చంద్రబాబు, రామోజీ, రిలయన్స్ తోడుదొంగలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు, రామోజీ, రిలయన్స్ తోడుదొంగలు

చంద్రబాబు, రామోజీ, రిలయన్స్ తోడుదొంగలు

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

* ధ్వజమెత్తిన కొణతాల, వాసిరెడ్డి పద్మ
* సుప్రీంలోనూ ‘నాట్ బిఫోర్’ నాటకం
* బాబు సూచనల మేరకే రామోజీ చానళ్ల కొనుగోలు
* టీడీపీని రిలయన్స్ దేశం పార్టీగా మారిస్తే మేలు
* రామోజీ, చంద్రబాబు, రిలయన్స్‌లకు కేంద్రం అండ

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయన ఆర్థిక మిత్రబృందం అవినీతి, అక్రమార్జనల కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ ఇంకొక ధర్మాసనానికి మారడంతో చంద్రబాబు-రిలయన్స్-రామోజీరావు మధ్య ఉన్న బంధం మరోమారు రుజువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. నష్టాల్లో ఉన్న ఈటీవీ తెలుగేతర చానళ్లను రెండు రోజుల కిందట రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినప్పుడే వారికున్న సంబంధం బయట పడిందని చెప్పారు. తమ అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టుల ద్వారా తప్పించుకోవాలని చంద్రబాబు ఆయన మిత్రులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో న్యాయమూర్తి దల్బీర్ భండారీ వద్దకు విజయమ్మ పిటిషన్ విచారణకు రాగానే హరీష్ సాల్వే అనే న్యాయవాది లేచి రిలయన్స్ కేసులు విచారించబోనని గతంలో చేసిన ప్రకటనను ప్రస్తావించడంతో... కేసును మరో ధర్మాసనానికి మార్చేశారని తెలిపారు. దీన్ని బట్టి హైకోర్టులో ‘నాట్ బిఫోర్’ అనే నాటకం ఎలా ఆడారో అదే విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో కూడా రిలయన్స్ సంస్థ ద్వారా అలాగే చేయించారని వారు విమర్శించారు. ఇలాగైతే దేశంలోని కార్పొరేట్ సంస్థలన్నింటిలోనూ ఏదో ఒక న్యాయమూర్తికి షేర్లు ఉంటాయని, అంతమాత్రాన వాటి విచారణను చేపట్టబోమంటే ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై ఒక విధానం రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వారు అభిప్రాయపడ్డారు. 

రిలయన్స్‌కు రామోజీ చుట్టమా?
ఈటీవీ చానళ్లను రిలయన్స్ స్వాధీనం చేసుకోవడాన్ని రెండు వ్యాపార సంస్థల మధ్య లావాదేవీగా టీడీపీ నేత ఎర్రంనాయుడు అభివర్ణించడాన్ని కొణతాల, వాసిరెడ్డి తప్పుబట్టారు. ‘‘ఇదే రకమైన లావాదేవీ? నష్టాల్లో ఉన్న ఈటీవీ తెలుగేతర చానళ్లను అధికంగా డబ్బు చెల్లించి రిలయన్స్ కొనుగోలు చేయడం లాభసాటి వ్యాపారమవుతుందా? డబ్బా చానళ్లను రిలయన్స్ కొని లాభాల్లో ఉన్న ఈటీవీ తెలుగు చానళ్లను మాత్రం రామోజీరావే ఉంచుకోవాలని నిర్ణయించడం సబబేనా? అసలు రామోజీపై రిలయన్స్‌కు అంత ప్రేమెందుకు? ఆయనేమైనా వారికి బంధువా?’’ అని నిలదీశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రిలయన్స్ సంస్థ ప్రయోజనాలు పొందినందుకే, ఆయన సూచనల మేరకు రామోజీ చానళ్లను కొనుగోలు చేసి పాప పరిహారంగా వందల కోట్ల రూపాయలు చెల్లించారా? అని వారు ప్రశ్నించారు. ఇందులో స్పష్టంగా ‘క్విడ్ ప్రో కో’ ఉన్నట్లు రుజువైందని వెల్లడించారు. ఈరోజు రామోజీ చానళ్లను తీసుకున్న రిలయన్స్ కొద్దిరోజులు పోయాక టీడీపీని కూడా కొనుగోలు చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశంను రిలయన్స్ దేశం పార్టీగా వ్యవహరిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కర్ణాటక గవర్నర్‌తో భేటీ ఎందుకో వెల్లడించాలి!
చంద్రబాబు కుప్పం వెళుతూ బెంగళూరులో కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్‌ను ఎందుకు కలిశారో, ఏం మాట్లాడారో వెల్లడించాలని రామకృష్ణ, పద్మ డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలం పాటు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ద్వారా సుప్రీంకోర్టులో మంత్రాంగం నడిపేందుకే బాబు ఆయనను కలిసినట్లుగా వార్తలొచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. రామోజీ, చంద్రబాబు, రిలయన్స్ సంస్థ కలిసి విచారణల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల కుట్రలకు పాల్పడుతున్నారనీ, కేంద్రంలోని కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం కూడా అందుకు అండగా నిలిచిందని వారు ఆరోపించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడతామని బాబు, రామోజీ ఇద్దరూ ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చి బయట పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కూడా బాబు బృందం బీజేపీ సహాయంతో తమపై విచారణలు జరక్కుండా చేసుకోగలిగారని విమర్శించారు. రామోజీకి చెందిన మార్గదర్శి అవకతవకలపైనా, ఇతర అక్రమాలపైనా రిజర్వు బ్యాంకు విచారణ జరక్కుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. కేజీ బేసిన్ సంపద ను దోచుకోవడానికి రిలయన్స్‌కు సహకరించిన చంద్రబాబు, రామోజీలిద్దరూ తెలుగు ప్రజల హిట్‌లిస్ట్‌లో నంబర్ ఒన్, నంబర్ టూలుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 

దేశంలోనే శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా పేరు మోసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ న్యాయం కోసం కోర్టుల తలుపులు తడుతూ ఉంటే... తమపై ప్రాథమిక విచారణ కూడా జరక్కుండా బాబు, రామోజీలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రాథమిక విచారణకే ఇన్ని అడ్డంకులా! అని కొణతాల, వాసిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలూ భ్రష్టు పట్టించిన బాబు న్యాయవ్యవస్థను కూడా వాడుకుంటున్నారని వారన్నారు.
Share this article :

0 comments: