వెల్లువలా అన్నదాతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వెల్లువలా అన్నదాతలు

వెల్లువలా అన్నదాతలు

Written By ysrcongress on Friday, January 13, 2012 | 1/13/2012

తొలిరోజున అంకాపూర్‌కు చెందిన రైతు మోహన్‌రెడ్డి నన్ను కలిశాడు. ‘‘రాష్ట్రమంతటా కరువు ఉంటే చిరునవ్వుతో మేమెందుకున్నామంటే.. మీ నాన్న గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టులు మాకిచ్చారు. అంతకుముందు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చూసి వెళ్లి పోయారు. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో చేస్తామన్నారు. కానీ మీ నాన్న మా ఊరికొచ్చారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి మమ్మల్ని ఆదుకున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోనే మాకు నీళ్లొచ్చాయి. రూ.230 కోట్లతో గుత్ప, రూ.270 కోట్లతో అలీసాగర్ నిర్మించారు..’’ అని మోహనన్న చెప్పినప్పుడు ఆనందమైంది. రైతుల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి దివంగత నేత వైఎస్ ఒక్కరే. అందుకే వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజకీయాల్లో విలువలకు అర్థం తెచ్చి.. విశ్వసనీయతకు అద్దంపట్టిన నాయకుడు వైఎస్. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట... అధికారపక్షం లో ఉన్నప్పుడు ఇంకోమాట మాట్లాడుతూ.. ఎన్నికలప్పు డు మాత్రమే ప్రాజెక్టులకు టెంకాయలు కొడుతున్నారు.

నాకు తల్లి లాంటిది, మన అక్కసురేఖను చూసి గర్వపడుతున్నా. కారణమేమిటంటే... విలువలు, విశ్వసనీయత లేక చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను కాదని ఆమెతోపాటు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రం నిఖార్సుగా పేదల పక్షాన నిలిచారు. ప్రజలందరూ మనవైపు చూస్తున్నారు.. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు.. పేద విద్యార్థి చదవలేని పరిస్థితి.. పేదలు బతకలేకపోతున్నారు.. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి మనల్ని చూస్తున్నారు. చంద్రబాబు ఏ దురుద్ధేశపూర్వకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టినా కూడా.. మనం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే.. అని నేను వారికి చెప్పా. ఈ రాజ కీయ వ్యవస్థలో విలువలు కావాలి.. విశ్వసనీయత ఉండాలి అని, ప్రతి ఒక్కరూ రైతుల కోసం నిలబడాలని, పేద ప్రజల కోసం పోరాడాలని అని నేను చెప్పిన మాటను గౌరవించి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతాయి. ఆ రోజు ఎమ్మెల్యేలందరూ భయపడ్డారు కూడా. ఎందుకంటే అధికార పక్షంతో పోటీ. వాళ్లు కోట్లతో కుమ్మరిస్తారు. మంత్రులంతా నియోజకవర్గాల్లో మకాం వేస్తారు. పోలీసు యంత్రాంగం కూడా వారి చెప్పుచేతల్లో ఉంటుంది. కానీ.. వారికి నేనొక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడదామని. మొట్టమొదటిసారి రైతుల కోసం పేదల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు జరగబోతున్నాయి.
 
ఉప్పొంగిన జనవాహిని, పోటెత్తిన కర్షకుల ఆదరాభిమానాల మధ్య... రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన రైతు దీక్ష విజయవంతం అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడు రోజుల పాటు సాగిన ఆయన దీక్ష రైతులకు మనో నిబ్బరాన్ని కలిగించింది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలతో కష్టాల సాగును కొనసాగించలేక, అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక రైతాంగం అల్లాడుతున్న తరుణంలో... నేరుగా రైతుల వద్దకు వెళ్లి దీక్ష చేయడం ద్వారా జగన్ వారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన వస్తున్నారని తెలిసిన రోజు నుంచే నిజామాబాద్ రైతుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది. మంగళవారం తొలి రోజున జిల్లాలో అడుగు పెట్టింది మొదలు, అడుగడుగునా ఆయనకు లభించిన స్పందనే అందుకు నిదర్శనం. 

మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభించిన దీక్షను గురువారం 5 గంటలకు జగన్ విరమించారు. రైతులకు జీవనాధారమైన సాగునీటి వసతి కోసం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ నిజామాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన విధంగానే తానూ అన్నదాత సంక్షేమానికి పాటు పడతానంటూ భరోసా ఇచ్చారు. ఆయనను కలుసుకోవడానికి వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లలు దీక్షా శిబిరం వద్ద బారులు తీరారు. జగన్ కూడా వారి కష్ట సుఖాలు తెలుసుకుని, వారి ఆవేదనలో పాలు పంచుకున్నారు. ఆర్మూర్ చుట్టు పక్కల నుంచే కాక ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు మూడు రోజులూ భారీగా తరలి వచ్చారు. ఇక గురువారం ముగింపు సభకు రైతులు పోటెత్తడంతో మైదా నం కిక్కిరిసిపోయింది. ఆద్యంతమూ ‘జై జగన్’, ‘వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలతో మారుమోగింది. ఆర్మూర్‌వాసులు ఆయనపై ఆద్యంతం అంతులేని ప్రేమాభిమానాలు కురిపించారు. 

రైతులతో మమేకమై, వారి సమస్యల పట్ల చలించి జగన్ చేసిన ప్రసంగం వారిని విశేషంగా ఆకట్టుకుంది. వారి కష్టాలను అసలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, విపక్ష నేత చంద్రబాబు మోసపూరిత విధానాలను ఆయన ఆద్యంతం తూర్పారబట్టారు. తాను దీక్ష చేశానని కాకుండా, దీన్ని యావత్ రైతుల విజ్ఞప్తిగా భావించి సమస్యలు పరిష్కరిం చాలంటూ జగన్ చేసిన సూచన పట్ల హర్షధ్వానాలు మిన్నం టాయి. సీఎం కిర ణ్‌ను, బాబును ఆయన దునుమాడినప్పుడల్లా చప్పట్లు మారుమోగాయి. జగన్ దీక్ష రైతులకు ఊరటనివ్వడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులను కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. మాజీ ఎం.పి కె.గంగారెడ్డి తదితర నేతలు ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఇందుకు రుజువు. తెలంగాణలో జగన్ తొలి పర్యటన దిగ్విజయంగా ముగియడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణుల ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కష్టం చెప్పుకుంటూ, కరచాలనాలు చేస్తూ...

ఎవరిని కదిలించినా.. కన్నీటి గోడు.. కరువు కష్టనష్టాలు.. అన్నదాతను సర్కారు పట్టించుకోవటం లేదనే ఆవేదన.. ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదనే మనో వేదన... రైతన్నల కన్నీటి గోసతో వైఎస్సార్ దీక్షా ప్రాంగణం మూడు రోజుల పాటు ప్రతిధ్వనించింది. తమ తరఫున పోరాడేందుకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు, కష్టాలను మొరపెట్టుకునేందుకు అన్నదాతలు పోటీపడ్డారు. పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి, గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి జన నేతపై అభిమాన్ని, తమకున్న విశ్వాసాన్ని చాటారు. నష్టాల ఊబిలో చిక్కిన ఆర్మూర్ పసుపు రైతులైతే జగన్‌కు జేజేలు పలికారు. తమకోసం పోరాడేందుకు వచ్చిన నేతను సాదరంగా ఆదరించి అభిమానం చూపారు. 

హైదరాబాద్‌లో తాము రెండు రోజులు ఆందోళన చేసినా సర్కారు పట్టించుకోలేదంటూ శాపనార్థాలు పెట్టారు. జగన్ రాకతో తమ కష్టాలు తీరతాయనే విశ్వాసం వారిలో వ్యక్తమైంది. ‘ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత దిగుబడి తగ్గింది? ఎంత ధర గిట్టింది?’ అంటూ వారందరి వెతలనూ జగన్ మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాక నిండా మునిగిపోతున్నామంటూ ఐదెకరాల్లో పత్తి వేసిన కారేపల్లి గిరిజన రైతులు భీక్యానాయక్, అంబాడీ నాయక్ తదితరులు బోరుమన్నారు. అంత బాధలోనూ మహా నేతను, ఆయన చేసిన సేవలను అన్నదాతలతో పాటు అన్ని వర్గాల వారూ మరీ మరీ గుర్తు చేసుకున్నారు! వైఎస్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగా అమలవడం లేదని, రెండేళ్లుగా స్కాలర్‌షిప్‌లే లేవని మామిడిపెల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు అలేఖ్య, శ్రీలేఖ, దివ్య వాపోయారు. వైఎస్ తెచ్చిన ఆరోగ్యశ్రీతో బైపాస్ జరిగి తన కొడుకు ప్రాణం దక్కిందంటూ జానకంపేటకు చెందిన కాకర్ల ప్రకాశ్ పొంగిపోయాడు. జగన్‌ను కలిసేందుకు ఆయన నాలుగు గంటల పాటు నిరీక్షించాడు!

దీక్షలో నేతలు...

ఆర్మూర్‌లో జరిగిన రైతుదీక్షలో పలువురు నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధ్దన్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కెపి వెంకటరమణారెడ్డి, ఎంఎల్‌ఏలు కొండా సురేఖ, శోభానాగిరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్, సేవాదళం అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు భూమానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, కొణతాల రామకృష్ణ, గట్టు రాంచంద్రరావు, మాజీ మంత్రులు మారెప్ప, సంతోష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బోడ జనార్ధ్దన్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, పార్టీ నేతలు ఆది శ్రీనివాస్, చందా లింగయ్య, సోమిరెడ్డి, బట్టి జగపతి, శ్రీనివాస్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పుట్ట మధు, రహ్మాన్, జనక్‌ప్రసాద్, నిరంజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 
Share this article :

0 comments: