అది చాలట... సీబీఐ అరెస్టు చేయటానికి!!? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది చాలట... సీబీఐ అరెస్టు చేయటానికి!!?

అది చాలట... సీబీఐ అరెస్టు చేయటానికి!!?

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

* ఎమ్మార్‌పై 2000కు ముందు నుంచే ప్రభుత్వంతో కోనేరు సంప్రదింపులు
* 2002లో ఎంఓయూ... దానికి భిన్నంగా 2003లో కొలాబరేషన్ అగ్రిమెంట్
* మూడో పక్షానికి హక్కులు బదలాయించేట్టుగా కొత్త క్లాజు తెరపైకి
* దాని ఆధారంగా 2005లో స్టైలిష్ హోమ్స్‌ను ఏర్పాటు చేసిన తుమ్మల రంగారావు
* ఈయన కోనేరు సన్నిహితుడే; ఈయన్ను దుబాయ్ తీసుకెళ్లిందీ ప్రసాదే
* ఎమ్మార్‌తో ఒప్పందం చేసుకుని విల్లాల్ని విక్రయించిన స్టైలిష్ హోమ్స్
* ఇవన్నీ రిపోర్టులో చెప్పిన సీబీఐ... దర్యాప్తు మాత్రం 2005-10కే పరిమితం
* ఏపీఐఐసీకి నష్టం చేకూర్చిన లావాదేవీలన్నీ అప్పుడే జరిగాయని వాదన!
* ఆ లావాదేవీల సొమ్మంతా సునీల్‌రెడ్డి చేతికే అందిందని వ్యాఖ్యలు
* అసలు సునీల్‌కు ఎవరైనా ఎందుకు ఇస్తారు.. వారికేమైనా పిచ్చా? 
* అదనపు సొమ్ము మొత్తాన్ని ఆయనకే ఇచ్చారంటూ అడ్డగోలు రాతలు..
* తన ఆరోపణల్ని తనే ఖండించుకుంటూ... తన వాదనకు తానే కట్టుబడని రిపోర్టు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
అదిగో పులి... అంటుందొక పార్టీ.
ఇదిగో తోక... అంటుందొక పత్రిక.
పట్టుకున్నాం! కాల్చేశాం!!... అంటుందొక చానల్.
ఇదిగో బూడిద... అంటూ వస్తుంది దర్యాప్తు సంస్థ.

అంతే!! దర్యాప్తు సంస్థ తెచ్చిన బూడిద ఆ పులిదేనని నమ్మించటానికి సిగ్గెగ్గులు వదిలేసిన వీధి నాటకం మొదలవుతుంది. జనం బహిరంగంగా చూస్తూ ఉన్నా... అందరికీ తెలుస్తూనే ఉన్నా... అంతా చట్టప్రకారం జరుగుతున్నట్లుగా పాత్రధారులంతా ఎవరి పనులు వారు చేసుకుపోతుంటారు. ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నారో, వేధించాలనుకున్నారో, అప్రతిష్టపాలు చేయాలనుకున్నారో అది చేస్తూ పోతుంటారు. వారు చేస్తున్న పనుల్ని ‘ఆహా! ఓహో!’ అంటూ మళ్లీ ఆ రెండు పత్రికలు, ఆ మూడు చానళ్లే మధ్యమధ్యలో కీర్తిస్తూ ఉంటాయి. నాటకాన్ని రక్తి కట్టించడానికన్నట్టు.. దర్యాప్తు సంస్థతో కుమ్మక్కయిన రాజకీయ పార్టీ నేతలే, ‘దర్యాప్తు సరిగా సాగటం లే’దంటూ అప్పుడప్పుడు దానిపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదీ... ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న రసవత్తర దర్యాప్తుల డ్రామా.

ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో గానీ, విల్లా స్థలాల్లో కోట్లు కొల్లగొట్టిన కోనేరు ప్రసాద్ కంపెనీ స్టైలిష్ హోమ్స్‌తో గానీ, అలా కొల్లగొట్టడానికి 2002 నుంచే ద్వారాలు తెరిచిన ఏపీఐఐసీతో గానీ సునీల్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. ప్రభుత్వాధికారీ కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో ఆయనకు దూరపు బంధుత్వముంది. సాన్నిహిత్యముంది. అది చాలట... సీబీఐ అరెస్టు చేయటానికి!!? అధికారాన్ని ఉపయోగించేటపుడు విచక్షణ జ్ఞానాన్ని కూడా వాడాలనే కనీస తెలివిడి లేని ఈ దర్యాప్తు సంస్థ.. తన రాజకీయ ఎజెండాను కప్పిపుచ్చటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కోర్టులో చూపిన రిమాండ్ రిపోర్టులో మాత్రం అడ్డంగా దొరికిపోయింది. 

‘‘అప్పట్లో ఏపీఐఐసీ సీఎండీగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ ఎంజీఎఫ్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి కుట్ర పన్ని 2005-10 మధ్య ఏపీఐఐసీని మోసం చేశారనేది ఆరోపణ. వీరంతా కలిసి విల్లా ప్లాట్లను మార్కెట్ ధర కన్నా అతి తక్కువగా, ముందే నిర్ణయించిన ధరకు విక్రయించారు. ఏపీఐఐసీ బోర్డుకు ఏమీ తెలియనివ్వకుండా, దాని అనుమతి తీసుకోకుండా ఆచార్య తన అధికారాన్ని అడ్డం పెట్టారు. ప్లాట్ల అమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని ఈహెచ్‌టీపీఎల్, ఎమ్మార్ ఎంజీఎఫ్‌లు ఏపీఐఐసీతో పంచుకోకుండా దానికి నష్టం చేకూర్చాయి’’ అని సీబీఐ పేర్కొంది. తద్వారా.. ఈ కేసులో 2005-10 మధ్య పరిణామాల్ని మాత్రమే తాను విచారిస్తానని చెప్పకనే చెప్పింది. చంద్రబాబు జోలికి వెళ్లబోనని కూడా స్పష్టంగానే తెలియజేసింది. కాకపోతే, దానికి కొనసాగింపుగా పేర్కొన్న అంశాల్లోనే సీబీఐ దురుద్దేశాలన్నీ స్పష్టంగా బయటపడిపోయాయి.

విజిలెన్స్ నివేదిక చెప్పినా పట్టించుకోరా?
ఎమ్మార్‌కు ప్రాజెక్టును కట్టబెడుతూ 2002 సెప్టెంబరు 4న చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇచ్చిన జీవో 359ని ప్రస్తావించిన సీబీఐ.. ‘‘2002 నవంబరు 6న ఈ మేరకు 535 ఎకరాలిచ్చేందుకు ఎంఓయూ కుదిరింది. అయితే 2003 ఆగస్టు 19న దీనికి అదనంగా ఓ కొలాబరేషన్ అగ్రిమెంట్ కుదిరింది. జీవో 359లో లేని కొన్ని అంశాల్ని దీన్లో చేర్చారు. అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ఎమ్మార్ సంస్థ మూడో పక్షానికి ఇచ్చేందుకు వీలైన క్లాజును దీన్లో చేర్చారు. నిజానికి డెవలపర్‌గా ఎమ్మార్‌ను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కానీ ఈ క్లాజు మూడో పక్షానికి అవకాశమిచ్చింది’’ అని వివరించింది. 

అంటే.. ఎమ్మార్ వ్యవహారంలో మూడో పక్షం ప్రవేశించటానికి ప్రత్యేక ఒప్పందం ద్వారా 2003లో చంద్రబాబు రంగం సిద్ధం చేశారని సీబీఐ స్పష్టంగా చెప్పిందన్నమాట. నిజానికి స్టైలిష్ హోమ్స్ అనే సంస్థ పుట్టుకు రావటానికి వీలు కల్పించింది ఈ కొలాబరేషన్ ఒప్పందమేనని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక గతంలోనే స్పష్టంగా బయట పెట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేటప్పుడు హైకోర్టు కూడా విజిలెన్స్ నివేదికను పరిగణనలోకి తీసుకుంది. మరి రిమాండ్ రిపోర్టులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన సీబీఐ.. దర్యాప్తుకు వచ్చేసరికి మాత్రం.. తన విచారణను 2005-10 పరిణామాలకే పరిమితం చేస్తానని ఎందుకు చెబుతోంది? ఎవరిని కాపాడటానికి? నిజం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా నిస్సిగ్గుగా కప్పెట్టే ప్రయత్నం చేయటమెందుకు? ఎవరి కోసం?

2000 నుంచీ కోనేరు సంప్రదింపులు...
2005లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 14ను జారీ చేయటం ద్వారా ప్రాజెక్టు అమలు తీరును మార్చిందని సీబీఐ పేర్కొంది. ‘‘ఏప్రిల్లో ఎమ్మార్-ఏపీఐఐసీ మధ్య అనుబంధ ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అమలుకు మూడు ఎస్‌పీవీలు ఏర్పడ్డాయి. మూడింట్లో ఏపీఐఐసీకి 26 శాతం వాటా కేటాయించారు. 2000 నుంచీ ఎమ్మార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న కోనేరు ప్రసాద్‌ను ఈ మూడింట్లోనూ డెరైక్టర్‌గా ఎమ్మార్ సంస్థ చేసింది. తరవాత విల్లా స్థలాల్ని విక్రయించటానికి ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలని ఎమ్మార్ భావించగా, కోనేరు తన సన్నిహితుడైన తుమ్మల రంగారావు చేత స్టైలిష్ హోమ్స్ సంస్థను ఏర్పాటు చేయించి, ఆయన్ను దుబాయ్ తీసుకెళ్లారు. స్టైలిష్-ఎమ్మార్ మధ్య ఒప్పందం కుదిర్చారు. తరవాత విల్లా స్థలాల్ని మార్కెట్ రేటు ఎక్కువున్నా సరే.. గజం రూ.5000కే విక్రయించారు. ఇలా 2010 వరకూ చేశారు. 

నిజానికి ఏపీఐఐసీ గానీ, ప్రభుత్వంగానీ ఎన్నడూ విల్లా స్థలాల్ని విక్రయించాలనుకోలేదు. దాని బదులు.. ఎమ్మార్ సంస్థ ఇళ్లను, అపార్ట్‌మెంట్లను నిర్మిస్తే, రేటు నిర్ణయించి వాటిని విక్రయించాలన్నది వాటి ఉద్దేశం. అయితే కోనేరు-తుమ్మల కలిసి తమకు తెలిసిన కొద్దిమందికే దీని గురించి ప్రచారం చేస్తూ 2010 వరకూ విల్లా ప్లాట్లను విక్రయించారు’’ అని సీబీఐ వివరించింది.
ఇక్కడ గమనించాల్సిందొకటే. ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి 2000వ సంవత్సరానికి ముందు నుంచే కోనేరు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీబీఐ స్వయంగా పేర్కొంది. పెపైచ్చు 2000లో విశాఖ జిల్లాలో బాక్సైట్ గనుల లీజు పొందటానికి వచ్చిన దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్) కమిటీలో కూడా కోనేరు కీలక సభ్యుడు. 

చంద్రబాబు దుబాయ్ వెళ్లినప్పుడల్లా ఆయనకు ఆతిథ్యమిస్తూ.. బాబు ఖాతాల్ని, వ్యాపార వ్యవహారాల్ని కూడా కోనేరే చక్కబెట్టేవారని గతంలో ఎన్నో ఆరోపణలొచ్చాయి. ‘ఈనాడు’ వార్తా విభాగానికి ఎండీగా పని చేసి, తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహారాలు చూసిన రమేశ్‌బాబు.. అందుకు వేతనాన్ని మాత్రం కోనేరు ట్రస్టు నుంచి తీసుకున్నారు. చంద్రబాబుకు కోనేరు ప్రసాద్ పచ్చి బినామీ అని వీటిని చూస్తేనే స్పష్టంగా తెలిసిపోతోంది. 

అలాంటి కోనేరును ఎమ్మార్ సంస్థ తన కంపెనీలన్నిట్లోనూ డెరైక్టరుగా నియమించిందంటే.. అదంతా బాబు సమ్మతితోనే నడిచిందనేది ఎవరికైనా తేలిగ్గా అర్థమయ్యే విషయం. కోనేరు సన్నిహితుడు రంగారావుకు చెందిన స్టైలిష్ హోమ్స్‌తో అమ్మకాలకు సంబంధించి ఎమ్మార్ ఒప్పందం కుదుర్చుకున్నా.. విల్లాల్ని చౌకగా విక్రయించినట్లు చూపించిన స్టైలిష్ సంస్థ, బ్లాక్‌లో అధిక మొత్తాలు వసూలు చేసినా.. ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా అందరికీ అర్థమైపోయే విషయమే. ఇవన్నీ చంద్రబాబును సమాధానంగా చూపించే ప్రశ్నలే. కానీ సీబీఐ మాత్రం వీటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. పైగా తనదైన శైలిలో ఏమని భాష్యం చెప్పిందో తెలుసా..!

మొత్తం డబ్బులు సునీల్ చేతికే..?
‘‘2005-10 మధ్య కోనేరు ప్రసాద్ సూచనల మేరకు చదరపు గజానికి రూ.5,000 నుంచి రూ.50వేల వరకూ అధిక మొత్తాన్ని తుమ్మల రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేశారు. అయితే చాలా సందర్భాల్లో రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేసిన మొత్తం సునీల్‌రెడ్డి చేతికి వెళ్లినట్లు మా దర్యాప్తులో తేలింది. కోనేరుతో కలిసి సునీల్‌రెడ్డి కుట్ర పన్ని ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిసింది. సాక్షుల సమక్షంలో మంగళవారం మేం సునీల్ ఇంటిని సోదా చేయగా కీలక పత్రాలు లభ్యమయ్యాయి. వాటి పరిశీలన అనంతరం సునీల్‌ను నిందితుడిగా చేర్చాం. ఈ మొత్తం అంతిమంగా ఎక్కడికి చేరిందనేది సునీల్‌రెడ్డికి తెలుసని వెల్లడయింది. అది తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆయన సహకరించలేదు. దీంతో సాయంత్రం అరెస్టు చేశాం’’ అంటూ పేర్కొన్న సీబీఐ నివేదిక.. దీన్లోని డొల్లతనాన్ని తనంత తానుగానే బయటపెట్టనే పెట్టింది. ఎందుకంటే..

* అసలు తుమ్మల రంగారావు, ఆయన మేనేజరు వసూలు చేసిన మొత్తాన్ని సునీల్‌రెడ్డికి ఎందుకు ఇచ్చేస్తారు? కొంచెం బుద్ధీ బుర్రా ఉన్న వారెవరికైనా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. బహుశా! వారలా డబ్బులివ్వాలంటే.. అయితే సునీల్ ఎమ్మార్ ప్రతినిధి అయి ఉండాలి. లేకుంటే స్టైలిష్ సంస్థ యజమాని అయి ఉండాలి. ఇవన్నీ కాకుంటే వారికి ఆయన వల్ల ఏదో ఒక ప్రతిఫలం దక్కి ఉండాలి. మరి ఏ ప్రతిఫలం దక్కిందన్నది సీబీఐ చూపించాలి కదా!!!

* అసలు ఎమ్మార్ సంస్థ తాను గజాన్ని రూ.5 వేలకు విక్రయించి.. ఆపై వచ్చిన డబ్బులన్నిటినీ సునీల్‌రెడ్డికి ఇచ్చేయడానికి దానికేమైనా పిచ్చా? ఏపీఐఐసీకి ఇవ్వాల్సిన 26 శాతం వాటాను ఎగ్గొట్టడానికి, మొత్తం 100 శాతం సొమ్మునూ సునీల్‌రెడ్డికి ఇచ్చేశారన్నది ఏ కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా? ఇలా అధికంగా వసూలు చేసిన రూ.432 కోట్లు దుబాయ్‌కి తరలిపోయాయని, వాటిని కోనేరు ప్రసాద్ చాకచక్యంగా తన తనయుడి ఖాతాల్లోకి మళ్లించారని ఎఫ్‌ఐఆర్‌లో కూడా సీబీఐ పేర్కొంది!! మరిప్పుడు ఆ డబ్బులన్నీ సునీల్‌రెడ్డికి అందాయని చెప్పడం వెనక కారణమేంటి? ఎవరి ప్రోద్బలముంది? ఏ ఒత్తిళ్లు పని చేస్తున్నాయి? అసలు సునీల్ అరెస్టు సహేతుకమేనని చెప్పేందుకు ఒక్కటంటే ఒక్క కారణాన్నయినా ఈ రిమాండ్ రిపోర్టులో సీబీఐ చూపించిందా? అన్ని వేళ్లూ బాబు బినామీ కోనేరు వైపు చూపిస్తుండగా.. సీబీఐ ఆ అంశాన్ని తన రిపోర్టులో పేర్కొని కూడా.. తన వేలును మాత్రం తన ‘టార్గెట్’ వైపు చూపించటం ఎవరిని మోసం చేయటానికి?

* విచారణకు సునీల్‌రెడ్డి సహకరించలేదు కాబట్టే అరెస్టు చేయాల్సి వచ్చిందంటున్న సీబీఐ.. అసలు ఆ నిర్ధారణకు ఎలా వచ్చేసింది? కేవలం నాలుగైదు గంటల పాటు ప్రశ్నించి, ‘ఇక సహకరించబోరు’ అని తేల్చేసుకుందా? అదీగాక.. సునీల్‌రెడ్డిని సీబీఐ ‘అరెస్టు’ చేసిన తీరు, ఆ సందర్భంగా ఆద్యంతం అధికారుల ప్రవర్తన.. ఆయన వారికి సహకరించే వాతావరణాన్ని ఏ కాస్తయినా కల్పించాయా? తెల్లవారుజామున ఇంటికొచ్చి లేపి, భార్యకు, కుటుంబీకులకు సమాచారం కూడా ఇవ్వకుండా, ఎటు తీసుకెళ్తున్నది కూడా చెప్పకుండా తీసుకెళ్లడాన్ని ఏమనాలి?

బాబువైపు కన్నెత్తని సీబీ‘ఐ’
ఎమ్మార్ వ్యవహారంలోని ప్రధానాంశాల్లో ఒకటి.. ఎమ్మార్‌కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టిన తీరు. రెండు.. దీన్లో ఏపీఐఐసీకి నష్టం వచ్చేట్టుగా కుదుర్చుకున్న కొలాబరేషన్ ఒప్పందం. వీటిలో ఎవరు దోషులన్నది వివరంగా చూస్తే..

కుట్రపూరితంగా కట్టబెట్టిన బాబు
ఫైవ్‌స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్, దాని చుట్టూ శ్రీమంతుల విల్లాలు... ఇలా ఉండే ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మించాలని చంద్రబాబు 2001లోనే భావించారు. దానికి తగ్గట్టుగా ఏపీఐఐసీ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు పిలిపించారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, మలేసియాకు చెందిన ఐఓఐ, దేశీయ సంస్థలైన ఎల్ అండ్ టీ, షాపుర్జీ పల్లోంజీ సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో సోమ్ ఏసియా, షాపుర్జీ పల్లోంజీ బిడ్లను ప్రభుత్వం తిరస్కరించింది. తర్వాత టెండర్ల గడువు ముగిసేనాటికి ఎల్ అండ్ టీ, ఐఓఐ వెనక్కెళ్లిపోయాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. నిజానికి సింగిల్ టెండర్ ఆధారంగా ఏ ప్రాజెక్టునూ కట్టబెట్టకూడదు. అది నిబంధనలకు విరుద్ధం. 

ఈ విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక స్పష్టంగా బయటపెట్టింది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో.. తానే స్వయంగా బరిలోకి దిగి ఎల్ అండ్ టీ, ఐఓఐల చేత బిడ్లు ఉపసంహరింపజేసిన బాబు.. 535 ఎకరాలనూ ఎమ్మార్‌కే కట్టబెట్టేశారు. అది కూడా ఎకరం రూ.29 లక్షలకు! చిత్రమేంటంటే అంతకు మూడేళ్ల కిందటే.. ఈ భూమికి సమీపంలోని తన సొంత భూమిని ఎకరా రూ.కోటికి అదే బాబు అమ్ముకున్నారు! మరి మూడేళ్ల తరవాత, అక్కడ ఎకరా రూ.4 కోట్లపైనే పలుకుతున్నా, ఎమ్మార్‌కు రూ.29 లక్షలకే ఎందుకిచ్చినట్టు? పోనీ అదేమైనా ప్రజోపయోగ ప్రాజెక్టా? దీనికి ఇప్పటివరకూ బాబు సమాధానం చెప్పిన దాఖలాలు కూడా లేవు. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే కోర్టు విచారణకు ఆదేశించినా.. దర్యాప్తు సంస్థ సీబీఐ మాత్రం ఈ దిశగా దృష్టి పెట్టిన ఛాయలు కూడా లేవు.

విల్లా అమ్మకాలకు కొలాబరేషన్ ఒప్పందమే మూలం!
భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక.. ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక.. 2003 ఆగస్టు 19న అనూహ్యంగా మరో ఒప్పందం తెరపైకి వచ్చింది. అదే.. కొలాబరేషన్ అగ్రిమెంట్. దీని ప్రకారం ప్రాజెక్టులో ఏ భాగాన్నయినా అభివృద్ధి, నిర్వహణ, ఇతర సహకారాల నిమిత్తం మూడో పక్షానికి అప్పగించొచ్చు. దీనికి ఏపీఐఐసీ అంగీకారం ఉండాలి. కానీ.. ‘‘ఏపీఐఐసీ సహేతుకమైన కారణాన్ని చూపించలేనప్పుడు మాత్రం ఆ నిర్ణయాన్ని అడ్డుకోజాలదు’’. ఇదిగో.. ఈ ఒక్క క్లాజుతోనే చంద్రబాబు ఏపీఐఐసీ చేతులు కట్టేశారు. ఎందుకంటే ఏపీఐఐసీ ఏదైనా నిర్ణయాన్ని అడ్డుకుని, దానికి కారణం చూపించినా.. అది సహేతుకం కాదంటూ ఎమ్మార్ కొట్టిపారేయొచ్చు. కుంభకోణానికి ఈ కొలాబరేషన్ ఒప్పందమే మూలమని విజిలెన్స్ నివేదిక స్పష్టంగా చెప్పింది!

రియల్టీ లావాదేవీలకిది కొత్తా?
దేశంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు నూటికి నూరుశాతం పారదర్శకంగా, అధికారికంగా జరిగితే ఎక్సైజ్ శాఖను మించిన ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకే వస్తుంది. ఆదాయంలో ఆ శాఖే టాప్‌లో నిలుస్తుంది. ఇదెందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రిజిస్ట్రేషన్లు జరిగేది స్థానిక మార్కెట్ విలువ ఆధారంగానే. మిగతా సొమ్ము చాలావరకూ బ్లాక్‌లో చేతులు మారుతుందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. ఎమ్మార్ వ్యవహారంలో కూడా అదే జరిగి ఉండొచ్చు. ఇలా భారీ మొత్తం బ్లాక్‌లో చేతులు మారటం వల్ల ఏపీఐఐసీకి తన వాటా మేర నష్టం వచ్చి ఉండొచ్చు. మరి ఈ నష్టానికి కారకులెవరు? అయితే గియితే స్టైలిష్ హోమ్స్ సంస్థ కావాలి. దాని ప్రతినిధులు కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కావాలి. వారు ఎమ్మార్ తరఫున లావాదేవీలు నడిపారు కనక, అధికంగా వసూలు చేసిన సొమ్ము ఎమ్మార్‌కే చేరి ఉండాలి. 

కోనేరు ఖాతాకు చేరిన సొమ్ము అక్కణ్ణుంచి దుబాయ్‌లోని ఆయన తనయుడి ఖాతాల్లోకి వెళ్లిందని సాక్షాత్తూ తన ఎఫ్‌ఐఆర్‌లోనే పేర్కొన్న సీబీఐ.. ఇప్పుడెందుకు మాట మారుస్తోంది? ఒకరి వాంగ్మూలం ఆధారంగా సునీల్‌ను విచారించాలని భావించినపుడు.. కనీసం ఆయన్ను పిలిచి ప్రశ్నించాలిగా! అదేమీ చేయకుండానే నేరుగా అరెస్టుకు దిగిపోవటం ఎందుకు? సహజ న్యాయసూత్రాలనేవి చంద్రబాబుకో, రిలయన్స్‌కో, రామోజీకో మాత్రమే వర్తిస్తాయా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా పెట్టుకున్నారు కనక, ఆయనెలాగూ కాంగ్రెస్ అధిష్టాన్ని ఎదిరిస్తున్నారు కనక ఇలాంటివేవీ ఆయనకు, ఆయన సన్నిహితులకు, బంధువులకు వర్తించవా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం... అపవిత్ర బంధాన్ని అడ్డంగా బయటపెట్టిన ‘ఈనాడు’ కథనమే!
Share this article :

0 comments: