రబీ పంట రుణాల లక్ష్యంలో 50 శాతమే పూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రబీ పంట రుణాల లక్ష్యంలో 50 శాతమే పూర్తి

రబీ పంట రుణాల లక్ష్యంలో 50 శాతమే పూర్తి

Written By ysrcongress on Monday, January 30, 2012 | 1/30/2012


ఇవ్వాల్సింది 10 వేల కోట్లు, ఇచ్చింది 5 వేల కోట్లు
బ్యాంకు రుణాలు ఇప్పించడంలో సర్కారు విఫలం
చేసేది లేక ప్రైవేటు రుణాల వైపు రైతన్నలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అటు కరువు.. ఇటు కరెంటు కోతలతో నష్టాలను మూటగట్టుకున్న రైతన్నలకు రుణాలిచ్చి ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేసింది! రబీలో రైతులకు రూ.10 వేల కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అందులో ఇప్పటిదాకా సగం మాత్రమే ఇచ్చింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని అన్నదాతకు పెట్టుబడి ఖర్చుల కోసం ప్రైవేటు రుణాలే దిక్కయ్యాయి. కరువుతో ఖరీఫ్‌లో పంటలు ఎండిపోయాయి. సర్కారు సాయం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో వీలైనంత ఎక్కువగా పంట రుణాలు ఇప్పించి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. ఆ విషయాన్నే మరిచిపోయింది.

సీజన్ ముగిశాక రుణాలా..?

ప్రస్తుత రబీలో అన్ని పంటలు కలిపి 1.05 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.10,700 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం రబీ సాగు పనులు పూర్తయినా అన్ని బ్యాంకులు కలిపి కేవలం రూ.5,313 కోట్ల రుణాలే ఇచ్చాయి. ఇష్టారీతిన పెరుగుతున్న ఎరువులు, విత్తనాలు, డీజిల్, కూలీల ఖర్చులు.. ఇలా రైతన్నకు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులను ఒప్పించి రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం ఇదేమీ చేయలేదు. ఫలితంగా రైతులు పంటలు వేసేందుకు ముందుకు రాకపోవడంతో రబీలో వ్యవసాయ శాఖ లక్ష్యం కన్నా 26 లక్షల ఎకరాలు తక్కువగా అంటే.. 79 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వ్యవసాయ సీజను మొదలయ్యే లోపే బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇస్తే పెట్టుబడికి ఇబ్బంది ఉండదు. వ్యవసాయ శాఖ మాత్రం దీన్ని పట్టించుకోవడంలేదు. అదనులో అందని, అదీ వస్తుందో రాదో తెలియని రుణం కోసం ఎదురు చూడలేక.. ఎక్కువ మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తెచ్చి సాగు చేస్తున్నారు.

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం..

సొంత భూమి కలిగిన రైతులకు రుణాలిచ్చేందుకే ఆసక్తి చూపని బ్యాంకులు కౌలు రైతులను దగ్గరికే రానివ్వడం లేదు. భూ యజమానులకు సమానంగా వీరికి రుణాలు, ఇతర సబ్సిడీలను, రుణ అర్హత కార్డులను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 20 లక్షల కౌలు రైతులు ఉండగా కేవలం 5,49,889 మందికే రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వీరిలో రబీలో 59,335 మందికే రూ.106 కోట్ల రుణాలిచ్చారు. కార్డులున్నవారికే రుణాలందని పరిస్థితి ఉండగా.. ఇప్పుడు సర్కారు మళ్లీ కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టడం గమనార్హం.
Share this article :

0 comments: