లక్షలాది మంది విద్యార్థుల ఘోష ఇది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్షలాది మంది విద్యార్థుల ఘోష ఇది

లక్షలాది మంది విద్యార్థుల ఘోష ఇది

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012

* ఫీజులు విడుదల చేయండి.. లక్షలాది మంది విద్యార్థుల ఘోష ఇది
* నాడు విద్యార్థుల పరిస్థితి ప్రభుత్వానికి చెప్పడానికి వారం రోజుల దీక్ష చేశాను
* ఏడాది గడిచినా అదే దుస్థితి.. విద్యా సంవత్సరం పూర్తయిపోతున్నా ఫీజులివ్వరా!
* ఫీజుల బకాయిలు లేవంటూ సీఎం అబద్ధాలాడుతున్నారు
* కానీ, గతేడాది స్కాలర్‌షిప్పులే ఇవ్వలేదని విద్యార్థులు చెప్తున్నారు
* నిలదీయాల్సిన ప్రతిపక్ష స్థానంలో బాబు ఉండడం మన దౌర్భాగ్యం

ఒంగోలు, న్యూస్‌లైన్: ఓ వైపు మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు చెల్లించకుండా రాష్ట్ర సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఏడాది కిందట ఇలాగే సర్కారు బకాయిలు చెల్లించకపోవడంతో రంగారెడ్డి జిల్లాలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు చెల్లించలేక, తల్లిదండ్రులకు తన అవస్థలు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ వేళ విద్యార్థుల అవస్థలు ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు తాను హైదరాబాద్‌లో ఏడు రోజులపాటు నిరాహార దీక్ష చేశానని గుర్తుచేశారు. అయితే ఏడాది గడిచినా అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 

ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు వెంటనే చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన ‘ఫీజు పోరు’లో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో జగన్‌మోహన్‌రెడ్డిమాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఈవేళ ఇక్కడ వేల మంది.. కాదు.. లక్షల మంది ఒక్కటై.. మా గోడు పట్టించుకోండి.. మా ఫీజులు గురించి పట్టించుకోండని నినదిస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థులపై దయచూపండి’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్కారు ఫీజులు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్న విద్యార్థుల పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ ఫీజు పోరు ధర్నా చేపట్టామన్నారు. మిగతా ప్రసంగం ఆయన మాటల్లోనే..

గతేడాది స్కాలర్‌షిప్పులే ఇవ్వలేదు..
‘ఇవాళ ఒకటి.. రెండు.. మూడు.. ఆరు సెమిస్టర్లు పూర్తయిపోయినా ఈ సర్కారు ఫీజులు చెల్లించలేదు. ఈ సంవత్సరమైనా ఫీజులు అందుతాయా అంటే.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఇక్కడకు(ధర్నాకు) వచ్చిన పిల్లలు చెప్తున్నారు. అన్నా గత సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్పులు కూడా అందలేదని! ఇలా అయితే విద్యార్థుల చదువులు సాగేదెలా? పేదరికం పోవాలంటే... కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్‌లాంటి పెద్ద చదువులు చదవాలని ఆ వేళ ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. పెద్ద చదువులు చదివేందుకు కులం, మతం, రాజకీయ పార్టీలు అడ్డురాకూడదని కలలు కన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఫీజులకు సంబంధించి అనుసరిస్తున్న వైఖరి చూస్తే బాధనిపిస్తోంది’.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రకటన..
‘ఈ వేళ ప్రభుత్వం నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసింది. లక్షల మంది చూస్తున్నారనే జ్ఞానం కూడా లేకుండా.. సీఎం అబద్ధాలాడారు. ఫీజుల బకాయిలు లేవన్నారు. ఈ సీఎంకు, ఈ సీఎంను నడిపిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు పేద విద్యార్థుల బాధలు అర్థంకావడం లేదు. ప్రభుత్వ పెద్దలారా నేడు అడుగుతున్నా... ఫీజులకు సంబంధించి ఆ వేళ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వంద రోజుల్లోనే చనిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే పాలించారు. వైఎస్ బతికున్నపుడు 2009-10 సంవత్సరంలో ఫీజులకు సంబంధించి బడ్జెట్‌లో రూ.2,333 కోట్లు కేటాయించారు. ఆయన మరణించాక ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పెద్దలు ఆ బడ్జెట్‌లో విడుదల చేసింది కేవలం రూ.1,686 కోట్లు. 

2010-11 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఫీజుల పథకానికి రూ.2,726 కోట్లు కేటాయించారు. కానీ ఇచ్చింది రూ. 999 కోట్లు మాత్రమే. 2011-12 బడ్జెట్‌లో రూ.2,913 కోట్లు కేటాయించారు. కానీ ఆ నిధులు ఎందుకు ఇవ్వలేదు? నిధులు విడుదల చేయకపోతే బకాయిలు ఉంటాయని మీకు తెలియదా? ప్రతి పేదవాడినీ చదివించాలని, పేదరికాన్ని పోగొట్టాలని మహానేత తలపెట్టిన గొప్ప కార్యక్రమాన్ని ఈ పాలకులు పక్కదారి పట్టిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కట్టడి చేయాలనే ఆలోచన చేస్తున్నారు’.

ప్రతిపక్షంలో చంద్రబాబు ఉండడం మన దౌర్భాగ్యం..
‘ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే బాధనిపిస్తోంది. పేద విద్యార్థుల బాధలు, రైతుల కష్టాలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం వైపు చూస్తే అక్కడ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉండటం మన దౌర్భాగ్యం. పిల్లల చదువులు, రైతన్నల కష్టాలు చంద్రబాబుకు కనిపించవు. ఆయనకు ఒకే ఒక వ్యక్తి కనపడతారు. ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి. నిజంగానే రాజశేఖరరెడ్డి గొప్ప వ్యక్తని చెప్పాలి. కారణం చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు కాలేజీలకు వెళ్ళారు. నేను టీవీలో చూశాను. అక్కడ చంద్రబాబు... అవినీతి గురించి విద్యార్థులకు క్లాస్ పీకారు. నేను అడుగుతున్నాను. చంద్రబాబూ నీ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఏనాడైనా... ఒక్క రోజైనా పిల్లల దగ్గరకు వెళ్లాలని, చదువులు గురించి తెలుసుకోవాలని, పిల్లల్ని చదివించేందుకు వారి తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు తెలుసుకోవాలని అనిపించలేదా?’

ప్రజలను మోసం చేసేందుకే నాడు బాబు అవిశ్వాసం..
‘ఇవ్వాళ చంద్రబాబుకు, ఈ ప్రభుత్వ పెద్దలకు ఈ పరిస్థితులు అర్థం కావు. జగన్ అనే మనిషిని, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే వీరి ఆలోచనంతా. పేదలు, రైతుల సమస్యలు వీరికి పట్టవు. మొన్న గుంటూరు ఓదార్పుయాత్రలో ఉన్నపుడు.. ప్రభుత్వం పడిపోదని తెలిసి చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకే అవిశ్వాసం పెడుతున్నారని నాకు తెలుసు. నాతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఈ పరిస్థితి తెలుసు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టేందుకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారు. ఇది తెలిసీ ఎమ్మెల్యేలతో ఒక మాట చెప్పాను. ‘ప్రజలు చూస్తున్నారు. విశ్వసనీయతకు విలువలకు రాజకీయాల్లో విలువలేకుండా పోయింది. రైతు కూలీలు, రైతులు, విద్యార్థులకు కష్టాలు, బాధలు ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉండా’లని చెప్పాను. 

నా మాట మేరకు 17 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. తమ ఓటుతో ప్రభుత్వం పడిపోదని, తమ ఓటుతో డిస్‌క్వాలిఫై అవుతామని, తమ ఓటుతో ఉప ఎన్నికలు వస్తాయని తెలిసీ.. రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం, పేద విద్యార్థులు, రైతుల కోసం అవిశ్వాసానికి వారు మద్దతు పలికారు. అటువంటి ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యే(బాలినేని శ్రీనివాసరెడ్డిని చూపిస్తూ) ఒకరని చెప్పటానికి గర్వంగా ఉంది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రతి రైతు, పేదవారు ఒక వైపు ఉంటే.. కుళ్ళు కుతంత్రాలు మరో వైపు ఉండి పోటీపడతాయి’.

సీఎం అంటే సీఈవో కాదు..
‘ఒక్కటైతే చెప్తున్నా... రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పేద విద్యార్థుల బాధలు పట్టించుకోవాలి. సీఎం అంటే సీఈవో కాదు... సీఎం అనే వాడు ప్రజల గుండె చప్పుడు వినాలి. చంద్రబాబు నాయుడికి, కిరణ్‌కుమార్‌రెడ్డికీ ఇద్దరికీ చెప్తున్నా.. ప్రజల బాధలు, పేద విద్యార్థుల బాధలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని, మేలు చేయాలని కోరుతున్నా’.

జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
మధ్యాహ్నం 2.04 గంటలకు ప్రసంగం ప్రారంభించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2.19 నిమిషాలకు వరకు మాట్లాడారు. అనంతరం 2.33 నిమిషాలకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృసింహాన్ని కలిసి.. ఫీజుల నిధులు వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. జగన్‌తో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్సీ రహమాన్, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, దారా సాంబయ్య, జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, బాచిన చెంచు గరటయ్య, జెడ్పీ మాజీ చైర్మన్లు ముక్కు కాశిరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: