జూడాల సమ్మె ఉధృతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జూడాల సమ్మె ఉధృతం

జూడాల సమ్మె ఉధృతం

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012


గాంధీ ఆస్పత్రిలో అదనపు డీఎంఈ ఘెరావ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు(జూడా) చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. అధికారుల ఘెరావ్‌లు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గాంధీ ఆస్పత్రి ఆవరణ శనివారం దద్ధరిల్లింది. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసేందుకు వెనుకాడేది లేదని ఈ సందర్భంగా జూడాలు హెచ్చరించారు. గాంధీలోని దీక్షాశిబిరం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న జూడాలు ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీక్షల్లో కూర్చున్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం పట్ల ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పేషీల వద్ద బైఠాయించారు. ఆ సమయంలో సంబంధిత అధికారులు లేకపోవడంతో ఆగ్రహం పట్టలేని జూడాలు వారి కుర్చీలను పేషీనుంచి ఎత్తుకొచ్చారు. ‘చేతకాక పారిపోతున్నాం..’ అంటూ ఆ కుర్చీలపై రాశారు. ఈ విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మసూద్, ఆర్‌ఎంఓ వసంతలు దీక్షా ప్రాంగణం వద్దకు చేరుకోగానే జూడాలు వారిని చుట్టుముట్టారు. దీక్షలు చేపట్టి నాలుగురోజులైనా వైద్య పరీక్షలు ఎందుకు చేపట్టడంలేదని నిలదీశారు. దీక్షలు చేపట్టిన వారిలో ఉస్మానియా కళాశాలకు చెందిన కె.రవికుమార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రి వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. అతడికి షుగర్, బీపీ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి 7.30 గంటలకు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డుకు రవిని తరలించి వైద్యచికిత్సలు నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకు దీక్షను విరమించేదిలేదని ఐసీయూలో చికిత్స పొందుతున్న రవి స్పష్టం చేశారు.

నేటినుంచి అత్యవసర సేవలు బంద్: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందని, తక్షణం స్పందించకుంటే ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అత్యవసరసేవలు బంద్ చేసి, మెడికల్ కళాశాలలవద్ద ఆమరణదీక్షలు చేపడతామని జూడాల సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. దీక్షలు చేపట్టి నాలుగురోజులైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అడిషినల్ డీఎంఈ ఘెరావ్: శనివారం సాయంత్రం దీక్షాశిబిరం వద్దకు వచ్చిన అడిషినల్ డీఎంఈ మోహనరావును జూడాలు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. రెండు గంటలపాటు దీక్షాశిబిరం వద్ద కూర్చోబెట్టారు. వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ఫోన్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీతో అడిషినల్ డీఎంఈ మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో జూడాలు ఆయనను అక్కడ్నుంచి కదలనివ్వలేదు.

పలువురి మద్దతు: జూడాలు చేపట్టిన దీక్షలకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా ఓ డాక్టర్ ఉండి కూడా జూడాల సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేయడం సిగ్గుచేటని ఈటెల విమర్శించారు. తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు రమేష్, ప్రవీణ్, ఎమ్మెల్సీ నాగేశ్వరరావులు జూడాలకు మద్దతు పలికారు.
Share this article :

0 comments: