ఎకరాకు రూ.70 వేలు నష్టం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎకరాకు రూ.70 వేలు నష్టం..

ఎకరాకు రూ.70 వేలు నష్టం..

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

*విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం కావాలి? 
*మరో రెండు నెలల్లో పరీక్షలు రాబోతున్నాయి
*ప్రభుత్వం ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు
*యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితేంటి?
*హఠాత్తుగా వేల రూపాయలు తెచ్చివ్వాలంటే తల్లిదండ్రులేమైపోవాలి?
*ఈ రోజు ప్రతి రైతు కంటా కన్నీరే
*రైతులపై రైతు కూలీలకు సానుభూతి ఉంది కానీ.. ప్రభుత్వానికి లేదు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో పూర్తి కావస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఫీజుల సొమ్ము చెల్లించకపోతే మరో రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వబోమని కళాశాలల యాజమాన్యాలు.. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 53వ రోజు శనివారం ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోని గ్రామాలలో పర్యటించారు. 15 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాలలో ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు అందడంలేదని ఇటీవలే ఒక ఉద్యమాన్ని చేశాం. ఆ ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్‌ను ముట్టడించాం. నేను కూడా ఒంగోలులో ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకున్నా. ఉద్యమంతో కలిసి వచ్చిన విద్యార్థులను ‘అమ్మా.. ఈ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మీకు అందిందా’ అని అడిగినపుడు.. ఆ పిల్లలంతా చేతులు అడ్డంగా ఊపుతూ ‘అన్నా... ఇంతవరకు మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదన్నా’ అని చెప్పారు. ‘అన్నా.. ఈ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారన్నా... కాని మాకు నిరుడుకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లే ఇంకా చాలా మందికి అందలేదన్నా’ అని చెప్పినపుడు బాధనిపించింది. 

ఈ విద్యా సంవత్సరం మరో రెండు నెలల్లో పూర్తి కావస్తోంది. పిల్లలు ఒక సెమిస్టర్ పూర్తి చేసుకుని రెండో సెమిస్టర్‌లోకి వెళ్లిపోయారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కొద్దిరోజులు పోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికె ట్లు ఇవ్వాలంటే ఆ పిల్లలు ఫీజులు కడితే తప్ప మేం హల్ టికె ట్లు ఇవ్వలేమని చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను రూ.35 వేలు, డాక్టర్ చదివే పిల్లలను రూ.55 వేలు కట్టాలని, కడితేనే హల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తే, ఆ పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు ఆ మాట చెబితే, హఠాత్తుగా అప్పటికప్పుడు అంతంత డబ్బు తేవలసి వస్తే.. ఆ తల్లిదండ్రులు ఏమైపోతారోనన్న కనీస ఆలోచన కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఉన్నారు.

ఎకరాకు రూ.70 వేలు నష్టం..
కాసేపటి కిందట నేను పొలాల నుంచి వస్తూ ఉన్నప్పుడు కొంత మంది పసుపు రైతులు కలిశారు. ‘అన్నా.. మా పసుపు తోటను చూడన్నా’ అంటూ తోటలోకి తీసుకెళ్లి పసుపు మొక్కలను నాకు చూపించారు. ‘అన్నా... దాదాపుగా రూ.50- 60 వేలు ఖర్చు చేశాం. పసుపు పూర్తిగా మా చేతికి వచ్చే సమయానికి రూ.లక్ష-1.20 లక్షలు ఖర్చు అవుతుంది. పంటను మార్కెట్‌కు తీసుకుని పోతే క్వింటాలుకు రూ. 3,500 మాత్రమే వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రేట్లకు మేం పసుపు అమ్మితే ఎకరాకు కనీసం రూ.70 వేలు నష్టం వచ్చే పరిస్థితి ఉందన్నా..’ అని చెప్పినపుడు చాలా బాధనిపించింది. 

మిర్చి రైతు, వరి రైతు, టమాటా రైతు, ఉల్లి రైతు, ప్రతి రైతన్నా కంట్లో ఈవాళ కన్నీళ్లే కనిపిస్తున్నాయి. అదే పొలాల్లో కూలి పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మలను ఎంత కూలీ గిడుతోంది తల్లీ అని అడిగినపుడు రూ.100 కూడా గిట్టడంలేదన్నా అన్న సమాధానాలే ఎక్కువగా వినిపించాయి. అక్కడక్కడ మాత్రం రూ.120 గిట్టుతున్నాయన్న మాటలు వినిపించాయి. ‘అన్నా.. ఇవాళ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నా.. వారు పంటలను మార్కెట్‌లోకి తీసుకుని అమ్మితే గిట్టుబాటు కాని పరిస్థితులలో ఉన్నారన్నా.. వాళ్లు ఇంతకంటే ఎక్కువ కూలీ ఏమివ్వగలరన్నా’ అని ఆ అక్కాచెల్లెమ్మలు రైతన్నమీద సానుభూతి చూపిస్తున్నారు. బాధెక్కడనిపిస్తోందంటే తోటి మనిషి మీద ఇంకో మనిషి సానుభూతి చూపిస్తున్నాడుకానీ.. సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం మాత్రం కనీస ప్రేమ కూడా చూపించకుండా.. తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

104కు ఫోన్ కొడితే..
గ్రామాలలో అవ్వా తాతలెవరికైనా బీపీ, షుగర్‌లు ఉండి వారు కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. వారిని అక్కడికక్కడే పరీక్షించి మందులు ఇవ్వాలని, వారికి తోడుగా నిలవాలని దివంగత వైఎస్సార్ ఓ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకం పేరే 104. ఇవాళ ఆ 104 నంబరుకు ఫోను కొడితే.. గత 8 నెలల నుంచి మా సిబ్బంది అందరూ సమ్మె చేస్తున్నారనో, మా అంబులెన్స్‌లో మందులు లేవనో సమాధానాలు వినబడుతున్నాయి. ఇంత అధ్వానమైన పరిస్థితులలో, ప్రజల ఆరోగ్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.

వస్తారా.... చావమంటారా?
జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి అచ్చంపేటతో యాత్ర ముగించుకుని విశ్రాంతి కోసం దాచేపల్లి మండలంలోని ముత్యాలంపాడుకు బయలు దేరారు. తమ గ్రామం రావాలంటూ అచ్చంపేట మండలంలోని అంబడిపూడి గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌కు అడ్డు పడ్డారు. ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని జగన్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన తమ గ్రామం రావడంలేదని తెలుసుకున్న స్థానికుల్లో ఒకరు వాటర్‌ట్యాంకు ఎక్కారు. మరో వ్యక్తి కిరోసిన్ డబ్బా తెచ్చుకుని ఒంటి మీద పోసుకునేందుకు ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకుని జగన్‌మోహన్‌రెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన అంబడిపూడి వెళ్లి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. అంబడిపూడి నుంచి ముత్యాలంపాడుకు దాదాపు 85 కిలోమీటర్ల దూరం. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి బసకు చేరుకోవడానికి అర్ధరాత్రి దాటింది.
Share this article :

0 comments: