విజయమ్మకు అందని న్యాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మకు అందని న్యాయం

విజయమ్మకు అందని న్యాయం

Written By ysrcongress on Tuesday, January 17, 2012 | 1/17/2012

సుప్రీంకోర్టు సూచనలను గౌరవిస్తూ.. 
బాబు అక్రమాస్తుల కేసు బదిలీ పిటిషన్ ఉపసంహరణ
బాబు బృందం నాట్‌బిఫోర్ నాటకాలను సుప్రీంకోర్టు ముందుంచిన విజయమ్మ న్యాయవాదులు
పిటిషన్‌లోని అంశాలను ఎక్కడా తప్పుబట్టని సుప్రీం
సానుకూల ఉత్తర్వులిస్తే న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తింటుందన్న కారణంతోనే ఉపసంహరణకు సూచన
లేదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజకీయాలకు అతీతంగా విచారించే బెంచ్ లేదనుకుంటారు
న్యాయవ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది...
అందుకే ఉపసంహరించుకొమ్మంటున్నామన్న సుప్రీం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ‘‘మీరు చేస్తున్న అభ్యర్థనను మన్నిస్తూ మేం సానుకూల ఉత్తర్వులిస్తే, ఈ వ్యాజ్యాన్ని రాజకీయాలకు అతీతంగా విచారించే ధర్మాసనమేదీ హైకోర్టులో లేదనే సందేశాన్ని పంపినట్టవుతుంది. అది న్యాయవ్యవస్థ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని చెబుతున్నాం’’
- జస్టిస్ చౌహాన్, జస్టిస్ ఠాకూర్‌ల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం

చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసును నిష్పాక్షిక విచారణ కోసం మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు సూచనలను గౌరవిస్తూ సోమవారం ఆమె ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే వాదనలు విని, తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో తాము ఎలాంటి ఆదేశాలూ జారీ చేసేందుకు ఆస్కారం లేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతో ఏకీభవిస్తూ ఒకవేళ తామేవైనా ఆదేశాలు జారీ చేస్తే, అది న్యాయవ్యవస్థ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

బాబు, ఆయన బినామీలు ‘నాట్‌బిఫోర్’ నాటకాలతో కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల నిష్పాక్షిక విచారణ కోసం అక్రమాస్తుల కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ విజయమ్మ గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. మొదట ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ దల్వీర్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించేందుకు సిద్ధమైంది. రిలయన్స్ కేసులను విచారించబోనని గతంలో చెప్పారన్న ఆ సంస్థ తరఫు న్యాయవాది వ్యాఖ్యలతో ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ భండారీ తప్పుకున్నారు. దాంతో కేసు విచారణ బాధ్యతలను జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌లతో కూడిన ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా అప్పగించారు. ఆ ధర్మాసనం సోమవారం విజయమ్మ పిటిషన్‌ను విచారించింది. విజయమ్మ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సుశీల్‌కుమార్ వాదనలు విన్పించారు. హైకోర్టులో బాబు అక్రమాస్తుల కేసు విచారణ క్రమాన్ని తొలుత ధర్మాసనానికి వివరించారు. ‘‘మొదట ఈ కేసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.లోకూర్ ముందు విచారణకు వచ్చింది. అనూహ్యంగా రిలయన్స్ సంస్థ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో, రిలయన్స్‌లో వాటాలున్న కారణంగా జస్టిస్ లోకూర్ విచారణ నుంచి తప్పుకున్నారు. తరవాత ‘నాట్‌బిఫోర్’ వల్ల కేసు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. దీనిపై మేం అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ నుంచి ఆయన తప్పుకున్నారు. తరవాత కేసు జస్టిస్ రోహిణి ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది’’ అంటూ రోహత్గీ వివరిస్తుండగా జస్టిస్ చౌహాన్ జోక్యం చేసుకున్నారు.

రెండేళ్ల క్రితం తనకూ రిలయన్స్‌లో వాటాలుండేవన్నారు. దానివల్ల ఇప్పుడేమైందని వ్యాఖ్యానించారు. ఈ ధర్మాసనం కేసును విచారించేందుకు తమకెలాంటి అభ్యంతరమూ లేదని రోహత్గీ స్పష్టం చేశారు. ఇదే ధర్మాసనం కేసును విచారించాలని కోరగా మళ్లీ ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘ మీరు (పిటిషనర్) లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవి. ఇందులో ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ విశ్వసనీయత ముడిపడి ఉంది’ అని వ్యాఖ్యానించింది. రోహత్గీ స్పందిస్తూ ప్రతివాదులు (బాబు తదితరులు) పక్కా వ్యూహం, పథకం ప్రకారం న్యాయవ్యవస్థకు కీడు చేసే ‘నాట్‌బిఫోర్’ విధానాన్ని అమలు చేశారని వివరించారు. దాంతో పలు ధర్మాసనాలు ఈ కేసును విచారించలేకపోయాయని తెలిపారు. ‘‘ప్రతివాదుల తరఫున నాట్‌బిఫోర్‌గా వకాలత్ దాఖలు చేసిన న్యాయవాది, కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తుల వద్ద గతంలో జూనియర్‌గా పని చేయలేదు. పైగా వారి బంధువు కూడా కాదు. కేవలం తన ప్రవర్తన కారణంగా ఆ న్యాయమూర్తుల ముందు నాట్ బిఫోర్‌గా మారారు’’ అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ సమయంలో ధర్మాసనం మళ్లీ జోక్యం చేసుకుంది. ‘‘మీ అభ్యర్థనను మన్నిస్తూ మేం సానుకూల ఉత్తర్వులు జారీ చేస్తే, ఈ వ్యాజ్యాన్ని రాజకీయాలకతీతంగా విచారించే ధర్మాసనమేదీ హైకోర్టులో లేదనే సందేశాన్ని పంపినట్టవుతుంది. అది న్యాయవ్యవస్థ ప్రతిష్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. న్యాయవ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముఖ్యమైనది. అక్రమాస్తుల కేసులో హైకోర్టు ధర్మాసనం వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. కాబట్టి ప్రస్తుత పిటిషన్‌పై మేమేమీ చేయలేం’’ అని తేల్చి చెప్పింది. ఈ కేసులో గతంలో జరిగిన పరిణామాలను జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారా అంటూ ప్రశ్నించింది. డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరిగిన వాదనల్లో తాను అన్ని అంశాలనూ వివరించానని సుశీల్‌కుమార్ బదులిచ్చారు. ‘‘కానీ విచారణను కొనసాగించేందుకే ధర్మాసనం మొగ్గు చూపింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ధర్మాసనమిచ్చిన గత ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ డిసెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. మా వాదనలను పూర్తిస్థాయిలో వినకుండానే ఈ ఉత్తర్వులిచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేం రాతపూర్వకంగా నివేదన చేశాం’’ అని వివరించారు. దాంతో ధర్మాసనం కల్పించుకుని, ‘‘మీరు కోరుతున్నట్టుగా ఈ కేసును పొరుగు హైకోర్టులకు బదిలీ చేస్తే, అక్కడ కూడా అదే (నాట్ బిఫోర్) విధానాన్ని అనుసరించరని నమ్మకమేమిటి? మా జూనియర్లు మా ముందు వాదనలు వినిపిస్తే ఆ కేసు నుంచి న్యాయమూర్తులం తప్పుకున్న ఘటనలు చాలా ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసు విషయంలో హైకోర్టులో జరిగిన తీరును గమనించాలని రోహత్గీ సమాధానమిచ్చారు. 

నాట్ బిఫోర్ విధానాన్ని అడ్డంపెట్టుకుని, న్యాయమూర్తులను అశక్తులను చేశారని వివరించారు. హైకోర్టులో వాదనలు పూర్తై, తీర్పును వాయిదా వేసిన ఈ దశలో తాము ఎలాంటి ఉత్తర్వుల జారీ చేయగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘మీరు మళ్లీ అయినా ఇక్కడికి (సుప్రీంకోర్టుకు) రావచ్చు. దయచేసి న్యాయవ్యవస్థ విశ్వసనీయతను చూడండి. మిస్టర్ రోహత్గీ! మీ అనుభవంలో మీరు ఇలాంటి వాటిని, ఇంతకు మించిన వాటిని చూసి ఉంటారు. అందుకే మీరీ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోండి. ఇది న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించింది’’ అని వ్యాఖ్యానించింది. దాంతో ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ధర్మాసనానికి రోహత్గీ తెలిపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్న ధర్మాసనం, అందులోని అంశాలను ఎక్కడా తప్పుబట్టలేదు. మరో హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఏకైక కారణంతోనే ఉపసంహరణకు ఆదేశాలిచ్చింది.
Share this article :

0 comments: