సాయిరెడ్డి అరెస్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయిరెడ్డి అరెస్టు

సాయిరెడ్డి అరెస్టు

Written By ysrcongress on Tuesday, January 3, 2012 | 1/03/2012

* ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు... ఇప్పటికి 200 గంటలకు పైగా ఇంటరాగేషన్... ఇపుడు అరెస్టు చేసి కొత్తగా ప్రశ్నించేదేమీ ఉండదంటున్న విశ్లేషకులు
* అసలు ఆరోపణ ‘క్విడ్ ప్రో కో’... అంటే ప్రభుత్వాస్తుల్ని చౌకగా కట్టబెట్టి ప్రతిగా తాను లాభపడటం.. అది తేలాలంటే ప్రభుత్వం ఎలా నష్టపోయిందో ముందు తేల్చాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* ఆ దిశగా ఇప్పటికీ దృష్టిపెట్టని దర్యాప్తు సంస్థ; ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవ్వరినీ ప్రశ్నించని వైనం
* దర్యాప్తు పేరిట ఇప్పటికే ‘సాక్షి’లో, ఇన్వెస్టర్ల ఇళ్లలో పలుమార్లు సోదాలు, సాక్షులకు వేధింపులు
* సీబీఐ పరిధి దాటుతోందంటూ కోర్టును ఆశ్రయించిన సాయిరెడ్డి
* సీబీఐని కేంద్రం చెప్పుచేతల్లో నుంచి తప్పించి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కూడా పిటిషన్... దాన్ని విచారణకు స్వీకరించి... కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు
* రైతులు, రైతు కూలీల అంశంపై కిరణ్ సర్కారుపై పెట్టిన అవిశ్వాసంలో జగన్ వైపే నిలిచిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు
* దాంతో అనివార్యమైన ఉప ఎన్నికలు... తిరుగు లేని గెలుపు జగన్ వర్గానిదే అంటున్న సర్వేలు
* జగన్‌ను అడ్డుకోవటానికే సాయిరెడ్డి అరెస్టు అంటున్న విశ్లేషకులు
* తద్వారా జగన్ వర్గాన్ని భయభ్రాంతుల్ని చేసే ఎత్తుగడ

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాస్తుల్ని పలువురికి కట్టబెట్టారని, అందుకు ప్రతిగా తన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన ‘సాక్షి’ పత్రికలో పెట్టుబడులు పెట్టించుకున్నారని నమోదైన కేసులో జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. మంగళవారం ఉదయం ఆయన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. 

సోమవారం ఉదయం నుంచి సాయిరెడ్డిని దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు... రాత్రి 7 గంటల సమయంలో అరెస్టు చేశారు. సీబీఐ ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని బృందం తొలుత సాయిరెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లింది. దాదాపు రెండు గంటల సేపు అక్కడే సోదాలు చేశారు. తర్వాత ఆయన్ను నేరుగా ‘సాక్షి’ కార్యాలయానికి తీసుకొచ్చి 11.25 గంటల వరకు సోదాలు చేసి రెండు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని విజయసాయిరెడ్డి ఆడిటింగ్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. అంతకుముందు... ఉదయం 10 గంటలకు దిల్‌కుశ అతిథి గృహానికి విజయసాయిరెడ్డిని సీబీఐ అధికారులు పిలిపించారు. దాదాపు 9 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత రాత్రి అరెస్టు చేశారు. ఆ సమాచారాన్ని సాయిరెడ్డి కుటుంబీకులకు తెలియజేశారు. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో తొలి నిందితుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉండగా, విజయసాయిరెడ్డి రెండో నిందితుడు.

ప్రభుత్వాస్తుల్ని కారుచౌకగా కట్టబెట్టినందుకే పలువురు ఇన్వెస్టర్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారని, ‘క్విడ్ ప్రో కో’ కింద వచ్చిన ఈ పెట్టుబడులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే హోదాలో పి.శంకర్రావు గతంలో హైకోర్టుకు లేఖ రాశారు. అప్పట్లో చీఫ్ జస్టిస్‌గా ఉన్న నిస్సార్ అహ్మద్ కక్రూ దీనిపై విచారించి... సీబీఐతో తొలుత ప్రాథమిక విచారణకు, ఆ తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. తదనంతర పరిణామాల్లో శంకర్రావు రాష్ట్ర మంత్రి అయ్యారు. కక్రూ రిటైరై... ఇపుడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ జగన్... అసలు ‘క్విడ్ ప్రో కో’ అనే వాదననే తోసిపుచ్చారు. 

‘‘క్విడ్ ప్రో కో అంటే ప్రభుత్వాస్తుల్ని కారుచౌకగా కట్టబెట్టి దానికి ప్రతిగా లబ్ధి పొందటం. దీన్ని నిగ్గు తేల్చాలంటే ప్రభుత్వాస్తుల్ని చౌకగా కట్టబెట్టారనేది ముందు రుజువు కావాలి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిబంధనల్ని పట్టించుకోకుండా ప్రభుత్వాస్తుల్ని పలువురికి కేటాయించిందని, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని తేల్చాలి. అది తేల్చాక... ఆ రకంగా లబ్ధి పొందినవారు, అందుకే మా దగ్గర పెట్టుబడులు పెట్టారని రుజువు చెయ్యాలి. అలాంటిదేమీ చేయకుండా... మా దగ్గరకు వచ్చిన పెట్టుబడుల్ని చూపిస్తూ... ఆ ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుంచి ఏమేం పొందారో విచారించి... అవన్నీ పొందినందుకే ఈ పెట్టుబడులు పెట్టారని చెబుతుండటం న్యాయం కాదు’’ అని ఆయన వాదించారు. 

‘‘నా తండ్రి మరణించటంతో ఆ బాధను తట్టుకోలేక రాష్ట్రంలో కొన్ని వందల మంది అసువులు బాశారు. వారికిచ్చిన మాటకు కట్టుబడి నేను ఓదార్పు యాత్ర చేపట్టడం ఇష్టం లేని కొందరు కాంగ్రెస్ నేతలు దాన్ని పార్టీ అధిష్టానం సాయంతో అడ్డుకోబోయారు. అధిష్టానం ఆదేశాల్ని లెక్క చేయకుండా మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తున్నందుకే ఈ వేధింపులు! నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేశాక వేధింపులు మరీ ఎక్కువయ్యాయి’’ అని కూడా జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు పేర్కొనటం గమనార్హం.

నిజానికి ‘క్విడ్ ప్రో కో’ కింద ప్రధానంగా కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ, ఆ అంశంపై దృష్టి పెట్టనేలేదు. విచారణలో భాగంగా ఇప్పటికే విజయసాయిరెడ్డిని దాదాపు 30 సార్లు సుదీర్ఘంగా రోజుల తరబడి ప్రశ్నించింది. ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది మొదలు... ఈనాటి వరకు ఆయన్ను దాదాపు 200 గంటలకు పైగా విచారించింది. ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేస్తూ వారి ఇళ్లపై, ‘సాక్షి’ కార్యాలయాలపై, జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసింది. ఇలా ఒకరకమైన టై సృష్టించడంతో... ఇదేం న్యాయమని ప్రశ్నిస్తూ దివంగత వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సాక్షాత్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు! చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఇలా చేయటం వేధించటం కాక మరేమిటని తీవ్రంగా ప్రశ్నించారు కూడా. అయినా సీబీఐ తన ధోరణి మార్చుకోలేదు. ఇన్వెస్టర్లను బెదిరిస్తూ... సాక్షుల్ని వేధించటానికి కూడా వెనకాడలేదు. ఆఖరికి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి సుదీర్ఘంగా కొలతలు కూడా వేశారు. 

ఇన్ని చేసినా ప్రతి ఇన్వెస్టరూ తాము వ్యాపారంలో భాగంగా ‘సాక్షి’లో పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉంటాయని భావించి పెట్టామే తప్ప మరొకటేమీ లేదని స్పష్టంగా చెప్పటంతో దర్యాప్తు సంస్థకు దిక్కు తోచలేదు. చివరికి ఆడిట్ సంస్థ డెలాయిట్‌కు చెందిన డెరైక్టర్‌ను తీసుకొచ్చి... వాల్యుయేషన్‌ను పెంచి చూపించాలని విజయసాయిరెడ్డి అడిగినట్లుగా, కావాలని పాత తేదీలు వేయించినట్లుగా తమకు కావాల్సిన విధంగా ఆయన చేత చెప్పించారు. అవన్నీ డొల్ల వాదనలని విజయసాయిరెడ్డి సాక్ష్యాలతో సహా చూపించటంతో పాటు సుదర్శన్‌తో తనకు ముఖాముఖి ఏర్పాటు చేయాలని సవాలు కూడా విసిరేసరికి దర్యాప్తు సంస్థకు ఏమీ తోచలేదు. దాంతో ఎటూ పాలుపోని దర్యాప్తు సంస్థ, ఈ మధ్య కేసుతో సంబంధం లేని పలువురిని తీసుకొచ్చి... 2004కు ముందరి అంశాలను కూడా విచారిస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. 

ఇవన్నీ చూసిన విజయసాయిరెడ్డి, ఈ తీరును ఇటు సీబీఐ కోర్టులో సవాల్ చేయటంతో పాటు... కేంద్ర సర్కారు సంకెళ్ల నుంచి విముక్తం చేస్తూ సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఒకరకంగా సీబీఐని రాజకీయ సంకెళ్ల నుంచి విముక్తం చేసేందుకు న్యాయ పోరాటానికి దిగారు. ఢిల్లీ హైకోర్టు సైతం దీన్ని విచారణకు స్వీకరించి కేంద్రానికి, సీబీఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పలువురు వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు సేకరించి, వాటి ఆధారంగా తనను వేధింపులకు గురి చేస్తుండటంతో... ఆ వాంగ్మూలాల వివరాలు (164 స్టేట్‌మెంట్లు) తనకివ్వాలంటూ ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. ఈ విధంగా తమపై న్యాయ పోరాటానికి దిగిన విజయసాయిరెడ్డిని ఎలాగైనా నియంత్రించాలన్న ఉద్దేశంతోనే ఇలా ఉన్నట్టుండి అరెస్టు చేసినట్లు సాక్షాత్తూ సీబీఐ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

కేసు తీరిదీ...
* కంటోన్మెంట్ ఎమ్మెల్యే హోదాలో డాక్టర్ పి.శంకర్రావు తేదీ లేకుండా హైకోర్టుకు ఓ తెల్ల కాగితంపై లేఖ పంపారు. జగన్ ఆస్తులపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించలేదు.
* ఈ లేఖను పరిశీలించిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశరావు.. దీనిని రిట్ పిటిషన్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఆ మేర రిజిస్ట్రీ లేఖను రిట్ పిటిషన్‌గా మలిచింది. మొదట ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నేతత్వంలోని ధర్మాసనం విచారించింది.
* అటు తరువాత టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డిలు మరో పిటిషన్ వేశారు. జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.
* ఈ రెండు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
* జూలై 12, 2011న సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది.
* ఆగస్టు 1న సీబీఐ అధికారులు తమ ప్రాథమిక విచారణ నివేదికను సమర్పించారు.
* ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం.. ఆగస్టు 10న జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
* ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
* ఇందులో విజయసాయిరెడ్డిని రెండవ నిందితునిగా చేర్చారు.
* అప్పటి నుంచి అరెస్టు చేసేవరకు సాయిరెడ్డిని సీబీఐ అధికారులు వందల గంటల పాటు రోజుల తరబడి విచారించారు.

నమోదు చేసిన సెక్షన్లు ఇవీ...
* ఐపీసీ 120 (బి) (నేరపూరిత కుట్ర), రెడ్‌విత్ 420 (మోసం), 409 (నమ్మకద్రోహం), 477(ఎ) (అకౌంట్లను తారుమారు)
* అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(సి)(డి)
Share this article :

0 comments: