జగన్ ఎక్కడికి వెళ్లినా విపరీతంగా జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఎక్కడికి వెళ్లినా విపరీతంగా జనం

జగన్ ఎక్కడికి వెళ్లినా విపరీతంగా జనం

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చెప్పారు. జగన్ ఎక్కడికి వెళ్లినా విపరీతంగా జనం వస్తున్నారని తెలిపారు. మంత్రివర్గంలో తెలంగాణ వాటా తగ్గిందని, శంకర్రావు రాజీనామాతో ఎస్సీల ప్రాతినిధ్యం కూడా తగ్గిందన్నారు. కాపు సామాజికవర్గానికి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతనిచ్చారంటూ తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని, కొన్ని పత్రికలు, చానళ్లు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సీఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. 

జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవంటూ కొన్ని పత్రికలు రాయడాన్ని తప్పుపట్టారు. ‘‘జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేకుంటే ప్రజల్లో ఎట్లా తిరుగుతున్నారు? నిజం చెప్పాలంటే జగన్ తిరుగుతుంటే విపరీతంగా జనం వస్తున్నారు. అవి ఓట్లుగా మారతాయో లేదో ఎన్నికల్లో తేలుతుంది. ఒక నాయకుడికి ప్రజాదరణ ఉందో లేదో తేలిసేది ఎన్నికల ఫలితాల ద్వారానే కదా! అంతేగానీ ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని ఊహించి రాయడం సరికాదు. అట్లా రాయడాన్ని చూసి చాలా బాధపడ్డాను’’ అని పేర్కొన్నారు. 

తాను ఓ కులాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని, తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయలేదని చెప్పారు. ‘‘ఇటీవల బాపట్లలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన సమయంలో మంత్రివర్గం నుంచి శంకర్రావు తొలగించడంపై నా అభిప్రాయం అడిగారు. కులాలవారీగా ఎవరి సంఖ్య ఎంత ఉన్నదో వివరించానేతప్ప ఒక కులానికి ఆధిపత్యం ఎక్కువైందనిగానీ, మాకు అన్యా యం జరిగిందనిగానీ చెప్పనేలేదు. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నవాడిని. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి నేను తెలివి తక్కువవాడినా? ఆలోచన లేని వ్యక్తినా? దయచేసి దీనిని ఇంతటితో ఆపేయండి. రాద్ధాంతం చేయొద్దు’’ అని అన్నారు. 

పార్టీ మారితే ప్రబలమైన కారణాలు చెబుతా
కాంగ్రెస్ పార్టీని వీడివెళ్లాలన్న ఆలోచన తనకు లేదని గాదె చెప్పారు. పోవాలనే ప్రబలమైన కారణం ఎప్పుడైనా వస్తే, అందరికీ ఆమోదమైన కారణంతోనే పోతానే తప్ప ఆషామాషీగా వెళ్లనని అన్నారు. అంత సులువుగా పార్టీలు మార్చేవాడిని తాను కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తాడా? అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు.


జగన్ ప్రజాదరణ కలిగిన నేత -రాయపాటి సాంబశివరావు
జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘జగన్ గారిని పార్టీలోకి ఆహ్వానించే స్థాయి నాది కాదు. సోనియాగాంధీగారు, ఆజాద్, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతుంది. వస్తే మంచిదే. మాకు అభ్యంతరం లేదు’’ అని ఎంపీ రాయపాటి బదులిచ్చారు. జగన్ ప్రజాదరణ కలిగిన నేత అని గాదె వెంకటరెడ్డి అన్నారని చెప్పగా...‘‘కనిపిస్తోంది కదా. జనం వస్తున్నారు. దాంట్లో తప్పుపట్టడానికి ఏముంది చెప్పండి?’’ అని ఆయన ప్రశ్నించారు. జగన్ వల్ల కాంగ్రెస్‌కు ఇబ్బందే కదా? అన్న ప్రశ్నకు... ‘‘ఇబ్బందే. ఏం చేయమంటారు చెప్పండి. ఏడన్నా దూకాలి మేం నీళ్లు లేని బావిలో. దూకమంటారా నన్ను? ఈ ప్రశ్నను నాయకులను అడగండి. పెద్ద నాయకులున్నారు కదా. మేం సాధారణ కార్యకర్తలం. ఏ పదవీ ఆశించడం లేదు. కాంగ్రెస్‌కోసం పనిచేస్తున్నాం’’ అని బదులిచ్చారు.


Share this article :

0 comments: