కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్ మేరకే సాయిరెడ్డి అరెస్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్ మేరకే సాయిరెడ్డి అరెస్టు

కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్ మేరకే సాయిరెడ్డి అరెస్టు

Written By ysrcongress on Tuesday, January 3, 2012 | 1/03/2012

*అసలు కారణం రాజకీయమే!
*కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్ మేరకే సాయిరెడ్డి అరెస్టు
*జగన్ కేసుపై చిదంబరంతో ఇటీవలే కిరణ్ చర్చలు
*ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీబీఐ జేడీ భేటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: విజయసాయిరెడ్డి అరెస్టు వెనుక ఢిల్లీ స్థాయిలో పెద్ద కథే నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. 7 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండటం, మరో 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ను ఏదోలా ఇరుకున పెట్టే యత్నంలో భాగంగా, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన, కేంద్ర హోం మంత్రి చిదంబరంతో ఆయన చర్చల పర్యవసనంగానే ఈ అరెస్టు చోటుచేసుకుందన్న వాదన విన్పిస్తోంది. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని కోరుతూ విజయసాయిరెడ్డి కొద్ది రోజుల కిందట ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం తెలిసిందే. నిజానికి కేసు విచారణలో ఆయన సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 30 సార్లు సీబీఐ ముందు హాజరయ్యారు. క్రమం తప్పకుండా విచారణకు హాజరవుతున్నప్పటికీ ఆకస్మాత్తుగా సోమవారం రాత్రి ఆయనను అరెస్టు చేయడం వెనుక రాజకీయమైన ఒత్తిళ్లు పని చేశాయని తెలుస్తోంది.

అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే జరగబోయే ఉప ఎన్నికలు ఇటు కాంగ్రెస్‌కు, అటు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయని ఆయా పార్టీల నేతలే అంగీకరిస్తున్నారు. రెండేళ్లుగా పలు అంశాల్లో కాంగ్రెస్‌తో టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్న వైనాలన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ బయటపెడుతుండటం కూడా వారికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఉపఎన్నికల నేపథ్యంలో జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యం, ఒత్తిళ్ల కారణంగానే అరెస్టు జరిగిందని చెబుతున్నారు. ఏడాదిగా సొంత పార్టీ తలనొప్పులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న పెను సవాళ్ల నేపథ్యంలో తాజాగా సీఎం ఢిల్లీలో చిదంబరంతో సుదీర్ఘంగా చర్చించిన క్రమంలో వ్యూహాత్మకంగానే సాయిరెడ్డి అరెస్టు దిశగా అడుగులు పడినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి రెండు రోజుల ముందే సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. 


వైఎస్ మరణం నుంచీ వేధింపులే...
మహానేత వైఎస్సార్ మరణం నుంచి మొదలుపెడితే... ఆయన తనయుడిగా జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు ఆది నుంచీ అడ్డంకులే ఎదురయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో పాటు అధిష్టానంతో పొసగని పరిస్థితులు సృష్టించింది. కాంగ్రెస్‌కు జగన్ రాజీనామా చేయటంతో వేధింపులు మరీ పెరిగాయి. అయినా ఎదురొడ్డి నిలిచి... వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించి.... కడప లోక్‌సభ స్థానంలో తాను, పులివెందుల అసెంబ్లీ సీట్లో తన తల్లి పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఇలాగైతే తామెన్నటినీ జగన్‌ను గెలవలేమని భావించిన కాంగ్రెస్-టీడీపీ ఒక్కటై ఎన్నో కుయత్నాలు చేశాయి. 

ప్రభుత్వం పడిపోయే పరిస్థితులున్నపుడు అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినా పట్టించుకోని టీడీపీ, ప్రభుత్వం పడిపోదని స్పష్టమయ్యాక మాత్రమే అవిశ్వాసం పెట్టింది. ఒకవేళ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టవచ్చని భావించింది. కానీ వారు తమ పదవుల్ని గడ్డిపరకల్లా తీసేసి... ప్రభుత్వం పడిపోదని తెలిసినా... తమ ఓటువల్ల తమ పదవులే పోతాయని తెలిసినా... ధైర్యంగా నిలబడ్డారు. విప్‌ను ధిక్కరించినందున వారి శాసనసభ్యత్వాలను రద్దు చేయాలి. అప్పుడు ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. కాకపోతే ఇప్పుడు జగన్ ప్రభంజనం వీస్తోందని, 17 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయఢంకా ఖాయమని సర్వేలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. 

దీంతో భయం పట్టుకున్న కాంగ్రెస్... ఎలాగైనా జగన్‌ను నిలువరించాలని ప్రయత్నిస్తోందని, అందుకోసం ఎంతకైనా తెగించవచ్చన్నది విశ్లేషకుల మాట. అందులో భాగంగా జగన్‌ను, ఆయనతో కలిసి నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను భయభ్రాంతుల్ని చేయటానికే సాయిరెడ్డిని అరెస్టు చేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘200 గంటలు విచారించి కూడా రాబట్టలేని కొత్త విషయాలనేమైనా సాయిరెడ్డి నుంచి ఇపుడు రాబడతారా? ఎందుకీ అరెస్టు?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడొకరు ప్రశ్నించటం ఈ సందర్భంగా గమనార్హం. ఇవన్నీ చూస్తే అరెస్టుకు అసలు కారణం రాజకీయమేనన్నది ఎవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది.





విజయసాయిరెడ్డి అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉం దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకే సీబీఐ ఈ అరెస్టు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకేసీబీఐ ఉపయోగపడుతోందనడానికిది నిదర్శనమన్నారు. 

‘‘జగన్ తనపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా, ఎల్లో మీడియా అడ్డగోలు రాతలపైనా ‘ఏది నిజం?’ శీర్షికన ఎప్పటికప్పుడు సమాధానాలిచ్చారు. అయినా సాక్షి మీడియా గొంతు నొక్కే యత్నంలో భాగంగా విజయసాయిరెడ్డి అరెస్టు జరిగింది. నిజానికి సీబీఐ కొద్ది రోజులుగా పరిధి దాటి వ్యవహరిస్తోందంటూ ఆయన ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. సంస్థ స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలని కోరుతూ వచ్చా రు’’ అని పద్మ గుర్తు చేశారు. నెలల తరబడి విజయసాయిరెడ్డిని పిలిపించుకుని విచారణ జరిపిన సీబీఐ, ఆధారాలూ లేకున్నా ఆయనను అరెస్టు చేసిందన్నారు.
Share this article :

0 comments: