హరిత పన్ను పేరుతో పట్టణ వాహనదారులపై వేల కోట్ల భారం!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హరిత పన్ను పేరుతో పట్టణ వాహనదారులపై వేల కోట్ల భారం!!

హరిత పన్ను పేరుతో పట్టణ వాహనదారులపై వేల కోట్ల భారం!!

Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012

పెట్రోలుపై లీటర్‌కు రూ.2 చొప్పున సర్‌చార్జి
ద్విచక్ర , నాలుగు చక్రాల వాహనాల
బీమా శాతం 4 నుంచి 7 శాతానికి పెంపు
కొత్త పెట్రో కార్లు, ద్విచక్ర వాహనాలపై 
7.5 శాతం పట్టణ రవాణా పన్ను.. డీజిల్ వాహనాలయితే 20 శాతం
ఈ పన్నుల ద్వారా కేంద్రానికి ఏటా రూ. 42,650 కోట్ల ఆదాయం
రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.4 వేల కోట్ల భారం! 
ఈ ఆదాయంతో పట్టణ రవాణా నిధి ఏర్పాటు 
కేంద్రానికి ప్రణాళిక సంఘ కమిటీ సిఫారసులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పట్టణ ప్రాంత వాహనదారులకు హెచ్చరిక!! మీపై పన్నుల బాంబు పడడానికి సిద్ధంగా ఉంది. హరిత పన్ను(గ్రీన్ ట్యాక్స్) అనే ఆహ్లాదకరమైన పేరుతో వివిధ రకాల పన్నుల ముళ్ల కొరడా ఝళిపించే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పట్టణ రవాణాకు సంబంధించి కేంద్రం ఢిల్లీ మెట్రో గురు శ్రీధరన్ నేతృత్వంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఈ ప్రతిపాదనలు చేసింది. వీటికి ఆమోదం లభిస్తే.. కొత్త వాహనం కొనాలని కల కనడానికి కూడా భయపడే పరిస్థితి రానుంది. వాస్తవానికి ఆ కమిటీ ఆలోచన కూడా అదే! ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గిస్తూ.. అదే సమయంలో ప్రజా రవాణా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా కమిటీ ఈ సూచనలు చేసింది. 

ఇప్పటికే రాష్ట్రంలో ఆస్తిపన్ను, నీటి చార్జీల పెంపు, నిత్యావసరాల ధరలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఈ తాజా హరిత పన్ను పెను భారం కానుంది. ‘కాలుష్య కారకుడే భారం చెల్లించాలి’ అన్నదే మార్గదర్శక సూత్రంగా ఈ ప్రణాళిక సంఘ వర్కింగ్ కమిటీ చేసిన సిఫార్సులు.. మొత్తానికే ఎసరు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగుపర్చేందుకు పట్టణ రవాణా నిధి ఏర్పాటు చేయాలని, ఇందు కోసం వేలకోట్ల రూపాయల సమీకరణకు వాహనాల యజమానులపై భారీగా పన్ను విధించాలని ఆ ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 

సాధారణ బడ్జెట్‌తో పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడం సాధ్యమయ్యే పనికాదని కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు, ప్రజలపై ఆర్థికభారం మోపడం, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తప్పనిసరని పేర్కొంది. జాతీయ స్థాయిలో పట్టణ రవాణా నిధి ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా పట్టణ స్థాయిల్లోనూ ఈ నిధి ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. పట్టణాల్లో ప్రజా రవాణా రంగం తగ్గుతూ, వ్యక్తిగత వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోందని, అందువల్ల పట్టణాల్లో కాలుష్యం పెరిగిపోతోందని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. లక్ష జనాభా ఉన్న పట్టణాలు మొదలుకొని పదిలక్షల పైబడి జనాభా ఉన్న పట్టణాల్లో రవాణా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న అంశాలపై కమిటీ సుదీర్ఘ నివేదిక ఇచ్చింది.

రాష్ట్రంపై ఏటా రూ.4 వేల కోట్ల భారం

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో దాదాపు 50 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం అదనంగా 12.5 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నట్లు అంచనా. పెట్రోలుపై సరిచార్జి, కొత్త వాహనాలపై పట్టణ రవాణా పన్ను, వాహన బీమాల పెంపు ద్వారా దేశవ్యాప్తంగా ఏడాదికి రూ.42, 650 కోట్ల రూపాయలు వస్తాయని కమిటీ అంచనా వేయగా.. అందులో నాలుగు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపైనే పడనుంది.


నివేదికలో ముఖ్యాంశాలివీ..

దేశంలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో పెట్రోలు వినియోగంపై ప్రతీ లీటరుకు రెండు రూపాయల గ్రీన్ సర్‌చార్జి విధించాలి.. తద్వారా ఏటా రూ.3,108 కోట్లు వసూలవుతాయి. అంటే ఐదేళ్లలో వాహనాల తగ్గుదలను మినహాయిస్తే దాదాపు రూ.14,050 కోట్లు సమకూరుతాయి.

వ్యక్తిగత వాహనాలపై వాహన బీమా మూడు శాతం పెంచాలి. అంటే ప్రస్తుతం ఉన్న నాలుగుశాతాన్ని ఏడు శాతం చేయాలి. బీమా కంపెనీలే మూడు శాతం వసూలు చేసి ప్రభుత్వానికి జమచేయాలి. ఈ పెంపుతో మొదటి సంవత్సరం రూ.18,613 కోట్లు వసూలైతే ఐదేళ్లలో దాదాపు రూ.83,753 కోట్లు వసూలవుతాయి.

కొత్త పెట్రోలు కార్లు, ద్విచక్ర వాహనాలపై పట్టణ రవాణా పన్ను పేరిట వాహనం విలువలో 7.5 శాతం పన్ను, అదే డీజిల్ వాహనాలపై 20 శాతం పన్ను వసూ లు చేయాలి. తద్వారా ఏటా రూ.20,929 కోట్లు.. అంటే ఐదేళ్లలో దాదాపు 95,739 కోట్లు వస్తాయి.
Share this article :

0 comments: