పులివెందుల సీఐ అరెస్టుకు ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందుల సీఐ అరెస్టుకు ఆదేశం

పులివెందుల సీఐ అరెస్టుకు ఆదేశం

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

ఇద్దరు ఎస్‌ఐలు, పోలీసులకు నాన్‌బెయిలబుల్ వారంట్
27లోపు అరెస్టుకు డీఎస్పీకి ఆదేశం

కడప (వైఎస్సార్ జిల్లా),న్యూస్‌లైన్: అధికార దుర్వినియోగానికి పాల్పడి, అమాయకులపై దాడి చేసిన పులివెందుల సీఐ శంకరయ్యతో పాటు ఎస్‌ఐలు యుగంధర్, గౌస్‌పీర్‌లు సహా మరికొందరి అరెస్టుకు పులివెందుల జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ శుక్రవారం ఆదేశించారు. సీఐ శంకరయ్యతో పాటు ఆయనకు సహకరించినవారిపై నాన్‌బెయిలబుల్ వారంటు జారీ చేశారు. ఈనెల 27వ తేదీలోపు వారిని అరెస్టు చేయాలని డీఎస్పీ జయచంద్రుడిని ఆదేశించారు. ఈ ఆదేశాలకు దారితీసిన రెండు ఘటనల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... పులివెందుల పట్టణానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముల్లా రహంతుల్లాను అక్టోబర్ 8న పులివెందుల పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. 

దీనిపై స్పందించిన కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల స్టేషన్ వెలుపల శాంతియుతంగా ధర్నాకు ఉపక్రమించారు. దీంతో జగన్‌తో పాటు 355 మందిపై అక్టోబర్ 9న నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీనిపై నవంబర్ 4న రహంతుల్లా పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. రహంతుల్లాతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి, మరో 355 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని విచారణ సందర్భంగా కోర్టు అంచనాకు వచ్చింది. దీంతో 171, 148, 341, 323, 324, 355, 187, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద సీఐ శంకరయ్యతో పాటు ఎస్‌ఐ గౌస్‌పీర్, ఏఎస్‌ఐ అన్నయ్య, మరో ఐదు మంది పోలీసులకు నాన్ బెయిలబుల్ వారంటు జారీ చేసింది. 

ఇప్పట్లలో గ్రామస్తులపై దాడి

వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డిపై ఓ కేసు నమోదు కాగా, పోలీసుస్టేషన్‌లో కాకుండా నేరుగా కోర్టులో లొంగిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన సీఐ శంకరయ్య, అప్పటి లింగాల ఎస్‌ఐ యుగంధర్ మూడు జీపుల్లో పోలీసులను తీసుకుని 2011 జూన్ 28 రాత్రి లింగాలకు వెళ్లారు. సుధాకర్‌రెడ్డి అన్న కుమారుడు శశిభూషణ్‌రెడ్డిని చితకబాదారు. అతడిని జీపులో వేసుకుని స్టేషన్‌కు వెళుతుండగా అడ్డగించిన గ్రామస్తులను కూడా విచక్షణారహితంగా కొట్టారు. సుధాకర్‌రెడ్డి భార్య గాయత్రితో పాటు మరికొందరు మహిళలను స్టేషన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గాయత్రి 30న పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన జూనియర్ సివిల్ జడ్జి శుక్రవారం సీఐ శంకరయ్య, ఎస్‌ఐ యుగంధర్, వారికి సహకరించిన నారాయణస్వామి, రామయ్యలపై 342, 323, 354, 355, 109, 506 ఐపీసీ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంటును జారీ చేస్తూ తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో శంకరయ్యను బదిలీ చేయాలని గాయత్రి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: