కోనసీమ అంతటా నేతలను తిప్పిన పోలీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోనసీమ అంతటా నేతలను తిప్పిన పోలీసులు

కోనసీమ అంతటా నేతలను తిప్పిన పోలీసులు

Written By ysrcongress on Monday, January 30, 2012 | 1/30/2012

దళితుల ఆత్మగౌరవ సభకు అనుమతులిచ్చి.. 
ఆపై అడ్డుకుని జూపూడి, నల్లా, నిర్మల, బొజ్జా తారకం తదితరులను అరెస్టు చేసిన పోలీసులు.. 
నేతలతో దురుసు ప్రవర్తన.. కార్యకర్తలపై లాఠీచార్జి
మీడియా కన్నుగప్పి కోనసీమ అంతటా నేతలను తిప్పిన పోలీసులు..
వేర్వేరు స్టేషన్లకు తరలింపు.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
అరెస్టును ఖండించిన దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు
పోలీసుల తీరు అమానుషం: జూపూడి, నిర్మల, నల్లా

అమలాపురం(తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: కోనసీమలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా అమలాపురంలో నిర్వహించ తలపెట్టిన దళితుల ఆత్మగౌరవ సభలో పాల్గొనేందుకు వచ్చిన నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆదివారమిక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఈ సభకు అనుమతినిచ్చిన పోలీసులు.. తర్వాత 144 సెక్షన్ ఉందనే సాకుతో సభను అడ్డుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, మాల మహానాడు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జి.చిన్నయ్య, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు బొజ్జా తారకం తదితరులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారు. పైగా.. సినిమా చేజింగ్‌లను తలపించే రీతిలో వారిని కోనసీమలోని ఊళ్లన్నీ తిప్పుతూ అతి ప్రదర్శించారు. కొందరిని పి.గన్నవరం, మరికొంత మందిని కొత్తపేట పోలీసు స్టేషన్‌లకు తీసుకెళ్లి.. వ్యక్తిగత పూచీకత్తులపై విడిచిపెట్టారు. నేతల అరెస్టును దళిత సంఘాలతోపాటు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు.


కార్యకర్తలపై విరిగిన లాఠీలు..

అమలాపురంలో విగ్రహాల విధ్వంసాన్ని నిరసిస్తూ ఆర్పీఐ, దళిత సంఘాలు ఆదివారం ‘చలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతులు కూడా తీసుకున్నాయి. అయితే, 144 సెక్షన్ అమలులో ఉందనే సాకుతో పోలీసులు సభను అడ్డుకునేందుకుసిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచే అమలాపురానికి వెళ్లే మార్గాల్లో భారీగా మోహరించారు. అయినప్పటికీ.. వారి కళ్లుగప్పి దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు వందలాదిగా అమలాపురానికి తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు శెట్టిబత్తుల రాజబాబు, కొండేటి చిట్టిబాబు, మట్టా వెంకట్రావు తదితరుల ఆధ్వర్యంలో జనం భారీగా బుద్ధవిహార్‌కు తరలివచ్చారు. ఈలోగా అక్కడకు జూపూడి, నిర్మలాకుమారి, సూర్యప్రకాశరావు, చిన్నయ్య, బొజ్జా తారకం తదితరులు చేరుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతులివ్వలేమని పోలీసులు వారికి చెప్పారు. అలాంటప్పుడు ముందు ఏ విధంగా అనుమతులిచ్చారని నాయకులు నిలదీశారు. ఈ దశలో పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసు హెచ్చరికలను లెక్క చేయకుండా నేతలు, కార్యకర్తలు ర్యాలీగా సభాస్థలికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతుండగా.. పోలీసులు వారిని చుట్టుముట్టి.. అరెస్టులకు సిద్ధమయ్యారు. వృద్ధులు, మహిళలు, రాష్ర్ట నేతలని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించారు. కార్యకర్తలపై లాఠీలు ఝళిపించారు. ఎమ్మెల్సీ జూపూడి, రాష్ర్ట నేతలు సూర్యప్రకాశరావు, బొజ్జా తారకం సహా నేతలందరినీ ఈడ్చుకుంటూ, తీసుకెళ్లి వ్యాన్‌లలో పడేశారు. పెనుగులాటలో బొజ్జా తారకం షర్టు, ప్యాంట్ చిరిగిపోయాయి. వారిని ఏ స్టేషన్‌కు తరలించాలన్న విషయంపై స్పష్టమైనఆదేశాలు లేకపోవడంతో సినిమా చేజింగ్‌ల మాదిరిగా మీడియాకు దొరక్కుండా రెండు వ్యాన్‌లలో వారిని కోనసీమలోని ఊళ్లన్నీ తిప్పారు. దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రహసనం కొనసాగింది. చివరకు జూపూడి, కొల్లి నిర్మలాకుమారి తదితరులను పి.గన్నవరం స్టేషన్‌కు.. బొజ్జా తారకం, నల్లా సూర్యప్రకాశరావు తదితరులను కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. మొత్తం 41 మందిని అరెస్టు చేశారు.

అమానుషం.. అప్రజాస్వామికం

ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాలను చూసి, నిరసన తెలిపేందుకు తాము వచ్చామని.. అయితే రాష్ట్ర స్థాయి నేతలని కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, అడ్డుకున్నారని జూపూడి ప్రభాకరరావు, కొల్లి నిర్మలాకుమారి ధ్వజమెత్తారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని, ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎంపీ ఉండి కూడా అమలాపురంలో దళితులు సభ పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని నల్లా సూర్యప్రకాశరావు అన్నారు. ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు దళిత నాయకులుగా చెబుతున్న కొందరు.. గతంలో అంబేద్కర్ విగ్రహాలకు అవమానం చేశారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో సామాజికవర్గాలతో సంబంధం లేకుండా బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: