తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు

తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012

* తప్పు జరిగిందా లేదా అన్నది నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు
* ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది నేను కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే ఈ కేసు ఉండేది కాదు 
* విజయసాయిరెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు.. సీబీఐ అంటేనే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. 
* ఓ మంత్రి వేసిన పిటిషన్‌కు టీడీపీ జతకలిసింది.. చక్కగా మేనేజ్ చేశారు..
* కోర్టు ప్రభుత్వం అనే మాట ఉపయోగిస్తే.. ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ దానికి బదులుగా నా తండ్రి పేరును చేర్చింది

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయంటేనే వాటి వెనుక రాజకీయ ఉద్దేశం అర్థమవుతోందన్నారు. తాను కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే ఇవేవీ ఉండేవి కాదన్నారు. ‘‘తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు. నన్ను ఎలా ఇరికించాలా అన్న కోణంలోనే దర్యాప్తు జరుగుతోంది. ఇన్వెస్టర్లను పిలిచి విచారిం చడం, వారిని బెదిరించడం, వేధించడం.... వారు చే యని దానిని చేసినట్లు అంగీకరించండని ఒత్తిడి తెస్తున్నారు. ఇలా చేయని దానిని చేసినట్లు చెప్పాలని ఒత్తిడి తేవడం ఇదే తొలిసారి. ఇంతటి అన్యాయంపై దేవుడే తీర్పిస్తాడు. నేను దేవుడిని నమ్ముతాను’’ అని చెప్పారు. బుధవారం ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ ఏమన్నారంటే..

‘‘సీబీఐ గురించి మేము మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నాం. సీబీఐ ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ కాదు. అది కాంగ్రెస్ దర్యాప్తు సంస్థ. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. సీబీఐ అంటేనే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆ పార్టీ చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి మొత్తం ప్రపంచానికి ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు రెండేళ్ల కిందట ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న (రాజశేఖరరెడ్డి) వ్యక్తిపైన కోర్టుకెళ్లారు. రిట్ పిటిషన్‌కు టీడీపీ కూడా జతకలిసింది. మొత్తం విషయాన్ని చక్కగా మేనేజ్ చేశారు. అంతిమంగా అది ఎలాంటి ఫలితాలివ్వాలో అదే ఇచ్చింది. 

ప్రభుత్వం అనే మాటను ఉపయోగిస్తూ కోర్టు ఆదేశమిచ్చింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రభుత్వం అనే మాటను తొలగించింది. ఎందుకు? ప్రభుత్వం అనే పదం స్థానంలో నా తండ్రి పేరును చేర్చారు. దీన్నిబట్టి మరొకరి ప్రయోజనాల కోసం సీబీఐ కక్షతో వ్యవహరిస్తుందనే విషయం అర్థమవుతుంది. నా తండ్రి రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతకాలం అత్యంత గౌరవప్రదమైన ముఖ్యమంత్రి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు కూడా ఆయన అత్యంత గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీలో అకస్మాత్తుగా ఆయన గౌరవం తగ్గిపోయింది’’ అని జగన్ చెప్పారు. 

‘‘న ల్లధనం అనే మాటకు సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. సీబీఐ చెబుతున్న దాంట్లో కొత్తదనమేమీ లేదు. నా పత్రిక, మీడియా హౌస్‌లోకి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కొత్తదేమీ కాదు. నా తండ్రి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆ రికార్డులు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ పాన్ నంబర్లున్నాయి. నా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవరకు వారి ఇన్వెస్ట్‌మెంట్లు గౌరవప్రదమైనవే. నా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ పెట్టుబడుల రంగు మారదు కదా? ఒక్క అంశాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నిబంధనలకు విరుద్ధంగా నా తండ్రి ఎవరికైనా మేలు చేసి ఉంటే క్విడ్ ప్రో కో అనే మాట వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే... సాక్షి పత్రిక ఈ దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) ప్రకారం 1.40 కోట్ల మంది పాఠకులున్నారు. ఏబీసీ గణాంకాల ప్రకారం 14.5 లక్షల కాపీల సర్క్యులేషన్ ఉంది. ఇదేమీ గాలి వాటం కంపెనీ కాదు. 

సాక్షి పెట్టుబడులు సమీకరించడానికి మూడు నెలల ముందు అలాంటి పత్రికే అయిన ఈనాడు విలువను రూ.6,700 కోట్లుగా లెక్కగట్టారు. నిమేష్ కంపానీ నుంచి రూ.2,600 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. వంద రూపాయల ఈనాడు షేర్‌ను రూ5.28 లక్షలకు అమ్మారు. ఆ సమయంలో సాక్షి విలువను రూ.3,500 కోట్లుగా లెక్కకట్టారు. ఈనాడు విలువలో ఇది సగం. ఈనాడులాగే సాక్షికి సర్క్యులేషన్, రీడర్‌షిప్ ఉన్నాయి. ఏ ప్రమాణాల ప్రకారం తీసుకున్నా సాక్షి.. ఈనాడు స్థాయిలోనే ఉంది. ఈనాడు విలువకంటే సగం ధరకు లభిస్తున్నప్పుడు మీరు పెట్టుబడి పెట్టరా? 

ప్రభుత్వంలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోరు. మొత్తం కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. మీకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలంటే కేబినెట్ అనుమతి ఉండాలి. ఏ ఒక్క వ్యక్తికో ఆ నిర్ణయాన్ని మీరు ఆపాదించలేరు. మొదట మీరు (సీబీఐ) చేయాల్సిందేమిటి? నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అన్నది తేల్చాలి. నా తండ్రి ముందున్నవారు ఏం చేశారో ఆయన కూడా అదే చేశారు. వారు చేసిన దానిలో తప్పు లేనప్పుడు నా తండ్రి చేసినది ఎలా తప్పవుతుంది? ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరగడంలేదు. నన్ను ఎలా ఇరికించాలా అన్న కోణంలోనే దర్యాప్తు జరుగుతోంది’’ అని అన్నారు.

Share this article :

0 comments: