పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు విలవిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు విలవిల

పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు విలవిల

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు విలవిల

కరువు.. కరెంటు కోతలను తట్టుకుని రైతన్న పండించిన కాస్తోకూస్తో పంటకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంటలు వేసే ముందు మురిపిస్తున్న ధరలు సరిగ్గా శ్రమఫలం చేతికి వచ్చేసరికి పడిపోతుండటంతో రైతుకు ఏటా నిరాశే మిగులుతోంది. ఉత్పత్తి పెరిగినందువల్లే ఇలా జరుగుతోందని ఎప్పుడూ చెప్పి చేతులు దులుపుకునే ప్రభుత్వం.. ఇప్పుడు కరువుతో పంటలు తగ్గిపోయిన పరిస్థితుల్లోనూ అదే పునరావృతమవుతున్నా కళ్లు మూసుకుంది. గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం ప్రయత్నించాల్సింది పోయి వ్యాపారులకు, దళారులకు సహకరించేలా మొద్దునిద్ర నటిస్తోంది. రాష్ట్రంలో ఏ పంట పరిస్థితి ఎలా ఉంది, ఏ పంటకు ఎంత రేటు వస్తోందో ఓసారి చూద్దాం..

వరి.. దిగుబడి తగ్గినా పాత రేటే!

వరికి కనీస మద్దతు ధర కూడా దక్కడంలేదు. గతేడాది 143 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయినప్పుడు పంటలు బాగా పండినందున ధర తగ్గిందని ప్రభుత్వం బుకాయించింది. అయితే ఈ ఏడాది కరువుతో బియ్యం ఉత్పత్తి 119 లక్షల టన్నులకు పడిపోయినా.. ధాన్యానికి మద్దతు ధర కూడా రావడంలేదు. సర్కారు.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంలేదు. ఐకేపీ, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్‌సీఐలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గత లెవీ సంవత్సరంలో ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,030, సాధారణ రకం ధాన్యానికి రూ.1,000 ఉండేది. ఈ ఏడాది కేంద్రం ప్రభుత్వం రూ.80 పెంచింది. ఏ గ్రేడ్ క్వింటాల్‌కు రూ.1,110, సాధారణ రకం రూ.1080గా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై రైతులకు అవగాహన కల్పించలేదు. దీంతో వ్యాపారులు, మిల్లర్లు గతేడాది ధరలనే ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. నాణ్యత సాకు చూపి కనీస మద్దతు ధర కంటే రూ.80 తక్కువకు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. 

చెరకు.. మద్దతు దక్కినా నష్టాలే
చెరకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఏటా పోరాడుతున్నా ఫలితం దక్కడం లేదు. ధర రాక రైతులు ఈ పంట సాగు మానేసే పరిస్థితి వస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడంలేదు. ఎకరా విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.50 వేలు ఖర్చవుతుంది. గత ఏడాది ఇదే సమయానికి చెరకు టన్ను ధర రూ.2,200 ఉండగా ఇప్పుడు రూ.1,800 మించి రావడం లేదు. కనీస మద్దతు ధర వస్తేనే టన్నుకు రూ.480 నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతకన్నా తక్కువ ధర వస్తుండడంతో రైతులు పెట్టుబడి కూడా నష్టపోతున్నారు.


పత్తి రైతు చిత్తు.. చిత్తు...
రాష్ట్రంలో వరి తర్వాత రెండో ప్రధా న పంట అయిన పత్తి రైతు ఈ ఏడాది భారీ నష్టాలతో చిత్తయ్యాడు. పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేలదాకా ఖర్చవుతుంది. అనుకూల వాతావరణంతో ఎకరాకు సగటున 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.7 వేలు రావడంతో ఈ ఏడాది పంట విస్తీర్ణం రికార్డు స్థాయిలో 50 లక్షల ఎకరాల్లో సాగయింది. అయితే కరువు వల్ల పత్తి రైతులే ఎక్కువగా నష్టపోయారు. సరిగ్గా పూత, కాత సమయంలో కరువు దెబ్బతీయడంతో దిగుబడి 6 క్వింటాళ్లకు తగ్గిపోయింది. 34.12 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినడంతో రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి 10.23 లక్షల టన్నులు తగ్గింది. రైతులు రూ.3 వేల కోట్లు నష్టపోయారు. ఉత్పత్తి తగ్గితే పెరగాల్సిన ధర.. గత ఏడాది కన్నా సగానికి సగం తగ్గింది. ఇప్పుడు క్వింటాల్‌కు రూ.3800 దక్కడమే గగనంగా మారింది!

ఏడిపిస్తున్న ఉల్లి...
ఉల్లి రైతులకు ఈసారి కూడా కష్టాలు తప్పడం లేదు. గతేడాది ప్రభుత్వాలనే వణికించే స్థాయిలో ధరలు పెరిగాయి. అయితే రైతుకు మాత్రం క్వింటాల్‌కు రూ.4 వేలే వచ్చింది. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి సాగుకు రూ.20 వేలు ఖర్చవుతోంది. సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కరువుతో ఇప్పుడు ఇది 40 క్వింటాళ్లకు పడిపోయింది. ఉత్పత్తి తగ్గినప్పుడు పెరగాల్సిన ధర అమాంతంగా పడిపోయింది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.400 మాత్రమే వస్తోంది. 



మిరప.. పెట్టుబడి కూడా డౌటే
మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో ఈ ఏడాది మిరప పంట విస్తీర్ణం పెరిగినా కరువు దెబ్బతీసింది. ఇది చాలదన్నట్లుగా ప్రభుత్వం వ్యాపారులకే సహకరించేలా వ్యవహరిస్తుండడంతో ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. మిగిలిన పంటలతో పోల్చితే మిరపకు పెట్టుబడి ఎక్కువ. పురుగుమందులు వినియోగించకపోతే పంట బతికే పరిస్థితి ఉండదు. ఎకరాకు ఈ పంట సాగుకు కనీసం రూ.1.10 లక్షలు ఖర్చవుతుంది. సగటున 20 క్వింటాళ్ల ఉత్పత్తి అవుతుంది. ఏడాది క్రితం, మూడు నెలల ముందు వరకు మిరప క్వింటాల్‌కు రూ.11 వేలు పలికింది. ఇప్పుడు కరువు కారణంగా దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్లకే పరిమితమైంది. ఉత్పత్తి తగ్గినందున ధర పెరుగుతుందని రైతులు ఆశపడ్డారు. అయితే వ్యాపారుల మాయాజాలంతో క్వింటాల్ ప్రస్తుతం ధర రూ.6 వేలకు పడిపోయింది. ఫలితంగా ఈసారి మిరప రైతులకు పెట్టుబడి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.

టమాటా.. నష్టాల మోత!
కూరగాయల్లో రారాజులాంటి టమాటాను సాగు చేస్తున్న రైతులు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. టమాటాకు ఇప్పుడు కిలోకు రూపాయి కూడా రాని పరిస్థితి నెలకొంది. అదే మార్కెట్‌లో వినియోగదారుడికి మాత్రం కిలో రూ.5 నుంచి రూ.6 పలుకుతోంది. గతేడాది ఇదే సమయంలో కిలో రూ.10 వరకు వచ్చిన టమాటా ఇప్పుడు రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు పంటను చేల మీదే వదిలేస్తున్నారు.
Share this article :

0 comments: