సాక్షి వెళ్లి ఏ చంద్రబాబు పేరో, సోనియాగాంధీ పేరో చెబితే వారిని కూడాఇలాగే అరెస్టు చేసేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి వెళ్లి ఏ చంద్రబాబు పేరో, సోనియాగాంధీ పేరో చెబితే వారిని కూడాఇలాగే అరెస్టు చేసేస్తారా?

సాక్షి వెళ్లి ఏ చంద్రబాబు పేరో, సోనియాగాంధీ పేరో చెబితే వారిని కూడాఇలాగే అరెస్టు చేసేస్తారా?

Written By ysrcongress on Wednesday, January 25, 2012 | 1/25/2012

 ఉదయం 5.30కే సునీల్ ఇంటికొచ్చిన సీబీఐ అధికారులు
* జేడీ పిలుస్తున్నారంటూ... ఇంట్లోవారికి సమాచారం ఇవ్వకుండా తరలింపు
* ఉదయం 10.30కు దిల్‌కుశకు వచ్చి భార్య వాకబు చేయాల్సిన దుస్థితి
* వారెంట్ లేకుండానే సోదాలు.. విచారణకు పిలవకుండానే అరెస్టు
* ఎమ్మార్‌ను తెచ్చిన బాబును, ఏపీఐఐసీని, అధికారుల్ని వదిలేసిన సీబీఐ
* అసలు దోషుల్ని వదిలి... కేసుతో అసలు సంబంధమే లేని సునీల్ లాంటి వైఎస్ బంధువుల్ని టార్గెట్ చేస్తూ పావులు
* ఓఎంసీ, ‘సాక్షి’ పెట్టుబడులు, ఎమ్మార్.. కేసు ఏదైనా లక్ష్యం మాత్రం జగనే

అనుకున్నదే జరిగింది. ‘సాక్షి’ ఊహించిందే నిజమైంది. అంతా పక్కా పథకం ప్రకారం... ‘పై’ నుంచి చెబుతున్న మేరకే సాగిపోతోంది. రాజకీయంగా తననెదిరించిన వారిని ఏం చేయగలననేది కాంగ్రెస్ అధిష్టానం చూపిస్తుండగా... ఢిల్లీకి వత్తాసు పలుకుతూ తాను ఎంతవరకూ బరితెగించగలదో... దర్యాప్తును ఏ స్థాయికి దిగజార్చగలదో... నైతిక ధర్మాన్ని ఏ మేరకుపతనం చేయగలదో... సీబీఐ కళ్లకు కడుతోంది. ఎమ్మార్ కేసులో అసలు దోషుల వైపు కన్నెత్తి కూడా చూడకుండా... న్యాయానికి పాతరేసి... తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది. కుంభకోణం మూలాల్ని ఎందుకు వదిలేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించినా... నోటీసులు జారీ చేసినా... దర్యాప్తు సంస్థకు చీమకుట్టినట్టు కూడా లేదు. దానిక్కావలసిందల్లా వైఎస్ కుటుంబం, బంధువులు, సన్నిహితులే. వారిని టార్గెట్ చేసి.. తద్వారా దివంగత నేత వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చి, ఆయన్ను జనం గుండెల్లోంచి చెరిపేయటమే... ఇందులో భాగమే అసలు కేసుతో సంబంధమే లేని వైఎస్ బంధువు సునీల్‌రెడ్డి అరెస్టు.


‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నున్నగా ఉంటాయి కనక బోడిగుండూ మోకాలూ ఒకటేనా? డబ్బులు కాబట్టి రూపాయి, డాలర్ ఒకటేనా? ఇంగితజ్ఞానం ఏ కొంచెం ఉన్నవారైనా కాదనే అంటారు. దేశంలో ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐ మాత్రం తాను చెప్పాలనుకుంటే రెండూ ఒకటే అంటుంది. ఎందుకంటే దానికి నిజానిజాలు అక్కర్లేదు. ధర్మాధర్మాలు అనవసరం. తాను చేయాలనుకున్నది చేస్తుంది. చెప్పాలనుకున్నది చెబుతుంది. ఢిల్లీ రాజకీయ బాసులు ఎలా చెబితే అలా... ఎలా రాజకీయ ఎజెండా నిర్దేశిస్తే అలా పని చేస్తుంది. అంతే!!. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అసలు కేసేంటి? దర్యాప్తు ఎందుకు మొదలైంది? ఏపీఐఐసీ వాటా తగ్గిపోయి, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందనే ఆరోపణలపై కదా!! మరి దాన్లో విచారించాల్సింది ఎవరిని? దర్యాప్తు చేయాల్సిందేమిటి? విచారిస్తోంది ఎవరిని? వేధిస్తోందెవరిని? సునీల్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవే. తెలియనట్టు నటిస్తున్నదల్లా సీబీఐ, దాంతో కుమ్మక్కయిన రాజకీయ పార్టీల నేతలు. అంతే!!

బాబును నిస్సిగ్గుగా వదిలేశారు!
సీబీఐ దర్యాప్తు తిన్నగా సాగితే... మొదట ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను ఈ దేశానికి తీసుకొచ్చిన పద్ధతి నిబంధనల ప్రకారం ఉందా, లేక ఏమైనా కుట్రలు, కుతంత్రాలున్నాయా అన్నది చూడాలి. టెండర్లు వేసిన అన్ని కంపెనీల్నీ నయానో, భయానో వెనక్కి పంపేసి.. ఎమ్మార్ ఒక్కటే మిగిలేలా చేసి.. దానికి 535 ఎకరాలు కట్టబెట్టిన చంద్రబాబునాయుడి మాస్టర్ ప్లాన్‌ను చూడాలి. కానీ సీబీఐకి మాత్రం ఆ ఉద్దేశం లేనేలేదు. గోల్ఫ్ కోర్సు, విల్లాల్లో ఏపీఐఐసీ వాటాను 26 శాతానికి పరిమితం చేసిన బాబును, అలా ఎందుకు చేశారని ప్రశ్నించాలి. కానీ సీబీఐకి ఆ ఆలోచనే లేదు. కానీ.. కొలాబరేషన్ ముసుగులో ఎమ్మార్-ఏపీఐఐసీ మధ్య బరితెగింపు ఒప్పందం చేసి, విల్లాల అమ్మకంతో కాసులు కొల్లగొట్టిన చంద్రబాబును మాత్రం ముట్టుకోవడం లేదు! ఆయన తరఫున ఈ కార్యం చక్కబెట్టిన స్టైలిష్ ప్రతినిధులనూ ఏమీ అనడం లేదు! ఏపీఐఐసీ వాటా వైఎస్ హయాంలో తగ్గిందనుకుంటే.. దానికి ముందుగా ప్రశ్నించాల్సింది.. అప్పటి అధికారులను, నాటి మంత్రివర్గంలోనూ ఉన్న నేటి మంత్రులనూ! వారందరినీ సీబీఐ వదిలేసింది. 

ఏపీఐఐసీతో అధికారులు కుమ్మక్కయ్యారని, అందుకే ఎమ్మార్ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా తగ్గిందన్న ప్రధాన అభియోగాన్ని కూడా వదిలేసింది. అన్నీ వదిలేసి.. అందరినీ వదిలేసి.. వైఎస్ వారసుడిని టార్గెట్ చేస్తూ, ఆయన బంధుమిత్రుల వైపు కదులుతోంది. దీన్లో భాగంగానే.. దర్యాప్తు తీరుతెన్నులపైనే సందేహాలు కలిగే రీతిలో, రాజకీయ ఎజెండాను తేటతెల్లం చేస్తూ, మంగళవారం సునీల్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఇంకా చిత్రమేమిటంటే.. వైఎస్సార్ బంధుమిత్రులు, సన్నిహితులు, లేదా దగ్గరి వారిలో ఎవరో ఒకరిని సీబీఐ అరెస్టు చేస్తుందని గత వారం రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దాన్నే రెండు రోజుల కిందట ‘సాక్షి’ కూడా బయటపెట్టింది. ఇప్పుడదే నిజమైంది. కాంగ్రెస్ వర్గాల కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని చెప్పటానికి ఇంతకన్నా ఏం కావాలి?

అన్ని కేసుల్లోనూ టార్గెట్ ఒక్కటే...
‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడులైతేనేం... ఎమ్మార్ వ్యవహారమైతేనేం... ఓబుళాపురం మైనింగ్ కేసైతేనేం!! కేసు ఏదైనా సీబీఐ లక్ష్యం మాత్రం ఒక్కటే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. జనం గుండెల్లోంచి చెరపటానికి సాధ్యం కానంతగా ఎదిగిపోయిన ఆయన ప్రతిష్ట. ఆయన ప్రతిరూపంగా జనం గుండెల్లోకి చేరిపోయిన వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఆయనే సీబీఐ టార్గెట్. ఈ టార్గెట్ కోసం దర్యాప్తును ఎన్ని వంకర్లు తిప్పాలో అన్ని వంకర్లూ తిప్పుతోంది. నిజానికి ఏ కేసునైనా ఆమూలాగ్రం శోధిస్తూ.. పరిశోధనలో లభ్యమైన క్లూల ఆధారంగా సదరు కేసులో దోషిని నిర్ధారించటం సహజం. ఇక్కడ మాత్రం అలా కాదు. తాను ఎవరిని దోషిగా తేల్చాలనే విషయంలో సీబీఐ ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది. 

అలా తేల్చడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డదార్లు తొక్కాలో అన్నిటినీ తొక్కుతోందిప్పుడు. దానికోసం అవసరమైన సాక్ష్యాల్ని సేకరించేందుకు కూడా జోరుగా విఫలయత్నం చేసింది. కానీ సాక్ష్యాలేవీ లేకపోవటంతో.. వైఎస్ బంధువుల్ని, కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని అరెస్టు చేసి, తద్వారా జగన్‌ను మానసికంగా దెబ్బతీసే ప్రక్రియకు పదును పెట్టింది. వారిని బెదిరించో, భయపెట్టో తనకు కావలసినట్టు చెప్పించుకోవాలని, అలా చేస్తేనే జగన్‌మోహన్‌రెడ్డి అనే అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని బలంగా విశ్వసిస్తోంది. ‘సాక్షి’ పెట్టుబడుల కేసులో ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్టు చేసినా, ఎమ్మార్ కేసులో తాజాగా సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నా... అది అటు తిప్పి, ఇటు తిప్పి జగన్‌మోహన్‌రెడ్డికి అంటగట్టే కుట్రలో భాగమేనన్నది ఈ కేసుల్ని దగ్గర్నుంచి పరిశీలిస్తున్న ఎవరికైనా తేలిగ్గా అర్థం కాకమానదు. 

‘సాక్షి’ పెట్టుబడులు క్విడ్ ప్రో కో గా వచ్చినవేనని ఎలాగోలా ‘నిర్ధారించడం’ కోసం ఇప్పటికే అన్ని పెట్టుబడుల్నీ సీబీఐ పరిశోధిస్తూ పోతోంది. నిజానికి క్విడ్ ప్రో కో అంటే ముందుగా ప్రభుత్వ ఖ జానాకు నష్టం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా అయాచిత లబ్ధి చేకూరిస్తే మొదట వాటిని చూడాలి. అలా లబ్ధి పొందిన వారి నుంచి ఏవైనా పెట్టుబడులొచ్చాయేమో పరిశీలించాలి. ఏ దర్యాప్తు సంస్థయినా చేయాల్సిందిదే. కానీ సీబీఐ అలా కాదు. ముందే జగన్‌మోహన్‌రెడ్డి అనే లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుంది కనక.. ‘సాక్షి’లోకి వచ్చిన ప్రతి పెట్టుబడినీ చూసి, దాన్ని పెట్టినవారికి ప్రభుత్వపరంగా ఏమైనా లబ్ధి చేకూరిందా లేదా అని చూస్తోంది. అంటే.. తాననుకున్నదాన్ని నిరూపించడానికి తంటాలు పడుతోందన్నమాట. 

ఓఎంసీ కేసులో సైతం లీజు ఇచ్చినవారిని, బదలాయించిన వారిని వదిలేసి.. దాని ద్వారా ‘సాక్షి’లోకి పెట్టుబడులు వచ్చాయంటూ తనతో కుమ్మక్కయిన ఓ రెండు పత్రికలు, మూడు చానళ్ల చేత హైడ్రామా నడిపించింది. చివరికది నిలిచే ఆరోపణ కాదని తేలిపోవటంతో ఆ మీడియా, దర్యాప్తు సంస్థ కూడా దాన్ని వదిలేశాయి. ఇపుడు ఎమ్మార్ కేసులోనూ అంతే. ఎమ్మార్‌ను తెచ్చిన బాబును, ఏపీఐఐసీని, కేబినెట్‌ను.. అందరినీ వదిలిపెట్టి ప్రైవేటు వ్యక్తులపై పడింది. నిజానికి సునీల్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే ఏ పదవిలోనూ లేరు. ఆయనేమీ అధికారి కారు. స్టైలిష్ హోమ్స్‌తోనూ ఆయనకెలాంటి సంబంధాలూ లేవు. కానీ ఎవరో ఒక సాక్షి చెప్పారన్న కారణంతో ఆయన్ను అదుపులోకి తీసుకోవటమనేది దర్యాప్తు సంస్థ దిగజారుడుకు పరాకాష్ట.

ఎజెండాను బయటపెట్టిన అరెస్టు!
సీబీఐ అధికారులు తెల్లవారుజామున 5.30కు హైదరాబాద్ గోపన్‌పల్లిలోని సునీల్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్నదల్లా సునీల్‌రెడ్డి, భార్య కృష్ణతేజ, తల్లి మాత్రమే. వారికి కాఫీ తెమ్మని చెప్పిన అధికారులు.. వారలా లోపలికెళ్లగానే, తాము సీబీఐ వారిమని చెప్పి.. జాయింట్ డెరైక్టర్ పిలుస్తున్నారంటూ సునీల్‌ను హడావుడిగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఆయన్ను ఎక్కడికి తీసుకెళుతున్నదీ కనీసం ఇంట్లో ఉన్నవారికి కూడా చెప్పలేదు! ఆందోళనతో ఆయన భార్య అన్నిచోట్లా వాకబు చేయడం మొదలు పెట్టారు. చివరికి ఉదయం 10.30 సమయంలో దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌కు వచ్చేదాకా ఆమెకు విషయం తెలియలేదంటేనే సీబీఐ ఏ తీరులో వ్యవహరించిందో బయట పడుతుంది. తర్వాత ఉదయం 11 గంటల సమయంలో సెర్చ్ వారెంట్ లేకుండానే అపర్ణా సైబర్ కౌంటీలోని సునీల్ ఇంటికొచ్చి అధికారులు సోదాలు చేశారు. 

మధ్యాహ్నం 1.30 కల్లా సెర్చ్ ముగించి, తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని సునీల్‌రెడ్డికి సంబంధించిన ఇంటీరియర్ డెకరేషన్ షాపులో కూడా సోదాలు జరిపారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన్ను దిల్‌కుశ అతిథి గృహానికి తీసుకుని వచ్చి.. జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో అక్కడే సుదీర్ఘంగా విచారించారు. చివరికి.. ఆయన్ను ‘సాయంత్రం 6.50 సమయంలో ఆయన్ను అరెస్టు చేశాం’ అని రాత్రి 9 గంటలకు ప్రకటించారు! తరువాత 9.45 గంటల సమయంలో సునీల్‌ను సీసీఎస్‌కు తరలించారు. దిల్‌కుశలో కారాగారం లేకపోవటంతో సీసీఎస్‌కు తరలించామని, బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని జేడీ చెప్పుకొచ్చారు.

అన్నీ ప్రశ్నలే:ఈ ఉదంతం పొడవునా తీవ్రమైన అనుమానాలకు దారితీసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. సీబీఐ ఎజెండాను బయటపెట్టిన అంశాలెన్నో ఉన్నాయి...

* విల్లాల అమ్మకాల్లో రికార్డుల్లో చూపని సొమ్మును స్టైలిష్ హోమ్స్ ప్రతినిధులు వసూలు చేశారని, దాన్లో కొంత సునీల్‌రెడ్డికి అందిందని స్టైలిష్ ప్రతినిధి టి.రంగారావు చెప్పటంతో సునీల్‌ను అరెస్టు చేశామని సీబీఐ అంటోంది. ఇదే నిజమనుకుంటే.. రంగారావు సాక్ష్యమిచ్చి చాన్నాళ్లయింది. మరి అదేదో సోమవారం రాత్రే తెలిసినట్టుగా, మంగళవారం సునీల్ ఎక్కడికో పారిపోతారన్నట్టుగా అంత తెల్లవారుజామునే వచ్చి నాటకీయంగా అరెస్టు చేయాల్సిన అగత్యం ఏమొచ్చింది?

* వారెంట్ లేకున్నా సెర్చి చేసే అధికారం సీబీఐకి ఉండొచ్చు. అయితే అధికారం ఉండటానికి, దాన్ని ఉపయోగించటానికి చాలా తేడా ఉంది. సునీల్ ఏ కేసులోనూ నిందితుడు కాదు. అలాంటి వ్యక్తి విషయంలో సీబీఐ ఈ అధికారాన్ని ఎందుకు ఉపయోగించింది? విల్లా అమ్మకాల్లో అందుకున్న సొమ్మును సునీల్ మాయం చేస్తారన్న ఉద్దేశంతో ఇలా చేశామంటున్న సీబీఐ మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చు?

* ఎక్కడైనా సెర్చి చేయాలంటే ముందు సమన్లిస్తారు. తర్వాతే సెర్చి. లేదంటే సెర్చి చేశాకయినా సమన్లిస్తారు. ఇక్కడ ఆ రెండూ లేవు. సరికదా, ఒక వ్యక్తిని తీసుకెళుతున్నప్పుడు, ఎక్కడికనే కనీస సమాచారాన్ని ఇంట్లో వారికివ్వాలన్న నిబంధననూ పాటించలేదు. ఇంట్లో మహిళలు వచ్చి అడిగితే తప్ప వారికీ వివరాలు తెలియని దుస్థితి! ఇలాంటి సీబీఐకి, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ అనే భుజకీర్తులు తగుతాయా?

* రంగారావు సాక్ష్యమిచ్చాక దానిపై విచారించడానికి సునీల్‌ను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పిలవలేదు. పిలిస్తే విచారణకు రాని పరిస్థితులేవీ లేవు కూడా. మరి విచారణ కూడా చేయకుండా నేరుగా ఎందుకు అరెస్టు చేసినట్టు? ఒక సాక్షి వెళ్లి ఏ చంద్రబాబు పేరో, సోనియాగాంధీ పేరో చెబితే వారిని విచారణ కూడా చేయకుండా ఇలాగే నేరుగా అరెస్టు చేసేస్తారా?

* మధ్యాహ్నం 1.30కి సెర్చి ముగిసిందని చెప్పి.. సాయంత్రందాకా రికార్డులివ్వలేదు. మధ్యాహ్నమే అరెస్టును ప్రకటిస్తే వెంటనే మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. ఉదయం నుంచీ హైడ్రామాలాడి, రాత్రికి అరెస్టు ప్రకటించారు. దీన్ని ఏమనుకోవాలి? ముందే ఒక నిర్ణయానికి వచ్చి.. తన రాజకీయ ఎజెండా ప్రకారం సునీల్‌ను అరెస్టు చేయాలనే నిర్ణయంతోనే సీబీఐ ఇదంతా చేసిందని స్పష్టంగా బయటపడటం లేదా?

* తెల్లవారుజామున అరెస్టు చేసే సమయానికి సీబీఐతో పాటు ఒక చానల్ ప్రతినిధి కూడా అక్కడికి వచ్చేశారు. సీబీఐ నిత్యం చేయబోయే పనిని లీకు చేస్తున్న ఆ చానల్ మాత్రమే అక్కడెలా ప్రత్యక్షమైందనేది సీబీఐ అధికారులకే కాదు, సీబీఐ తీరును గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనే అనుకోవాలి.

వివిధ సెక్షన్ల కింద కేసు: సునీల్‌పై ఐపీసీ 120(బి), 420, 477, 409, 406 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. 

కొలాబరేషన్ ముసుగులో 2003 ఆగస్టు 19న ఎమ్మార్-ఏపీఐఐసీ మధ్య చంద్రబాబు చేసిన ఈ బరితెగింపు ఒప్పందానిదే మొత్తం కుంభకోణంలో కీలక పాత్ర. దీని ప్రకారం విల్లాలకు సంబంధించి థర్డ్ పార్టీతో ఎమ్మార్ ఎలాంటి ఒప్పందమైనా చేసుకోవచ్చు. సదరు థర్డ్ పార్టీ వాటిని ఎంతకు అమ్ముకున్నా ఎమ్మార్‌కు ఏ సంబంధమూ ఉండదు! అలా థర్డ్ పార్టీ ముసుగులో రంగప్రవేశం చేసిన స్టైలిష్ హోమ్స్.. చదరపు గజానికి రూ.5,000 ఎమ్మార్‌కు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. తర్వాత 285 ఎకరాల్లో ఉన్న ఈ విల్లాలను కళ్లు చెదిరే మొత్తాలకు అమ్ముకుని ఖజానాకు తూట్లు పొడిచింది. ఇలాంటి స్టైలిష్ హోమ్స్‌కు యజమాని... కోనేరు ప్రసాద్! ఎమ్మార్‌ను తేవడం నుంచి ‘స్టైలిష్’గా కొల్లగొట్టడం దాకా అన్నిం ట్లోనూ పాత్రధారి అతనే కాగా... సూత్రధారేమో నారా బాబు! ఆ డబ్బును కోనేరు తన కొడుకు ఖాతాల్లోకి తరలించినట్టు సీబీఐ అధికారులే చెబుతున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు ఖాతాల్లోకి ఆయన తరలించినట్టు ఆరోపణలున్నాయి.
Share this article :

0 comments: