గ్రామానికి పదిమంది మహిళా పోలీసుల్ని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్రామానికి పదిమంది మహిళా పోలీసుల్ని

గ్రామానికి పదిమంది మహిళా పోలీసుల్ని

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

* మద్యాన్ని దూరం చేయడానికి గ్రామానికి పదిమంది మహిళా పోలీసుల్ని పెడతాం
* బ్రాందీ తాగాలంటే నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లాల్సిందే.. షాక్ కొట్టేలా రేట్లుంటాయి
* పిల్లలు తాగుడుకు బానిసలు కాకుండా ఉండాలంటే.. వారిని చదివించడమే మార్గం
* వారిని ఉచితంగా చదివిస్తాం.. వారిని బడికి పంపినందుకు తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులేస్తాం
* మన ఖర్మకొద్దీ ఒక నాయకుడు మద్యంతో ఆదాయం పెంచుకోవాలనుకుంటాడు..
* మరో నాయకుడేమో సరసమైన ధరలకు మద్యం అందుబాటులోకి తెస్తానంటాడు
* వీరిద్దరినీ చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి
* కృష్ణా జిల్లాలో కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం చేసిన జగన్

విజయవాడ, న్యూస్‌లైన్: గ్రామాల నుంచి మద్యాన్ని దూరం చేసి పేదరికాన్ని పోగొడితేనే సమాజం బాగుపడుతుందని, రాబోయే సువర్ణయుగంలో అది చేసి చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. దీన్ని పటిష్టంగా అమలు చేయడానికి గ్రామాల్లో మహిళా పోలీసులను పెడతామని స్పష్టంచేశారు. కష్టపడిపనిచేసే ప్రతి కుటుంబానికీ రాత్రికి సరసమైన ధరకు పెగ్గు మందు కావాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రతి నెలా మద్యం విక్రయాల్లో 15 శాతం పెరుగుదల కావాలని టార్గెట్లు ఇస్తూ తాగుబోతుల్ని చేసే ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరును ఎండగట్టారు. 

‘మన ఖర్మకొద్దీ ఒక నాయకుడు ఆదాయం పెంచుకోడానికి టార్గెట్లు పెడతాడు. మరో నాయకుడు సరసమైన ధరలకు మందు అందిస్తానంటాడు’ అంటూ ప్రతిపక్ష నాయకుడికి, రాష్ట్ర పెద్దకు బుర్ర లేదని విమర్శించారు. వీరిద్దరినీ చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయన్నారు. కృష్ణా జిల్లాలోని మైల వరం సమీపంలోని పోరాటనగర్, కనిమెర్లతండా, నాగులూరు తండాల్లో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల వంతున ఆర్థికసాయం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోరాటనగర్‌లో రచ్చబండ వేదికగా ప్రజలనుద్దేశించి ఉద్విఘ్నంగా ప్రసంగించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

108 అంబులెన్స్‌లు రానందుకే.. 
ఈ పరిస్థితుల్లో ఈ గ్రామాలకు రావడం ఎంతో బాధగా ఉంది. ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు, సారా బట్టీలు కనబడుతున్నాయి. రోజంతా కష్టపడి పనిచేస్తే రాత్రికి ఒక పెగ్గు మందు కావాలని చంద్రబాబు అంటారు. ఏది అందుబాటులోకి వచ్చినా, రాకపోయినా తక్కువ ధరకే మందు అందుబాటులోకి తెస్తానంటున్న చంద్రబాబును ఏమనాలి? నేను ఈ తండాల్లో ప్రతి అక్కా, చెల్లెల్ని ఇక్కడ స్కూళ్ళెలా ఉన్నాయి తల్లీ అని అడిగా. అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ స్కూళ్ళలో టీచర్లు సరిగా రాని పరిస్థితి మాకుంది అని చెబితే చాలా బాధనిపించింది. పోనీ హాస్పిటల్ ఉందా అమ్మా.. అని అడిగా.. 20 కిలో మీటర్ల మేర ఎక్కడా అందుబాటులో లేదని చెబితే ఇంకా ఇంకా బాధగా అనిపించింది. కల్తీ సారా తాగి ప్రమాదం జరిగినప్పుడు మీరు 108 అనే నెంబరుకు ఫోన్ చేయలేదా అని ప్రశ్నించా. ఫోన్ చేశాం.. 2 గంటల సమయానికైనా అంబులెన్స్‌లు పంపించే పరిస్థితుల్లో మేం లేమని చెప్పారు. 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ 2 గంటలకు పైగా పడుతుందని నిస్సిగ్గుగా చెప్పే పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నా. సరైన సమయంలో అంబులెన్స్‌లు రాకపోవడంతో ఒకటి కాదు.. రెండు కాదు.. 19 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

సారా బట్టీలు కళ్లముందు కనిపిస్తుంటే..
సారా తాగుతున్నారు.. బ్రాందీ షాపులున్నాయి. అంతా తాగే పరిస్థితుల్లోకి వెళుతున్నందుకు బాధ అనిపించడం లేదా? అని ఆ తల్లుల్ని అడిగితే.. ఊళ్ళో బ్రాందీ షాపు తెరిచారు. సారా బట్టీ తెరిచారు. కళ్ళముందు కనిపిస్తుంటే భర్త, కొడుకులు వెళుతున్నారు. తాగుతున్నారన్నా.. అని చెబుతుంటే బాధ అనిపించింది. ఈ రోజులు మారే రోజు త్వరలోనే వస్తుంది. పిల్లలు మద్యం బానిసలు కాకుండా ఉండాలంటే వారిని విద్యావంతుల్ని చేయాలి. పిల్లల్ని చదివించేందుకు ఏ అక్కా, ఏ చెల్లెలు బాధపడే పరిస్థితి లేని రోజు త్వరలోనే వస్తుంది. పిల్లల్ని బడికి పంపిస్తే గొప్పగా చదివించే కార్యక్రమం మేం చేస్తాం. పిల్లల్ని బడికి పంపితే ఒక్కో పిల్లాడికి రూ.500 చొప్పున తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. నేను గర్వంగా చెబుతున్నా. 

గ్రామాల నుంచి మద్యం దూరం చేసేరోజు త్వరలోనే వస్తుంది. దీన్ని అమలు చేయడానికి ప్రతి వెయ్యి మంది నివాసం ఉన్న గ్రామంలో పదిమంది మహిళా పోలీసులను పెడతాం. బ్రాందీ షాపులు తరిమేస్తారు.. సారా బట్టీలు తగలేస్తారు. గ్రామాల్లో యువత బాగుపడాలంటే సారా బయటకు పోవాలి. బ్రాందీ షాపులు గ్రామాల్లో లేకుండా పోవాలి. ఓ సువర్ణయుగం కచ్చితంగా వస్తుంది. బ్రాందీ, విస్కీ తాగాలంటే నియోజకవర్గ హెడ్‌క్వార్టర్స్‌లోకి వెళ్ళాలి. అదీ షాక్ కొట్టే రేట్లుంటాయి.

నిందుతులెవరో తెలిసినా
ఈ గ్రామాల్లో సారా బట్టీలు కాస్తుంది ఎవరనేది చిన్న పిల్లాణ్ణి అడిగినా తెలుస్తుంది. 19 మంది చనిపోయి మూడు రోజులైంది. సారా బట్టీ కాసింది ఎవరనేది పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి టీవీల్లో వారి ఫొటోలు చూపించి గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంతవరకు వారిని పట్టించుకోని పరిస్థితి చూస్తే బాధేస్తుంది. రాజకీయ పరిస్థితులు మారే రోజు కచ్చితంగా వస్తుందని హామీనిస్తున్నా.

మద్యం వద్దని ధర్నాలు చేస్తే కొడతారా?
కనిమెర్ల తండాలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు చెందిన మహిళలు మద్యం వద్దని ధర్నాలు చేస్తే కొట్టారట. ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్ళి వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవలేదని యువకులు చెప్పారు. తమ గ్రామాల్లో బెల్టు షాపులు వద్దు.. సారాయి వద్దు అని ఇక్కడ్నుంచి వినబడుతున్న మాట రాష్ట్ర పెద్దలకు, చంద్రబాబుకు అర్థం కావాలి. కల్తీ సారాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు ఎందుకు ఇస్తుందంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.50 వేలు ఇస్తున్నామన్న విషయం తెలుసుకుని ఎక్కడ వెనకబడతామోనని ఆందోళన చెంది ఇస్తోంది.

హోరెత్తిన జనం
కల్తీ సారా మృతుల కుటుంబాలకు చెందిన తండాల్లో గ్రామస్తులు జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు. అడుగడుగునా ఆయన కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేయడానికి ఉవ్విళ్లూరారు. జగన్ వారి కోరిక నెరవేరుస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుని ఆంధ్రా హాస్పిటల్‌లో కల్తీ సారా ఘటనతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మేకా వెంకట ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. అనంతరం బుధవారం ఫీజు ధర్నాలో పాల్గొనేందుకు ఒంగోలు బయలుదేరి వెళ్లారు.

నేటి నుంచి గుంటూరులో ఓదార్పు
గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి గుంటూరు జిల్లాలో మూడో విడత ఓదార్పు యాత్రను ప్రారంభిస్తున్నారు. బుధవారం ఒంగోలులో కలెక్టరేట్ ముందు ఫీజు ధర్నాలో పాల్గొని సాయంత్రం ఆయన గుంటూరు చేరుకుంటారు. రోడ్డు మార్గాన చిలకలూరిపేట మీదుగా మేడికొండూరు మండలం పేరేచర్లకు చేరుకుని యాత్ర ప్రారంభిస్తారు. ఫిరంగిపురం వరకు పర్యటిస్తారు. గురువారం మేడికొండూరు మండలం పాలడుగులో ప్రారంభమై సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.
Share this article :

0 comments: