ఎమ్మార్ పరిణామాలన్నీ దోషిగా చూపిస్తున్నది చంద్రబాబునే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మార్ పరిణామాలన్నీ దోషిగా చూపిస్తున్నది చంద్రబాబునే

ఎమ్మార్ పరిణామాలన్నీ దోషిగా చూపిస్తున్నది చంద్రబాబునే

Written By ysrcongress on Friday, January 27, 2012 | 1/27/2012


* సీఎంగా ఉంటూ కూడా సిండికేట్‌లా చక్రం తిప్పారు 
* కొలాబరేషన్ ఒప్పందం ద్వారా మూడో పక్షానికి ఎందుకు అవకాశమిచ్చారు? 
* ఎమ్మార్ తరఫున బాబుతో మాట్లాడిన కోనేరు ఆయన బినామీ కాదా?
* ఆయన విల్లాలమ్మితే ఆ డబ్బులు ఆయనకో, బాబుకో కాక సునీల్‌కెందుకిస్తారు?
* అసలు ఎమ్మార్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన వెసులుబాటేమిటి?
* విల్లాల్లో 26 శాతం వాటాను ఆయన యథాతథంగా ఉంచారుగా?
* వీటన్నిటినీ వదిలేసి, వైఎస్ సన్నిహితుల్నే టార్గెట్ చేయటం ఎంత నీచం!

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో సీబీఐ తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసలు దొంగల్ని వదిలేసి, తాము అనుకున్న వారిని దోషులుగా చిత్రించేందుకు సీబీఐ నానాటికీ దిగజారిపోతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ‘‘సునీల్‌రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు చూసినా, ఎమ్మార్‌పై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక చూసినా.. ఇందులో అప్పటి సీఎం చంద్రబాబు కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. కానీ పక్షపాతంతో, బరితెగించి ముందుకు పోతున్న సీబీఐకి మాత్రం ఇవేవీ పట్టటం లేదు. ఇది దారుణం. తన రిపోర్టులో పేర్కొన్న విషయాన్ని తానే పట్టించుకోకుండా సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు ఎన్నో సందేహాలకు తావిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మార్‌కు ప్రాజెక్టును కట్టబెట్టిన తీరును అందులో పద్మ వివరంగా తెలిపారు. సీబీఐ తీరును ఎండగట్టారు. ఆమె ఏమన్నారంటే...

‘‘ఫైవ్‌స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్, దాని చుట్టూ శ్రీమంతుల విల్లాలుండే ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని 1999లో సీఎం హోదాలో చంద్రబాబు భావించారు. అందుకోసం ఎమ్మార్‌కు చెందిన కోనేరు ప్రసాద్‌తో అప్పటి నుంచే సంప్రదింపులు మొదలెట్టారు. అయితే, ఈ వ్యవహారానికి పారదర్శకత ముసుగు తొడిగేందుకు ఏపీఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిపించారు. దీనికి స్పందించి ఐదు కంపెనీలు రాగా రెండు కంపెనీల్ని కావాలనే తప్పించారు. తర్వాత తానే సిండికేట్‌కు తెర తీసి, మిగతా రెండూ వాటంతటవే వెనక్కెళ్లిపోయేలా చక్రం తిప్పారు. చివరకు ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. ఇవన్నీ సాక్షాత్తూ విజిలెన్స్ నివేదిక, సీబీఐ రిమాండ్ రిపోర్టు చెప్పిన సత్యాలే!

సాధారణంగా ఏ పనికైనా సింగిల్ టెండర్ వచ్చినపుడు దాన్ని రద్దు చేసి మళ్లీ పిలుస్తారు. పోటీదారు ఉంటేనే సరైన ధర దక్కుతుందనే ఉద్దేశంతో, పోటీ లేని బిడ్లను ఎవరూ అంగీకరించరు. కానీ బాబు మాత్రం 535 ఎకరాల స్థలాన్నీ ఎమ్మార్‌కే కట్టబెట్టేశారు. అది కూడా ఎకరం రూ.29 లక్షలకు! బాబే దోషని ఇక్కడే స్పష్టంగా తేలిపోతున్నా, సీబీఐ మాత్రం ఈ కోణాన్ని పట్టించుకోవటమే లేదు. తాను ఏం చేయాలనుకుంటోందో అదే చేస్తోంది.


దాన్లో 49 శాతం.. దీన్లో 26 శాతమా?
రైతుల నుంచి సేకరించి మరీ ఎమ్మార్‌కు ఏకంగా 535 ఎకరాల భూమిని అప్పగించిన బాబు.. వాటాల విషయంలో ఆదిలోనే దారుణమైన కుట్ర చేశారు. మొత్తం 535 ఎకరాల్లో హోటల్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఒక కంపెనీని (ఎస్‌పీవీ-1); గోల్ఫ్‌కోర్స్, విల్లాల ప్రాజెక్టు చేపట్టడానికి మరో కంపెనీని (ఎస్‌పీవీ-2) ఏర్పాటు చేశారు. తొలి కంపెనీకి 15 ఎకరాలు, రెండో కంపెనీకి 520 ఎకరాలు కేటాయించారు. అయితే.. ఎక్కువ పెట్టుబడులు పెట్టి, దీర్ఘకాలం వేచి చూసినా తక్కువ లాభాలొచ్చే ఎస్‌పీవీ-1లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచిన బాబు.. తక్షణం లాభాలొచ్చే అవకాశమున్న, 520 ఎకరాలిచ్చిన ఎస్‌పీవీ-2లో మాత్రం ఏపీఐఐసీ వాటాను 26 శాతానికే పరిమితం చేశారు. ఇదే అసలు కుట్ర. అయినా సీబీఐ దీనివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అంత భూమి ఇచ్చిన, అంత విలువైన ప్రాజెక్టులో వాటా ఎందుకు తగ్గించుకున్నారని ఇప్పటిదాకా బాబును ప్రశ్నించలేదు. దానికోసం తెరవెనక ఏం నడిచిందో, ఎంతెంత ముడుపులు చేతులు మారాయో తెలుసుకునే ప్రయత్నమే చేయటం లేదు? ఎందుకని? దీనికి సీబీఐ సమాధానం చెప్పి తీరాల్సి ఉంది.


కొలాబరేషన్.. విల్లా అమ్మకాలకు మూలం!
భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక, ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక... కొలాబరేషన్ అగ్రిమెంట్ పేరుతో 2003 ఆగస్టు 19న అనూహ్యంగా మరో ఒప్పందం తెరపైకి వచ్చింది. ఎంఓయూలో లేని కొత్త క్లాజులెన్నో ఈ ఒప్పందం ద్వారా వచ్చి చేరాయి. వాటి ప్రకారం ప్రాజెక్టులో ఏ భాగాన్నయినా అభివృద్ధి, నిర్వహణ, ఇతర సహకారాల నిమిత్తం మూడో పక్షానికి అప్పగించే అధికారం ఎమ్మార్‌కు ఉంటుంది. అందుకు ఏపీఐఐసీ సూత్రప్రాయ ఆమోదం చాలంటూనే.. ‘ఒకవేళ అడ్డుకోవాలనుకున్నా హేతుబద్ధం కాని కారణాలతో అడ్డుకోజాలదు’ అంటూ చేర్చారు. అసలు హేతుబద్ధం కాని కారణమేదో, అయినదేదో తేల్చేదెవరు? ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇలాంటి అధికారం ఏపీఐఐసీకి ఉండాలా, లేక ఎమ్మార్ చేతిలో పెడతారా? ఇలా చేయడం వెనక బాబు ఉద్దేశమేంటి? ఏపీఐఐసీ దేన్నీ అడ్డుకోకూడదనేగా! బాబు ఇంత నిస్సిగ్గుగా బరితెగించినా సీబీఐ కళ్లు మూసుకోవటానికి కారణమేంటి?

ఇన్వెస్టర్ల విశ్వాసానికే ప్రాధాన్యమిచ్చిన వైఎస్
2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల వాగ్దానం మేరకు అన్ని ప్రాజెక్టుల్నీ సమీక్షించారు. పెట్టుబడులతో, ఇన్వెస్టర్లతో ముడిపడిన ఏ ప్రాజెక్టునూ రద్దు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ఎమ్మార్ సహా పలు ప్రాజెక్టులపై నిర్ణయాన్ని ప్రస్తుత తమిళనాడు గవర్నరు, నాటి మంత్రి రోశయ్య నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. దాని సిఫారసుల ప్రకారమే విల్లాల ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 26 శాతంగా యథాతథంగా ఉంచారు. మరి ఈ విల్లా ప్రాజెక్టుకు వైఎస్ ఏ రాయితీ ఇచ్చారని ఆయన కుటుంబాన్ని, సన్నిహితుల్ని సీబీఐ టార్గెట్ చేస్తోందో మాకైతే అర్థం కావటం లేదు. ఒకవేళ ఏదైనా రాయితీయో, వెసులుబాటో కల్పిస్తే అదేమిటో చూపించాలి కదా! అలాంటిదేమీ లేనప్పుడు, విల్లాలమ్మగా వచ్చిన సొమ్మును ఎమ్మార్ తన ఖాతాలోనే వేసుకోవాలిగా! లేకపోతే తనకు ప్రాజెక్టు అప్పగించిన బాబుకో, ఆయన బినామీ కోనేరుకో సమర్పించుకుంటుంది కదా! డబ్బును దుబాయ్‌కి పంపించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కూడా స్పష్టంగా పేర్కొంది. అక్కడున్నది ఎమ్మార్, కోనేరు కంపెనీలే. బాబు బినామీలే. మరి వాటన్నిటినీ వదిలి సునీల్‌ను ఎందుకు అరెస్టు చేసినట్టు?

విల్లా అమ్మకాల్లో కోనేరు సూచనల మేరకు స్టైలిష్ రంగారావు, ఆయన మేనేజరు కలిసి బ్లాక్‌లో భారీ మొత్తాలు వసూలు చేశారని, వాటిని సునీల్‌రెడ్డికి అందజేశారని సీబీఐ చెబుతున్న కథనం అసలెవరైనా నమ్మేట్టుగా ఉందా? మొత్తం డబ్బులు సునీల్‌రెడ్డికి ఇచ్చేయటానికి ఆయనేమైనా ఎమ్మార్‌కు యజమానా? లేక ఎమ్మార్‌కు ఈ ప్రాజెక్టును అక్రమ మార్గంలో కట్టబెట్టిన బాబుకు ఏజెంటా? కోనేరుకు బంధువా? లేక కోనేరు స్నేహితుడైన స్టైలిష్ రంగారావుకు బంధువా? స్టైలిష్ సంస్థ యజమానా? ఇవేవీ కాకుండా ఆయనకు డబ్బులెందుకిస్తారు? ఏపీఐఐసీకి పావలా వాటా ఎగ్గొట్టడానికే ఎమ్మార్ ఇలా చేసిందంటున్న సీబీఐకి.. అందుకు ప్రతిఫలంగా మొత్తం వాటాను సునీల్‌కు ఎలా ఇస్తారన్న కనీస జ్ఞానం లేకపోయిందా?

మేం చెబుతున్నదొక్కటే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నిర్ణయాల్ని మాత్రమే విచారిస్తామని, మిగిలిన ప్రభుత్వాల జోలికెళ్లబోమని సీబీఐ అనుకుంటే.. బాబు జోలికెళ్లబోమని తీర్మానించుకుంటే.. వైఎస్సార్ కేబినెట్లో సభ్యులు ఇప్పుడూ మంత్రులుగానే ఉన్నారు. అప్పటి మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల్లో ఒకరు ఇప్పుడు ఓ రాష్ట్ర గవర్నర్‌గా, మిగతా వారంతా ఇక్కడ మంత్రులుగానే ఉన్నారు. మొదట వారిని విచారించండి. అటు మూల కారకుడు, సూత్రధారి అయిన బాబునూ వదిలేస్తున్నారు. ఇటు సిఫార్సులు చేసిన ఉపసంఘాన్నీ వదిలేస్తున్నారు. అందరినీ వదిలి, కేవలం వైఎస్ వారసుడిని, ఆయన బంధుమిత్రుల్ని మాత్రమే టార్గెట్ చేయడం సీబీఐకి ఎంతమాత్రమూ సరికాదు. ఇంత తాబేదారుగిరీ... ఇంత గులాంగిరీ ఏమాత్రం పనికిరాదు. ఇప్పటికైనా ఈ ప్రశ్నలకు జవాబివ్వండి. లేకుంటే దర్యాప్తు తీరును మార్చుకోండి. ఇవన్నీ చేతకాకుంటే.. ఢిల్లీ రాజకీయ బాసులకు తాబేదార్లన్న ముద్ర వేసుకోండి’’.


ఎమ్మార్ పరిణామాలు జరిగాయిలా...
*ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని 1999లో చంద్రబాబు భావించారు
*1999 ఏప్రిల్ 5న, 2000 మార్చి 30న, 2001 జూలై 25న మూడుసార్లు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిచారు. అయితే 2000 నుంచే దీనికి సంబంధించి ఎమ్మార్ తరఫున బాబుతో కోనేరు ప్రసాద్ టచ్‌లో ఉన్నట్లు సీబీఐ స్పష్టంగా పేర్కొంది.
*దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌తో పాటు మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, దేశీయ సంస్థలు ఎల్ అండ్ టీ, షాపుర్జీ పల్లోంజీ.. ఇలా 2001 సెప్టెంబర్ 7 కల్లా ఐదు సంస్థలు వచ్చాయి

*2001 సెప్టెంబర్ 26 నాటికి సోమ్ ఏసియా, షాపుర్జీ పల్లోంజీలను ప్రభుత్వం పక్కకు తప్పించింది
*మిగతా మూడింటికీ 2001 సెప్టెంబర్ 29న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) పంపించారు
*2001 అక్టోబర్ 25న ఆ మూడు సంస్థలతో ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు
*2001 డిసెంబర్ 15తో టెండర్ల గడువు ముగిసింది. ఐఓఐ, ఎల్‌అండ్‌టీ తప్పుకున్నాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. నిజానికి ఎల్‌అండ్‌టీకి అప్పటికే కాకినాడ పోర్టు ప్రాజెక్టును, హైటెక్ సిటీనీ బాబు అప్పగించారు. అందుకు ప్రతిఫలంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలున్నాయి. నిజానికి అప్పట్లో ఏ ప్రాజెక్టుకైనా బాబు పిలిస్తే తొలుత వచ్చేది ఎల్ అండ్ టీనే. ఐఓఐ ఇండియా సంస్థ కూడా బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది. దానికి హైటెక్‌సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్‌ను అప్పగించింది కూడా బాబే. అంటే.. తెలివిగా ఆ రెండింటినీ చివరిదాకా ఉంచి, చివర్లో తానే తప్పించారన్నది సుస్పష్టం.

*2002 జనవరి 8న ఎమ్మార్‌ను డెవలపర్‌గా ఎంపిక చేశారు
*2002 జూలై 10న నానక్‌రామ్ గూడలో 80.35 ఎకరాలకు భూ సేకరణ నోటిఫికేషన్ విడుదలైంది
*ఎమ్మార్‌కు 535 ఎకరాలు ఇస్తున్నట్టు, ప్రాజెక్టు అప్పగిస్తున్నట్టు పేర్కొంటూ 2002 సెప్టెంబర్ 4న జీవో 359 విడుదలైంది. అదే ఏడాది నవంబర్ 6న ఏపీఐఐసీ-ఎమ్మార్ మధ్య ఎంఓయూ కుదిరింది.

*2003 ఆగస్టు 19న మళ్లీ ఈ రెండు పక్షాల మధ్యా కొలాబరేషన్ అగ్రిమెంట్ రిజిస్టరయింది. మూడో పక్షాన్ని చేర్చేందుకు వీలుగా కొత్త క్లాజును దీన్లో చేర్చారు. స్టైలిష్ హోమ్స్ పుట్టుకకు, విల్లాల్ని చౌకగా అమ్మినట్లు చూపించటానికి ఇదే మూలం.
*2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారు. పలు ప్రాజెక్టుల్ని సమీక్షించాలంటూ జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. దాన్లో ఎమ్మార్ కూడా ఉంది.
*2004 సెప్టెంబర్ నాటికి ఉపసంఘం సిఫార్సులు చేసింది. ఎమ్మార్‌లో అదనపు పెట్టుబడి పెట్టే కంటే.. ఉన్న పెట్టుబడికి తగ్గట్టుగా వాటాను సర్దుబాటు చేస్తే సరిపోతుందని అది సిఫార్సు చేసింది. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది.

*ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఎమ్మార్‌తో ఒప్పందాన్ని సవరించారు. ఈ మేరకు 2005లో జీవో జారీ అయింది. దీని ప్రకారం కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26 శాతానికి తగ్గింది. విల్లాలు, గోల్ఫ్ కోర్సుల్లో వాటా 26 శాతంగా యథాతథంగా ఉంది.

*ఇంకా చిత్రంగా ఏం చేశారంటే.. ఎమ్మార్ ఇలా మూడో పక్షానికి అప్పగించేటప్పుడు ఏపీఐఐసీ బోర్డు అనుమతి తప్పనిసరి అని 5వ పేరాలో పేర్కొన్నారు. కానీ 7వ పేరాకు వచ్చేసరికి, ఏపీఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరిస్తే చాలంటూ నసిగారు. 10వ పేరాకు వెళ్లేసరికళ్లా.. ‘‘ఏపీఐఐసీ అనుమతి ఉండాలి. అలాగని ఏ నిర్ణయాన్నయినా హేతుబద్ధం కాని కారణాలు చూపిస్తూ ఏపీఐఐసీ అడ్డుకోజాలదు’’ అంటూ అడ్డగోలు క్లాజును చేర్చారు. ఎంఓయూలో లేని ఈ క్లాజును కొలాబరేషన్ అగ్రిమెంట్ ద్వారా చేర్చినట్టు సీబీఐ రిమాండ్ రిపోర్టులోనూ, విజిలెన్స్ నివేదికలోనూ స్పష్టంగా పేర్కొన్నారు.
Share this article :

0 comments: