నిధులు మిగుల్చుకోవడం లక్ష్యంగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిధులు మిగుల్చుకోవడం లక్ష్యంగా

నిధులు మిగుల్చుకోవడం లక్ష్యంగా

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012

కరవు, ప్రకృతి విపత్తులు, తెగుళ్లు తదితర కారణాలవల్ల పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకుని విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కూడా రాష్ట్ర సర్కారుకు చేతులు రావడంలేదు. నిధులు మిగుల్చుకోవడం లక్ష్యంగా అన్నదాతల ఆత్మహత్యల లెక్కలను తగ్గించి చూపుతోంది. ‘రైతుల ఆత్మహత్యలను సాధ్యమైనంత వరకూ తగ్గించి చూపండి. లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో అందరూ ఆత్మహత్య ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని ప్రోత్సహించవద్దు. అప్పులు మరీ ఎక్కువగా ఉండి ఆత్మహత్య చేసుకుంటేనే ఆత్మహత్యల ప్యాకేజి కింద ఆర్థికసాయానికి సిఫారసు చేయండి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించండి’ అంటూ 2010లోనే అన్ని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు అందాయి. 

2011లో పరిస్థితి మరీ దారుణం..: తీవ్ర కరువు, విద్యుత్తు కోతల వల్ల 2011 ఖరీఫ్‌లో పంటలు కోల్పోయి పెట్టుబడులు కూడా నష్టపోయిన రైతుల సంఖ్య 53.53 లక్షలు. సాగైన మొత్తం పంటల విస్తీర్ణం 1.94 కోట్ల ఎకరాలు కాగా అందులో దుర్భిక్ష పరిస్థితులు, విద్యుత్తు కోత రూపంలో సర్కారు సృష్టించిన విపత్తువల్ల 86 లక్షల ఎకరాల్లో పంటలు మట్టిలో కలిశాయి. ఇవన్నీ ప్రతిపక్షాలో, మీడియానో చెబుతున్న లెక్కలు కావు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన గణాంకాలే. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక విస్తీర్ణంలో పంటలను కరువు మాడ్చేసింది. దీనివల్ల ఏకంగా రూ.5,746 కోట్ల పెట్టుబడులను రైతులు కోల్పోయారని ఆ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెరిగిన సాగు ఖర్చుల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదంటూ 2011లో కోస్తాలోని పలు జిల్లాల రైతులు దేశ చరిత్రలోనే మొదటిసారిగా పంట సాగుకే విరామం ప్రకటించారు. విపత్కర పరిస్థితులను తట్టుకోలేక, ఆర్థికంగా చితికిపోయిన రైతులు అనేకమంది.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం సానుకూల చర్యలు లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల్లో మనోధైర్యం నింపాల్సిన సర్కారు సాయంపై మీనమేషాలు లెక్కిస్తూ.. పైగా తప్పుడు లెక్కలు చూపుతోంది. 2009లో 299 మంది, 2010లో 187 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెబుతున్న ప్రభుత్వం 2011లో ఈ సంఖ్యను మరింత కుదించి 109 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చూపడం గమనార్హం.

వైఎస్ చూపిన ఉదారత ఏదీ?

రైతు కన్నీటి చుక్క సమాజానికి అనర్థమని ప్రకటించిన నాటి వైఎస్ సర్కారు.. పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా సహాయక ప్యాకేజీని అమల్లోకి తెచ్చింది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్షం రోజుల్లోనే ఈ ప్యాకేజీ కింద లక్షన్నర రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు 2004 జూన్ 1న ఉత్తర్వులు జారీ చేశారు. బలవన్మరణం పొందిన రైతు పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేర్పించి ఉచితంగా విద్య అందించాలని, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇతరత్రా పథకాల కింద ప్రయోజనం కల్పించాలని, వృద్ధాప్య, వితంతు లాంటి పింఛన్లు ఇవ్వాలని కూడా జీవోలో స్పష్టం చేశారు. ఒకవేళ రైతుల ఆత్మహత్యల ప్యాకేజీ వర్తింపు జీవోలోని నిబంధనవల్ల ఇబ్బంది ఏర్పడితే సవరించేందుకు కూడా అందులోనే వెసులుబాటు కల్పించింది. ఈ ప్రయోజనాన్ని తనకంటే ముందు అధికార పక్షం విస్మరించిన ఆత్మహత్య రైతు బాధిత కుటుంబాలకు కూడా వర్తింప జేశారు. 2004లో జీవో జారీ అయినా 1998 జూలై ఒకటో తేదీ మొదలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా ఈ మేరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ విధంగా వైఎస్ మరణించే వరకూ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తూ ఆర్థిక సాయం అందిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ జీవోను మార్చకపోయినా ఆర్థిక సాయానికి అర్హుల ఎంపిక సమయంలో కఠినంగా వ్యవహరించాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం విశేషం.
Share this article :

0 comments: