నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను మూడుకో.. నాలుగుకో తగ్గించాలని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను మూడుకో.. నాలుగుకో తగ్గించాలని

నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను మూడుకో.. నాలుగుకో తగ్గించాలని

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

* చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టారు
* కాంగ్రెస్ పెద్దలు నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను మూడుకో.. నాలుగుకో తగ్గించాలని చూశారు
* తర్వాత జగనే ఎమ్మెల్యేలను తమ వద్దకు పంపించాడని విషప్రచారం చేయాలనుకున్నారు
* వారెన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యేలు విలువలకు కట్టుబడి రైతన్నకు మద్దతుగా ఓటేశారు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రైతు మీద ప్రేమ నటిస్తూ మొన్ననే అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై పెట్టిన ఆ అవిశ్వాసం అసలు ఉద్దేశం వేరే ఉంది. నాకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్యను ఎలాగైనా మూడుకో, నాలుగుకో తగ్గించాలన్నదే ఆ ఉద్దేశం. ఆ తరువాత జగనే తన ఎమ్మెల్యేలను మా దగ్గరకు పంపించాడని కాంగ్రెస్ పెద్దలు విషప్రచారం చేయాలనుకున్నారు. ఛీ.. ఇంత నీతిమాలిన రాజకీయాలా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 46వ రోజు గురువారం ఆయన సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పర్యటించారు. ఫిరంగిపురం పట్టణంలోని విజయదుర్గ కాలనీలో మేడా పోతురాజు, కోమెరపూడి గ్రామంలో రాజారపు సాంబశివరావు కుటుంబాలను ఓదార్చారు. తెక్కళ్లపాడులో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన బ్రహ్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామ వేదికపై ఆయనకు ఒక నిమిషం మౌనం పాటించారు. గురువారం యాత్రలో 12 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. సారాంశం ఆయన మాటల్లోనే..

వారెన్ని కుట్రలు చేసినా..
జగన్ విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడే మనిషి. ఎలాగైనా ఆయన్ను దెబ్బతీయాలి. దెబ్బతీయాలంటే ఏదో విషప్రచారం చేయాలని చెప్పి కాంగ్రెస్ పెద్దలు.. నాకు మద్దతు పలికిన కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆశ చూపారు.. డబ్బులు ఎరగా వేశారు.. కాంట్రాక్టు పనులు ఇస్తామన్నారు.. కొంతమందినైతే బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్‌ను అభిమానించే ఎమ్మెల్యేలు లొంగలేదు. పదవులు పోతాయని తెలిసి, ఉప ఎన్నికలు జరుగుతాయని తెలిసి కూడా అవిశ్వాసానికి మద్దతిచ్చారు. రైతన్నలకూ, రైతు కూలీలకు మేమున్నాం తోడుగా అంటూ, విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.

మన పిల్లలను బ్రాందీ షాపుకు దూరంగా పెడదాం 
మొన్న కృష్ణా జిల్లాలో ఒక గిరిజన తండాకు వెళ్లాను. ఆ తండాలో సారా తాగి 20 మంది చనిపోయారు. ‘అన్నా..! మా కళ్లకు కనపడేటట్టు బ్రాందీ షాపు పెట్టారు.. బెల్టు దుకాణం తెరిచారు.. అది చాలదన్నట్లు బట్టీలు పెట్టి సారా డిపో కూడా నడిపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నా. సారా బట్టీలు కళ్లెదురుగా కనపడుతుంటే భర్తా, కొడుకూ వెళ్లి తాగుతున్నారన్నా..’ అని అక్కడ అక్కాచెల్లెళ్లు చెప్పినప్పుడు బాధనిపించింది. 

పల్లెలు బాగుపడాలంటే పిల్లలు చదువుకోవాలి. మన పిల్లలను సారా.. బ్రాందీ దుకాణాలకు దూరంగా పెడదాం. వాటికి దూరంగా ఉండాలంటే పిల్లలను చదివించాలి. అక్కాచెల్లెమ్మలకు ఒక్క మాట చెప్తున్నాను. పిల్లలను మీరు బడికి పంపించండి.. మీ బ్యాంకు ఖాతాలో నెలనెలా డబ్బులు వేసే బాధ్యత మేం చూసుకుంటాం. గ్రామంలోకి బ్రాందీ, సారా రాకుండా చూసేందుకు అదే గ్రామానికి చెందిన పది మంది మహిళా పోలీసులను తయారు చేసి కాపలా పెడతాం.

నీతి లేని రాజకీయాలు చేస్తున్నారు..
ఇవాళ రాష్ట్రంలోనైనా.. కేంద్రంలోనైనా సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్. అటువంటి నేత చనిపోయాడన్న సంగతి తెలిసి, తిరిగి రాలేడు అనే సంగతి తెలిసి కూడా.. ఇవాళ ఆయనను అప్రతిష్ట పాలు చేయడం కోసమని ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ పక్కనబెట్టి చివరకు చంద్రబాబుతో కుమ్మక్కైంది. వారిద్దరూ కలసికట్టుగా ఒక్కటై నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ల దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వియోగం చేస్తున్నారు. ఇవాళ వీళ్లకు ప్రజలు పట్టడం లేదు.. ప్రజా సమస్యలు పట్టడం లేదు. రైతులు, రైతు కూలీల సమస్యలనైతే గాలికి వదిలేశారు.

తోట గోపాలకృష్ణ అంత్యక్రియలకు హాజరుకానున్న జగన్
గుంటూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ తోట గోపాలకృష్ణ మృతి చెందిన నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడికి వెళ్లనున్నారు. గురువారం గుంటూరు జిల్లా కంటెపూడిలో ఓదార్పు యాత్ర పూర్తయ్యాక విజయవాడ చేరుకొని రాత్రి బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం కిర్లంపూడికి బయల్దేరనున్నారు. ఇక్కడ తోట గోపాలకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నాక తిరిగి సాయంత్రానికి గుంటూరు చేరుకుని ఓదార్పు యాత్ర కొనసాగిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
Share this article :

0 comments: