పేదల ఆరోగ్యం.. విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు చెలగాటం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదల ఆరోగ్యం.. విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు చెలగాటం!

పేదల ఆరోగ్యం.. విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు చెలగాటం!

Written By ysrcongress on Thursday, January 19, 2012 | 1/19/2012

* మహానేత వెళ్లిపోయాక ఫీజుల పథకాన్ని ఎలా కత్తిరించాలా అని చూస్తున్నారు
* 108, 104కు ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితి లేదు
* రైతులను ఈ సర్కారు గాలికొదిలేసింది
* 10 నెలలుగా వ్యవసాయశాఖకు మంత్రి లే రు
*వ్యవసాయ వర్సిటీకి 12 నెలలుగా వైస్ చాన్సలర్ లేరు
*ఇదీ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ 



గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: పేదల ఆరోగ్యంతో.. విద్యార్థుల భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల గురించి పట్టించుకోకుండా వారిని గాలికొదిలేసిందని విమర్శించారు. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రాన్ని ఇలాంటి పాలకుల చేతుల్లో చూస్తుంటే బాధనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లాలో 50వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన బుధవారం పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పది వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో జెర్రిపోతు చంద్రమ్మ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. మునగోడు, లగడపాడు, బయ్యవరం, ఉటుకూరు సహా పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. ‘‘ఇక్కడకు రాకముందు 15 రోజుల క్రితం అనుకుంటా.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు కోసం ఒంగోలులో ధర్నా చేశాను. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాం. ఇప్పుడు విద్యార్థులు ఒక సెమిస్టర్ పూర్తయి రెండో సెమిస్టర్‌లోకి వచ్చారు. మరో రెండు నెలల్లో పరీక్షలు.. ఫీజు చెల్లిస్తేనే.. హాల్ టికెట్ ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు అంటే.. విద్యార్థుల పరిస్థితి ఏమిటి? పోనీ.. రాష్ట్రప్రభుత్వం పిల్లల చదువులపై ఆలోచన చేస్తుందా? అంటే కేవలం చెలగాటమాడుతోంది. ఫీజుల పథకాన్ని ఎలా కత్తిరించాలా అని ఆలోచన చేస్తోంది. పేదరికం పోవాలంటే కుటుంబంలో ఒక్కరయినా ఇంజినీరు, డాక్టరు, కలెక్టరు వంటి పెద్ద చదువులు చదవాలి. 


అలాంటి చదువులు తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా చదివించగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని దివంగత వైఎస్ భావించారు. ఆయన వెళ్లిపోయాక ఆ పథకాన్ని కత్తిరించాలని చూస్తున్నారు. పేదవాడి ఆరోగ్యంతోనూ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అనారోగ్యం పాలయినపుడు 108 నంబరుకు ఫోను చేస్తే.. కుయ్‌కుయ్ మంటూ వచ్చే అంబులెన్సులు.. వైఎస్ చనిపోయాక ఇప్పుడు ఎలా ఉన్నాయంటే.. 108కి ఫోను చేస్తే.. అంబులెన్సులు రిపేరులో ఉన్నాయని, డీజిల్‌కు డబ్బులు లేవని, సిబ్బంది సమ్మెలో ఉన్నారనే సమాధానం వస్తోంది. 

పల్లెల్లో ముసలి వయసులోని అవ్వ, తాతకు బీపీ, షుగర్‌కు మందులు ఇచ్చే 104 అంబులెన్సుకు ఫోను చేసినా ఇదే పరిస్థితి. మందులు లేవు.. సిబ్బంది సమ్మె చేస్తున్నారనే సమాధానం. పేదవాడి ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది.

రైతుల పరిస్థితి చూస్తుంటే బాధనిపిస్తోంది..
వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక ఇవాళ రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవాలని ఆలోచన చేసే నాథుడు ఒక్కడంటే ఒక్కడు లేడనుకుంటే బాధనిపిస్తోంది. వైఎస్ చనిపోయి రెండున్నర సంవత్సరాలవుతోంది. 

రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అలా ఊళ్లలో తిరగాలని చాలా గ్రామాలు వెళ్లాం.. కొంతమంది రైతులు పొలాలకు తీసుకెళ్లి వాళ్లు పండించిన పత్తి, మిరప పంటలను చూపించారు. ‘మిరపను కోస్తున్నాం. వర్షాలు సరిగా పండక పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ మధ్యకాలంలో అకాలవర్షాలు కురిసి పంటను ఇంకా నాశనం చేశాయి. ఎకరాకు 25 క్వింటాళ్లు వస్తుందనుకున్న మిర్చి ఇవాళ 10-12 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. మార్కెట్లో క్వింటాలు రూ.4 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి...అది కూడా బాగున్న మిర్చికే..’ నంటూ రైతులు పంటను చూపిస్తూ.. చెబుతున్నపుడు బాధనిపించింది. 

ఆ దారిలోనే పొలాల్లో పనిచేస్తున్న అక్కాచెల్లెమ్మలు చాలామంది ఆప్యాయంగా పలకరించారు. ‘ఎంత గిట్టుతోంది తల్లీ’ అనడిగా...‘రూ.120 గిట్టుబాటవుతోంది...అది కూడా మిరప పంటకెళితేనే’ అని వారు చెప్పారు. వీరిలో కర్నూలు, ఆలూరు, ఆదోని, పత్తికొండ, డోన్ నుంచి కూడా వలస వచ్చినవారు ఉన్నారు. ‘కర్నూలులో మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. రూ.70 కన్నా గిట్టేది కాదు. కనీసం ఇక్కడయినా రూ.120 గిడతాయని వచ్చామన్నా’ అని పసిపిల్లలను చంకన వేసుకుని వారు మాట్లాడుతున్నప్పుడు బాధనిపిస్తుంది. 

ఇదీ రైతులపై ప్రభుత్వానికున్న ప్రేమ: రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఎంత ప్రేమ చూపుతుందీ అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. రాష్ట్రంలో గత పది నెలలుగా వ్యవసాయశాఖకు మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే రైతులపై వారికెలాంటి ప్రేమ ఉందో అర్థమవుతోంది. విత్తనాలు నాణ్యత లేక దిగుబడులు తగ్గిపోతున్నాయి. టెస్ట్ చేసి సర్టిఫై చేయించాల్సింది వ్యవసాయ యూనివర్సిటీ. ఇవాళ మన ఖర్మ ఏమిటంటే.. గత 12 నెలలుగా వ్యవసాయ యూనివర్సిటీకి వైస్‌చాన్సలర్ కూడా లేని అధ్వాన పరిస్థితుల్లో పాలన చేస్తున్నారు. మానవత్వం లేని ప్రభుత్వాన్ని చూస్తున్నపుడు బాధనిపిస్తుంది.’’

పాల్గొన్న నేతలు: ఓదార్పుయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ప్రోగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పల్లెలకు వెళ్లే ధైర్యం లేదు..
‘‘దివంగత వైఎస్ ఒక గొప్ప స్వప్నాన్ని చూశారు. ఆ కార్యక్రమానికి రచ్చబండ అని పేరుపెట్టారు. ముందుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు మాత్రమే తెలియజేసి.. హఠాత్తుగా ఒకరోజు ఉదయం ఏదొక జిల్లాలోని ఒక గ్రామంలో దిగుతారు. ఉదయాన్నే సమాచారం అందుకుని వచ్చిన కలెక్టర్ సమక్షంలోనే రచ్చబండ వద్ద.. ‘అర్హులైన వారిలో ఎవరికైనా.. పింఛను, రేషనుకార్డు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వైద్యసౌకర్యం అందడం లేదా’ అని అడుగుతారు. 

ఇవి అందడం లేదని ఎవరూ చేయి లేపకుంటేనే.. తన స్వప్నం నెరవేరినట్టవుతుందని ఆయన నమ్మారు. ప్రతి పేదవాడికి ఇవన్నీ అందుబాటులోకి రావటానికి కులం, మతం. పార్టీ, రాజకీయాలు అడ్డుకాకూడదని వైఎస్ కలగన్నారు. ఇవాల్టి ప్రభుత్వం అదే కార్యక్రమానికి రచ్చబండ అని పేరుపెట్టుకుంది. అయినా పల్లెలకు రాదట..! పల్లెలకు వచ్చే ధైర్యం రాష్ట్రప్రభుత్వానికి లేదు. పేదవాడి గుండెచప్పుడును వినాలన్న మనసు, కోరికలు తీర్చాలన్న తపన లేదు. 

కేవలం మండల కేంద్రం లేదా నియోజకవర్గ కేంద్రంలోనే రచ్చబండ పెడతారట.. తోచిన మేరకు కొద్దోగొప్పో భిక్షమేసినట్టు వేస్తారట.. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేసినవారికి మాత్రమేనట. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్నీ, రాష్ట్ర పాలకులను చూసినపుడు బాధనిపిస్తుంది.’’
Share this article :

0 comments: