచనున్న ప్రభుత్వం.. అంతకంటే ముందే.. వచ్చే నెల (ఫిబ్రవరి) నుంచే వినియోగదారులపై సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) పేరిట రూ.2,547 కోట్ల భారం మోపనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సర్దుబాటు చార్జీలను వసూలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ ఈ సర్దుబాటు చార్జీలు వసూలు చేయనున్నారు. వ్యవసాయం మినహా మరమగ్గాలు, దోబీఘాట్లు వంటి అన్నిరకాల విద్యుత్ వినియోగదారులపై భారం పడనుంది. గృహ వినియోగదారులపై యూనిట్‌కు 33.88 పైసల చొప్పున అదనపు భారం పడనుండగా.... పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై యూనిట్‌కు ఏకంగా 78.38 పైసల మేరకు అదనంగా భారం పడనుంది. అయితే 2008-09 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ వినియోగదారులపై సర్దుబాటు భారం వేయకూడదని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలపై వేయాల్సిన రూ. 502 కోట్ల భారాన్ని తామే భరిస్తామని హామీ ఇచ్చారు. కానీ 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను మాత్రం భరించలేమని తాజా సర్కారు తేల్చిచెప్పింది. దీంతో గృహ వినియోగదారులపై యూనిట్‌కు 33.88 పైసల చొప్పున వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఈ విధంగా మొత్తం రూ.3,049.07 కోట్ల మేరకు వినియోగదారులపై భారం పడనుండగా ఇందులో రూ.502 కోట్లు (2008-09) భరించేందుకు వైఎస్ హామీ ఇవ్వడంతో అంతిమంగా ప్రజలపై రూ.2,547.07 కోట్ల భారం పడనుంది. 

ఎందుకు వడ్డన..

2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలుకు, ఉత్పత్తికి అయిన అదనపు వ్యయాన్ని సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్‌సీకి డిస్కంలు దరఖాస్తు చేసుకున్నాయి. 2008 ఏప్రిల్ 1 నుంచి 2009 మార్చి వరకు రూ. 1,649 కోట్ల మేరకు సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసుకోవాల్సి ఉందని... ఈ మొత్తానికి గాను యూనిట్‌కు అదనంగా 44 పైసల చొప్పున పడనుందని పేర్కొన్నాయి. అదేవిధంగా 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 1481 కోట్లు వసూలు చేసుకోవాల్సి ఉందని.... యూని ట్‌కు 36 పైసల చొప్పున వసూలు చేసుకోవాల్సి ఉందని తెలి పాయి. దీనిపై ఈఆర్‌సీ ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అనంతరం సర్దుబాటు చార్జీల వసూలుకు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 2008-09లో రూ. 1649 కోట్ల మేరకు యూనిట్‌కు సగటున 44.5 పైసలు, 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 1400.07 కోట్లను యూనిట్‌కు 33.88 పైసల చొప్పున వసూలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 

ఎప్పటినుంచి?

2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను వచ్చే నెల నుంచే వసూలు చేయనున్నారు. 2009 ఏప్రిల్-జూన్ తైమాసికం సర్దుబాటు చార్జీలను ఫిబ్రవరి 2012 నుంచి ఏప్రిల్ 2012 వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా 2009 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానిది...2012 మే నుంచి జూలై వరకు, 2009 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం సర్దుబాటు చార్జీలను 2012 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా 2010 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించిన సర్దుబాటు భారాన్ని.... 2012 నవంబర్, డిసెంబర్‌తో పాటు 2013 జనవరి వరకు వసూలు చేస్తారు. ఈ మొత్తం రూ. 1,400.07 కోట్ల భారాన్ని... యూనిట్‌కు సగటున రూ. 33.88 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. 

ఎవరో వాడారు... మీరు కట్టాలి!

2008-09కి సంబంధించి గృహ వినియోగదారులపై (వైఎస్ హామీ మేరకు) భారం పడే అవకాశం లేదు. అయితే, 2009-10 ఆర్థిక సంవత్సరం భారం మాత్రం గృహ వినియోగదారులపై పడనుంది. 2009 ఏప్రిల్ నుంచి 2010 మార్చి వరకు వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌కు 36 పైసల చొప్పున.... ఫిబ్రవరి నుంచి గృహ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. 2009 ఏప్రిల్ నుంచి 2010 మార్చి వరకు ప్రతి నెలా వాడిన విద్యుత్ వినియోగాన్ని బట్టి ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ వసూలు చేయనున్నారు. అంటే మీరు కొత్తగా ఒక ఇంట్లో అద్దెకు చేరారనుకుంటే.... మీ కంటే ముందు ఉన్న వారి బిల్లును మీరు చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ‘వాస్తవానికి సర్దుబాటు చార్జీలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈఆర్‌సీకి డిస్కంలు సమర్పించాలి. వీటిని పరిశీలించి.... ఈఆర్‌సీ వెంటనే ఆదేశాలు జారీచేయాల్సి ఉంటుంది. అంతేకానీ మూడు,నాలుగేళ్ల నాటి ప్రతిపాదనలకు ఇప్పుడు ఆదేశాలు జారీచేయడం సరికాదు. దీనివల్లే ఎవరో వాడుకున్న కరెం టుకు ప్రస్తుతం ఉంటున్నవారు బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇది సరైన విధానం కాదు’ అని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పాత ఆదేశాలే మళ్లీ...!: 2008-09 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలపై 2010 జూన్‌లోనే ఈఆర్‌సీ ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించకుండా ఆదేశాలు జారీచేశారంటూ.... అనేక పరిశ్రమలు హైకోర్టును ఆశ్రయించాయి. సర్దుబాటు ప్రతిపాదనలపై బహిరంగ విచారణ అనంతరం తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు సూచించింది. ఆ మేరకు పాత ఆదేశాలనే ఈఆర్‌సీ జారీ చేసింది. ఎవరైనా హైకోర్టుకు వెళ్లి సర్దుబాటు చార్జీల నుంచి తాత్కాలికంగా మినహాయింపు పొంది ఉంటే వారి నుంచి కూడా 2008-09 చార్జీలను వచ్చే ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు వసూలు చేయనున్నారు. 

వైఎస్ తరహాలో భరించలేం....!

2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ. 502 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో గృహ వినియోగదారులకు ఊరట లభించింది. అయితే 2009-10 ఆర్థిక సంవత్సరం సర్దుబాటు చార్జీలపై ప్రస్తుత సర్కారు చేతులెత్తేసింది. గతంలో వైఎస్ హామీ ఇచ్చిన మేరకు మాత్రమే (2008-09కి మాత్రమే) ఇవ్వగలమని తేల్చిచెప్పింది. అప్పట్లో వైఎస్ ఇచ్చిన లేఖనే మళ్లీ ఇస్తూ.... రూ. 502 కోట్లకు మించి ఒక్కపైసా కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతకుమించి పడే భారాన్ని గృహ వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2009-10 ఆర్థిక సంవత్సరంలోని సర్దుబాటు చార్జీల భారం గృహ వినియోగదారులపై ఏకంగా రూ. 477 కోట్ల మేర పడనుంది. ఈ మొత్తాన్ని యూనిట్‌కు 33.88 పైసల చొప్పున 2012 ఫిబ్రవరి నుంచి 2013 జనవరి వరకూ వసూలు చేయనున్నారు. 

ఏప్రిల్ నుంచి మరో బాదుడు

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను ఈఆర్‌సీ ముందున్నాయి. 30 యూనిట్ల పైబడిన గృహ వినియోగదారులతో పాటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నింటిపైనా యూనిట్‌కు 50 పైసలనుంచి రూపాయికిపైగా పెంచేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ మొత్తం భారం సుమారు రూ.5 వేల కోట్లు. ఈ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ అనంతరం.....మార్చి నెలాఖరులో ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే రెగ్యులర్ చార్జీల రూపంలో రూ.5 వేల కోట్లతో పాటు సర్దుబాటు చార్జీల రూపంలో మరో రూ.2,547 కోట్లతో మొత్తం రూ. 7,547 కోట్ల మేర భారం ప్రజలపై పడుతుందన్నమాట.

సర్దుబాటు చార్జీలంటే...

ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే హైడల్ (జల) విద్యుత్ తగ్గి.... బొగ్గు, గ్యాసు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఆ మేరకు పెరుగుతుంది. దీనితో పాటు దేశీయ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అధిక ధరకు విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్న ఫలితంగా కూడా విద్యుత్ ఉత్పత్తికి అదనపు వ్యయం పెరుగుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి వెచ్చించిన అదనపు ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఈ చార్జీలనే ఇంధన సర్దుబాటు చార్జీలుగా (ఎఫ్‌ఎస్‌ఏ) వ్యవహరిస్తారు.
Share this article :

0 comments: