రామోజీకి పోలవరంతో ఎంత నష్టం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీకి పోలవరంతో ఎంత నష్టం!

రామోజీకి పోలవరంతో ఎంత నష్టం!

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

300 టీఎంసీల నీటిని సముద్రంలో వృధాగా కలవకుండా ఆపి… 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయటం రామోజీకి ఇష్టం లేదా?
వైఎస్ అన్ని అనుమతులు తెచ్చినా ప్రాజెక్టు ఆగిపోయిందని, దాన్ని ముందుకు నడిపించటానికే జగన్ నడుం కట్టారనే ఇంగితజ్ఞానం ‘ఈనాడు’కు లేదా?
జగన్‌ను ప్రజల్లో ఎదుర్కొనే ధైర్యం లేకనే అడ్డగోలు రాతలు. స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు రామోజీకి ఏనాడు పట్టాయి?
డెల్టాను ఎండగట్టింది బాబు-రామోజీ కాదా?
నిధులు అతితక్కువగా కేటాయించారంటూ గగ్గోలు పెడుతూనే… భారీ సొమ్ము ముఖ్యుల జేబుల్లోకి వెళ్లిందంటూ ఒకే కథనంలో రెండు వాదనలు చేయటం రామోజీకి మాత్రమే చెల్లింది.
వైఎస్ తసన్నిహితులకే కాంట్రాక్టులు కట్టబెట్టారు అనుకుంటే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావుకు కీలకమైన స్పిల్‌వే నిర్మాణ పనులెందుకు అప్పజెబుతారు?
డెల్టా, తెలంగాణ రైతాంగం ప్రయోజనాల్ని పట్టించుకోకుండా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల గురించి అరుస్తున్న రామోజీ ఏ రాష్ట్ర భక్తుడు?
‘మీరు ప్రాజెక్టులు కడితే ఏ అనుమతైనా ఇస్తాం…’ అంటూ 2002లో కేంద్రం ఓపెన్ ఆఫర్ ఇచ్చినా తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులెన్నో చెప్పగలరా రామోజీ?
ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే ఏళ్లకేళ్లు పడుతుంది. ఈ లోపు అంచనా వ్యయం పెరిగితే అది దుర్మార్గమా? ఇల్లు కట్టాలన్నా సరే… అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చవుతుందన్న సంగతి ‘ఈనాడు’కు తెలీదా?
వైఎస్ జగన్ పాదయాత్ర తన అనుంగు రాజకీయ పక్షాలకు పరలోక యాత్రగా మారుతుందని రామోజీ ఎంతగా కంగారుపడ్డారో నిన్న ‘ఈనాడు’లో నిస్సిగ్గుగా వెల్లడించుకున్నారు. పోలవరం కట్టి తీరతాం… అని వైఎస్ ప్రకటించినది మొదలు గడచిన ఆరున్నరేళ్ళలో ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వందల కథలు, కథనాలు ప్రచురించి… గిట్టని వ్యక్తి పాలన చేస్తుంటే ప్రజాప్రయోజన అంశాల్లో సైతం తాను ఎంతటి శాడిజం ప్రదర్శించగలదో ‘ఈనాడు’ నిరూపించు కుంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లో 30 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇవ్వటంతోపాటు… సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 300 టీఎంసీల నీటిని ఆపటం, ఈ క్రమంలోనే ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి భరోసా లభించేలా 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూపకల్పన చేయటం… ఇది స్థూలంగా వైఎస్ కన్న పోలవరం కల.
దీన్ని నిజం చేసే క్రమంలో రకరకాల అనుమతులను తీసుకువచ్చే కార్యక్రమాన్ని పూర్తిచేసి, ఆ అనుమతులన్నీ తీసుకురాగలనన్న ఆత్మవిశ్వాసంతో కుడి-ఎడమ కాల్వలకు భూసేకరణతోపాటు వాటి తవ్వకాలను కూడా ఆదిలోనే ప్రారంభించి… ఆ ప్రాజెక్టుకు అన్నీ తానై నడిపించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరెవరైనా కనిపించారా? పోలవరాన్ని కట్టే దమ్మూ ధైర్యం వైఎస్‌లకు తప్ప ఈ రాష్ట్రంలోగానీ దేశంలోగానీ మరే రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా ఉందని ప్రజలు ఇప్పటికైనా నమ్ముతున్నారా? రాజమండ్రి నుంచి పాపికొండలు లాంచి ప్రయాణం చేయాలనుకునేవారంతా ఇప్పుడే చూసిరండి… త్వరలో పోలవరం పూర్తయితే ఆ అవకాశం ఉండదు… అంటూ వైఎస్ హయాములో లక్షలకొద్దీ కుటుంబాలు నిర్ణయించుకోవటం వెనక… ఒక్కసారి ఆయన మాటంటే, అది చేతల్లో కనపడి తీరుతుందన్న నమ్మకం కనిపిస్తుంది.
కాబట్టే నమ్మకద్రోహానికి మారుపేరైన చంద్రబాబు ఇంటికి నెలకు రెండువేలు పంచుతానన్నా తెలుగుజాతి 2009 ఎన్నికల్లో ఛీకొట్టింది. ఇంకుడుగుంతల బాబుకు ఇందిరాసాగర్ కట్టేటంత సీను లేదని తిరస్కరిస్తున్నా రామోజీ ఆరాటం రామోజీది! ఏ జాతి ప్రయోజనాల పోరాటం ఈయనది? వైఎస్ హయాములోనే దాదాపుగా అనుమతులన్నీ వచ్చినా, మహానేత హఠాన్మరణం తరవాత ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిచిపోవటాన్ని ప్రశ్నిస్తూ జగన్ పాదయాత్ర చేపడుతున్న ఈ వేళ… ‘ఈనాడు’ అధినేత రక్తపోటు ఎంతగా పెరిగిపోయిందో ‘‘పోలవరం ఆదిలోనే అస్తవ్యస్తం’’ అంటూ ఆ పత్రిక నిన్న ప్రచురించిన కథనం ద్వారా వెల్లడయింది. రాష్ట్రంలో ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ఓ మహా నాయకుడు కృతనిశ్చయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు… ఆయన రాజకీయ వారసుడు అదే దృఢ సంకల్పంతో ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నప్పుడు ప్రజాప్రయోజనా లకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రిక మనమధ్యే ఉండటమన్నదే… తెలుగుజాతి దురదృష్టం!
నామా కూడా వైఎస్ సన్నిహితుడేనా?
నిన్నటి ‘ఈనాడు’ కథనంలో ఉన్నదంతా ఒక్కటే. అబ్బే… పోలవరం ప్రాజెక్టుకోసం వైఎస్ ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం. ఈ అబద్ధాన్ని నిజం అని తన పాఠకుల్ని నమ్మించటానికి ‘ఈనాడు’ పడిన తాపత్రయాన్ని చూడండి… ఈ ప్రాజెక్టు ఆరేళ్ళు గడిచినా పూర్తి కాలేదన్నది అది పడిన మొదటి బాధ! ఈ ప్రాజెక్టుకు ఏడాదికి పదిహేను వందల కోట్లు కేటాయించాల్సి ఉంటే… మొత్తం ఆరేళ్ళలో కేవలం 3,500 కోట్లే ఖర్చు చేశారని ఒక చోట రాస్తుంది. ముందుగా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిర్చేసుకుని భారీగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని… వాటిలో ఎక్కువ భాగం పర్సెంటేజీల రూపంలో ప్రభుత్వ ముఖ్యుల జేబుల్లోకే వెళ్ళిందంటుంది. పర్సెంటేజీల రూపంలో కాంట్రాక్టర్లనుంచి ఎక్కువ భాగం ప్రభుత్వ ముఖ్యుల జేబుల్లోకే వెళ్ళేటట్లయితే, ప్రభుత్వ కేటాయింపులు తక్కువగా ఎందుకుంటాయన్న అనుమానం తన పాఠకుడికి కలుగుతుందన్న ఇంగితం ‘ఈనాడు’కు లేకపోయింది.
మరోవంక… కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సు రూ. 353.65 కోట్లలో రూ. 190.98 కోట్లు రికవరీ చేశారంటుంది. పర్సెంటేజీలు జేబుల్లో వేసుకున్న నాయకులైతే సొమ్ము రికవరీకి ఎలా ఆదేశించగలుగుతారనే సందేహం వస్తుందన్న స్పృహ కూడా ‘ఈనాడు’కు లేకపోయింది. వైఎస్ సన్నిహితుని కాంట్రాక్ట్ సంస్థ రూ. 28 కోట్ల మేర అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉందని రాస్తున్నప్పుడు… మధుకాన్ సంస్థ కూడా రూ. 23.28 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉందంటూ తప్పనిసరై ఓ వాక్యం రాసినా… ఆ సంస్థ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధినాయకుడు నామా నాగేశ్వరరావుకు చెందిందన్న మరో ముక్క అక్కడే రాయటానికి ‘ఈనాడు’కు చేతులెందుకు రాలేదు? ఎక్కడో చివర వేరే సందర్భంలో ‘నామ’మాత్రంగా ఆయన పేరు రాసినా… వైఎస్ తన సన్నిహితులకే కాంట్రాక్టులు కట్టబెట్టాలనుకుంటే- చంద్రబాబుకు అన్ని రకాలుగా సన్నిహితుడైన నామా నాగేశ్వరరావు సంస్థకు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌వే నిర్మాణం పనులు ఎందుకు అప్పచెబుతారన్న ప్రశ్న పాఠకుడి మదిలో ఉదయిస్తుందన్న జ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోయింది.
‘ఈనాడు’ ఏడుపులో అత్యంత ముఖ్యమైన కోణం ఏమిటంటే… 3,731 హెక్టార్ల అటవీ భూములు ముంపునకు గురై 1.77 లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతారన్నది. చైనాలో త్రీగోర్జెస్ డ్యాం నిర్మించేటప్పుడైనా, ప్రపంచంలో మరెక్కడ ఏ భారీ ప్రాజెక్టు నిర్మించేటప్పుడైనా లక్షల సంఖ్యలో ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయకతప్పదు. ఇలా సమాజంలో కొందరికి అనివార్యంగా నష్టం కలుగుతున్నా అంతకుమించి భారీ సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం చేపట్టినప్పుడు కష్టనష్టాలు అనివార్యంగా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.
తరతరాల జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోవాలంటే అక్కడి ప్రజలకు కలిగే మానసిక క్షోభ వెలకట్టలేనిదే. ఇక్కడే గుర్తించాల్సిన ముఖ్యాంశమేమిటంటే… ప్రాజెక్టు కట్టాలన్నది అధికారంలో ఉండే వ్యక్తుల సత్తాకు సంబంధించిన అంశమే అయినా, ప్రాజెక్టు ఎక్కడ కట్టాలన్నది పూర్తిగా సాంకేతిక నిపుణులు నిర్ధారించేది. నీటి నిల్వకు అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఇలా నిర్ధారించి ఆరు దశాబ్దాలవుతున్నా అంతకుముందు ప్రభుత్వాలు పోలవరాన్ని పట్టించుకొనకపోవటాన్ని విమర్శిం చాలా… లేక ప్రాజెక్టు నిర్మిస్తుంటే కన్నీళ్ళు పెట్టుకోవాలా అన్న విషయంలో రామోజీ ఆలోచనా ధోరణి అనన్య సామాన్యం. ఈ విషయంలో చివరికి రాజకీయ పార్టీలకు కూడా లేని వైరాన్ని, ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారంటే ఆ రాతలు ఆయన మానసిక రుగ్మతకే నిదర్శనాలు. మన రాష్ట్రంలో డెల్టా రైతుల ప్రయోజనాలు, విద్యుదుత్పాదనపరంగా తెలంగాణ రైతులకు ఒనగూడే ప్రయోజనాలు, ఖమ్మం జిల్లా రైతాంగానికి చేకూరే లబ్ధి తుంగలోకి తొక్కి ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఏదో కొద్ది ప్రాంతం మునుగుతుందని వారికంటే ఎక్కువగా అరుస్తున్న రామోజీ ఇంతకీ ఏ రాష్ట్ర భక్తుడు? ఎవరి ఏజెంటు ఈయన?
పోలవరం ప్రాజెక్టు కడితే కష్టం కలిగేది రామోజీకా లేక ముంపు ప్రాంత ప్రజలకా? ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస ప్యాకేజిగా ఎంత ఇచ్చినా తక్కువే. అలా వారికి మద్దతో, సానుభూతో తెలపాలనుకునే మనస్తత్వమే రామోజీకి ఉంటే… మా నారా బాబు పాలనలో ఇదిగో ఈ ప్రాజెక్టు కట్టాం… నిర్వాసితులకు ఇంత మెరుగైన ప్యాకేజీ ఇప్పించాం… అంటూ అంతకు ముందు ప్రభుత్వాలతో పోల్చి చూపవచ్చు. లేదా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చి చూపి ఫలానా రాష్ట్రంలో ఇంతకు మించి మేలు జరిగింది కాబట్టి మన రాష్ట్రంలోనూ అంత మొత్తాన్ని అందించాలనవచ్చు. అలాంటి దేమీ లేకుండా పునరావాసం గురించి అడ్డగోలుగా రాస్తున్నా రంటేనే రామోజీ ఎజెండా అర్థమవుతుంది. దేశంలోకెల్లా మేలైన ప్యాకేజీ ఇస్తామని వైఎస్ పదేపదే చెప్పినా అప్పటినించి ఇప్పటి వరకు ‘ఈనాడు’ది అదే పాచిపళ్ళ పాట! ప్రభుత్వం భూసేకరణమీద దృష్టిపెట్టలేదన్నది అంతకు మించిన అబద్ధ మని ప్రాజెక్టు ప్రాంత వాసులతోపాటు ప్రజలందరికీ తెలుసు.
ఇంకుడు గుంతల చుట్టూనే బాబు ‘చక్రం’!
ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని చెప్పి తప్పించుకునే మనిషి కాదు కాబట్టే వైఎస్ తాను అధికారంలోకి రాగానే పోలవరం కాల్వల సహా అన్ని పనులకూ పచ్చజెండా ఊపారు. మరోవంక రామోజీ అవిభాజ్య కవల అయిన చంద్రబాబు తన హయాంలో ఏం మాట్లాడారో చూడండి… ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం లేదంటూ ఇంకుడు గుంతల ఉద్యమకారుడు ఆ నేరాన్ని కేంద్రప్రభుత్వం మీదికి తోసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో … కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అర్జున్ చరణ్ సేధీ 2002 సెప్టెంబరు 23న ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ‘‘మీ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటామంటే కావలసిన అనుమతులన్నీ ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నా’’మంటూ సేధీ అప్పట్లోనే ప్రకటించినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ ప్రాజెక్టూ కట్టినది లేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నారంటూ పత్రికల్లో రాయించుకోవటమే తప్ప నీటి పారుదల ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చినది లేదు… నిధులు కేటాయించినది లేదు. 1995 నుంచి 2004 వరకు పాలించిన చంద్రబాబు ఈ తొమ్మిదేళ్ళలో నీటి పారుదలకు చేసిన ఖర్చు దాదాపు పదివేల కోట్లయితే… వైఎస్ ప్రభుత్వం కేవలం అయిదేళ్ళలో నలభై వేల కోట్లకు పైగా వ్యయం చేసింది.
అంచనా వ్యయం పెరగదా?
పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయాయంటూ ‘ఈనాడు’ ఎప్పటినుంచో మొసలి కన్నీరు ఒలికిస్తూనే ఉంది. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకున్నా తొలుత వేసుకున్న అంచనాలకు- తదుపరి కాలంలో అది పూర్తయ్యేటప్పటికి అయిన వ్యయానికి అనూహ్యమైన అంతరం ఉంటుంది. ఏడాదిలోగా నిర్మించగల ఇంటి నిర్మాణాన్ని ఉదాహరణగా తీసుకున్నా, అంచనాలకు- అంతిమంగా ఖర్చుకు మధ్య అనేక కారణాలవల్ల అంతరం కనిపిస్తుంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఏడాది, రెండేళ్ళలో ముగిసే కార్యక్రమం కాదు. ఉదాహరణకు నాగార్జున సాగర్‌నే తీసుకుంటే 1960లో అంచనా వ్యయం రూ. 91.12 కోట్లయితే, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుమీద చేసిన ఖర్చు రూ. 1,300 కోట్లకు పైనే. 1963లో శ్రీశైలం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 45.74 కోట్లయితే, 1984లో అది పూర్తయ్యేసరికి లెక్క తేలిన ఖర్చు రూ. 524 కోట్లు. 1969లో వంశధార ప్రాజెక్టును రూ. 8.78 కోట్లతో నిర్మించవచ్చను కుంటే 2005లో అది పూర్తయ్యేనాటికి అయిన ఖర్చు రూ. 118.73 కోట్లు. ప్రియదర్శని-జూరాల ప్రాజెక్టు ప్రారంభించే నాటికి అనుకున్న వ్యయం రూ. 76.4 కోట్లు. నిజానికి అయిన ఖర్చు- రూ. 762.51 కోట్లు. అంచనాలు పెరిగాయని, కాంట్రాక్టర్లకు మిగులుతోందని, చాలా కాలం పడుతోందని బాధపడుతూ ఏ ప్రాజెక్టులూ నిర్మించరాదన్నది తెలుగుదేశం పార్టీకి ‘ఈనాడు’ చెప్పిన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ ప్రకారం అది వార్తలు రాస్తూనే ఉంటుంది.
ముమ్మాటికీ వైఎస్ వరమే!
పోలవరం ప్రాజెక్టుకు-వైఎస్‌కు మధ్య బంధం… మొత్తంగా జలయజ్ఞం ప్రాజెక్టులతో ఆయనకు-నీటికి ఉన్న మమతానుబంధం రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేనిది. పోలవరం ప్రాజెక్టుకు… జలయజ్ఞంలో ఇతర ప్రాజెక్టులకు వరుసగా లభించిన అనుమతులు వైఎస్ పట్టుదలకు, పలుకుబడికి సంకేతాలు. మధ్యలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ జోక్యంతో పోలవరం పనులు నిలిచిపోయినా ఏడాదిలోపే మళ్ళీ అనుమతులు సాధించుకోవటమన్నది వైఎస్ నాయకత్వ పటిమకు, వజ్ర సంకల్పానికి నిదర్శనాలు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ళపాలనలో రామోజీ సుద్దులు విని ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు ఆపకుండా గురక కొట్టి నిద్రపోయిన నేపథ్యంలో 2002 నాటికే కృష్ణా డెల్టాలో మొదటి పంటే లేదు.
ఆలమట్టి నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లోకి చుక్క నీరు కూడా విడుదల కాని పరిస్థితి ఏర్పడింది రాజగురువు రామోజీ హయాంలో బాబు పాలిస్తున్న రోజుల్లోనే. అటు గోదావరి, ఇటు కృష్ణా డెల్టా రైతులతోపాటు తెలంగాణలో బోర్లమీద ఆధారపడి సేద్యం చేస్తున్న లక్షలాది రైతాంగానికి శాశ్వతంగా భరోసా ఇవ్వటానికి వైఎస్ తాను ప్రారంభించి, తానే పూర్తి చేయాలనుకున్న మహాప్రయత్నమే పోలవరం. ప్రజలకు మేలు చేసే వైఎస్ ఆలోచనలకు వారసత్వం ఎవరిదంటే… జగన్ అని జనం నినదిస్తుంటే, రామోజీ రాతలు అడ్డగోలుగాకాక నిలువుగా ఉంటాయని మూడున్నర దశాబ్దాలుగా ‘ఈనాడు’ పైత్యం తెలిసిన ఎవరు మాత్రం నమ్ముతారు? చేతల ద్వారా, నమ్మకం ద్వారా వైఎస్ కుటుంబం సంపాదించుకున్న ప్రజాభిమానమనే ఆస్తుల్ని ఎవరు కొల్లగొట్టగలరు?
వైఎస్ హయాంలో ఇదీ అనుమతుల క్రమం…
19.09.2005 సైట్ క్లియరెన్స్
25.10.2005 పర్యావరణ క్లియరెన్స్
17.04.2007 పునరావాస- పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) క్లియరెన్స్
26.12.2008 ఫారెస్ట్ క్లియరెన్స్ (మొదటి దశ)
20.01.2009 కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ క్లియరెన్స్
25.02.2009 కేంద్ర ప్రణాళిక సంఘం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్
20.05.2009 జాతీయ హోదాకై కేంద్ర జలసంఘానికి వినతి
06.08.2009 జాతీయ హోదాపై హైపవర్ స్టీరింగ్ కమిటీ చర్చ
హై పవర్ స్టీరింగ్ కమిటీ చర్చ అనంతరం ఫైల్‌ను కేంద్ర కేబినెట్‌కు పంపాల్సి ఉంది. అయితే…ఈ కమిటీ సమావేశమైన 26 రోజులకే వైఎస్ అకాలమరణం పాలయ్యారు. దాంతో పోలవరం కథ వెనక్కి వెళ్లింది.
Share this article :

0 comments: