రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్

రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

కింది కోర్టు, హైకోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం
ఎలాంటి కుట్రపూరిత ఉద్దేశాలు లేవని ఇప్పుడు చెబితే ఎలా అని ప్రశ్న?

న్యూఢిల్లీ/హైదరాబాద్, న్యూస్‌లైన్: విశాఖపట్నం సీతమ్మధారలోని ‘ఈనాడు’ లీజు స్థలం విషయంలో ఆ పత్రిక అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్ ఇచ్చింది. ఈ స్థలానికి సంబంధించిన లీజును పొడిగించేలా యజమానిని ఆదేశించాలని కోరుతూ కింది కోర్టులో రామోజీ వేసిన పిటిషన్‌కు చేసిన సవరణలను అనుమతించటానికి నిరాకరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే.. కింది కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రభావితం చేసినట్లవుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోథా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏం చెప్పాలనుకున్నా.. కింది కోర్టులకు వెళ్లి చెప్పుకోవాలని తేల్చి చెప్పింది. కింది కోర్టుల్లో ఉన్న కేసుల్లో తదుపరి పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని శుక్రవారం స్పష్టం చేసింది. 

ఇదీ కేసు నేపథ్యం...

విశాఖపట్నంలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్య ఈశ్వరకుమార కృష్ణవర్మకు చెందిన 2.70 ఎకరాల భూమి (13,078 చదరపు గజాలు)ని 33 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఉషోదయా పబ్లికేషన్స్ పేరు మీద 1974 మార్చి 30న రామోజీరావు తీసుకున్నారు. లీజు గడువు ముగిసిన వెంటనే భూమిని తిరిగి అప్పగించేటట్లు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. వర్మ నుంచి తీసుకున్న స్థలంలో రామోజీ ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే రామోజీరావు.. స్థల యజమాని వర్మకు తెలియకుండానే, ఆయనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా తాను లీజుకు తీసుకున్న స్థలం నుంచి 517 చదరపు మీటర్ల స్థలాన్ని రోడ్డు వెడల్పు నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 

స్వాధీనం చేసిన భూమికి ప్రతిఫలంగా సీతమ్మధారలోనే 872 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని 1985 జనవరి 17న కోరారు. ఆ స్థలాన్ని వర్మ పేరు మీద కాకుండా ‘డెరైక్టర్, ఈనాడు’ పేరు మీద కేటాయించాలని అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరారు. రామోజీ డిమాండ్‌ను నాటి విశాఖ ఎమ్మార్వో తోసిపుచ్చారు. రోడ్డు నిర్మాణం కోసం ఈనాడుకు చెందిన స్థలంలో కేవలం 289 చదరపు మీటర్లను మాత్రమే తీసుకోవటం జరిగిందని ఎమ్మార్వో స్పష్టం చేశారు. అయితే రామోజీ కోరిన వెంటనే, అప్పటి కలెక్టర్ ఎస్.వి.ప్రసాద్ మాత్రం ఆగమేఘాల మీద స్పందించారు. రామోజీ కోరిన భూమి అప్పటికే ఈనాడు కార్యాలయ స్వాధీనంలో ఉన్నందున దానిని డెరైక్టర్, ఈనాడుకు స్వాధీనం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ ఎస్.వి.ప్రసాద్ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. 

రామోజీ పిటిషన్ ఇదీ...

రామోజీ తీసుకున్న స్థలం లీజు కాలపరిమితి 2007 మార్చి 31న ముగిసింది. కానీ స్థలాన్ని వర్మకు ఆయన అప్పగించలేదు. పైగా టైటిల్‌డీడ్‌ను వ్యతిరేకిస్తూ లీజు కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో 2007లోనే పిటిషన్ దాఖలు చేశారు. లీజుకు తీసుకున్న స్థలంలోకి భూ యజమాని వర్మ, ఆయన మనుషులు రాకుండా నిరోధించాలని కూడా కోరారు. తాము లీజుకు తీసుకున్న ఆస్తిపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా వర్మను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 

ఇందులో లీజుకు తీసుకున్న స్థల విస్తీర్ణాన్ని మొదట 9,200 చదరపు మీటర్లుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తనకు వ్యతిరేకంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం, కేసు నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించటం వంటి పరిణామాల నేపథ్యంలో పిటిషన్‌లో సవరణలు చేసేందుకు అనుమతించాలని కింది కోర్టును అభ్యర్థించారు. భూమి విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా పేర్కొన్న దానిని 11,034 మీటర్లుగా సవరించేందుకు అనుమతించాలని కోరారు. ఇందుకు కింది కోర్టు తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ.. కేసును మరో జడ్జికి బదిలీ చేయాలంటూ రామోజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో కింది కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్, కౌంటర్లలో సవరణలకు కింది కోర్టు అనుమతించకపోవటాన్ని సవాల్ చేస్తూ మరో రెండు పిటిషన్లను కూడా సమర్పించారు. ఈ పిటిషన్లను హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. రామోజీ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ గోడా రఘురాం గతేడాది నవంబర్ 18న 74 పేజీల సంచలన తీర్పు ఇచ్చారు. 1974 నుంచి ఇప్పటి వరకు రామోజీరావు చేస్తూ వచ్చిన పలు అవకతవకలను, కోర్టులకు చెప్పిన అవాస్తవాలను ఎండగట్టారు. యజమాని నుంచి తీసుకున్న స్థలం విస్తీర్ణాన్ని తగ్గించి చూపటం.. వర్మ స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ప్రతిగా ప్రభుత్వం నుంచి ఉషోదయా సంస్థ పేరు మీద స్థలం పొందటం.. తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేయటం.. తదితర అంశాలపై రామోజీ చర్యలను న్యాయమూర్తి తప్పుపట్టారు. స్థలాన్ని లీజుకు తీసుకునే సమయంలో దాని విస్తీర్ణం ఎంతో తనకు తెలియదంటూ రామోజీ చెప్పటంపై విస్మయం వ్యక్తం చేశారు. లీజుకు తీసుకున్న స్థలం 11,034.78 చదరపు మీటర్లన్న విషయం రామోజీకి మొదటి నుంచి స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. 

వర్మకు పంపిన నోటీసుల్లో సైతం లీజు విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా రామోజీ పేర్కొన్నారని, వర్మ దీనిపై అభ్యంతరం కూడా తెలిపారని న్యాయమూర్తి గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో పలు ప్రభుత్వ సంస్థలు సర్వే చేసి, విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లకు పైనేనని తేల్చిన విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం రామోజీ తాను లీజుకు తీసుకున్న స్థలం విస్తీర్ణం 11,000 చదరపు గజాలని చెప్పటాన్ని కూడా న్యాయమూర్తి గుర్తు చేశారు. దీనికి సంబంధించి రామోజీకి వ్యతిరేకంగా కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎటువంటి దోషం లేదని న్యాయమూర్తి తేల్చారు. మేజిస్ట్రేట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేశారు. 

‘సుప్రీం’లోనూ చుక్కెదురు...

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్‌పై కింది కోర్టులో ఉన్న కేసులను అద్దె నియంత్రణ చట్టం కిందకు మార్చాలని కోరారు. 

అలా చేస్తే పాత బకాయిలన్నింటినీ కలిపి ఇప్పటివరకూ మొత్తం అద్దెను చెల్లించటానికి తాము సిద్ధమని, పిటిషనర్‌కు ఎలాంటి కుట్ర పూరిత ఉద్దేశాలు లేవని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కుట్రపూరిత ఉద్దేశాల విషయమై తాము ఆలోచించటం లేదని, అలాంటి ఉద్దేశాలు లేవని ఈ దశలో ఈ రోజున చెప్పటం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కింది కోర్టు వ్యవహరించిన తీరును తాము తప్పుపట్టటం లేదని తేల్చి చెప్పింది. ‘ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది. అందువల్ల మేం జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు. మీరు అక్కడికే వెళ్లి మీ వాదనలు వినిపించుకోండి. క్రిమినల్ కేసు నమోదైందని, ఇప్పుడు అద్దె నియంత్రణ చట్టం కిందికి కేసును మార్చాలని కోరితే ఎలా? అలా చేస్తే అది కింది కోర్టులోని పిటిషనర్ ప్రయోజనాలకు భంగం కలిగించినట్లు అవుతుంది. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, అద్దె మొత్తం కడతామని ఇప్పుడు చెబితే ఎట్లా?’ అని ధర్మాసనం నిలదీసింది. రామోజీ తరఫు న్యాయవాది హైకోర్టు తీర్పు తప్పని చెప్పేందుకు ప్రయత్నించినా ధర్మాసనం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ ప్రాథమిక దశలోనే రామోజీ పిటిషన్‌ను కొట్టివేసింది.
Share this article :

0 comments: