సాక్షి పెట్టుబడులపై వందసార్లు వివరణ ఇచ్చినా.. పిచ్చి రాతలు రాస్తునే ఉన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి పెట్టుబడులపై వందసార్లు వివరణ ఇచ్చినా.. పిచ్చి రాతలు రాస్తునే ఉన్నారు

సాక్షి పెట్టుబడులపై వందసార్లు వివరణ ఇచ్చినా.. పిచ్చి రాతలు రాస్తునే ఉన్నారు

Written By ysrcongress on Sunday, January 22, 2012 | 1/22/2012

* ఇప్పటికీ ఆయన తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు.. ఎందుకింతటి గోప్యత? 
* ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందమేమిటి? అందులోని మర్మమేంటో ప్రపంచానికి చెప్పాలి
* సాక్షి పెట్టుబడులపై వందసార్లు వివరణ ఇచ్చినా.. పిచ్చి రాతలు రాస్తునే ఉన్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తన కంపెనీల్లో రిలయన్స్ పెట్టుబడులపై ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు నోరు విప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రామోజీ సంస్థల కు చెందిన రూ.వంద విలువ చేసే ఒక్కో షేరును రిలయన్స్ 5 లక్షల 28 వేల 600 రూపాయలకు హెచ్చించి కొనడంలో మతలబేంటని ఆమె ప్రశ్నించారు. ఈ పెట్టుబడులపై రెండు మూడేళ్లుగా అటు రిలయన్స్.. ఇటు రామోజీ నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఈనాడు ప్రతికాధినేత రామోజీరావు పరిస్థితి దొంగే దొంగా.. దొంగా అంటూ అరిచినట్లుంది. తన కంపెనీలోకి రిలయన్స్ పెట్టుబడులపై ఇప్పటికీ తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు. 

ఈ నెల 3న రిలయన్స్ స్వయంగా ప్రకటించే వరకూ ఈనాడులో ఆ కంపెనీ పెట్టుబడుల గురించి ఎవరికీ తెలియదు. రిలయన్స్ తన వాటాదారులు, షేరు హోల్డర్లకు మాటమాత్రంగానైనా చెప్పలేదు. వార్షిక నివే దికలోనూ ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు ఇంత గోప్యంగా వ్యవహరించారు? ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందమేంటో.. అందులో దాగున్న మర్మమేంటో ప్రపంచానికి చెప్పాలి. తెలుగు ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టినందుకే ఆ పెట్టుబడులు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేజీ బేసిన్ బిడ్‌లలో రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చినందుకే నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థలోకి వేలకోట్ల రూపాయలు తరలించారు. తెలుగు ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి రామోజీ నోరు విప్పాలి’ అని పద్మ డిమాండ్ చేశారు. 

16 కాదు.. 20 కంపెనీలకు డెరైక్టర్‌గా ఉండొచ్చు..
జగతి పబ్లికేషన్, సాక్షి టీవీలోకి వచ్చిన పెట్టుబడులపై ఇప్పటి దాకా వందసార్లు వివరణ ఇచ్చామని పద్మ గుర్తు చేశారు. ‘రామోజీ మాదిరిగా నోరు మెదపకుండా ఉండలేదు. అయినప్పటికీ చేతిలో పత్రిక ఉంది కదా అని నాలుగేళ్లుగా పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నారు. పాత ఆరోపణలనే వల్లె వేస్తూ పాఠకులను మభ్యపెడుతున్నారు’ అని విమర్శించారు. సాక్షి పెట్టుబడులకు సంబంధించి రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉన్న సమాచారం నెట్‌లో ఎవరికైనా దొరుకుతుందని.. దీనికే రామోజీ తానేదో పరిశోధించిన కథనమంటూ తాటికాయంత అక్షరాలతో పాచి వార్తలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ‘జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులు పెట్టిన 22 కంపెనీల్లో 16 కంపెనీలకు ఒకే డెరైక్టర్ ఉన్నారని.. ఇదేదో పెద్ద తప్పు అన్నట్లు రామోజీ వ్యవహరిస్తున్నారు. కానీ మన చట్టాల ప్రకారం ఒక్క వ్యక్తి 20 కంపెనీలకు డెరైక్టర్‌గా ఉండవచ్చు. ఈ కనీస ఇంగిత జ్ఞానం రామోజీకి లేదా?’ అని నిలదీశారు. 

బ్రీఫ్‌కేస్, సెల్ కంపెనీలంటూ తన ఆలోచనలను ఇతరులపై రుద్దుతున్నారని పద్మ మండిపడ్డారు. రిలయన్స్ 36 రోజుల్లో 6 బ్రీఫ్‌కేస్, సెల్ కంపెనీలను సృష్టించి ‘ఈనాడు’లోకి పెట్టుబడులు ప్రవహింపజేసినందునే.. రామోజీ వాటి గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.1,900 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన టీవీ-18.. ఈటీవీ చానళ్లను రూ.2,100 కోట్లకు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. టీవీ-18కు ఉన్న చరిత్ర రామోజీకి పవిత్రంగా కనిపించిందా అని నిలదీశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండటమే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, దిగజారిన రాజకీయ విలువలకు ఆయన ప్రతీక అని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాబు తన బాధ్యత మరచి రెండున్నరేళ్ల క్రితం మరణించిన రాజశేఖరరెడ్డిపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. 

బాబు మాట్లాడుతున్న భాష చాలా అసభ్యంగా ఉందని, ఒక పార్టీ నాయకుడిగా అది ఆయనకు తగదని హితవు చెప్పారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఏడేళ్ల నుంచి ప్రతిపక్ష నేతగా ఉంటున్న వ్యక్తి ఏది పడితే అది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అసలు ఆయన ఒక పార్టీకి నాయకుడుగా ఉండటమే దౌర్భాగ్యమని అన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్నది చాలక, ఆయన చనిపోయేదాకా మానసికంగా హింసించిన ఘనత బాబుదన్నారు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాక ఆయన పేరు కూడా ఎక్కడా లేకుండా చెరిపేసిన బాబు ఇపుడు మళ్లీ అధికారంకోసం ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామంటూ బయలుదేరారని విమర్శించారు. 

వైఎస్ విగ్రహాలను తొలగిస్తామన్న బాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ విగ్రహాలు ప్రభుత్వ సొమ్ముతో పెట్టినవేమీ కావు. ప్రజలు, ముఖ్యంగా కూలీలు, పేదలు విరాళాలు పోగు చేసి ప్రతిష్టిస్తున్నవి. విగ్రహాలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు నివసించే కాలనీల్లోనే ఉన్నాయి. బాబు మళ్లీ వైఎస్సార్ విగ్రహాల గురించి మాట్లాడితే బాగుండదు’’ అని ఆయన హెచ్చరించారు. బాబు తొమ్మిదేళ్ల తన పాలనలో రైతులకుగానీ, సామాన్య ప్రజలకుగానీ ఏమీ చేయకుండా ఇపుడేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో అమలు జరిగిన పథకాల వల్లనే ప్రజలు ఆయన్ను మరువలేకుండా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

చంద్రబాబు తాను చేయించుకున్న సర్వేల్లో మళ్లీ టీడీపీ గెలిచే అవకాశం లేదని తెలుసుకున్నట్లుగా ఉందని, అందుకే దిగజారి విమర్శలు చేస్తున్నారని శ్రీకాంత్ దుయ్యబట్టారు. బాబు జిల్లా పర్యటనల్లో వస్తున్న స్పందనా అంతంత మాత్రమేనని, అందుకే తానేం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అందుకు ఆయన వద్ద ఉన్న రుజువులేమిటో చెప్పాలని నిలదీశారు. వైఎస్ ముఖ్యమంత్రి కాక మునుపే జగన్‌కు రూ.140 కోట్ల విలువ చేసే విద్యుత్ ప్రాజెక్టు ఉందన్నారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసులో విచారణ జరక్కుండా కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తన ఆస్తులపై విచారణకు ఆదేశించగానే బెంబేలెత్తి స్టే కోసం పడరాని పాట్లు పడ్డారని, నిజాయితీపరుడైతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు.
* వైఎస్ విగ్రహాలను తొలగిస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపాటు
* ఏడేళ్లుగా అధికారంలో లేకపోవడంతో గతి, మతి తప్పి మాట్లాడుతున్నారు
* ఆయన్ను ఆగ్రా పిచ్చాసుపత్రికి పంపాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రానికి మళ్లీ సీఎం అవ్వడమనేది బట్టి మాటేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు మూలింటి మారెప్ప, మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ విమర్శించారు. శనివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాలను తొలగిస్తామంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘అసలు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే కదా విగ్రహాలను కూల్చేది. ఈ జన్మకు ఆయన సీఎం కాలేరు. బాబు టీడీపీ అధినేతగా ఉంటే ఆ పార్టీకి కనీసం 50 ఏళ్ల పాటు భవిష్యత్తు ఉండదు. అందుకే ఆయన్ను ఆగ్రా పిచ్చాసుపత్రికి పంపాల్సిందిగా సలహా ఇస్తున్నాం’ అని చెప్పారు. గత ఏడేళ్లుగా అధికారంలో లేకపోవడంతో గతి తప్పి.. మతి తప్పి బాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రగడ్డలో ఉండే పిచ్చాసుపత్రి బాబు స్థాయికి సరిపోదని.. అందుకే ఆగ్రాలో చే ర్పించాలని అంటున్నామని చెప్పారు. 

బాబుకు ఒళ్లంతా విషమే..
బాబు వాడే భాషను చూసి జంతువులు కూడా అసహ్యించుకుంటున్నాయని మారెప్ప అన్నారు. తేలుకు కొండిలో.. పాముకు కోరల్లో విషం ఉంటే చంద్రబాబుకు శరీరమంతా విషమేనని చెప్పారు. ‘చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చిల్లర పథకాలు ప్రవేశ పెట్టి అల్లరి చేశారే తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదు. వైఎస్ కారణ జన్ముడు. 64 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ప్రవేశ పెట్టనన్ని పథకాలను అమలు చేశారు. అలాంటి వ్యక్తి విగ్రహాలను ప్రజలు నెలకొల్పుకుంటే బాబుకు అభ్యంతరం ఎందుకు? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు.. ఆయన చనిపోయిన 16 ఏళ్ల తరువాత లక్ష విగ్రహాలు పెడతామని చెప్పడం సిగ్గు చేటు’ అని అన్నారు. 

వైఎస్ జీవించి ఉన్నపుడు ఆయనతో పోరాడలేని బాబు.. చనిపోయాక ఆయనపై బురద జల్లుతున్నార ని విమర్శించారు. మాజీ మంత్రి శంకర్రావును కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ వాడుకుని వదిలేశాయన్నారు. జగన్‌పై ఆయనతో కేసు వేయించి.. ఆ తరువాత ఆయన్ను పదవి నుంచి తొలగించారని.. ఇది వారి కుల దురహంకారానికి నిదర్శనమని మారెప్ప అన్నారు. వైఎస్ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారని.. అలాంటి వ్యక్తి విగ్రహాలను తొలగిస్తామని చెప్పడం బాధాకరమని రెహమాన్ పేర్కొన్నారు. ‘బాబు చనిపోతే ఆయన కుమారుడు కూడా ఆయన విగ్రహం పెట్టడు. వైఎస్‌పై మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. నాలుక చీరేస్తాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత భారత చరిత్రలో వైఎస్‌దేనని అన్నారు.
 
Share this article :

0 comments: