ప్రభుత్వపరంగానే మద్యం విక్రయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ప్రభుత్వపరంగానే మద్యం విక్రయాలు

ప్రభుత్వపరంగానే మద్యం విక్రయాలు

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

మద్యం సిండికేట్లు, రాజకీయ నాయకుల ప్రమేయం, వాటిపై ఏసీబీ దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. తమిళనాడు తరహాలో ప్రభుత్వపరంగానే మద్యం విక్రయాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్సైజ్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అంధ్రప్రదేశ్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) అధికారులతో ఎక్సైజ్ యంత్రాంగం పలు దఫాలు చర్చలు జరిపింది. తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేయడంతో పాటు మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా చట్ట సవరణ తయారీ కసరత్తులో ఎక్సైజ్ అధికారులు బిజీ అయ్యారు. ఎక్సైజ్ విధానం రూపకల్పనపై నెల రోజులుగా మల్లగుల్లాలు పడ్డారు. ప్రభుత్వపరంగా మద్యం దుకాణాలను నడిపేందుకు 19,788 మంది సిబ్బంది కావాలని లెక్కలు కట్టారు. వారందరినీ రాజీవ్ యువకిరణాలు పథకం కింద కాంట్రాక్టు పద్ధతిన తీసుకోవాలని భావిస్తున్నారు.

ఓపెన్ టెండర్ కన్నా ఇదే మేలట..!

నిజానికి తమిళనాడు ఎక్సైజ్ విధానంలో లోపాలున్నాయని, మన రాష్ట్రంలో దాని అమలు అంత సులువు కాదని కిరణ్‌కు అధికారులు సూచించారు. సీఎం కోరిక మేరకు తమిళనాడు విధానాన్నే అమలు చేయాలని వారు తాజాగా నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత ఓపెన్ టెండర్ విధానంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి తన మార్కు రాజకీయం ప్రదర్శించారని ఎక్సైజ్ ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘యువ కిరణాలు’ పథకం పేరుతో మద్యం దుకాణాల సిబ్బందిలో వీలైనంత వరకూ తన అనుచరులనే చొప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయాలపై పట్టు బిగించాలన్నది సీఎం వ్యూహమని తెలుస్తోంది.

ఇప్పుడెలా.. ఇకపై ఎలా..?

ప్రస్తుతం రాష్ట్రంలో 6,596 మద్యం దుకాణాలున్నాయి. ఇప్పటిదాకా రెండేళ్లకు ఒకసారి ఓపెన్ టెండర్ విధానంలో వాటికి రాష్ట్ర ప్రభుత్వం లెసైన్సులిచ్చే విధానం అమల్లో ఉంది. దీనిపై విమర్శల నేపథ్యంలో నూతన ఎక్సైజ్ విధానం వస్తే ఇకపై మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతుంది. ఈ బాధ్యతను ఏపీబీసీఎల్ తీసుకుంటుంది. అప్పుడు ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు చొప్పున సేల్స్‌మన్, క్యాషియర్, సూపర్‌వైజర్ కావాలన్నది ఎక్సైజ్ అధికారుల అంచనా. ఇలా కనీసం 19,788 మందిని నియామక ప్రక్రియను ఎక్సైజ్ శాఖలోనే అదనపు కమిషనర్ స్థాయి అధికారికి ఇప్పటికే అప్పగించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

తమిళనాట సర్వం టస్మాక్...

తమిళనాడులో మద్యం విక్రయాలపై గుత్తాధిపత్యం ఆ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్)దే. మద్యం విక్రయాలన్నీ దాని ద్వారానే జరుగుతుంటాయి. 1983లో తొలిసారిగా దీన్ని నాటి సీఎం ఎం.జి.రామచంద్రన్ ఏర్పాటు చేశారు. నిజానికి 1937 నుంచి 2001 దాకా తమిళనాడులో మద్యనిషేధం అమల్లో ఉంది. 1971-74, 1981-87, 1990-91ల్లో తాత్కాలికంగా, 2001 నుంచి పూర్తిగా నిషేధాన్ని ఎత్తేశారు. 2001లో మద్యం దుకాణాలు, బార్లకు టెండర్లు పిలవగా, అది రాజకీయ సమీకరణలనే ప్రభావితం చేసింది. దాంతో లాట్ పద్ధతి తెచ్చినా రాజకీయ లాబీయింగ్ ఆగలేదు. దాంతో మద్యం వ్రికయాలపై టస్మాక్‌నే ప్రభుత్వం గుత్తాధిపతిని చేసింది. అప్పట్నుంచీ అవి దాని నేతృత్వంలోనే నడుస్తున్నాయి. 2004 నాటికి రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ టస్మాక్ పరిధిలోకి వచ్చేశాయి.
Share this article :

0 comments: