పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చింది

పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చింది

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

 పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చింది. పోలవరం టెండర్‌ను ‘సూ’ సంస్థకు కట్టబెట్టాలని సర్కారు ప్రయత్నించినా, వివాదాల నేపథ్యంలో టెండర్‌ను రద్దుచేయాలనే హై పవర్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోలవరం టెండర్ పై నెలకొన్న వివాదాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా హై పవర్ కమిటీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో అధికారులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 

ఈ టెండ ర్‌లో ఎల్-1గా ఉన్న ‘సూ’ సంస్థపై వచ్చిన అనేక ఆరోపణల నేపథ్యంలో అదే సంస్థకు టెండర్‌ను అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. అర్హత లేకున్నా... ఉన్నట్టు బోగస్ సర్టిఫికెట్‌ను సమర్పించిన సదరు సంస్థను సమర్థించడం మంచిది కాదని సమావేశంలో స్పష్టంచేశారు. దీంతో ప్రస్తుత టెండర్‌ను రద్దు చేసి, తిరిగి టెండర్‌ను ఆహ్వానించడం మంచిదనే నిర్ణయానికి హై పవర్ కమిటీ వచ్చినట్టు సమాచారం. 

ఒత్తిళ్లున్నా రద్దుకే నిర్ణయం!
పోలవరం టెండర్‌ను ‘సూ’ సంస్థకు అప్పగించడానికి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు విమర్శలున్నాయి. అలాగే ‘సూ’ సంస్థకు చెందిన రాజం కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను ఢిల్లీలో కలుసుకోవడం, పోలవరం కోసమే ఈ కలయిక జరిగిందని రాజకీయ పక్షాలు విమర్శించడం తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా పలు సాంకేతిక అంశాల్లో ‘సూ’ సంస్థకు అర్హత లేదని ఎల్-2 స్థానంలో నిలిచిన సోమా సంస్థ ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువచ్చింది. ఈ విషయం ఇప్పటికే కోర్టు దృష్టిలో కూడా ఉంది. 

ఈ పరిస్థితుల్లో ‘సూ’ సంస్థకు టెండర్‌ను అప్పగిస్తే... సోమా సంస్థ మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు కోర్టులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేక తీర్పు వస్తే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందనే అభిప్రాయం కూడా హై పవర్ కమిటీ సమావేశంలో కొందరు అధికారులు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో టెండర్‌ను రద్దు చేయడమే ఉత్తమమనే అభిప్రాయానికి కమిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సీఎస్ పంకజ్‌ద్వివేది అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరిగేషన్, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కె జోషి, భాస్కర్‌లు పాల్గొన్నారు. 

టెండర్ రద్దు చేయడం కాకుండా... ఎల్-2 స్థానంలో ఉన్న సోమా సంస్థకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే సోమా సంస్థపై ‘సూ’ సంస్థ కూడా కొన్ని ఆరోపణలను చేస్తూ అధికారులకు కొన్ని పత్రాలను సమర్పించింది. దాంతో ఏ సంస్థకు ఈ టెండర్‌ను కట్టబెట్టినా... వివాదం కొనసాగుతుందనే ఉద్దేశంతో ఏకంగా రద్దుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
Share this article :

0 comments: