భార్య స్థలం మాత్రం ఎకరా రూ.కోటికి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భార్య స్థలం మాత్రం ఎకరా రూ.కోటికి!

భార్య స్థలం మాత్రం ఎకరా రూ.కోటికి!

Written By ysrcongress on Monday, January 23, 2012 | 1/23/2012

ఎమ్మార్ కుంభకోణంలో చంద్రబాబు లీలలు* టెండరు స్థాయి నుంచే కుట్ర మొదలు!
* బిడ్లకు 2001లో ఏపీఐఐసీ ఆహ్వానం
* ఐదు సంస్థలు రాగా రెండింటి తిరస్కరణ
* మిగిలిందల్లా ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీలే
* చివరి తేదీకల్లా ఎమ్మార్ తప్ప మిగతా రెండూ వెనక్కి
* ఐఓఐ సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది
* దానికి హైటెక్ సిటీ-2, జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు
* ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ, కాకినాడ పోర్టు తదితరాలు
* ఎమ్మార్‌కు కట్టబెట్టేందుకే వాటితో బాబు టెండర్ల డ్రామా
* కుంభకోణంలో కీలకమైన కోనేరుతో అప్పటికే లింకులు
* ఎమ్మార్‌కిచ్చిన 535 ఎకరాల పక్కనే.. తన భూమిని మూడేళ్లకు ముందే ఎకరా రూ.కోటికి అమ్మిన బాబు..
* ఎమ్మార్‌కు మాత్రం ఎకరా రూ.29 లక్షలకే చదివింపులు
* ఇంత కుట్ర చేసినా బాబువైపు కన్నెత్తి చూడని సీబీఐ

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టెండర్లలో సిండికేట్లు కొత్తేమీ కాదు. పక్కా పథకం ప్రకారం ఒకరికి ఆ టెండర్ దక్కేలా చేయటమే సిండికేట్ లక్ష్యం. దీనివల్ల ప్రజాధనం ఎంత లూటీ అయినా వారికి పట్టదు. మరి ప్రజాధనానికి ధర్మకర్తలాంటి ముఖ్యమంత్రే ఓ సిండికేట్‌ను తయారు చేస్తే? 535 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి తన జేబు సంస్థలతో బిడ్లు వేయించి.. పథకం ప్రకారం వాటిని పక్కకు తప్పిస్తే? అది దుర్మార్గానికీ లూటీకీ పరాకాష్ట. మనిషనే వాడెవ్వడూ కనీసం ఊహించనంతటి అక్రమం! ఎనిమిదేళ్లకుపైగా రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసింది కూడా సరిగ్గా ఇదే!! సమీపంలో ఉన్న తన భూముల్ని అక్షరాలా ఎకరా కోటి రూపాయలకు విక్రయించిన మూడేళ్ల తరవాత కూడా.. ప్రభుత్వ భూమిని ఎకరా 29 లక్షలకే కట్టబెట్టడం ఆయన మార్కు దోపిడీకి మచ్చు తునక. ఎమ్మార్ కేసులో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై బాబు నడిపిస్తున్న హైడ్రామా గుట్టుమట్లు ఇవిగో...

ఎమ్మార్ సంస్థకు భూములు కట్టబెట్టడాన్ని చూస్తే అనిపించేదొక్కటే. ప్రభుత్వాధినేత బరితెగిస్తే నేరుగా సిండికేట్‌నే నడిపించొచ్చు. ప్రభుత్వ ఆస్తుల్ని తనకు నచ్చినవారికి కట్టబెట్టడానికి ఎంత కుట్రకైనా తెరతీయొచ్చు. ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగట్టవచ్చు. ఇక ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తును చూసినా అనిపించేదిదే.. దర్యాప్తు సంస్థలు బరితెగిస్తే ఎంతకైనా దిగజారతాయని! కళ్లెదురుగా కనిపిస్తున్న దోషుల్ని వదిలేసి మరీ.. తాము ‘అనుకున్న’ వారిని ఇరికించడానికి ఏ స్థాయికైనా వెళ్తాయని. ఈ కేసులో సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పినా కూడా.. 2004 కన్నా ముందు జరిగినదాన్ని విచారించకూడదన్న సీబీఐ తీరుకు కనిపిస్తున్న కారణమొక్కటే. అది.. రాష్ట్రంలో కాంగ్రెస్ కొమ్ము కాస్తున్న చంద్రబాబు అడ్డంగా దొరికిపోతారన్న భయం మాత్రమే.

2000వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో ఎక్కడా లేనట్టుగా.. ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలనుకున్నారు. టౌన్‌షిప్ అంటే జనముండేదేమీ కాదు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్.. దాని చుట్టూ శ్రీమంతులకు విల్లాలు.. ఫైవ్‌స్టార్ హోటల్.. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్. ఇదీ టౌన్‌షిప్ స్వరూపం. దీన్ని నిర్మించడానికి ఆసక్తి, అనుభవమున్న సంస్థలు రావచ్చంటూ 2001 జూలై 6న ఏపీఐఐసీ ద్వారా ప్రకటన ఇప్పించారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌తో పాటు మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. 

ఈ ఐదింట్లో సోమ్ ఏసియా, షాపూర్జీ పల్లోంజీలను బాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. మిగతా మూడింటిని మాత్రమే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)కి అర్హమైనవిగా సెప్టెంబర్ 2001, 26న ‘షార్ట్‌లిస్ట్’ చేసింది. కానీ టెండర్లకు చివరి తేదీ అయిన 2001 డిసెంబర్ 15 నాటికి ఐఓఐ, ఎల్ అండ్ టీ విచిత్రంగా వెనక్కెళ్లిపోయాయి! ఇక బరిలో మిగిలింది ఎమ్మార్ ఒక్కటే. మామూలుగా అయితే ఇలా పోటీదారు లేకుండా ఒకే సంస్థ బరిలో ఉంటే ఆ టెండర్లను రద్దు చేయాలి. మళ్లీ పిలవాలి. కానీ బాబు అలా చేయలేదు. ఎమ్మార్‌కే ప్రాజెక్టును ఖాయం చేశారు.

సిండికేట్ నడిపించిందే బాబు..?
హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజీ రెండూ ఐటీ పార్కులతో సహా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్ని పూర్తి చేసిన సంస్థలే. కానీ బాబు వీటిని పక్కన పెట్టేశారు. కారణం.. ప్రాజెక్టును ఎమ్మార్‌కు కట్టబెట్టాలనే కుట్ర. నేరుగా ఎమ్మార్‌కిస్తే ఇబ్బందులొస్తాయని భావించి.. తన జేబు సంస్థలైన ఐఓఐ, ఎల్ అండ్ టీల చేత కూడా బిడ్లు వేయించారు బాబు. ఆఖరి క్షణంలో వాటిచేత ఉపసంహరింపజేశారు. ఎందుకంటే ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది. ఈయన సోదరుడు రమేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా. 

ఈ సంస్థకు హైటెక్ సిటీ రెండో దశతో పాటు ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట బంజారాహిల్స్‌లో విలువైన రెండున్నర ఎకరాల స్థలాన్ని బాబు కట్టబెట్టారు కూడా. ఇక ఎల్ అండ్ టీతో బాబు దోస్తీ రాష్ట్రమంతటికీ తెలిసిందే. హైటెక్ సిటీ, కాకినాడ పోర్టు సహా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని ఎల్ అండ్ టీకి కట్టబెట్టినందుకు బదులుగా, టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందని ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్లో వై.ఎస్.విజయమ్మ సైతం పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ అప్పట్లో పలు కంపెనీల్లో బాబుకు బినామీగా వ్యవహరించారని అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలొచ్చాయి!

కోనేరుతో అప్పటికే లింకులు
సిండికేట్‌ను నడిపించి ఎమ్మార్‌కు భూములు కట్టబెట్టింది ఎందుకంటే.. ఎమ్మార్‌లో కీలక సూత్రధారి అయిన కోనేరు రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే బాబుతో సన్నిహిత సంబంధాలుండేవి. 2000లోనే దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్)ను రాష్ట్రానికి తెచ్చి విశాఖలో బాక్సైట్ గనుల్ని కాజేయబోయారు కోనేరు. తరవాత రస్ అల్ ఖైమాను రాష్ట్రానికి పరిచయం చేసిందీ ఆయనే. బాబు దుబాయ్ వెళ్లినప్పుడల్లా కోనేరు ఇంట్లోనే ఉండేవారని, దుబాయ్‌లో బాబు వ్యాపార వ్యవహారాలన్నిటినీ ఆయనే చక్కబెట్టేవారనీ పలు ఆరోపణలొచ్చాయి కూడా. అలాంటి సంస్థకు బాబు ఏకంగా హైదరాబాద్ ఐటీ హబ్‌కు చేరువలో 535 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టేశారు! అది కూడా రైతుల నుంచి సేకరించి...! అదీ... ఎకరం కేవలం రూ.29 లక్షలకు!!

భార్య స్థలం మాత్రం ఎకరా రూ.కోటికి!
ఎమ్మార్‌కు ఇలా ఎకరా రూ.29 లక్షలకు కట్టబెట్టిన చంద్రబాబు... దానికి సమీపంలో ఉన్న తన భార్య భూమిని అంతకు మూడేళ్ల ముందే ఎకరా రూ.కోటికి విక్రయించటం మరీ విడ్డూరం. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ పేరిట ఉన్న మూడెకరాల స్థలాన్ని 2000లో ఎకరా కోటి రూపాయల చొప్పున అమ్మేశారు బాబు. మూడేళ్ల తరవాత ఎమ్మార్‌కు మాత్రం ఎకరం రూ.29 లక్షలకే అప్పగింత పెట్టారు. తన స్థలాన్ని ఖరీదైన ధరకు, సర్కారు స్థలాన్ని కారుచౌకగాను విక్రయించడంలోనే బాబు దురుద్దేశాలన్నీ స్పష్టంగా కళ్లకు కడతాయి. 

సిండికేట్‌ను నడిపించి, తన సన్నిహిత సంస్థ మాత్రమే రంగంలో ఉండేలా ప్లాన్ చేసిందీ చంద్రబాబే. ఎల్ అండ్ టీ, ఐఓఐలను వెనక్కి తగ్గేలా చేసి... ఆ రెండింటికీ విలువైన ఇతర ప్రాజెక్టుల్ని కట్టబెట్టిందీ చంద్రబాబే. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా... సీబీఐ మాత్రం ఈ కేసులో 2004 కన్నా ముందు ఏం జరిగినా తమకు అవసరమే లేదంటోంది! కుట్రదారును వదిలేసి వేరెవరైనా దొరుకుతారేమోనని చూస్తోంది. గిట్టనివారిని ఇరికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి కారణం కూడా రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే. ఇటీవల నగ్నంగా బయటపడిందే! అదే.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో బాబు అనుబంధం. 

చిత్తూరు, వైఎస్సార్ కడప ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి.. నిన్న మొన్నటి అవిశ్వాస తీర్మానం వరకూ ఈ అపవిత్ర మైత్రి అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. బాబుపై ఎన్ని పిటిషన్లు దాఖలైనా, కోర్టుల్లో వాటిపై ప్రభుత్వం తరఫున స్పందన లేకపోవటం కూడా ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూనే ఉంది. అక్రమాస్తుల కేసులో చంద్రబాబును విచారించాలని కోర్టు ఆదేశించినా.. ఓఎంసీ కేసులో లీజును బదలాయించిందే చంద్రబాబంటూ నాటి జీవోను జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా సీబీఐకే అందించినా, దర్యాప్తు సంస్థ స్పందించకపోవటానికి కూడా కారణమిదే!

ఎమ్మార్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే
నిజానికి శంకర్రావు తన లేఖలో ఇటు ‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడుల్ని, అటు ఎమ్మార్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. రెండింటిపై విచారణ జరిపించాలని కోరటం వెనక పెద్ద కుట్రే ఉంది. భూముల కేటాయింపు తదితరాలపై ప్రశ్నించాలనే అనుకుంటే ఐఎంజీ, రహేజా, ఇంకా ఎన్నో అంశాలున్నాయి. కానీ వాటన్నిటినీ వదిలేసిన శంకర్రావు.. ఏరి కోరి ఎమ్మార్‌నే తీసుకోవటం వెనక టీడీపీ నేతలు వేసిన పథకమే కారణమని విశ్వసనీయంగా తెలుస్తోంది. ‘‘ఎమ్మార్ కేసును గనక తెరపైకి తెస్తే దాన్లో ఉన్నది కోనేరు ప్రసాద్ వంటి మన మనుషులే కాబట్టి మనం చెప్పమన్నట్టుగా చెబుతారు. మనం టార్గెట్ చేసిన వాళ్ల పేర్లు చెప్పించి.. వారిని జాగ్రత్తగా ఇరికించే అవకాశముంటుంది. వేరేవాటిని తీసుకుంటే ఈ రకంగా చేయలేం’’ అంటూ తెలుగుదేశం పార్టీలో సాగిన మంత్రాంగం ఫలితంగానే ఎమ్మార్ అంశం శంకర్రావు లేఖలోకి చేరినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. 

అనుకున్నట్టుగానే.. శంకర్రావు లేఖ రాసిన దగ్గర్నుంచి ప్రస్తుతం విచారణ వరకూ అంతా ముందస్తు పథకం ప్రకారం నడిపిస్తున్న బాబు అండ్ కో.. ఇప్పుడీ కేసులో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని, ఆయనకు దగ్గరగా ఉండేవారిని టార్గెట్ చేసింది. సీబీఐని పావుగా వాడుకుంటూ.. సాక్షుల చేత వారి పేర్లు చెప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కాకపోతే ఈ వ్యవహారంలో జరుగుతున్నదంతా ఇప్పుడు జనానికి బ్లాక్ అండ్ వైట్‌లో ఎప్పటికప్పుడు తెలిసిపోతూండటంతో ఇటు సీబీఐ, అటు తెలుగుదేశం కూడా మల్లగుల్లాలు పడుతున్నాయి. జనం ఏమనుకున్నా పర్లేదులెమ్మనే రీతిలో మరీ బరితెగించి ముందుకెళితే.. అంతిమంగా న్యాయస్థానాల్లోను, ప్రజా కోర్టులోను ఎదురుదెబ్బలు తప్పవనే సంగతి ఎన్నో కేసుల్లో ఇప్పటికే రుజువైన సంగతి దర్యాప్తు సంస్థలకు, రాజకీయ పార్టీలకు తెలియనిదేమీ కాదు!


ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ఐదు సంస్థల నుంచి బిడ్డింగ్‌లు రాగా.. ఎమ్మార్, తన జేబు సంస్థలైన మరో రెండు మాత్రమే మిగిలేలా చంద్రబాబు చక్రం తిప్పారు. తర్వాత ఆ రెండింటినీ తప్పించి, ఎమ్మార్ మాత్రమే మిగిలిందంటూ ప్రాజెక్టును దానికి కట్టబెట్టారు. విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న ఆ క్రమం ఇదీ...
Share this article :

0 comments: