రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు?

రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు?

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

ఎమ్మార్ వ్యవహారంలో కీలక నిందితుల్లో ఒకరైన స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావును సీబీఐ అధికారులు ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవటాన్ని సుశీల్‌కుమార్ ప్రశ్నించారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే రంగారావును అరెస్ట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ, రంగారావుల మధ్య కుట్ర సాగుతోందని చెప్పారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని వదిలి వేసి.. సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ మొత్తం కేసులో సీబీఐకి ఎలా కావాలంటే అలా.. ఏం కావాలంటే అది.. రంగారావు చెప్పారు. అందుకే సీబీఐ ఆయన జోలికి వెళ్లటం లేదు. రంగారావును పిలుస్తారు.. తాము అనుకున్నది ఆయన చేత చెప్పించుకుని వెంటనే పంపేస్తున్నారు. కానీ మిగిలిన వారిని మాత్రం విచారణ పేరుతో పిలిపించి.. అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

రంగారావు విషయంలో సీబీఐ ఎందుకింత ప్రేమ కనపరుస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో సీబీఐ స్వతంత్రంగా సాధించింది ఏమీ లేదు. రంగారావు చెప్పిన దానిని బట్టే సునీల్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సహ నిందితుడు చెప్పిన దానిని బట్టి.. ఇతరులను అరెస్ట్ చేయటం సరికాదు. ఈ విషయం నేను చెప్పటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కానీ సీబీఐ అధికారులు ఇందుకు విరుద్ధంగా రంగారావు ఏదో చెప్పారంటూ సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తమకు రంగారావు ఇన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టే.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేలా ఆయనను ప్రేరేపించారు. 

ఈ కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ ఏం రాసిందో ఒక్కసారి చూడండి. కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కలిసి కుట్రపన్నారని సీబీఐయే చెప్పింది. అలాంటప్పుడు కోనేరును అరెస్ట్ చేసి.. రంగారావును ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ కేసులో కోనేరు ప్రసాద్, రంగారావులే ప్రధాన కుట్రదారులు, నిందితులు. కానీ సీబీఐ అధికారులు రంగారావు పేరును ప్రతి చోటా తప్పిస్తూ వస్తున్నారు. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ రంగారావు ప్రస్తావన ఉంది. ఆ తీర్పు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆయన పేరు ఉంది. అయినా కూడా సీబీఐ ఆయన జోలికి వెళ్లదు. ఎందుకంటే రంగారావును అరెస్ట్ చేస్తే.. తమకు అనుకూలంగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి. రంగారావును సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రతి దశలోనూ అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇదేనా దర్యాప్తు చేయాల్సిన పద్ధతి?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

‘‘నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని మాటల్లో చెబితే సరిపోదు.. అది చేతల్లో కనిపించాలి. కానీ సీబీఐ దర్యాప్తు తీరును చూస్తుంటే వారివి కేవలం మాటలేనని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. ‘‘ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో. ఎమ్మార్‌కు భూములు కేటాయించింది ఆయనే. ఆయన హయాంలోనే కీలక జీవోలన్నీ జారీ అయ్యాయి. అసలు కుట్రకు తెరలేచింది బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. అయినప్పటికీ సీబీఐ అధికారులు ఆయన జోలికి వెళ్లరు. ఆయనను కనీసం పిలిపించి ప్రశ్నించటం కూడా చేయరు. బాబును ఎందుకు పిలిపించరో.. ఎందుకు ప్రశ్నిం చరో.. సీబీఐకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎమ్మార్ కేసులో బాబు హయాం నుంచీ దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు, సీబీఐ తదితరులకు నోటీసులు కూడా జారీ చేసింది’’ అని ఆయన గుర్తుచేశారు.
Share this article :

0 comments: