‘దీక్ష’ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘దీక్ష’ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర

‘దీక్ష’ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

తెలంగాణ సెంటిమెంట్‌ను మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గౌరవించారు
పార్టీలకతీతంగా రైతులు కదిలిరావాలి
మాది దండయాత్ర కాదు... చంద్రబాబులా కిరాయి గూండాలతో రావడంలేదు
రాజీనామా చేసిన వారి స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని ప్రకటించారు
జగన్ అధికారంలోకి వస్తేనే రైతన్నలకు 
మళ్లీ వైఎస్ హయాం రోజులు వస్తాయి



నిజామాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోరాదని, ఆర్మూర్‌లో 10, 11, 12 తేదీల్లో ఆయన చేపట్టిన రైతు దీక్షను స్వాగతించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ తెలంగాణ వాదులను కోరారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి, ఐసీడీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ప్రజల మనోభావాలకు భిన్నం గా ఎన్నడూ వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరులకు పార్టీ ప్లీనరీలోనే తాము శ్రద్ధాంజలి ఘటించామని గుర్తుచేశారు. తెలంగాణ అంశానికి సంబంధించి తమపార్టీ, అధినేత స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని, బలమైన ఆకాంక్షను గౌరవిస్తూ తెలంగాణకోసం రాజీనామా చేసినవారి స్థానాల్లో జరిగే ఎన్నికల్లో తాము అభ్యర్థులను నిలబెట్టబోమని స్పష్టంగా ప్రకటించారని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలా తమది దండయాత్ర కాదన్నారు. చంద్రబాబులా తమ అధ్యక్షుడు జగన్ కిరాయిగూండాలతో వచ్చే నాయకుడు కాదని, ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కాదని చెప్పారు. చంద్రబాబు, జగన్‌లకు పొంతనే లేదన్నారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరిపించే ఉద్దేశంలో దీక్ష చేపట్టేందుకు వస్తున్న జగన్ పర్యటనకు అడ్డుకోరాదని కోరారు. ఎక్కడైనా నిరసనలు ఎదురైతే తెలంగాణవాదుల మనోభావాలను గౌరవిస్తూ దండం పెడతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పార్టీలకు అతీతంగా రైతులు కదిలిరావాలి...

ఆర్మూర్‌లో జరగనున్న రైతుదీక్షకు పార్టీలకు అతీతంగా రైతులు కదిలిరావాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలపై గతంలో జగన్ అనేక పోరాటాలు చేసినా గుడ్డి, చెవిటి ప్రభుత్వంలో చలనం లేదని, అందుకే రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపి అండగా నిలిచేందుకు ఆయన దీక్ష చేపడుతున్నారని తెలిపారు. బోర్లమీదే ఆధారపడిన 70 శాతం మంది రైతులకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌తో మేలు చేశారని, రుణమాఫీ వల్ల లక్షలాదిమంది రైతులు లబ్ధి పొందారని గుర్తు చేశారు. వైఎస్ చొరవతో గాడినపడిన రైతుల జీవితాలు తిరిగి కష్టాల పాలవుతున్నాయని, ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ జగన్ అధికారంలోకి వస్తే కొనసాగుతాయన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తోందని వివరించారు. విశ్వసనీయతగల నేత జగన్ ఒక్కరే నన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల రైతాంగం పసుపు, వరి, చెరుకు, పత్తి పంటలు వేసి నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ హయాంలో ఈ పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని, ఇప్పుడు ఆ పరిస్థితిలేక రైతులు భూములు అమ్ముకునే దుస్థితి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్‌నుంచి బయటకొచ్చిన తరువాత ఎన్ని అడ్డంకులు వచ్చినా, విచారణ, బెదిరింపులు ఎదురైనా నిరంతరం ప్రజల్లో ఉంటున్న జననేత జగన్‌దీక్షను అందరూ స్వాగతించాలని కోరారు. 

జననేత పర్యటన ఇలా...

జననేత జగన్ పదోతేదీ ఉదయం ఏడుగంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, నిజామాబాద్ మీదుగా ఆర్మూర్‌లోని వైఎస్‌ఆర్ ప్రాంగణానికి మధ్యాహ్నం చేరుకుంటారని బాజిరెడ్డి చెప్పారు. బిక్కనూరు, చంద్రాయన్‌పల్లిల వద్ద జిల్లా నాయకులు, రైతులు జగన్‌కు స్వాగతం పలుకుతారని వివరించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతపెద్దల ఆశీస్సులు పొంది దీక్షను ప్రారంభిస్తారని చెప్పారు. 12 వ తేదీ సాయంత్రం స్థానిక రైతుల చేతుల మీదుగా దీక్ష విరమిస్తారని, అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. మూడురోజుల దీక్షలో తెలంగాణ ప్రాంత నేతలతో పాటు ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రైతులకు మద్దతుగా విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని బాజిరెడ్డి వివరించారు. 

‘దీక్ష’ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర

రైతు దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ కుట్ర పన్నుతోందని, తెలంగాణవాదులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని బాజిరెడ్డి దుయ్యబట్టారు. రైతులు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధుల శ్రేయస్సు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తపించారని, ప్రస్తుతం ఆ మహనీయుని బాటలో ఆయన తనయుడు జగన్ నడుస్తున్నారని తెలిపారు. దీనిని ఓర్వలేని టీడీపీ నాయకులు దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్‌కు మద్దతు తెలిపేందుకు ప్రతి రైతూ ఉబలాటపడుతున్నారని చెప్పారు. రైతుదీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లను ఆయన పర్యవే క్షించారు.
Share this article :

0 comments: