అసలు దోషుల్ని వదిలిపెట్టేందుకు సీబీఐ నానాతంటాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసలు దోషుల్ని వదిలిపెట్టేందుకు సీబీఐ నానాతంటాలు

అసలు దోషుల్ని వదిలిపెట్టేందుకు సీబీఐ నానాతంటాలు

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

* ఎమ్మార్ కేసులోనూ వైఎస్ కుటుంబం, సన్నిహితులే టార్గెట్?
* అసలు దోషుల్ని వదిలిపెట్టేందుకు సీబీఐ నానాతంటాలు
* భూములు సేకరించిన, కేటాయించిన బాబుకు ‘ఢిల్లీ’ రక్ష
* ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి, వాటాలను నిర్ణయించిందీ బాబే
* బాబునెందుకు విచారించరంటూ సుప్రీం ప్రశ్నించినా మీనమేషాలే
* అధికారంలోకి రాగానే ఒప్పందం రద్దు చేయాలని భావించిన వైఎస్
* ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతినకూడదనే ఉప సంఘానికి అప్పగింత
* ఆ కమిటీ సూచనల మేరకే ఏపీఐఐసీ వాటాలో మార్పులు
* వీటన్నిటినీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని దర్యాప్తు సంస్థ 
* విల్లాల అమ్మకంలో డబ్బులు చేతులు మారటంపైనే దృష్టి
* సాక్షుల ద్వారా వైఎస్ సన్నిహితుల పేర్లు చెప్పించటానికి తంటాలు
* వైఎస్ పరిచయస్తులను, బంధువులను ఇరికించే యత్నాలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మరో కుట్ర. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక నాయకుడి ప్రతిష్టను దిగజార్చడానికి పన్నుతున్న కుట్రల పరంపరలో మరో అంకం. ఆ నాయకుడి వారసుడిని రాజకీయంగా తుదముట్టించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మరో కోణం. భూ సేకరణ పేరిట రైతుల భూముల్ని కాజేసి.. నామమాత్రపు పరిహారంతో వారిని నట్టేట ముంచి.. గోల్ఫ్ కోర్సుకు, విల్లాలకు, ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆ భూముల్ని కట్టబెట్టిన కుంభకోణంలో సూత్రధారుల్ని వదిలేశారు. ఈ రాష్ట్రానికి పరిచయమే లేని దుబాయ్ సంస్థ ఎమ్మార్-ఎంజీఎఫ్‌ను రెడ్‌కార్పెట్ పరిచి మరీ పిలిచి.. 535 ఎకరాల్ని అప్పనంగా ఇచ్చేసిన చంద్రబాబు నాయుడి వంక దర్యాప్తు సంస్థలు చూడటమే లేదు. 

‘‘భూముల సేకరణ, అప్పగింత అన్నీ ఆయన హయాంలోనే జరిగాయిగా! అప్పటినుంచీ ఎందుకు దర్యాప్తు చేయకూడదు? ఆయన్నెందుకు దర్యాప్తు పరిధిలోకి తీసుకురాకూడదు?’’ అంటూ సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ప్రశ్నించినా, నోటీసులు జారీ చేసినా.. దర్యాప్తు సంస్థల్లో ఉలుకూ పలుకూ లేదు. అంతటి విలువైన స్థలాన్ని కారుచౌకగా ఎందుకు కేటాయించారో.. విల్లా స్థలాల్ని విక్రయించుకోవటానికి వీలుగా కొలాబరేషన్ అగ్రిమెంట్‌కు ఎందుకు సై అన్నారో.. దీని వెనక ఎవరెవరికి ఎంత ముట్టిందో కనీసం పట్టించుకోవటం లేదు! ఈ కోణంలో దర్యాప్తు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని కూడా సీబీఐ మరిచిపోయినట్టుంది. 

ఇవన్నీ వదిలేసి.. విల్లా స్థలాల్ని అధికారికంగా ఎంతకు విక్రయించారు, అనధికారికంగా ఎవరెవరికి ఎంత సొమ్ము ముట్టింది వంటి అంశాలపైనే సంస్థ దృష్టి కేంద్రీకరిస్తోంది. పెపైచ్చు ఈ వ్యవహారంలో పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారిస్తూ.. ఒకరు కాకుంటే మరొకరి చేతనైనా తమకు గిట్టని వారి పేర్లు చెప్పించాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ రకంగానైనా తాము కావాలనుకుంటున్న వారి పేర్లు చెప్పించి.. తమ ‘టార్గెట్’ను పూర్తి చేయాలని భావిస్తోంది. మరీ ఇంత ఘోరమా? ఢిల్లీ పెద్దలు ఏం చెబితే అది చేయడానికేనా ఈ దర్యాప్తు సంస్థలున్నది? ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకున్న వారినైతే ఎంతటి అక్రమాలకు పాల్పడినా వదిలేయటానికేనా ఈ సంస్థ? ఢిల్లీ పెద్దల్ని ఎదిరించిన వారిని టార్గెట్ చేయడానికేనా ఈ సంస్థ? మొదట కేసు వేసిన దగ్గర్నుంచి, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరు వరకూ.. ఎమ్మార్ కేసులో ఆది నుంచీ ఓ భయంకరమైన కుట్ర కనిపిస్తూనే వస్తోంది.

టీడీపీ-కాంగ్రెస్ మూకుమ్మడి కుట్రే!
ఎమ్మార్ వ్యవహారాన్ని తొలుత కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. రెండ్రోజుల కిందట బర్తరఫ్ అయిన మంత్రి శంకర్రావు. ‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ జరిపించాలంటూ హైకోర్టుకు లేఖ రాసిన ఆయన.. దాన్లోనే ఎమ్మార్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. కోర్టు దీనిపై విచారణ ఆరంభించటంతో ‘సాక్షి’ కేసులో తమ వాదన కూడా వినాలంటూ తెలుగుదేశం నేతలు ఇంప్లీడయ్యారు. నిజానికి ఈ కేసులో శంకర్రావు, టీడీపీ నేతలు సమర్పించిన డాక్యుమెంట్లు ఒకరి దగ్గర్నుంచి మరొకరు తీసుకున్నట్టే ఉన్నాయని, కొన్ని కాగితాలపై ఉన్న పిచ్చి రాతలతో సహా ఇద్దరి పిటిషన్లూ పరస్పరం జిరాక్స్ కాపీలేనని ‘సాక్షి’ గతంలోనే బయటపెట్టింది. 

టీడీపీ నేతలు, శంకర్రావు కుమ్మక్కయ్యే ఈ కేసు వేశారని ఆధారాలతో సహా తేల్చి చూపించింది. ఇక, కాంగ్రెస్ పెద్దలు చెబితేనే తాను కేసు వేశానని, అంతా ఢిల్లీ పెద్దలే చూసుకుంటారని శంకర్రావు స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. అంటే.. కాంగ్రెస్-టీడీపీ కలిసి కుట్ర పన్ని, శంకర్రావు చేత కథ నడిపించినట్టు స్పష్టంగానే తేలింది. ఎమ్మార్ విచారణ కూడా శంకర్రావు లేఖతోనే మొదలైంది కనుక ఇదీ ఆ కుట్రలో భాగమేనని అనుకోక తప్పదు. మరి పథకం ప్రకారం టీడీపీ పెద్దలు దాఖలు చేయించిన కేసులో టీడీపీ వారిని విచారించటం, వారి అక్రమాల్ని నిగ్గు తేల్చటం వంటివాటికి అవకాశాలుంటాయా? 

కోనేరు.. బాబు బినామీ
ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా అదే. అసలు ఈ భూ సేకరణ చేసింది, భూముల్ని కేటాయించింది చంద్రబాబని, టెండర్లు పిలవటం నుంచి కొలాబరేషన్ ఒప్పందానికి అనుమతించడం దాకా కథ నడిపింది ఆయనేనని.. ఈ మొత్తం కుంభకోణంలో కొలాబరేషన్ అగ్రిమెంటే కీలకమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా తేల్చింది. దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మాత్రం.. అసలు 2004 కన్నా ముందు జరిగిన పరిణామాల్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అవేవీ తన పరిధిలోకే రావన్నట్టు వ్యవహరిస్తోంది. 2004కు ముందే కుట్ర జరిగింది కాబట్టి దాన్ని కూడా దర్యాప్తు చేయాలంటూ స్వాతంత్య్ర సమరయోధుడొకరు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసి.. భంగపడి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని విచారణకు స్వీకరించింది. ఎందుకు దర్యాప్తు చేయటం లేదంటూ నోటీసులు జారీ చేసింది. 

ఇంత జరిగినా సీబీఐ చంద్రబాబు వంక చూడకపోవటానికి కారణమేంటి? ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్.. బాబు బినామీ కాదా? బాబు దుబాయ్ వెళ్లినప్పుడల్లా అక్కడ ఏర్పాట్లు చూసింది, వ్యవహారాలు చక్కబెట్టింది ఈ కోనేరు ప్రసాదే కాదా? టీడీపీ ఆఫీసులో వ్యవహారాలు చక్కబెట్టిన ‘ఈనాడు’ న్యూస్ విభాగం మాజీ ఎండీ రమేశ్ బాబు కోనేరు ట్రస్ట్‌లో కీలక బాధ్యతలు చూడలేదా? ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా సీబీఐ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది? తన సొంత కంపెనీ హెరిటేజ్‌లోనూ ఇన్వెస్టర్ల భూముల్ని భార్య పేరిట బదలాయించుకున్న ఘనత ఉన్న బాబుకేసి కన్నెత్తి కూడా చూడటం లేదెందుకు?

బాబు-కాంగ్రెస్ కుమ్మక్కే కారణం...
పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. చంద్రబాబునాయుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కలిసిపోయారు. జగన్‌మోహన్‌రెడ్డేమో ఆ పెద్దలను ఎదిరిస్తున్నారు. అంతే! మొత్తం సమాధానాన్నీ ఈ రెండు వాక్యాల్లోనే వెతుక్కోవచ్చు. బాబు-కాంగ్రెస్ దోస్తీ వైఎస్సార్ కడప, చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. భూ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరిగినపుడు సైతం‘‘సభాసంఘం వేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చా’’ అంటూ ముందే కుదిరిన ఒప్పందాన్ని బాబు బయటపెట్టడం.. సభాసంఘం వేశాక కూడా, 2004 తర్వాత జరిగిన భూ కేటాయింపులనే దానికి అప్పగించటం.. బాబు జోలికి వెళ్లకపోవటం వంటివన్నీ బాబు-కాంగ్రెస్ దోస్తీని కళ్లకు కట్టాయి. ఇక అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ప్రభుత్వం పడిపోయే అవకాశమున్నపుడు వెనక్కి తగ్గి.. పీఆర్పీ విలీనం తరువాత, సర్కారు పడిపోదని తేల్చుకున్నాకే అవిశ్వాసం పెట్టడం.. బాబుపై ఎన్ని పిటిషన్లు దాఖలైనా ప్రభుత్వం తరఫున కోర్టుల్లో వాటిపై స్పందించకపోవటం.. ఇవన్నీ ఆ ఇద్దరి బంధం ముసుగును తొలగిస్తూనే వస్తున్నాయి. ఆఖరికి సీబీఐ సైతం బాబుపై కోర్టు విచారణకు ఆదేశించినా ముందుకు కదల్లేదు. ఓబుళాపురం మైనింగ్ కేసులో లీజును బదలాయించిందే బాబు అంటూ నాటి జీవోను జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా సీబీఐకే అందజేసినా దానిపై ఉలుకూ పలుకూ లేదు. ఇలా ఒక్కటి కాదు. ఢిల్లీతో బాబు కుమ్మక్కయ్యారనటానికి ఎన్నెన్నో ఆధారాలు కనిపిస్తూనే వస్తున్నాయి.

అటూ ఇటూ తిప్పి.. గిట్టని వారిపైకి
ఎమ్మార్ కేసులో సూత్రధారిని వదిలేయటానికి సిద్ధపడ్డ సీబీఐ.. కేసును అటు తిప్పి, ఇటు తిప్పి, చివరకు ఢిల్లీ పెద్దలకు గిట్టని వైఎస్సార్ కుటుంబాన్ని, ఆయన సన్నిహితులనే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందుకోసం వేరే ఆధారాలేవీ లేక.. విల్లాలు కొనుక్కున్న వారిని, ఇతరుల్ని సాక్షులుగా పిలిచి.. వారిచేత వైఎస్సార్ కుటుంబీకులు, సన్నిహితుల పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మార్ వ్యవహారంలో ఏపీఐఐసీ వాటా తగ్గించుకోవాలని సూచించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని గానీ, దానికి భూములు కట్టబెట్టి కుట్రపూరిత ఉద్దేశంతో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో వాటాను ముందే 26 శాతానికి పరిమితం చేసుకున్న చంద్రబాబును గానీ తప్పుబట్టే ఉద్దేశం సంస్థకు ఎంతమాత్రం లేనట్టే కనిపిస్తోంది. 

అసలు ఏ దర్యాప్తు సంస్థయినా ఒక కుంభకోణాన్ని విచారిస్తే దాని మూలాల్లోకి వెళుతుంది. అక్కడే దోషుల్ని పట్టుకుంటుంది. సీబీఐ మాత్రం అలాంటి ప్రయత్నమే తనకు అనవసరమనుకుంటోంది. ఆఖరికి సుప్రీంకోర్టు సైతం చెప్పినా సరే, ఆ దిశగా దృష్టి పెట్టడానికి ఇష్టపడటం లేదు. భూమి ఇచ్చిన వారిని, ఒప్పందం కుదుర్చుకున్న వారిని వదిలేసి.. చివరికి ప్లాట్లు కొనుక్కున్న వారిని పట్టుకుంది. తామనుకున్న మాటలను వారితో చెప్పించేందుకు ‘అన్ని’రకాలుగానూ ప్రయత్నిస్తోంది. ‘ప్లాట్లు కొనేందుకు ఎంతిచ్చారు? అందులో బ్లాక్‌లో ఎంత, వైట్‌గా ఎంతిచ్చారు?’ అంటూ కూపీ లాగుతోంది. 

ఏ రియల్టీ సంస్థ అయినా ఇలా కొంత బ్లాక్‌లో, మరికొంత వైట్‌లో తీసుకోవడం పరిపాటేనని తెలిసి కూడా ఇలాంటి దర్యాప్తు ద్వారా సీబీఐ ఏం తేల్చాలనుకుంటున్నట్టు? బ్లాక్‌లో ఇచ్చామని చెప్పిన వారిని బ్లాక్‌మెయిల్ చేసి, వైఎస్ కుటుంబీకుల్లో, సన్నిహితుల్లో, పరిచయస్తులో ఎవరో ఒకరు దీని వెనక ఉన్నారని చెప్పించడం.. వారిని తన బోన్లోకి ఎక్కించడం.. తద్వారా మహానేత ప్రతిష్టను దారుణంగా మసకబార్చడమే లక్ష్యంగా సీబీఐ మహా ‘పట్టుదల’తో పని చేస్తున్న విషయం స్పష్టమవుతూనే ఉంది. ఇలా ఏదోరకంగా చివరికి దర్యాప్తును తాననుకున్న ‘దిశ’గా తీసుకెళ్లేందుకు సంస్థ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం అడ్డదారులు కూడా తొక్కుతోంది. ఇలాంటి ఎత్తుగడలు తాత్కాలికంగా ఒకవేళ ఫలించినా, అంతిమంగా న్యాయస్థానాల్లో గానీ, ప్రజా కోర్టులో గానీ నిలవబోవని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. ఈసారి జరగబోయేది కూడా అదే!

ఇదీ ఎమ్మార్-బాబు బాగోతం...
దుబాయ్‌కి చెందిన మల్టీ నేషనల్ సంస్థ ఎమ్మార్ 2001లో రాష్ట్రానికి వచ్చింది. 2002లో దానికి 535 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన కోనేరు ప్రసాద్.. బాబు హయాంలోనే విశాఖలో బాక్సైట్ తవ్వకాల కోసం దుబాల్ అనే మరో దుబాయ్ సంస్థను కూడా రాష్ట్రానికి తెచ్చారు. మణికొండలో గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్, విల్లాలు నిర్మించేందుకు ఎమ్మార్‌కు స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎమ్మార్ రెండు సంస్థల్ని ఏర్పాటు చేసింది. ఒకదాని పరిధిలో గోల్ఫ్ కోర్స్, క్లబ్, విల్లాలుంటాయి. అవి 520 ఎకరాల్లో ఏర్పాటవుతాయి. దీన్లో ఏపీఐఐసీకి 26 శాతం మాత్రమే వాటా ఉంచుకున్నారు. మిగతా 74 శాతం ఎమ్మార్‌దే. రెండో సంస్థ పరిధిలో కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్ ఉంటాయి. వాటిని 15 ఎకరాల్లో నిర్మిస్తారు. దీన్లో మాత్రం ఏపీఐఐసీ వాటా 49 శాతం. అంటే ఆదాయం వచ్చే గోల్ఫ్‌కోర్స్, క్లబ్, విల్లాల్లో 26 శాతం, ఖర్చు పెట్టాల్సిన కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్లో 49 శాతం వాటా తీసుకున్నారన్న మాట. ఈ ఒప్పందాలన్నీ 2002లోనే అమల్లోకి వచ్చాయి.

2000లోనే దుబాల్‌ను తెచ్చిన కోనేరు!
విశాఖలో బాక్సైట్ నిక్షేపాల్ని కట్టబెట్టడానికి 2000లోనే చంద్రబాబు మాస్టర్‌ప్లాన్ వేశారు. అందుకోసం గిరిజన చట్టాలనూ మార్చిపారేశారు. గిరిజనులకు తప్ప వేరెవ్వరికీ అక్కడి గనులు లీజుకివ్వకూడదన్న నిబంధనలను సడలించారు. దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్)ను రంగంలోకి దించారు. ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నట్టుగా వారి పేర్లతో 2000 జూన్ 23న జీవో కూడా విడుదలయింది. ఆ ప్రతినిధుల్లో మొదటి పేరు కోనేరు ప్రసాద్‌దే. ఇదిగో నాటి జీవో ప్రతి... 


వైఎస్ హయాంలో జరిగిందిదీ.. 
బాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని తాము అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన సమీక్షిస్తామని 2004కు ముందే వైఎస్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే.. ఎమ్మార్-ఎంజీఎఫ్ వ్యవహారాన్ని చూశాక ఒప్పందం రద్దు చేయాలని భావించారు. అయితే దీన్లో దుబాయ్‌కి చెందిన ప్రఖ్యాత కంపెనీ ఎమ్మార్ ఉండటంతో.. రద్దు చేస్తే విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బ తింటుందన్న కారణంతో, ఏం చేయాలో సూచించమంటూ వ్యవహారాన్ని నాటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. 2005 సెప్టెంబర్ రెండో వారంలో నివేదిక సమర్పించిన రోశయ్య కమిటీ.. బాబు హయాంలో జరిగిన భూ కేటాయింపుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్టు తేల్చింది. ఈ నివేదిక ఇవ్వటానికి ముందు.. ఎమ్మార్‌లో ప్రభుత్వం తరఫున మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ మరో ప్రతిపాదన దాని ముందుకు వచ్చింది. దానికి కమిటీ ఏం చెప్పిందంటే..

* కన్వెన్షన్ సెంటర్, దాంతో పాటు నిర్మించాలనుకున్న హోటల్... ఈ రెండింటి నిర్మాణానికీ భారీగా ఖర్చవుతుంది. పెపైచ్చు వీటిని పూర్తి చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. పెట్టుబడులపై వచ్చే లాభాలు కూడా తక్కువే.

* ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి 49 శాతం, ఎమ్మార్‌కు 51 శాతం వాటా ఉంది. నియంత్రించగలిగే వాటా ఎమ్మార్ చేతిలోనే ఉంది. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచాల్సి వస్తోంది కనక వాటాకు తగ్గట్టుగా ఏపీఐఐసీ పెట్టుబడి కూడా పెంచాలి.

* ఇలాపెట్టుబడి పెట్టకుండా.. పెట్టుబడి మొత్తాన్ని ఎమ్మార్‌నే భరించమంటే ఆ మేరకు ఏపీఐఐసీ వాటా తగ్గుతుంది. 49 నుంచి 26 శాతానికి తగ్గించుకోవటం ద్వారా అదనపు పెట్టుబడి పెట్టనక్కర్లేదు. పెపైచ్చు 26 శాతానికి ఓటింగ్ హక్కులుంటాయి కనక రాష్ట్ర, ప్రాజెక్టు ప్రయోజనాలకు విరుద్ధంగా కంపెనీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అడ్డుకోవచ్చు.

* ఎమ్మార్‌నే మొత్తం పెట్టుబడి పెట్టమనటం ద్వారా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లవుతుంది.

ఇక్కడ గమనించాల్సిందొకటే. వైఎస్సార్ కనక ఎమ్మార్‌కు మేలు చేయాలనో, ఎమ్మార్‌కు అనుకూలంగా వ్యవహరించాలనో అనుకుంటే ఆయనే నేరుగా ఆ ఒప్పందాన్ని కొనసాగించటమో, మార్పులు చేయటమో చేసేవారు. అంతే తప్ప ఏం చేయాలో సూచించమని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించేవారే కాదు. కానీ ఆ ఉపసంఘాన్నీ వదిలిపెట్టి, నాటి మంత్రుల్నీ వదిలిపెట్టి.. నేరుగా వైఎస్‌ను, ఆయన వారసుడిని మాత్రమే టార్గెట్ చేయటం వెనక ఉద్దేశాలన్నీ స్పష్టమవుతూనే ఉన్నాయి.
Share this article :

0 comments: