భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల

భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల

Written By ysrcongress on Friday, January 20, 2012 | 1/20/2012

*విద్యుత్ సర్దుబాటు చార్జీలపై సీఈఆర్‌సీ ఆదేశాలు
*డిస్కంల నుంచి నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని ఈఆర్‌సీలకు సూచన
*డిస్కంలు సమర్పించకుంటే సుమోటోగా తీసుకోవాలని స్పష్టీకరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) భారం విద్యుత్ వినియోగదారులపై ఇక ఏ నెలకానెల పడనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) కొద్దిరోజుల క్రితం రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్‌సీలు) ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) నుంచి ఇకపై నెలవారీగా ప్రతిపాదనలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోతే.... సుమోటాగా ప్రతిపాదనలు తీసుకుని ఆదేశాలు జారీ చేయాలని కూడా సీఈఆర్‌సీ ఆదేశించింది. 

ప్రస్తుతం సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను మూడు నెలలకు ఒకసారి డిస్కంలు సమర్పిస్తున్నాయి. ఉదాహరణకు.... ఏప్రిల్-జూన్ త్రైమాసికపు ప్రతిపాదనలను జూలై చివరినాటికి సమర్పిస్తున్నాయి. అయితే సీఈఆర్‌సీ తాజా ఆదేశాల నేపథ్యంలో... ఏప్రిల్ నెలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు మే మొదటి వారంలోనే సమర్పించాల్సి ఉంటుంది. వీటిపై మే చివరినాటికి ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు సర్దుబాటు భారం జూన్ నెల బిల్లులోనే వినియోగదారులపై పడుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు అంటే ఏ నెలకానెల బిల్లులో సర్దుబాటు చార్జీలు విధిస్తారన్నమాట.

పొంచి ఉన్న మరో రూ. 5 వేల కోట్ల భారం
రెండు రోజుల క్రితం 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.3 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ఈఆర్‌సీ రాష్ట్ర వినియోగదారులపై మోపింది. ఫలితంగా ఫిబ్రవరి నుంచి గృహ వినియోగదారులపై యూనిట్‌కు 33.88 పైసలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై యూనిట్‌కు 78.38 పైసలు చొప్పున భారం పడనుంది. వీటితో పాటు మరో రూ.5,238 కోట్ల భారం కూడా పొంచి ఉంది. 

2010-11 ఆర్థిక సంవత్సరంతో పాటు 2011-12 ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు ఇప్పటికే ఈఆర్‌సీకి సమర్పించాయి. వీటిపై కూడా ఈఆర్‌సీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఫలితంగా యూనిట్‌కు సగటున 50 పైసల మేరకు అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. గృహ వినియోగదారులపై సుమారు రూ.1,600 కోట్ల మేరకు భారం పడనుంది.
Share this article :

0 comments: