ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది

ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012

సీబీఐ దర్యాప్తు తీరుపై ప్రశ్నలు సంధించిన ప్రత్యేక కోర్టు 
అసలు సునీల్ అరెస్టును మీరు ఎలా సమర్థించుకుంటారు? 
సునీల్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీ కోరిన సీబీఐ అధికారులు 
రెండున్నర రోజుల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి
న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని స్పష్టీకరణ 
సీబీఐది అధికార దుర్వినియోగం: సుశీల్‌కుమార్ వాదన
రంగారావును ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? 
ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది.. ఆ పత్రికల 
ప్రతినిధులను సీబీఐ వెంట పెట్టుకుని తిరుగుతోంది... లీకులపై కోర్టు దృష్టి సారించాలి
ఎమ్మార్ రాష్ట్రంలోకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే.. ఎమ్మార్‌కు భూములు 
కేటాయించిందీ, కీలక జీవోలిచ్చిందీ బాబే.. ఆయనను సీబీఐ ఎందుకు ప్రశ్నించదు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఎమ్మార్ వ్యవహారంలో సునీల్‌రెడ్డి పాత్రపై ఒక్క ఆధారమైనా ఉందా? ఎఫ్‌ఐఆర్ దాఖలు సమయంలో ఒక్క చిన్న ఆధారమైనా సంపాదించారా? ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పాత్రపై ఒక్క లైను కూడా లేదు. అసలు సునీల్‌రెడ్డి అరెస్టును మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇన్ని రోజులుగా సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా మీరు సంపాదించిన ఆధారాలేమిటి?’’ అని సీబీఐ అధికారులను ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. సునీల్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది చూపిన సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే.. ఈ మొత్తం కేసు వారికే అనుకూలంగా ఉందని సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సునీల్‌రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ గట్టిగా పట్టుపట్టినప్పుడు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని సీబీఐ అధికారులు.. చివరకు రెండున్నర రోజుల కస్టడీకి అంగీకరించారు. 

దీంతో సునీల్‌రెడ్డిని శనివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి బి.నాగమారుతీశర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని సీబీఐ అధికారులను ఆదేశించారు. సునీల్‌రెడ్డిని ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే న్యాయవాదుల సమక్షంలోనే ప్రశ్నించాలని, అనంతరం రిమాండ్‌కు తరలించాలని స్పష్టం చేశారు. సునీల్‌రెడ్డిని 15 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనల విన్న అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సునీల్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదించగా.. సీబీఐ తరఫున బిళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. సుశీల్‌కుమార్ దాదాపు రెండు గంటల పాటు తన వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరును.. అందులోని లోపాలను.. పక్షపాత ధోరణిని.. అధికారులు కొన్ని పత్రికలకు చేస్తున్న ఉద్దేశపూర్వక లీకులను.. సీబీఐ అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ఆయన ఎత్తిచూపారు. ఒక వర్గం మీడియా ప్రచురిస్తున్న అసత్య కథనాలను కూడా కోర్టు ముందుంచారు. 

రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు?

ఎమ్మార్ వ్యవహారంలో కీలక నిందితుల్లో ఒకరైన స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావును సీబీఐ అధికారులు ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవటాన్ని సుశీల్‌కుమార్ ప్రశ్నించారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే రంగారావును అరెస్ట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ, రంగారావుల మధ్య కుట్ర సాగుతోందని చెప్పారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని వదిలి వేసి.. సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ మొత్తం కేసులో సీబీఐకి ఎలా కావాలంటే అలా.. ఏం కావాలంటే అది.. రంగారావు చెప్పారు. అందుకే సీబీఐ ఆయన జోలికి వెళ్లటం లేదు. రంగారావును పిలుస్తారు.. తాము అనుకున్నది ఆయన చేత చెప్పించుకుని వెంటనే పంపేస్తున్నారు. కానీ మిగిలిన వారిని మాత్రం విచారణ పేరుతో పిలిపించి.. అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

రంగారావు విషయంలో సీబీఐ ఎందుకింత ప్రేమ కనపరుస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో సీబీఐ స్వతంత్రంగా సాధించింది ఏమీ లేదు. రంగారావు చెప్పిన దానిని బట్టే సునీల్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సహ నిందితుడు చెప్పిన దానిని బట్టి.. ఇతరులను అరెస్ట్ చేయటం సరికాదు. ఈ విషయం నేను చెప్పటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కానీ సీబీఐ అధికారులు ఇందుకు విరుద్ధంగా రంగారావు ఏదో చెప్పారంటూ సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తమకు రంగారావు ఇన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టే.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేలా ఆయనను ప్రేరేపించారు. 

ఈ కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ ఏం రాసిందో ఒక్కసారి చూడండి. కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కలిసి కుట్రపన్నారని సీబీఐయే చెప్పింది. అలాంటప్పుడు కోనేరును అరెస్ట్ చేసి.. రంగారావును ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ కేసులో కోనేరు ప్రసాద్, రంగారావులే ప్రధాన కుట్రదారులు, నిందితులు. కానీ సీబీఐ అధికారులు రంగారావు పేరును ప్రతి చోటా తప్పిస్తూ వస్తున్నారు. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ రంగారావు ప్రస్తావన ఉంది. ఆ తీర్పు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆయన పేరు ఉంది. అయినా కూడా సీబీఐ ఆయన జోలికి వెళ్లదు. ఎందుకంటే రంగారావును అరెస్ట్ చేస్తే.. తమకు అనుకూలంగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి. రంగారావును సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రతి దశలోనూ అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇదేనా దర్యాప్తు చేయాల్సిన పద్ధతి?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

‘‘నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని మాటల్లో చెబితే సరిపోదు.. అది చేతల్లో కనిపించాలి. కానీ సీబీఐ దర్యాప్తు తీరును చూస్తుంటే వారివి కేవలం మాటలేనని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. ‘‘ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో. ఎమ్మార్‌కు భూములు కేటాయించింది ఆయనే. ఆయన హయాంలోనే కీలక జీవోలన్నీ జారీ అయ్యాయి. అసలు కుట్రకు తెరలేచింది బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. అయినప్పటికీ సీబీఐ అధికారులు ఆయన జోలికి వెళ్లరు. ఆయనను కనీసం పిలిపించి ప్రశ్నించటం కూడా చేయరు. బాబును ఎందుకు పిలిపించరో.. ఎందుకు ప్రశ్నిం చరో.. సీబీఐకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎమ్మార్ కేసులో బాబు హయాం నుంచీ దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు, సీబీఐ తదితరులకు నోటీసులు కూడా జారీ చేసింది’’ అని ఆయన గుర్తుచేశారు. 

సీబీఐ దర్యాప్తు తీరు చూడండి...

‘‘ఈ కేసులో సీబీఐ తన దర్యాప్తును ఏ విధంగా చేస్తోందో ఒక్కసారి చూడండి. సునీల్‌రెడ్డి అరెస్టు జరిగిన తీరును చూస్తే సీబీఐ దర్యాప్తు ఎంత సక్రమంగా సాగుతోందో అర్థమవుతోంది. సునీల్‌రెడ్డిని ఈ నెల 24న ఉదయం 6గంటలకు ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్ కేసులో ఒక్కసారి కూడా సునీల్‌రెడ్డిని విచారించలేదు. కనీసం నోటీసులు జారీ చేయలేదు. అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి ఆయన బ్యాంకు లాకర్లు ఉన్న బ్యాంకుకు తీసుకెళ్లి, నిబంధనలకు విరుద్ధంగా వాటిని తెరిచారు. బ్యాంకు లాకర్లలో సీబీఐ వారికి ఏమీ దొరకలేదు. అక్కడి నుంచి దిల్‌కుష అతిథి గృహానికి తీసుకువచ్చి.. అక్కడకు స్టైలిష్ రంగారావును పిలిపించి.. సునీల్‌రెడ్డి అతనేనా.. కాదా.. అని తేల్చుకున్నారు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకోలేదు. ఇలా చేయటం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. సోదాలు పూర్తయిన తరువాత సాయంత్రం 6.30కి అరెస్టు చేశారు. కానీ సునీల్‌రెడ్డే స్వయంగా తమ వద్దకు వచ్చి అరెస్టు చేయాలని కోరినట్లు సీబీఐ అధికారులు చెప్తున్నారు. ఇది నమ్మదగ్గ విధంగా ఉందా? సునీల్‌రెడ్డి అరెస్టు సమయంలో ఆయన నివసించే ప్రాంతంలో ఉండే ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా చూపాలి. కానీ సీబీఐ అధికారులు తమ జేబులో ఉండే ఇద్దరు బ్యాంకు అధికారులను సాక్షులుగా చూపారు. ఇది చట్టవిరుద్ధం.

సీబీఐది అధికార దుర్వినియోగం... 

అసలు ఏం చేశారని సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు..? గంటల కొద్దీ సోదాలు చేసి ఏం కనుగొన్నారు..? ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించి ఏం రాబట్టారు..? ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐది అధికార దుర్వినియోగం. దానిని ఈ కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. సీబీఐ ఏం కావాలంటే అది.. ఎలా కావాలంటే అలా దర్యాప్తు చేస్తోంది. ఇందుకు రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తమ విచారణలో సునీల్‌రెడ్డి ఏం చెప్పలేదని సీబీఐ చెబుతోంది. 

ఏదైనా తెలిసుంటే కదా.. చెప్పేందుకు. తెలియని విషయాలను గురించి ఎవరు మాత్రం ఏం చెప్తారు..? అందరూ రంగారావులాగా సీబీఐకి కావాల్సిన విధంగా చెప్పగలరా..? కోనేరు ప్రసాద్ కస్టడీ కోరే సమయంలో సీబీఐ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో.. విల్లాల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును దుబాయ్‌లోని తన కుమారుడి ఖాతాకు బదిలీ చేసిందని స్వయంగా చెప్పింది. మరి అలాంటప్పుడు సునీల్‌రెడ్డికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది..? సీబీఐ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్‌రెడ్డి పాత్ర గురించి హైకోర్టు తీర్పులో లేదు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేదు. కేవలం 25న దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రమే సునీల్ ప్రస్తావన ఉంది. ఇప్పటి వరకు ఎమ్మార్ కేసులో ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని కూడా అరెస్టు చేయలేదు. కీలక నిందితుడిగా ఉన్న రంగారావు జోలికి వెళ్లకపోవటం వెనుక ఉద్దేశాలు ఏమిటి?’’ అని సుశీల్ ప్రశ్నించారు.

ఆధారాలున్నాయి: సీబీఐ న్యాయవాది 

సీబీఐ తరఫు న్యాయవాది రవీంద్రనాథ్ వాదనలను వినిపిస్తూ.. సునీల్‌రెడ్డి అరెస్టును సమర్థించుకున్నారు. విల్లాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును కోనేరు ప్రసాద్.. సునీల్‌కు అందచేశారన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, మరింత సమాచారం రాబట్టేందుకే సునీల్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నామని కోర్టుకు చెప్పారు. వసూలు చేసిన మొత్తాలు అంతిమంగా ఎక్కడకు చేరాయనే విషయాన్ని సునీల్ ద్వారా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ డబ్బు ఎక్కడ దాచారు? ఎవరికిచ్చారు? తదితర కీలక సమాచారాన్ని సునీల్ వెల్లడించాల్సి ఉందన్నారు. అందువల్ల 15 రోజులు కాకున్నా కనీసం ఐదు రోజుల పాటైనా ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనికి సునీల్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తరువాత కోర్టు రెండున్నర రోజులకు సునీల్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ మీడియాకు సీబీఐ లీకులు... 

‘‘సీబీఐ మొదటి నుంచీ ఓ వర్గం మీడియాను ప్రోత్సహిస్తూ వస్తోంది. వారికే ఉద్దేశపూర్వకంగా లీకులిస్తోంది. ఏ రీతిలో కథనం ప్రచురిస్తే.. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు నష్టం కలుగుతుందో.. అదే రీతిలో కథనాలు రాయిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియాను సీబీఐ తన వెంట తిప్పుతోంది. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను. సునీల్‌రెడ్డి వ్యవహారంలోనూ ఇదే జరిగింది. ఉదయం 6 గంటలకు సీబీఐ అధికారులు సునీల్‌రెడ్డి ఇంటికి వెళితే.. సీబీఐతో పాటు ఆంధ్రజ్యోతి అక్కడ ఉంది. సునీల్ ఇంటికి సీబీఐ వెళుతోందని ఆంధ్రజ్యోతికెలా తెలిసింది? సీబీఐ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారు కాబట్టే.. ఆ పత్రిక అక్కడకు రాగలిగింది. 

చిన్న లీకు ఆధారంగా ఆ రెండు పత్రికలు అర్థం లేని కథనాలను తయారు చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో కూడా రాస్తున్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్ మీడియా ప్రతినిధులకు ఎలా అందుబాటులోకి వస్తోంది? పత్రికల్లో వచ్చిన కథనాలను ఓసారి చూడండి. అందులో ఉపయోగించిన భాషను పరిశీలించండి (కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల తాలూకు కటింగులను న్యాయమూర్తికి ఇచ్చారు). ఇదంతా కూడా పెద్ద కుట్ర. అసలు 161 స్టేట్‌మెంట్లు ఈ పత్రికలకు ఎలా తెలుస్తున్నాయి? దీనిపై కోర్టు దృష్టి సారించాలి’ అని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. సీబీఐ కొన్ని సమయాల్లో సీరియస్‌గా వ్యవహరించటం లేదని వ్యాఖ్యానించారు. 

కటిక నేలపై పడుకోబెట్టారు...

అరెస్టు చేసిన రోజున సునీల్‌రెడ్డితో సీబీఐ వ్యవహరించిన తీరుపై సుశీల్‌కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. సీబీఐ మానవత్వం లేకుండా వ్యవహరించిందని తెలిపారు. ‘‘సీబీఐ అధికారులు ఇక్కడే ఉన్నారు. వారిని ఒక్క ప్రశ్న అడగండి. ఐవో (దర్యాప్తు అధికారి)గా కాకుండా ఓ మనిషి హోదాలో చెప్పమనండి.. సునీల్‌రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించారో. అరెస్టు చేసిన రాత్రి సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లో ఉంచారు. కటిక నేలపై పడుకోబెట్టారు. కింద పరుచుకోవటానికి, కప్పుకోవటానికి దుప్పటి కూడా ఏర్పాటు చేయలేదు. పక్కనే ఉన్న మ్యాట్‌ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మూత్ర విసర్జనకు సైతం సరైన సదుపాయాలు లేవు. సీబీఐ కావాలనే ఇదంతా చేస్తోంది’’ అని సుశీల్ వివరించారు. సుశీల్‌కుమార్ వాదిస్తున్న సమయంలో సీబీఐ న్యాయవాది రవీంద్రనాథ్ జోక్యం చేసుకుంటూ.. సునీల్‌రెడ్డి ప్రమేయంపై ప్రతి విషయాన్ని ఆధారాలతో నిరూపిస్తామని, ఇది తమ చాలెంజ్ అని పెద్ద గొంతుతో వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం సునీల్‌రెడ్డి పిటిషన్

ఎమ్మార్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న తనకు ప్రత్యేక హోదా కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని సునీల్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన విద్యార్హతలు, హోదాను పరిగణనలోకి తీసుకుంటూ తన అభ్యర్థనను మన్నించాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ఈ నెల 30న విచారించనున్నది.
Share this article :

0 comments: