‘ఫీజు’ పథకం ఎంతో ప్రయోజనకరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఫీజు’ పథకం ఎంతో ప్రయోజనకరం

‘ఫీజు’ పథకం ఎంతో ప్రయోజనకరం

Written By ysrcongress on Monday, January 30, 2012 | 1/30/2012

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో ప్రయోజనకరమని.. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల జరిగిన జాతీయ మహాసభల్లో తీర్మానించినట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ మిలింద్ మరాఠే తెలిపారు. ఏబీవీపీ 30వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం కర్నూలు వచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన విద్యా విధానమే కొనసాగుతుండటం విచారకరమన్నారు. విదేశీ మోజులో భారతీయతతో కూడిన విద్యను హీనంగా చూడటం సరికాదని హితవు పలికారు. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫీజులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. దీంతో పేద, మెరిట్ విద్యార్థులకు ఉన్నత విద్య అందడంలేదని పేర్కొన్నారు. మరోవైపు ఉన్నత విద్యను ప్రైవేటు విద్యాసంస్థలు హస్తగతం చేసుకుని విద్యార్థులను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. వృత్తి విద్యను అందిస్తున్నా ఉపాధి కరువైందన్నారు. 

దేశంలో గుణాత్మక, భారతీయ సంస్కృతితో కూడిన విద్యను, పరిశోధనాత్మక విద్యను ప్రవేశపెట్టాలని మిలింద్ డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో దాచిన నల్లడబ్బును బయటకు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో వేయాలని, ఆ సొమ్ముతో విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని సూచించారు. అవినీతికి పాల్పడిన మంత్రులను జైల్లో వేశామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. కాగ్ తప్పుబట్టిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో బలమైన లోక్‌పాల్ బిల్లును తీసుకురావాలని, ఈ చట్టం పరిధిలోకి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు రంగ సంస్థలను, మీడియానూ చేర్చాలని డిమాండ్ చేశారు. 

బలమైన్ లోక్‌పాల్ కోసం న్యాయవ్యవస్థ, పోలీస్, పరిపాలన, ఎన్నికలు, విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. దేశంలోని విదేశీ విశ్వవిద్యాలయాలు వస్తే తాము అడ్డుకోబోమని, అయితే ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో ఉన్న వర్సిటీలను మాత్రమే అనుమతిస్తామని ఉద్ఘాటించారు. వాటికి మన దేశంలోనే న్యాక్ గుర్తింపు ఉండాలని, ఇక్కడి నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు.
Share this article :

1 comments:

saraswati.salu said...

సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర ,మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమే,నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోంది,జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులకు సిబిఐ బెదిరిస్తోంది,ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు,నిధులు దుబాయ్ కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవు,అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారు-----ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు విజయమ్మలేఖ