రాహుల్ గాంధీపైనా ఆశలు సన్నగిల్లాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాహుల్ గాంధీపైనా ఆశలు సన్నగిల్లాయి

రాహుల్ గాంధీపైనా ఆశలు సన్నగిల్లాయి

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

ప్రధాని పదవికి రాహుల్(17%)కన్నా మోడీ(24%) బెటర్
ఎన్‌డీఏ కూటమికి సైతం ఆదరణ అంతంతమాత్రమే
కేంద్రంలో చక్రం తిప్పేది యుపీఏయేతర, ఎన్డీఏయేతర పార్టీలే.. వీటికే అత్యధిక స్థానాలు

దేశంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీపైనా ఆశలు సన్నగిల్లాయి. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు 110కంటే తక్కువేనని ఇండియా టుడే - ఓఆర్‌జీ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రధాని అభ్యర్థిగా బీజేపీకి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రజలు అగ్రాసనం వేశారు. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వెంటనే ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చే స్థానాలు 140కి మించవని సర్వేలో తేలింది. అధిక స్థానాలు గెలుచుకునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి), సమాజ్‌వాది పార్టీ (ములాయం), బీఎస్పీ (మాయావతి), ఏఐఏడీఎంకే (జయలలిత), బీజేడీ (నవీన్ పట్నాయక్)లు, లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలు దేశానికి కొత్త ప్రధానిని నిర్ణయిస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది.




న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రాభవం సైతం దీంతోపాటే దిగజారుతోందని ఇండియా టుడే-ఓఆర్‌జీ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడు 206 స్థానాలున్న కాంగ్రెస్‌కు 110 మించి రావని సర్వేలో తేలింది. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ ఎన్నడూలేనన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వే పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన 98 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. 

‘ఇండియా టుడే’ తాజా సంచికలో ఈ వివరాలున్నాయి. అయితే, బీజేపీ కూడా సంబరపడే పరిస్థితులు లేవని, ప్రభుత్వం ఏర్పాటుచేసేంత బలం దాని నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి ఉండకపోవచ్చని సర్వే వివరించింది. 2009 ఎన్నికల్లో 116 సీట్లను గెల్చుకున్న బీజేపీ బలం 140కి మించి పెరిగే సూచనలు లేవు. అయితే, ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ కంటే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే ఎక్కువ మార్కులు కొట్టేశారు. మోడీ ప్రధాని అయితే బావుంటుందని 24 శాతం మంది అనుకుంటుండగా, రాహుల్ ప్రధాని కావాలనుకునే ఓటర్లు 17 శాతం మాత్రమే ఉన్నారు.

క్షీణ దశలో కాంగ్రెస్: వివిధ దశల్లో చేసిన సర్వేలను బట్టి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రజాదరణ బాగా పడిపోతోంది. 2009 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే యూపీఏకు ప్రజాదరణ 7.7 శాతం దిగజారింది. ఎన్‌డీఏపై ప్రజాదరణ 2.3 శాతం పెరిగింది. ఇతర పార్టీలపై ప్రజాదరణ అత్యధికంగా 5.4 శాతం పెరిగింది. ఈ సర్వేలో యూపీఏ, ఎన్‌డీఏలకు సమానంగా 28 శాతం ఓట్లు రాగా, ఇతర పార్టీలకు 44 శాతం ఓట్లు వచ్చాయి. 

ఇతర పార్టీలకు గత 5 నెలల్లో ఓట్ల శాతం రీత్యా బలం పెరగలేదు గానీ సీట్లు గెల్చుకోగల సత్తా పెరగడం విశేషం. మొత్తమ్మీద చూస్తే ఈ రెండు కూటములూ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సీట్లను గెల్చుకునే అవకాశాల్లేవని తేలింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీట్లను గెల్చుకోనున్న ఇతర పార్టీలే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయని ఈ సర్వే తెలిపింది.

సమాజవాది పార్టీ(ములాయం), బీఎస్పీ(మాయావతి), వైస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి), ఏఐఏడీఎంకే(జయలలిత), బీజేడీ(నవీన్ పట్నాయక్)లు, లెఫ్ట్ సహా మరికొన్ని ఇతర పార్టీలు దేశానికి కొత్త ప్రధాని ఎవరనే విషయాన్ని నిర్ణయించబోతున్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 12వ తేదీ మధ్యకాలంలో అన్ని వర్గాలు, అన్ని వయసులకు చెందిన 12,648 మంది ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. 

2010 ఆగస్టులో జరిగిన సర్వేలో రాహుల్ ప్రధాని పదవిని చేపట్టాలని 29 శాతం మంది భావించగా, 2011 జనవరి నాటికి అది 20 శాతానికి పడిపోయింది. మరో వైపు నరేంద్ర మోడీకి ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతోంది. 2010 ఆగస్టులో 9 శాతం ఓట్లు పొందిన మోడీ 2011 జనవరి నాటికి 12 శాతం ఓట్లు దక్కించుకున్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా ఎల్‌కే అద్వానీ(10 శాతం), మన్‌మోహన్ సింగ్(10), సోనియా(10), నితీష్‌కుమార్(5), మాయావతి(4) నిలి చారు. ధరల పెరుగుదలకు ప్రధాని మన్మోహన్ సింగ్‌దే బాధ్యత అని 37 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. 

ఆ రెండు పార్టీలూ వద్దంటున్న ఓటర్లు 
కాంగ్రెస్, బీజేపీలకన్నా ఇతర పార్టీలను నమ్ముకుంటేనే దేశానికి మేలు జరుగుతుందని 35 శాతం మంది ఓటర్లు భావిస్తున్నారు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కాంగ్రెసే మెరుగని 26 శాతం మంది, పేదలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని 31 శాతం మంది అనుకుంటున్నారు. అన్నా హజారే, రాహుల్ గాంధీ మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్నకు 60 శాతం మంది హజారేకు, 24 శాతం మంది రాహుల్‌కు మద్దతు తెలిపారు.
Share this article :

0 comments: