చట్టవిరుద్ధమన్నా రోశయ్య పట్టించుకోలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చట్టవిరుద్ధమన్నా రోశయ్య పట్టించుకోలేదు

చట్టవిరుద్ధమన్నా రోశయ్య పట్టించుకోలేదు

Written By ysrcongress on Tuesday, January 24, 2012 | 1/24/2012

అమీర్‌పేటలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేసేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టంగా పేర్కొన్నా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పట్టించుకోలేదని సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, టీఎస్.అప్పారావులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేసిన ఆచార్య, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అప్పారావులు సోమవారం ఏసీబీ కోర్టులో సాక్షులుగా హాజరయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించి వీరి వాంగ్మూలాన్ని జడ్జి జయసూర్య నమోదు చేశారు. 

‘‘మైత్రీవనం, మైత్రీవిహార్ ప్రాజెక్టుల కోసమే ఈ భూమిని హెచ్‌ఎండీఏ స్వాధీనం చేసుకుంది. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 48 కింద ప్రభుత్వం భూమి స్వాధీనం నోటిిఫికేషన్ ఇచ్చిన తర్వాత రద్దు చేయడం కుదరని ప్రభుత్వానికి స్పష్టం చేశాం... ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తోంది. అమీర్‌పేటలో ప్రభుత్వ భూమిని డీనోటిఫై చేస్తే ఔటర్‌రింగ్ రోడ్డులో తమ భూములు కోల్పోయిన వారు డీనోటిఫై చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. డీనోటిఫై చేయడం మంచి పరిణామం కాదు. 

అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రూ.200 కోట్ల విలువైన భూమి. డీనోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధం... అప్పటి మున్సిపల్ మంత్రి కూడా భూమి డీ నోటిఫై చేయడం కుదరదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ భూమిని పొందిన వారు నిజమైన యజమానులు కారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీరు తెర మీదకు వచ్చారు. మా నిర్ణయాన్ని కాదని అప్పటి సీఎం రోశయ్య విచక్షణాధికారం మేరకు భూమిని నోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు. 

ఈ భూమి ప్రభుత్వం అధీనంలో లేదని, నామమాత్రపు అధీనంలో మాత్రమే ఉందని రోశయ్య నోట్ ఫైల్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ అధీనంలో లేని భూమిని డీనోటిఫై చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు’’ అని వారు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. అమీర్‌పేటలో 9.14 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని రోశయ్య ప్రభుత్వం డీనోటిఫై చేసి పలువురు వ్యక్తులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు న్యాయవాది మోహన్‌లాల్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: