ముకేశ్ అంబానీని తొలి దర్శనం చేసుకున్నారు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముకేశ్ అంబానీని తొలి దర్శనం చేసుకున్నారు.

ముకేశ్ అంబానీని తొలి దర్శనం చేసుకున్నారు.

Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012



* ఈ మధ్యే మరో రూ.2,600 కోట్లు పెట్టిన రిలయన్స్ గ్రూపు కంపెనీలు
* ప్రతిగా కంపానీ, చజ్‌లానీ కంపెనీలకు ఉషోదయాలో 40 శాతం వాటా
* రిలయన్స్‌కేమో10 ప్రాంతీయ భాషా చానళ్లు; తెలుగు చానళ్లలో 49 శాతం వాటా
* ఇప్పటిదాకా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచిన రామోజీ, రిలయన్స్
* రామోజీకి ఇలా రూ.5,200 కోట్లు ఎందుకివ్వాల్సి వచ్చిందన్నదే అసలు ప్రశ్న
* ఇన్వెస్టర్లకు చెప్పకుండా రిలయన్స్ ఇలా చేయటం అతి పెద్ద కార్పొరేట్ నేరం
* ఈ గోప్యానికి, మౌనానికి అసలు కారణం ‘క్విడ్ ప్రో కో’ అంటున్న విశ్లేషకులు
* తన చానళ్లను అమ్మేసి... వేరెవరి వ్యవహారమో అన్నట్టుగా ప్రచురించిన ‘ఈనాడు’ 

‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈటీవీ చానళ్లలో వాటాల మార్పిడి జరిగింది. రామోజీరావుకు చెందిన మీడియా సంస్థ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో కొద్దికాలం క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన గ్రూపు కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టింది. దీంతో ఉషోదయా చేతిలో ఉన్న 10 ప్రాంతీయ భాషా చానళ్లు పూర్తిగా రిలయన్స్ చేతిలోకి వెళ్లిపోయాయి. రెండు తెలుగు చానళ్లలో మాత్రం రిలయన్స్‌కు 49 శాతం... ఉషోదయాకు 51 శాతం వాటా ఉంటుంది’’ 

ఇదీ... బుధవారం ‘ఈనాడు’ పత్రిక తన బిజినెస్ పేజీలో ఒక మూలన ప్రాధాన్యం లేకుండా ప్రచురించిన కథనం సారాంశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తన గ్రూపు కంపెనీల ద్వారా ఉషోదయాలో రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు మంగళవారమే అంగీకరించింది. 

దీనర్థమేంటి? ఇటీవల రామోజీకి చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన గ్రూపు కంపెనీల ద్వారా రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిందనే కదా? ఆ పెట్టుబడితో 10 ప్రాంతీయ భాషా చానళ్లను, తెలుగు చానళ్లలో 49 శాతం వాటాను కొనుక్కుందనే కదా!! సరే... దీన్ని కాసేపు పక్కనపెడదాం.

నాలుగేళ్ల కిందట... అంటే 2008 జనవరిలో నిమేశ్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్ 15 రోజుల వ్యవధిలో అర డజను డబ్బా కంపెనీల్ని ఏర్పాటు చేసి... వాటిద్వారా రూ.1,500 కోట్లు ఉషోదయాలో పెట్టుబడి పెట్టింది. రూ.100 విలువైన ఒకో షేరును ఏకంగా రూ.5,28,630 పెట్టి కొనుగోలు చేసింది.

అదే సమయంలో వినయ్ చజ్‌లానీకి చెందిన అనూ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా 8 డబ్బా కంపెనీల ద్వారా నిధులు సేకరించి మరో మూడు డబ్బా కంపెనీల ద్వారా ఉషోదయాలో రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది కూడా ఒక్కో షేరును రూ.5,28,630కే కొనుగోలు చేసింది. చిత్రమేంటంటే ఇటు ఈక్వేటర్‌కు, అటు అనూ ట్రేడింగ్‌కు నిధులిచ్చిన మూల విరాట్టు రిలయన్స్ ఇండస్ట్రీసే!!!

నాలుగేళ్ల కిందట కంపానీ, చజ్‌లానీ రహస్యంగా రిలయన్స్ నుంచి డబ్బులు తెచ్చుకుని తమ కంపెనీల ద్వారా రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టి... ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 40 శాతం వాటా కొనుక్కున్నారు. కొద్ది రోజుల క్రితం రిలయన్స్ తన గ్రూపు కంపెనీల ద్వారా మరో రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టి ఉషోదయాకు చెందిన 10 ప్రాంతీయ భాషా చానళ్లను పూర్తిగాను, రెండు తెలుగు చానళ్లలో 49 శాతం వాటాను కొనుక్కుంది. దీన్ని బట్టి చూసినపుడు రామోజీ కంపెనీలో రిలయన్స్ ఏకంగా రూ.5,200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు లెక్క. 

ఇంత పెట్టుబడి పెట్టినా ‘ఈనాడు’ పత్రికలోను, కీలకమైన తెలుగు చానళ్లలోను మెజారిటీ వాటా ఇప్పటికీ రామోజీరావు చేతుల్లోనే ఉంది. ఈ మాత్రం మైనారిటీ వాటా కోసం.. తన ఇన్వెస్టర్లకు చెందిన రూ.5,200 కోట్లను రామోజీకి రిలయన్స్ ఉదారంగా ఇచ్చేసింది...!!! వింటేనే బుర్ర తిరిగిపోతోంది కదూ! భారతదేశంలో ఇంతకన్నా పెద్ద కార్పొరేట్ కుంభకోణం లేనే లేదని అనిపిస్తోంది కదూ! తమను నమ్మి పదీ పరకా ఇన్వెస్ట్ చేసిన మదుపర్లను వంచించటంలో ఇంత కొమ్ములు తిరిగిన మొనగాళ్లు మరెవరూ ఉండబోర ని కూడా అనిపిస్తోంది కదూ! అలా అనిపించటం తప్పేమీ కాదు. ఎందుకంటే భారత్ ఇప్పటిదాకా ఇంతటి వంచనను చూసి ఉండలేదు కనుక!

ఆది నుంచీ రిలయన్స్ రహస్యమే!
2008లో కంపానీ, చజ్‌లానీ ద్వారా రామోజీ కంపెనీల్లో రిలయన్స్ పెట్టుబడి పెట్టిందన్న విషయం ‘సాక్షి’ బయట పెట్టేదాకా బయటి ప్రపంచానికి తెలియనే తెలియదు. ఇటీవల రూ.2,600 కోట్లు పెట్టి రామోజీ చానళ్లను రిలయన్స్ కొనుక్కుందని కూడా మంగళవారం రిలయన్స్ చెప్పేదాకా ఎవరికీ తెలియదు. ఆఖరికి రామోజీ-బాబు బండారాన్ని బయటపెడుతూ విజయమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ వేసినప్పుడు కూడా రామోజీ గానీ, రిలయన్స్ గానీ ఈ విషయాన్ని వెల్లడించనే లేదు. ఎందుకింత గోప్యత? ఇదేమీ ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల ఒప్పందం కాదుగా!! ఉదయం లేచిన దగ్గర్నుంచీ తన పత్రిక ద్వారా అందరిపైనా బురదజల్లే రామోజీకి తాను పారదర్శకంగా ఉండాలని తెలియదా? ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇన్వెస్టర్లున్న రిలయన్స్, వారికైనా జవాబుదారీగా ఉండాలిగా! తను డబ్బా కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టినపుడూ, చానళ్లను కొనుగోలు చేసినపుడూ బయటికెందుకు చెప్పలేదు? తన ఇన్వెస్టర్లకు, స్టాక్ ఎక్స్ఛేంజీలకు సైతం చెప్పలేదేం? ఇది బాబు చేసిన సాయానికి ప్రతిగా ఆయనకు సమర్పించుకున్న ‘క్విడ్ ప్రో కో’ కాకుంటే అంత భయమెందుకు? అంత గోప్యతెందుకు? అన్ని దాటవేతలెందుకు?

బదలాయింపు ఇటీవలే జరిగిందా?
రామోజీ టీవీ చానళ్లు పనోరమా, ప్రిజమ్, ఈటీవీ అనే కంపెనీల పేరిట ఉన్నాయి. ఆ కంపెనీలు 2011కు ఆర్‌ఓసీకి సమర్పించిన వార్షిక నివేదికలో రామోజీ కుటుంబీకులకు 61 శాతం, ఈక్వేటర్, అనూ ట్రేడింగ్‌లకు 39 శాతం వాటా ఉన్నట్టు పేర్కొన్నాయి. అంటే 2011 మార్చి వరకూ ఆ చానళ్లు రామోజీ చేతిలోనే ఉన్నాయన్న మాట. ఇక జూలైలో రామోజీ తన చానళ్లను సోనీ సంస్థకు కట్టబెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంటే అప్పటికీ చానళ్లు ఆయన చేతిలోనే ఉండి ఉండాలి. ఆ తరవాతే రిలయన్స్ వాటిని కొని ఉండాలి. ఇలా కొన్న తరవాత రిలయన్స్ దాన్నెందుకు దాచింది? ఇన్వెస్టర్లకు చెప్పకుండా వారి సొమ్మును ఇలా పెట్టుబడి పెట్టినందుకు రిలయన్స్‌పై సెబీ గానీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ గానీ ఎందుకు చర్య తీసుకోకూడదు? బహుశా.. ప్రభుత్వమో, న్యాయవ్యవస్థో క్రియాశీలంగా వ్యవహరిస్తేనే తప్ప ఇది సాధ్యం కాకపోవచ్చు.

కొసమెరుపు: 2009 ఎన్నికలు ముగియగానే.. గెలిచిన, ఓడిన రాజకీయ నాయకులు ఏ దేవుడినో సందర్శించుకుని వచ్చారు. బాబు మాత్రం అందుకు భిన్నంగా ముకేశ్ అంబానీని తొలి దర్శనం చేసుకున్నారు. ఇది ఏ సాయానికి కృతజ్ఞతగానో...!?

Share this article :