ఇంట్లో ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ వేసుకుని కాలక్షేపం చేయడమే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంట్లో ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ వేసుకుని కాలక్షేపం చేయడమే..

ఇంట్లో ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ వేసుకుని కాలక్షేపం చేయడమే..

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012


* ఇప్పటివరకూ 30 యూనిట్లకుబిల్లు రూ.63.50
* కొత్త చార్జీలు అమల్లోకి వస్తే.. 31 యూనిట్లు వాడితే రూ.105.60
* అంటే ఆ అదనపు ఒక్క యూనిట్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.42.10!
* శ్లాబుల మాయాజాలంతో పెనుభారం
* 30 యూనిట్లు లోపు వాడేవారే పేదోళ్లు.. ఆపై దాటితే బాదుడే..
* ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి...

హైదరాబాద్, న్యూస్‌లైన్: కరెంటు 30 యూనిట్లు దాటి వాడితే ఏమవుతుంది? బిల్లు బాంబవుతుంది! కరెంట్ కాదు.. బిల్లే షాక్ కొడుతుంది!! ఎందుకంటే.. రోజుకు ఒక యూనిట్ చొప్పున 30 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించినవారే పేదోళ్లని(దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు) రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది కాబట్టి.. మిగతావారందరినీ చార్జీలతో చావబాదాలనే నిర్ణయానికి వచ్చింది కాబట్టి.. ఈ లెక్కన 30 యూనిట్లలోపు కరెంటు వాడాలంటే.. మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఇంట్లో ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ వేసుకుని కాలక్షేపం చేయడమే.. అదీ ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు వాడ్డానికి లేదు. రోజుకు కేవలం ఎనిమిదిన్నర గంటలే! అప్పుడే నెలకు 30 యూనిట్లు అవుతుంది. కాదు కూడదని అన్నారో.. అదనంగా వాడే ఆ ఒక్క యూనిట్‌కు మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంతో తెలుసా? రూ.42.10!! కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని మరో మూడు నెలల్లో ఈ కరెంటు బాంబు మన ముంగిట్లోనే పేలనుంది. ఈ వింత విద్యుత్ చార్జీల విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 

శ్లాబుల లోగుట్టు ఇదీ...
ఇప్పటివరకూ విద్యుత్ యూనిట్ల వినియోగాన్ని బట్టి.. 0-50, 51-100, 101-200, 201-300, 301-500, 500 ఆపైన శ్లాబులుగా విభజించారు. అయితే, ఇటీవల డిస్కంలు సమర్పించిన తాజా ప్రతిపాదనల్లో 0-50తోపాటు 51-100 స్థానంలో 0-100 అనే కొత్త శ్లాబును ఏర్పాటు చేశారు. 1-50 వరకూ యూనిట్‌కు రూ.1.45నే వసూలు చేయనున్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. చార్జీలేమీ పెంచలేదని నమ్మబలికారు. కేవలం 51 యూనిట్లు దాటినవారికే టెలిస్కోపిక్ విధానం ఎత్తేశామని.. వారిని 0-100 శ్లాబు కింద ప్రతి యూనిట్‌కు రూ.2.60 చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రతిపాదించారు. అయితే, ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించినప్పుడు.. అసలు విషయం బయటపడింది. 

ఏడాదికి 360 యూనిట్లకు(నెలకు 30 యూనిట్లకుపైగా) పైగా వినియోగించేవారికి తక్కువ చార్జీలు వసూలు చేయాల్సిన అవసరం లేదని.. వీరిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నవారిగా పరిగణించలేమని.. అందుకే వీరిని 0-100 శ్లాబు వినియోగదారులుగా పరిగణించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఫలితంగా 0-50 శ్లాబు 0-30గా మారనుంది. ఈ లెక్కన నెలకు 30 యూనిట్ల వినియోగం దాటిన వారందరికీ యూనిట్‌కు రూ.1.45కు బదులుగా రూ.2.60 చొప్పున బాదుతారన్న మాట! 0-50 యూనిట్లలోపు వినియోగదారులు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ఉన్నారు. వీరిలో 30 యూనిట్లలోపు వారు 25 లక్షల మంది ఉండగా.. 31 నుంచి 50 యూనిట్లు వినియోగించే వారి సంఖ్య 75 లక్షల మందికిపైనే. అత్యధిక వినియోగదారులకు చార్జీలు పెంచలేదని పైకి చెప్పుకోవడానికే ప్రభుత్వం 0-50 శ్లాబును కొనసాగిస్తూ.. అసలు విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించింది. 

బీపీఎల్‌పై భారాన్ని తగ్గించరా?
నెలకు 30 యూనిట్లపైబడి వినియోగించే వారిపై చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.... పేద కుటుంబాలపై మాత్రం ఆ భారాన్ని తగ్గించడం లేదు. జాతీయ టారిఫ్ విధానం ప్రకారం నెలకు 30 యూనిట్లలోపు వినియోగించే వారికి సగటున యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగం మాత్రమే వసూలు చేయాలి. అయితే, రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో యూనిట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.3.60 మాత్రమే. అంటే నెలకు 30 యూనిట్లలోపు వినియోగించేవారి నుంచి యూనిట్‌కు రూ. 1.80 చొప్పున నెలకు రూ. 54 మాత్రమే వసూలు చేయాలన్న మాట. అయితే.. ఇక్కడ 30 యూనిట్లు వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ.43.5తో పాటు సర్వీసు చార్జీ పేరుతో రూ.20 కలిపి మొత్తం రూ.63.50 వసూలు చేస్తున్నారు. అంటే నెలకు ఈ కుటుంబాల నుంచి దాదాపు రూ.9.50 అధికంగా దండుకుంటోంది. 

టెలిస్కోపిక్ విధానం ఎత్తేస్తే.. 
ఇప్పటివరకూ 0-50 యూనిట్ల వరకు ఒక శ్లాబు, 51 నుంచి 100 యూనిట్ల వరకు ఒక స్లాబు ఉంది. స్లాబు మారే కొద్దీ విద్యుత్ చార్జీలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు నెలకు 70 యూనిట్లు వినియోగిస్తే.... మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున.. 51 నుంచి 70 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున లెక్కిస్తారు. దీనినే టెలిస్కోపిక్ పద్ధతి అంటారు. అయితే, తాజాగా ప్రభుత్వం ఈ టెలిస్కోపిక్ పద్ధతితోపాటు శ్లాబు విధానానికీ స్వస్తి పలికితే 0-30 వరకూ మాత్రమే యూనిట్‌కు 1.45 చొప్పున వసూలు చేస్తారు. అంతకు మించితే.... ప్రతీ యూనిట్‌కు యూనిట్‌కు 2.60 చొప్పున వసూలు చేస్తారు.

లైట్, ఫ్యాన్ లెక్క ఇదీ..
* ఒక ట్యూబ్‌లైటు సామర్థ్యం 55 వాట్స్. 
* ఫ్యాన్ సామర్థ్యం 60 వాట్స్. 
* మొత్తం 115 వాట్స్

ఒక యూనిట్ అంటే 1000 వాట్స్. అంటే 115 వాట్స్ సామర్థ్యం కలిగిన ఒక ట్యూబ్, ఒక ఫ్యాన్‌ను సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు వినియోగిస్తే 1000 వాట్స్ వినియోగించినట్టు అవుతుంది. అంటే ఒక యూనిట్ విద్యుత్‌ను వాడుకున్నట్టు లెక్క. అంతకు మించి వినియోగిస్తే విద్యుత్ వినియోగం ఆ మేరకు పెరుగుతుంది. ఫలితంగా రోజుకు యూనిట్‌కు మించి ఖర్చవుతుంది. దీంతో నెలకు 30 యూనిట్లకు మించుతుంది. మీ కరెంటు బిల్లు మీకు షాక్ కొడుతుంది.
Share this article :

0 comments: