గుక్కెడు పాలు కడివెడు రోగాల పెట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుక్కెడు పాలు కడివెడు రోగాల పెట్టు

గుక్కెడు పాలు కడివెడు రోగాల పెట్టు

Written By ysrcongress on Sunday, January 15, 2012 | 1/15/2012

పాలు సహజసిద్ధమైన బలవర్ధక ఆహారం అంటారు. రోజూ గ్లాసుడు పాలు తాగితే ఎటువంటి రోగాలూ దగ్గరకు రావని ఎందరో నమ్ముతూ ఉంటారు. ఇప్పుడీ అభిప్రాయాలను మార్చుకోవలసిన పరిస్థితులు దాపురించాయి. గుక్కెడు పాలు కడివెడు రోగాల పెట్టు అని అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. తెల్లనివన్నీ పాలని అనుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. పాలల్లో నీళ్లే కాదు, అంతకంటె ప్రమాదకరమైన డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి కూడా కలుస్తున్నాయని చెబుతున్నాయి. అంతేకాదు, పాల పరిమాణాన్ని కృత్రిమంగా పెంచడానికి పాలపొడి, గ్లూకోజ్, చక్కెర వగైరాలనూ కలుపుతున్నారు. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ దేశవ్యాప్తంగా 1,791 పాల శాంపిళ్లను పరిశీలించి, 68 శాతానికి పైగా పాలు కలుషితమని తేల్చింది. 

దేశరాజధాని ఢిల్లీలోనే 70 శాతం పాలు విషప్రాయమని నిర్ధారించింది. కలుషిత క్షీరాలలో పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం ‘అగ్రస్థానం’లో ఉన్నాయి. క్షీరవిప్లవానికి పుట్టిల్లుగా చెప్పదగిన గుజరాత్‌లో సైతం 89 శాతం పాల నమూనాలు ప్రమాణాల పరీక్షలో విఫలమయ్యాయి. గోభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరభారతంలో క్షీర కాలుష్యం అత్యధికంగా ఉండగా, మన రాష్ట్రంతో సహా దక్షిణభారత రాష్ట్రాలలో కొంత తక్కువగా ఉన్నట్టు తేలడం విశేషం. గోవా, పుదుచ్చేరిలలో మాత్రమే పాల నమూనాలు నూటికి నూరుశాతం ప్రమాణాలకు తులతూగు తున్నాయి. 

గ్రామీణ ప్రాంతాలలో కంటె పట్టణ ప్రాంతాలలో పాలు ఎక్కువ కలుషితమవుతున్నాయని ఇంకొక నిర్ధారణ. 

పసిపిల్లల ఆహారమైన పాలు కూడా ఇంత విచ్చలవిడిగా విషగ్రస్తం అవుతున్నాయంటే, వ్యాపారుల అత్యాశ ఎంతగా అమానుషత్వపు అంచులు తాకుతున్నదో ఊహించగలం. ప్రభుత్వాల నిఘా, నియంత్రణా పూర్తిగా లోపించడం అంతకు మించిన దారుణం. అత్యధిక పాల ఉత్పత్తిదేశాలలో మన దేశం ఒకటి. అయినా ఈ దేశపు పాలకడలినిండా హాలాహలం పరచుకోవడం, దానినుంచి దేశాన్ని కాపాడే గరళకంఠుడి వంటి దిక్కు లేకపోవడం శోచనీయం. నాడు విషస్తన్యంతో బాలకృష్ణుని వధించడానికి ప్రయత్నించిన పూతన ఒక్కతే అయితే, ఈనాడు దాదాపు ప్రతి పాల కంపెనీ పూతనలా పరిణమించడం కలికాల మహిమ. పాలు కలుషితమవుతున్న సంగతిని అధ్యయనాలు బయట పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఆమధ్య లూథియానాలోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛందసంస్థ ఏడు ప్రముఖ కంపెనీలకు చెందిన ప్యాకెట్ పాలపై పరీక్షలు జరిపించి, వాటిలో కలుషితాలు హెచ్చుస్థాయిలో ఉన్నట్టు కనుగొంది. 

అవి తాగడానికి పూర్తిగా అయోగ్యమని స్పష్టంచేసింది. పాలల్లో సూక్ష్మజీవుల పరిమాణాన్ని టీపీసీ (టోటల్ ప్లేట్ కౌంట్) అనే మాటతో; పాల ఉత్పత్తీ, వాటిని శుద్ధి చేసే ప్రక్రియకు సంబంధించిన పరిశుభ్రవాతావరణ సూచిని కోలిఫారం కౌంట్ అనే పేరుతో సూచిస్తారు. నిబంధనల ప్రకారం టీపీసీ పరిమాణం 30 వేల ఎంఎల్; కోలిఫారం కౌంట్ 10 ఎంఎల్‌ను మించి ఉండకూడదు. కానీ, పై స్వచ్ఛంద సంస్థ పరీక్షలు జరిపించిన ఏడు ప్రముఖ బ్రాండ్లలో ఇవి దిగ్భ్రాంతికర పరిమాణంలో ఉన్నాయి. పసిపిల్లల నుంచి, గర్భిణులు, రోగుల వరకు ప్రతి ఒకరికీ అతిముఖ్య పోషకాహారమైన పాల విషయంలో ఉత్పత్తి దశనుంచి పంపిణీ దశవరకు తీసుకోవలసిన జాగ్రత్తలను విస్మరిస్తుండడమే ఈ దుస్థితికి కారణం. చవకగా, విరివిగా లభించే ప్యాకెట్ పాలపై ఆధారపడుతున్నవారి సంఖ్య పెరిగిపోవడంతో ఈ అజాగ్రత్త కలుషిత క్షీరాల రూపంలో దేశవ్యాప్త సమస్యగా విస్తరించి ప్రజారోగ్యానికి చేటు తెస్తోంది. పిండిన పాలను శీతలీకరణ వ్యవస్థ లేని ట్యాంకర్ల ద్వారా శీతలీకరణ కేంద్రాలకు చేర్చడానికి పట్టే అయిదారు గంటల వ్యవధిలో వాటిలో సూక్ష్మజీవులు చేరుతున్నాయనీ; అక్కడినుంచి ఆ పాలను అరక్షిత స్థితిలో దుకాణాలకు చేర్చుతున్నారనీ, అక్కడ కూడా పాలప్యాకెట్లను అననుకూల వాతావరణంలో ఉంచుతున్నారనీ, ఫలితంగా సూక్ష్మజీవుల పరిమాణం అనేక రెట్లు పెరిగిపోయి చివరికి పాలు విషపూరితమవుతున్నాయని పై స్వచ్ఛందసంస్థ వివరించింది. 

స్వచ్ఛమైన పాలు వినియోగదారులకు అందేలా చూడడంలో తమవంతు పాత్రను విస్మరిస్తున్న ప్రభుత్వాలే ఇందులో అసలు నేరస్తులు. పాలు, ఇతర ఆహార పదార్ధాలలో కల్తీని, కలుషితాలను నివారించవలసిన అంచెలంచెల యంత్రాంగాలు ముసుగుతన్ని నిద్రపోతున్నాయి కనుకనే, అమృతప్రాయంగా మారి ఆయుర్వృద్ధికి తోడ్పడవలసిన క్షీరధారలు విషధారలుగా పరిణమించి ఆయుర్దాయాన్ని హరిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా పంపిణీ అవుతున్న ఆహారంలో కూడా 13 శాతం కలుషితమేనని అంకెలు ఘోషిస్తున్నాయి. ఇందులో కూడా ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లు ‘ఆధిక్య’ స్థానంలో ఉన్నట్టు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లగా ఆహారపు కల్తీ మరింతగా పుంజాలు తెంచుకుంటోంది. ఆహార మంత్రిత్వశాఖ ఇప్పుడిప్పుడే మేలుకొని చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పన్నెండో ప్రణాళికా కాలంలో రూ.155 కోట్లతో జాతీయస్థాయిలో ఆహార శాస్త్రవిజ్ఞానం, ఆరోగ్యప్రమాదాల అంచనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది దాని ప్రతిపాదనలలో ఒకటి. విజ్ఞానాన్నీ, అంచనాలను అందిస్తే సరిపోదు. పాలను, ఇతర ఆహారపదార్థాలను కల్తీ చేసే వారిపై, అవి కలుషితం కావడానికి అవకాశమిచ్చేవారిపై కొరడా ఝళిపించే వ్యవస్థను పటిష్టీకరించడం, నిఘా పెంచడం అంతకంటె ముఖ్యం. అలాగే, ఆహార పదార్థాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీలలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అమలు చేసేలా చూడాలి. ఇప్పటికీ దేశంలో పోషకాహారలోపం అత్యధికస్థాయిలో ఉండడం సిగ్గుచేటని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించారు. అటువంటి సిగ్గుచేటు అంశాల జాబితాలో కలుషిత క్షీరాలను కూడా చేర్చుకోవాలి.
Share this article :

0 comments: