రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టింది తామేనని ఇన్నాళ్లకు రిలయన్స్ ప్రకటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టింది తామేనని ఇన్నాళ్లకు రిలయన్స్ ప్రకటన

రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టింది తామేనని ఇన్నాళ్లకు రిలయన్స్ ప్రకటన

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

* రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టింది తామేనని ఇన్నాళ్లకు రిలయన్స్ ప్రకటన
* అంత అడ్డదార్లో ఎందుకు పెట్టారన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం పూజ్యం
* రూ. 2,600 కోట్లు పెట్టి, ఇప్పుడు ప్రాంతీయ భాషా చానళ్లకే పరిమితం
* తెలుగు చానళ్లలో మెజారిటీ వాటా రామోజీ చేతిలోనే
* పత్రికలో వాటాను ఉచితంగానే వదిలేసుకున్న రిలయన్స్?
* రిలయన్స్ వద్దనున్న చానళ్లలో వాటా కొనుగోలు చేస్తున్న నెట్‌వర్క్-18 గ్రూప్
* అందుకోసం నెట్‌వర్క్-18కు రూ.1,400 కోట్లు రుణమిస్తున్న రిలయన్స్!
* ఇదంతా ‘క్విడ్ ప్రో కో’ వ్యవహారమేనని ఆది నుంచీ ఆరోపిస్తున్న ‘సాక్షి’, వైఎస్సార్ కాంగ్రెస్
* పెట్టుబడులపై ఇవాళ్టి దాకా నోరెత్తని రిలయన్స్, రామోజీ గ్రూపులు
* ఇప్పుడు కంపానీ సంస్థ కూడా తమ గ్రూప్ కంపెనీయేనంటున్న రిలయన్స్
* రామోజీని రక్షించేందుకు చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆది నుంచీ తాపత్రయం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాము అప్పుల పాలయ్యాడు. తీర్చాలంటే డబ్బుల్లేవు. పోనీ తన కంపెనీల్లో వాటా అమ్ముదామంటే... అవన్నీ పీకల్లోతు నష్టాల్లో ఉన్నాయి. పైగా అంతకు ముందెన్నడూ పైసా లాభం చూసినవి కూడా కావు. ఏం చేయాలి...?
ఇంతలో ముకేశ్ ఆపద్బాంధవుడిలా వచ్చాడు. జనం సొమ్ము ఆయన దగ్గర దండిగా ఉంది. అదేదో తన సొమ్మన్నట్టుగా తీశాడు. తన బంట్లను పిలిచాడు. ‘‘మీరు డబ్బా కంపెనీలు పెట్టండి. వాటినుంచి రాముకు డబ్బులు పంపండి’’ అని ఆదేశించాడు. వారు అక్షరాలా అదే చేశారు. రాము అప్పుల్లోంచి బయటపడ్డాడు.

కథ ఆగలేదు. తన కంపెనీల్లో 39 శాతం వాటా ఇతరుల చేతుల్లో ఉండటం రాముకు నచ్చలేదు. ఓ ఐడియా వేశాడు. తన కంపెనీల్లో లాభాల్లేని, ఆస్తుల్లేని విభాగాల్ని పక్కకు తీశాడు. వాటిని కొత్త కంపెనీలుగా ప్రకటించాడు. ‘‘ఈ కొత్త కంపెనీల్ని నీకిచ్చేస్తా. దానికి, నువ్విచ్చిన డబ్బులకి చెల్లు’’ అన్నాడు ముకేశ్‌తో. ఎవరైనా దీనికి చచ్చినా ఒప్పుకోరు. కానీ ముకేశ్ ఒప్పుకున్నాడు. అంతేకాదు. వాటిని రాఘవ అనే మరో వ్యక్తికి అంటగట్టాలనుకున్నాడు. రాఘవ తీవ్రమైన నష్టాల్లోను, అప్పుల్లోను ఉండటంతో... ఆ అప్పులు తీర్చడానికి కూడా తానే డబ్బులిస్తున్నాడు. ఔరా.. ఎంత ఔదార్యం!


పైన చెప్పిన కథలో రాము పాత్రలో రామోజీరావు, ముకే శ్ పాత్రలో ముకేశ్ అంబానీ, రాఘవ పాత్రలో టీవీ-18కు చెందిన రాఘవ్ బెహల్ సరిగ్గా ఇమిడిపోతారు. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీకి ఇంత ఔదార్యమెందుకు? రామోజీపై ఇంత ప్రేమెందుకు? రామోజీని అప్పుల్లోంచి, కోర్టు కేసుల్నుంచి బయటపడేయటానికి ఇంత తాపత్రయమెందుకు? ఇప్పుడు మళ్లీ రామోజీ కంపెనీని స్వతంత్రం చెయ్యడానికి తానెందుకు అంత విలువలేని చానళ్లను కొనుగోలు చేస్తున్నారు? నిమేశ్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్‌ను, వినయ్ ఛజ్‌లానీకి చెందిన అనూ ట్రేడింగ్‌ను తమ గ్రూప్ కంపెనీలుగా ముకేశ్ ఎందుకు అంగీకరించారు? టీవీ-18 సంస్థను ఎందుకు రంగంలోకి దించారు? ఇవన్నీ బేతాళ ప్రశ్నలే. 

వీటన్నిటికి సమాధానమే... మొదటి నుంచీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపిస్తున్న ‘క్విడ్ ప్రో కో’! కేజీ బేసిన్లో గ్యాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడకుండా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో అడ్డుపడి రిలయన్స్‌కు సహకరించారని... తవ్వకాలు, సరఫరాలో రిలయన్స్ ఉల్లంఘనలన్నిటినీ చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏ చర్యా తీసుకోలేదని... పెపైచ్చు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (అప్పట్లో ఇది ముకేశ్‌ది) ఏ ప్రభుత్వమూ ఇవ్వనన్ని రాయితీలిచ్చారని... వీటన్నిటికి ప్రతిఫలంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ చంద్రబాబు తరఫున రామోజీకి చెందిన ‘ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (యూఈపీఎల్)లో పెట్టుబడి పెట్టిందని ఇటీవల వైఎస్ విజయమ్మ కూడా తన ప్రజాహిత వ్యాజ్యంలో ఆరోపించారు. దీనిపై జరుగుతున్న సీబీఐ విచారణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ఇచ్చిన స్టే కారణంగా ప్రస్తుతం నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

‘ఈనాడు’ టు రిలయన్స్ వయా కంపానీ....
2008 జనవర్లో ఈక్వేటర్, అనూ ట్రేడింగ్ ద్వారా ఉషోదయాలోకి రూ.2,600 కోట్లు వచ్చాయి. ప్రతిగా ఉషోదయాలో ఆ రెండు కంపెనీలకూ 39 శాతం వాటా దక్కింది. ‘ఈనాడు’ దినపత్రిక, రెండు తెలుగు చానళ్లు, 10 ఇతర భాషా చానళ్లన్నీ యూఈపీఎల్ కిందికే వస్తాయి. వీటిలో దేనికైనా విలువుందంటే అది ‘ఈనాడు’ పత్రికకు, తెలుగు చానళ్లకే. ఇతర భాషా చానళ్లు పేరుకు నడుస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వాటికన్నా స్థానిక, ఇతర జాతీయ చానళ్లే ఆధిపత్యం వహిస్తున్నాయి. పైగా ఈ చానళ్లకు పెద్దగా ఆస్తులూ లేవు. దాంతో రామోజీరావు తెలివిగా వాటిని ఉషోదయా నుంచి వేరు చేస్తూ... 2009లో డీమెర్జర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 

ప్రాంతీయ భాషా చానళ్ల కోసం ప్రిజమ్, హిందీ, ఉర్దూ చానెళ్ల కోసం పనోరమా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఏర్పాటు చేశారు. ఈటీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలుగు చానళ్లు రెండింటినీ ఉంచారు. ఈ మూడు కంపెనీలకూ పెద్దగా స్థిరాస్తులేమీ లేవు. వాటి చిరునామా బేగంపేటలోని ఉషాకిరణ్ కార్యాలయంలో ఓ డొక్కు గది. వాటి బ్యాలెన్స్ షీట్లు చూసినా... ఫిల్మ్, టెలి కాస్టింగ్ హక్కుల రూపంలో అమూల్యమైన ఆస్తులున్నాయంటారు. అలా చూసినా వాటి విలువ వంద కోట్లలోపే. ఎందుకంటే ఎక్కువ రైట్స్ తెలుగు చానళ్ల పేరిటే ఉన్నాయి. 

ఒకో షేరు విలువ రూ.5,28,630?
రిలయన్స్ సంస్థ దొడ్డిదారిన డబ్బా కంపెనీల ద్వారా ‘ఈనాడు’లో రూ.100 విలువైన ఒకో షేరును రూ.5,28,630 చొప్పున కొనుగోలు చేసి ప్రవహింపజేసిన మొత్తం సొమ్ము రూ.2,600 కోట్లు. దానికోసం మొత్తం 12 చానళ్లలోను, ‘ఈనాడు’ పత్రికలోను దానికి దక్కిన వాటా 39 శాతం. కానీ మంగళవారం ఉన్నట్టుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని సారాంశమేంటో తెలుసా..? తమ గ్రూపు సంస్థలు రామోజీ కంపెనీల్లో రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టాయని.. అందుకు ప్రతిగా తమకు ‘ఈటీవీ’ ప్రాంతీయ భాషా చానళ్లలో 100 శాతం వాటా ఉందని, ఈటీవీ తెలుగు, ఈటీవీ-2 చానళ్లలో మాత్రం 49 శాతం వాటా ఉందని! అంటే... ఉషోదయాలో రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు మూడేళ్ల తరవాత రిలయన్స్‌కు దక్కింది ఇదేనా? 

‘ఈనాడు’ పత్రికలో వాటాను పూర్తిగా వదులుకుని, రామోజీరావును స్వతంత్రుడిని చేయడానికే ఇదంతా చేస్తున్నారా? అసలు రిలయన్స్‌కు చానళ్ల బదలాయింపు ఎప్పుడు జరిగింది? ఈ మేరకు రిలయన్స్-రామోజీ మధ్య ఒప్పందమెప్పుడు కుదిరింది? కంపానీ కంపెనీలు రిలయన్స్ గ్రూపు సంస్థలెలా అవుతాయి? రిలయన్స్ తన బ్యాలెన్స్ షీట్లో కూడా ఎన్నడూ వీటిని తన అనుబంధ కంపెనీలుగా కానీ, గ్రూపు సంస్థలుగా కానీ పేర్కొనలేదే!! మరి రామోజీని బయటపడేయటం కోసం ఇంత కార్పొరేట్ నేరానికి ఎందుకు ఒడిగట్టినట్టు? ఇవే ప్రశ్నల్ని ముంబైలో ఉన్న రిలయన్స్ ప్రతినిధిని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. తనకేమీ తెలియదని జవాబిచ్చిన ఆ ప్రతినిధి... ఇ-మెయిల్ పంపితే సమాధానమివ్వటానికి ప్రయత్నిస్తానన్నారు. కానీ ఇ-మెయిల్‌కు కూడా ఎలాంటి సమాధానమూ రాలేదు.

ఆది నుంచీ చెబుతున్నదిదే...
చట్టవిరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరిస్తున్న విషయం బయటపడి రామోజీ హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబం) పీకల్లోతు నష్టాల్లో ఉన్నపుడు కంపానీ తెరపైకి వచ్చారు. అప్పుడే అందర్లోనూ పలు అనుమానాలు రేగాయి. కంపానీ ఎందుకు ఈ పెట్టుబడి పెడుతున్నారనే సందేహాలు వెల్లువెత్తాయి. తీగలాగితే రిలయన్స్ డొంక బయటపడింది. చంద్రబాబు సాయానికి ప్రతిగా క్విడ్ ప్రోకోగానే ఆ నిధులు వచ్చాయనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఇప్పుడు మళ్లీ రిలయన్స్ తన వాటాకు బదులుగా పెద్దగా ఆస్తులు, లాభార్జన లేని చానళ్లను తీసుకుని బయటకు వెళ్లిపోతుండటం ఆ ఆరోపణల్ని ధ్రువపరుస్తోంది. బిజినెస్ చానళ్లు నడుపుతున్న టీవీ-18 గ్రూప్‌తో రిలయన్స్ ఈ చానెళ్లను కొనిపిస్తూండటం... దానికోసం అప్పుల్లో ఉన్న టీవీ-18కు తానే రూ.1,400 కోట్లు కొత్త రుణం ఇస్తుండటం... రామోజీపై రిలయన్స్‌కున్న ఆసక్తిని మరింత స్పష్టంగా బయటపెడుతున్నాయి. 

తాజా ఒప్పందం ప్రకారం చూసినపుడు తెలుగు మినహా మిగిలిన ప్రాంతీయ భాషా చానళ్ల విలువే రూ.2,600 కోట్లట!! ‘ఈనాడు’ను కలిపితే ఆ విలువ రామోజీ లెక్కల ప్రకారం రూ.10 వేల కోట్లపైనే! అలాంటిది, ‘ఈనాడు’తో దాదాపు సమాన సర్క్యులేషన్‌ను సాధించి.. నాలుగేళ్లుగా దాన్ని నిలబెట్టుకుంటూ దూసుకెళ్తున్న ‘సాక్షి’ విలువ రూ.3,500 కోట్లుంటే మాత్రం రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. అందులో పెట్టుబడులు పెట్టినవారంతా వైఎస్ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందారు కనకే పెట్టుబడి పెట్టారంటున్నారు. రామోజీ ఎందుకిలా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి ఈజీగానే అర్థమవుతుంది.

తాజా ఒప్పందం లోగుట్టు ఇదీ...
* నెట్‌వర్క్ -18 గ్రూప్ ఇప్పటికే పలు చానళ్లను నిర్వహిస్తోంది. దీనికి టీవీ-18, నెట్‌వర్క్-18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే రెండు లిస్టెడ్ కంపెనీలున్నాయి. ఆ రెండింటి మార్కెట్ విలువ దాదాపు రూ.1750 కోట్లయితే ఇప్పటికే దాదాపు రూ.1,400 కోట్ల అప్పులున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల నష్టాలు వచ్చాయి.

* ఈ సంస్థకు ‘ఈటీవీ’ చానళ్లను కొనటానికి నిజానికి డబ్బుల్లేవు. కానీ రిలయన్స్ సంస్థ ఒక ఫండ్‌ను ఏర్పాటు చేసి... టీవీ-18 ప్రమోటర్లకు రూ.1,400 కోట్లు రుణంగా ఇస్తోంది. వారు ఈ సొమ్మును కంపెనీలో పెట్టి తమ వాటా పెంచుకుంటారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చేస్తారు.

* రూ.1,400 కోట్ల రుణం తీసుకున్నందుకు రిలయన్స్‌కు చెందిన ‘మీడియా ట్రస్ట్’కు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేస్తారు. 

* ఇదికాక మరో రూ.2,600 కోట్లను రిలయన్స్ నుంచి సమీకరించడానికి ‘రైట్స్’ జారీ చేస్తారు. ఈ రైట్స్ తీసుకుని... ప్రతిగా రిలయన్స్ నగదు బదులు తన చేతుల్లోకి వచ్చిన రామోజీ చానళ్లలో కొంత వాటాను దానికి కేటాయిస్తుంది. అంటే... ఈటీవీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈటీవీ ఉర్దూ చానళ్లలో 100 శాతం, మిగతా ప్రాంతీయ భాషా చానళ్లలో 50 శాతం, తెలుగు చానళ్లలో 24.5 శాతం నెట్‌వర్క్-18కు దక్కుతాయి. 

* 5 ప్రాంతీయ భాషా చానళ్లలో 50 శాతం వాటా, తెలుగు చానళ్లలో 24.5 శాతం వాటా రిలయన్స్ వద్దే ఉంటాయి.

* తెలుగు చానళ్లలో మెజారిటీ వాటా... అంటే 51 శాతం రామోజీ చేతిలోనే ఉంటుంది.

* పెపైచ్చు నెట్‌వర్క్-18, టీవీ-18లలో 51 శాతం వాటా దాని ప్రమోటర్ రాఘవ్ బెహల్ చేతిలోనే ఉంటుంది. రిలయన్స్‌కు మైనారిటీ వాటా మాత్రం దక్కుతుంది.

* అంటే దాదాపు రూ.4,000 కోట్లు (‘ఈనాడు’కు 2,600 కోట్లు , టీవీ-18కు 1,400 కోట్లు చొప్పున) వెచ్చించిన రిలయన్స్‌కు దక్కుతున్నది నామమాత్రపు వాటానే.

* మరోవైపు టీవీ18, నెట్‌వర్క్18 సంస్థల కంటెంట్‌ను ప్రసారం చేసే విషయంలో ఆర్‌ఐఎల్‌కు చెందిన ఇన్ఫో టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌కు ప్రాధాన్య హక్కులు దక్కుతాయి. 

* ఈ మొత్తం వ్యవహారంలో నంబర్-1 లబ్ధిదారు ఎవరైనా ఉంటే అది రామోజీరావే! నెంబర్-2 లబ్ధిదారు రాఘవ్ బెహలే. నష్టపోయింది మాత్రం రిలయన్స్‌ను నమ్మి, దాన్లో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్లే. ఇదీ కథ! 

ఆది నుంచీ మౌనరాగమే...
‘క్విడ్ ప్రో కో’ ఆరోపణలపై మొదటి నుంచీ రామోజీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ మౌనం వహిస్తూనే వచ్చాయి. అసలు తమ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసిందని కూడా రామోజీరావు ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. అటు రిలయన్స్ కూడా తమ వార్షిక నివేదికల్లో గానీ, వాటాదారుల సమావేశాల్లో గానీ ఎన్నడూ దీన్ని ఒప్పుకోలేదు. ఈక్వేటర్ ట్రేడింగ్, అనూ ట్రేడింగ్‌లకు తాము షేర్లు కేటాయించినట్లు తప్పనిసరి స్థితిలో ఆర్‌ఓసీ వద్ద రామోజీ డాక్యుమెంట్లు దాఖలు చేశారు తప్ప... ఆ కంపెనీలెవరివో, ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశాయో ఇప్పటిదాకా చెప్పలేదు. నిన్న మొన్నటిదాకా దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్న రిలయన్స్ కూడా దీనిపై స్టాక్ ఎక్స్ఛేంజీలకు కూడా సమాచారమివ్వలేదు. 

షేర్‌హోల్డర్ల సొమ్మును వారికి తెలియకుండా పెట్టుబడి పెట్టిన రిలయన్స్... దీనిపై ‘సాక్షి’లో కథనాలు వెలువడినప్పుడు కానీ, రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు ఆరోపించినపుడు గానీ ఎన్నడూ జవాబిచ్చే సాహసం చెయ్యలేదు. నిజానికి ఏ సంస్థలోనైనా రిలయన్స్ పెట్టుబడి పెట్టాలనుకుంటే నేరుగా పెట్టొచ్చు. అదేమీ నేరం కాదు. కానీ రిలయన్స్ సంస్థ ‘ఈనాడు’లో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకున్న మార్గం ఆద్యంతం రహస్యంగానే నడిచింది. రిలయన్స్ ట్రస్ట్ నుంచి హోల్డింగ్స్‌కు నిధులు మళ్లించటం... దాన్నుంచి ఆల్టిట్యూడ్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్, కవీంద్రా కమర్షియల్స్, దేవకీ కమర్షియల్స్, షినానో రిటైల్, తీస్తా రిటైల్ సహా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన డజనుకు పైగా కంపెనీల్లోకి నిధులు మళ్లటం... చివరికి నిమేశ్ కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్‌లోకి... అక్కడి నుంచి ఉషోదయాలోకి ప్రవహించటం ఆద్యంతం అనుమానాలకు తావిచ్చేదే. 

ఇన్ని డబ్బా కంపెనీల నుంచి నిధుల్ని ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్న ప్రశ్నకు రామోజీ, రిలయన్స్‌ల నుంచి నేటికీ జవాబు లేకపోవటం గమనార్హం. కేజీ బేసిన్ తవ్వకాల్లో ముఖ్యమంత్రి హోదాలో రిలయన్స్‌కు చంద్రబాబు చేసిన ‘ఉదార’ సాయాలకు ప్రతిఫలంగానే ఆయన రాజగురువు కంపెనీల్లోకి రిలయన్స్ ఇంత అడ్డదిడ్డంగా నిధులు గుమ్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందునుంచీ చెబుతున్నదే నిజమని తాజా పరిణామాల నేపథ్యంలో తేలిపోయింది.

కోర్టుల్లో కేసులుండగానే....
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు ఇప్పటికే బయటపడింది. ఎందుకంటే వ్యక్తులుగానీ, వ్యక్తుల సమూహం గానీ డిపాజిట్లు సేకరించటాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా సేకరించిన డిపాజిట్లకు రెండు రెట్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.2,600 కోట్ల డిపాజిట్లు సేకరించారు కనక రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు వివిధ కోర్టుల్లో రామోజీపై ఆదాయపు పన్ను కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో గనక నేరం రుజువయితే గరిష్టంగా రూ.2,500 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తమ్మీద రూ.7,700కోట్ల జరిమానా చెల్లించాల్సిన కేసులో రామోజీ, ఆయన సంస్థలు ప్రస్తుతం విచారణనెదుర్కొంటున్నాయి. 

ఒకవేళ నేరం రుజువయి అంత జరిమానా పడితే రామోజీ ఎలా చెల్లిస్తారు? ఇదే ప్రశ్న ఇపుడు అందరినీ వేధిస్తోంది. ఎందుకంటే రామోజీ సంస్థల్లో కాస్త విలువైనదిగా చెప్పే రామోజీ ఫిల్మ్‌సిటీలోని భూములన్నీ వివాదాస్పదంగానే ఉన్నాయి. అసైన్‌మెంట్ భూముల్ని కొన్నందుకు, సీలింగ్ పరిమితిని అతిక్రమించినందుకు దీనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి వాటిని పక్కనబెట్టాల్సి ఉంటుంది. మిగతా ఆస్తులు చూస్తే ఉన్నవల్లా ఈనాడు పత్రిక, టెలివిజన్ చానెళ్లే. ప్రస్తుతం టెలివిజన్ చానెళ్లను అమ్మేస్తే పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. అందుకని ఈ ఒప్పందాన్ని నిలుపు చేయటమో... లే క ఒప్పందం కుదిరితే తద్వారా వచ్చిన సొమ్మును ఎస్క్రో ఖాతాలో వేసి కేసుల్లో తుది తీర్పు వెలువడే వరకూ అట్టిపెట్టడమో చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సింది అయితే ప్రభుత్వం... లేకుంటే న్యాయస్థానాలు. అవేం చేస్తాయో చూడాల్సిందే!!
Share this article :

0 comments: