అన్నదాతే ఈ దేశానికి, ఈ దేశ ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నదాతే ఈ దేశానికి, ఈ దేశ ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు

అన్నదాతే ఈ దేశానికి, ఈ దేశ ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

అశాస్త్రీయ మద్దతు ధరతో రైతుల నుంచి రూ. లక్ష కోట్లు కొట్టేస్తున్న సర్కారు 
దేశంలో, రాష్ట్రంలో అన్ని పంటలకూ పెట్టుబడికన్నా తక్కువగానే ధరల నిర్ణయం 
తక్కువ ఎంఎస్‌పీ వల్ల ఏటా రూ. 10 వేల కోట్లు నష్టపోతున్న రాష్ట్ర రైతులు 
పెట్టుబడి ఖర్చుకు 50% కలిపి ఎంఎస్‌పీ నిర్ణయించాలన్న స్వామినాథన్ కమిటీ 
సిఫారసులు పక్కనపెట్టి.. డిమాండ్, నిల్వల ప్రకారం ధర నిర్ణయిస్తున్న సర్కారు 
దేశ ప్రజలకు తిండి పెడుతూ ఏటేటా అప్పులు మూటకట్టుకుంటున్న అన్నదాత 

రైతు సంక్షేమ సర్కారు తమదని.. వ్యవసాయానికి భారీగా సాయం చేస్తున్నామని.. రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నామని.. ప్రభుత్వం వారు ఊదరగొడుతుంటారు. కానీ.. వాస్తవంగా జరుగుతున్నది దీనికి పూర్తి విరుద్ధం. ఉన్నదంతా ఊడ్చిపెట్టి.. తల తాకట్టు పెట్టి అప్పులు చేసి.. ఆరుగాలం ఎండనకా వాననకా, రాత్రనకా పగలనకా కష్టించి.. పిల్లా పాపలతో సహా ఇంటిల్లిపాదీ పొలంలో శ్రమించి, స్వేదం చిందించి.. పండించిన పంటలను.. పెట్టుబడి ఖర్చులకన్నా తక్కువకే విక్రయించటం ద్వారా.. అన్నదాతే ఈ దేశానికి, ఈ దేశ ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నాడు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వమే రైతన్నకు అండగా నిలవాల్సి ఉండగా.. రైతులు పండించిన పంటలకు అశాస్త్రీయమైన పద్ధతుల్లో ధరలు నిర్ణయించటం ద్వారా.. వారి నుంచి ప్రభుత్వమే సబ్సిడీ కొట్టేస్తోంది. అన్నదాతను అప్పుల్లో ముంచేసి, పస్తులతో ఎండగట్టి.. వారి పంటలను తక్కువ ధరలకే కొనుగోలు చేసి తన గోదాములకు, ప్రైవేటు వ్యాపారులు, దళారుల చేతుల్లోకి తరలిస్తోంది. ఇలా.. దేశ వ్యాప్తంగా రైతులు ఏటా రూ. లక్ష కోట్లు సర్కారు వారికి, ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు సబ్సిడీగా ఇస్తున్నారు. ఇది సర్కారీ లెక్కలే చెబుతున్న కఠోర వాస్తవం. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రైతు పంటకు పెట్టే పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం మొత్తం కలిపి ఎంఎస్‌పీ నిర్ణయించాలన్న జాతీయ రైతు కమిషన్ (స్వామినాథన్) సిఫారసును కేంద్రం పట్టించుకోవటంలేదు సరికదా.. కనీసం పెట్టుబడికి సమానంగా అయినా ఎంఎస్‌పీని నిర్ణయించటంలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీ ఖర్చులు.. పెట్టుబడి ఖర్చులన్నీ ఏటికేడు అమాంతంగా పెరిగిపోతుంటే.. వాటితో ఏమాత్రం పొంతనలేకుండా మార్కెట్‌లో డిమాండ్, గోదాముల్లో నిల్వల లెక్కలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు శాస్త్రీయత అన్నదే లేకుండా పోయింది. ఫలితంగా రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక పోగా మరింత ఎక్కువగా నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. దీంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యవసాయం సంక్షోభంలోకి దిగజారుతోంది. ఎంఎస్‌పీ తక్కువగా నిర్ణయించటం వల్ల ఈ ఏడాది వరి, గోధుమ, చక్కెర, పత్తి పంటలకే దేశ వ్యాప్తంగా రైతులు నష్టపోయే మొత్తం రూ. 78 వేల కోట్లు ఉంటోంది. కరువు కారణంగా పంట ఉత్పత్తులు తక్కువగా ఉన్న ప్రస్తుత సంవత్సరంలోనే రాష్ట్ర రైతులు ఏకంగా రూ. 10,089 కోట్లు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించే ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకే ఈ నష్టం రూ. 5,778.72 కోట్లు ఉంది. పసుపు, మిరప, ఉల్లి వంటి వాణిజ్య పంటల్లో రైతులకు వాటిల్లే నష్టం రూ. 4,310.28 కోట్లు ఉంటోంది. ఎంఎస్‌పీ వల్ల ఎప్పుడూ ఉండే ఈ నష్టానికితోడు కరువుతో 85 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవటంతో రాష్ట్రంలోని రైతులు మరో రూ. 5,746 కోట్లు పెట్టుబడి నష్టపోయారు. 

పెట్టుబడికి.. మద్దతు ధరకు పొంతనేది? 

ప్రభుత్వ లెక్కల ప్రకారమే అయినా ప్రధాన పంట వరి సాగును పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా సగటున క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యం పండించటానికి రూ. 1,355 ఖర్చవుతుంది. ఎకరాకు సగటున 19.20 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయినప్పుడే పెట్టుబడి ఖర్చు ఇంత ఉంటుంది. దిగుబడి ఏ మాత్రం తగ్గినా క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి అయ్యే పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో ఏ గ్రేడ్ ధాన్యం ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ. 1,110 గా ఉంది. ఈ లెక్కన రైతుకు సాధారణ దిగుబడి వచ్చినా క్వింటాల్‌కే రూ. 245 నష్టపోతున్నారు. ఆ ప్రకారం ఎకరానికి రూ. 4,777 నష్టం ఉంటోంది. ఇలా రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత ఏడాదిలో ఏకంగా రూ. 2,915 కోట్లు నష్టపోతున్నారు. మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంతా వ్యాపారులు, మిల్లర్ల చేతుల్లోనే ఉంటోంది. ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు తప్ప ఏ సీజనులోనూ వీరు రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వరు. క్వింటాల్‌కు కనీసం రూ. 100 వరకు తక్కువకే కొనుగోలు చేస్తుంటారు. ఇలా క్వింటాల్‌కు వంద రూపాయలు తగ్గించటం వల్ల ధాన్యం రైతులు అదనంగా మరో రూ. 1,200 కోట్లు నష్టపోతున్నారు. ఎంఎస్‌పీ వచ్చినా రైతులు నష్టపోవటం ఒక్క వరి రైతుకే పరిమితం కాదు.. అన్ని పంటలు సాగు చేసే వారిదీ ఇదే దుస్థితి. 

వాణిజ్య పంటలు... దళారులకే!

రైతుల చేతుల్లో ఉన్నప్పుడు పాతళంలో, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక ఆకాశంలో చేరే ధరలతో వాణిజ్య పంటలు వ్యవసాయం జూదమనే నానుడిని నిజం చేస్తున్నాయి. మిరప, పసుపు, ఉల్లి వంటి వాణిజ్య పంటల సాగు రాష్ట్రంలో ఎక్కువగానే ఉంటోంది. ఈ మూడు పంటల విస్తీర్ణం రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ పంటలకైతే కేంద్ర ప్రభుత్వం అసలు కనీస మద్దతు ధరను కూడా ప్రకటించలేదు. దీంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడాది రైతులకు క్వింటాల్‌కు రూ. 18,000 వేలు వచ్చిన పసుపు ధర ఇప్పుడు రూ. 3,000 పలకటం గగనంగా మారింది. అలాగే మిరప రైతులకు గత ఏడాది క్వింటాల్‌కు రూ. 9,000 రాగా ఇప్పుడు రూ. 4,000 రావటమూ కష్టంగా మారింది. ఉల్లి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. గత ఏడాది ఇదే సమయానికి ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ. 4,000 ధర రాగా.. ఇప్పుడది రూ. 400కు పడిపోయింది. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించక, రాష్ట్ర ప్రభుత్వం దళారులను నియంత్రించకపోవటంతో రాష్ట్రంలో వాణిజ్య పంటలను సాగు చేసే రైతులు ప్రస్తుత ఏడాదిలో రూ. 4,310 కోట్లు నష్టపోతున్నారు.
Share this article :

0 comments: