దెబ్బలు తింటున్నా.. దయ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దెబ్బలు తింటున్నా.. దయ లేదు

దెబ్బలు తింటున్నా.. దయ లేదు

Written By ysrcongress on Saturday, January 21, 2012 | 1/21/2012

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన
ఈ ప్రభుత్వం రైతులు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది
నాసిరకం విత్తనాల సరఫరాతో పత్తి, మిరప పంటల్లో దిగుబడి భారీగా తగ్గింది
అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన వడ్లు కొనే నాథుడే కనపడటం లేదు


ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇవాళ గ్రామాల్లో రైతన్నలు సేద్యం చేసుకోలేని పరిస్థితులను కల్పించింది. గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేయకపోతే పరువు, మర్యాద పోతుందేమో అనే బాధతో రైతన్నలు వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయే పరిస్థితులు వచ్చాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 52వ రోజు శుక్రవారం ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నాలుగు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పెదపాలెంలో చిలకా మరియమ్మ కుటుంబాన్ని, ఆవులవారి పాలెంలో ద్రోణాదుల శ్రీనివాసరావు కుటుంబాన్ని, హస్సానాబాద్‌లో షేక్ గారపాటి గాలీసా కుటుంబాన్ని ఓదార్చారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఈ రోజు రైతన్న దగ్గరకు పోయి ఎలా ఉన్నావన్నా అని అడిగితే.. ‘గ్రామాల్లో ఉన్నాం కదా..! వ్యవసాయం చేయకపోతే పరువు పోయినట్లు ఉంటుంది. వ్యవసాయం చేస్తే ప్రాణమే పోయేట్టుగా ఉంది మాకు’ అని రైతన్న సమాధానం చెప్తున్నాడు. ఇవాళ ఈ గ్రామానికి రాక ముందు పొలాల్లో అక్కడక్కడ పసుపు తోటలు కనపడ్డాయి. పసుపు అమ్మితే రూ. 3500 నుంచి రూ.4000 కూడా గిట్టని పరిస్థితుల్లో రైతన్న వ్యవసాయం చేస్తున్న పరిస్థితులున్నాయి. వడ్ల గురించి ఆలోచన చేస్తే అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం కొనే నాథుడే లేడు. అకాల వర్షానికి ముందు కోసిన వరి ధాన్యానికి బస్తా రూ. 750 కంటే ఎక్కువ పడే అవకాశం లేదు. ఉల్లి పరిస్థితి మరీ దారుణం. కేజీ రూ.2కు కూడా అమ్ముకోలేని అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఇవాళ క్వింటాల్‌కు రూ.4 వేలు కూడా రాని పరిస్థితి మిర్చి రైతుది.

వైఎస్ పోయాక..
దివంగత నేత వెళ్లిపోయిన తరువాత రైతన్న పరిస్థితి అధ్వానంగా తయారైంది. రైతులు, రైతు కూలీలను పట్టించుకోవాల్సిన, వారికి అండగా నిలవాల్సిన పెద్దలే.. ఇవాళ రైతు సమస్యలను గాలికి వదిలేశారు. నాసిరకం విత్తనాల వల్ల అనుకున్న దిగుబడి రాని పరిస్థితి.. ఇవాళ పత్తిలో కనపడుతోంది, మిర్చీలోనూ కనబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ యూనివర్శిటీ విత్తనాల నాణ్యతను పరీక్షించి, సర్టిఫికెట్ ఇస్తుంది. మన ఖర్మ ఏమిటంటే గత 12 నెలలుగా వ్యవసాయ యూనివర్శిటీకి వైస్ చాన్స్‌లర్ లేడు. 10 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రే లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే వీళ్లకు రైతుల మీద ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది.

చంద్రబాబు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు..
ఇవాళ రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే ప్రజల తరుపున ఎవరూ మాట్లాడటం లేదు. పేదవాడి కష్టాలు ఎవరికీ కనబడటం లేదు. చేసేదల్లా డ్రామాలు. ఆడేదల్లా నాటకాలు. చంద్రబాబు నాయుడుకైతే ఆ దివంగత నేత పేరు చెప్పందే ఒక్కరోజు కూడా గడవదు. కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై అన్నీ ఆ దివంగత నేత మీద బురదజల్లే ప్రయత్నాలే. దివంగత నేత నిజంగా గొప్ప వ్యక్తి... తాను చనిపోయిన తరువాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇవాళ అన్యాయమైన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే బాధనిపిస్తోంది. చాలా బాధనిపిస్తోంది. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబు నాయుడుకు వేరొక న్యాయమట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ మ్యానేజ్ చేయగలుగుతారు. వైఎస్సార్‌ను అప్రదిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు ఈ ఇద్దరూ కలిసి పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలు చేస్తున్నారు.

దెబ్బలు తింటున్నా.. దయ లేదు
అంగన్‌వాడీలు గత 12 నెలలుగా దెబ్బలు తింటున్నారు.. సమ్మె చేస్తున్నారు. అయినా ఈ పాలకులు వాళ్ల గురించి పట్టించుకోవడం లేదు. 104 ఉద్యోగులు గత ఆరు నెలల నుంచీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి గురించీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదర్శ రైతులకైతే ఎనిమిది నెలల నుంచి జీతాలు అందటం లేదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా తయారైందీ అంటే.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది.
Share this article :

0 comments: