సుప్రీంకోర్టులో కూడా రిలయన్స్ రంగంలోకి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టులో కూడా రిలయన్స్ రంగంలోకి

సుప్రీంకోర్టులో కూడా రిలయన్స్ రంగంలోకి

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

* చంద్రబాబు అక్రమాస్తుల కేసులో రిలయన్స్ నాటకం
* బాబు కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ విజయమ్మ పిటిషన్
* విచారణకు సిద్ధమైన జస్టిస్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం
* గతంలో మీరు రిలయన్స్ కేసులను విచారించనని చెప్పారు.. 
* జస్టిస్ భండారీకి గుర్తు చేసిన రిలయన్స్ న్యాయవాది హరీష్‌సాల్వే
* వెంటనే కేసు విచారణ నుంచి తప్పుకున్న భండారీ
* మరో ధర్మాసనానికి నివేదన... నిర్ణయం తీసుకోనున్న ప్రధాన న్యాయమూర్తి
* హైకోర్టులో ‘నాట్ బిఫోర్’ను వాడుకున్న రిలయన్స్ సుప్రీం లోనూ అదే వైఖరి

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసును అనూహ్యరీతిలో మలుపుతిప్పిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. సుప్రీంకోర్టులోనూ అదే పంథాను కొనసాగించింది. చంద్రబాబు, రామోజీ తదితరుల అక్రమాస్తులపై హైకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో అనూహ్యంగా రిలయన్స్ రంగంలోకి దిగడంతో... కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్.బి.లోకూర్ తప్పుకున్నారు. రిలయన్స్‌లో ఆయనకు వాటాలు ఉండటమే అందుకు కారణమని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా రిలయన్స్ రంగంలోకి దిగడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. 

గతంలో రిలయన్స్ కేసులు విచారించనని చెప్పారంటూ.. జస్టిస్ భండారీని ఉద్దేశించి రిలయన్స్ తరఫు సీనియర్ న్యాయవాది హరేశ్‌సాల్వే చేసిన వ్యాఖ్యే ఇందుకు కారణం. ఈ కేసును మరో ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించిన రికార్టు మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా ముందుంచాలని రిజిస్ట్రీని జస్టిస్ భండారీ ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసుకు సంబంధించిన రికార్డులను జస్టిస్ కపాడియా ముందుంచేందుకు ఏర్పాట్లు చేసింది. రికార్డును పరిశీలించిన అనంతరం ఈ కేసును ఏ ధర్మాసనం విచారించాలన్నది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు. 

సుప్రీంలోనూ ‘నాట్ బిఫోర్’ నాటకమే!
చంద్రబాబు, ఆయన బినామీలైన రామోజీరావు, మురళీమోహన్, సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరుల అక్రమాస్తులపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ను నిష్పాక్షిక విచారణ కోసం మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టులో ఇటీవల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆయన బినామీలు ‘నాట్ బిఫోర్’ల ద్వారా హైకోర్టు విచారణపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారని, తమకు కావాల్సిన బెంచ్‌ల కోసం ‘నాట్ బిఫోర్’ను వాడుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో నిష్పాక్షిక విచారణ కోసం కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలని విజయమ్మ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. పలు అవాంతరాలను దాటుకుంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. 

విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా ఉన్న రిలయన్స్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే లేచి నిల్చున్నారు. రిలయన్స్ సంబంధం ఉన్న ఎలాంటి కేసులు విచారించనని గతంలో చెప్పారంటూ.. జస్టిస్ దల్వీర్ భండారీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుత కేసులోనూ రిలయన్స్ ఉంది. మీ గత నిర్ణయాన్ని పక్కనపెడితే వాదనలు వినిపించేందుకు మేము సిద్ధం’’ అని స్పష్టం చేశారు. హరీశ్‌సాల్వే వ్యాఖ్యలను అర్థం చేసుకున్న జస్టిస్ దల్వీర్ భండారీ.. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసును మరో ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా రికార్డులను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై త్వరలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కపాడియా నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదినుంచీ తప్పించుకునే యత్నాలే
చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వై.ఎస్.విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ గులాం మహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించి, మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ తదితరులకు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ, సీఎం రమేష్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని వారికి స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, రామోజీ, సీఎం రమేష్ తదితరులు హైకోర్టులో గతంలో ఇచ్చిన సీబీఐ ప్రాథమిక విచారణ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. 

మొదటి వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. విచారణ సక్రమంగా సాగిపోతున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తెరపైకి వచ్చింది. విజయమ్మ తన పిటిషన్‌లో తమపై ఆరోపణలు చేశారని, అందువల్ల తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. రిలయన్స్‌లో తనకు వాటాలు ఉండటంతో ఈ కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి తప్పుకున్నారు. పిటిషన్లు దాఖలు చేసే సమయంలోనే సీఎం రమేష్ తదితరులు ‘నాట్ బిఫోర్’గా ఉన్న న్యాయవాదులను ఎంపిక చేసుకుని కేసులు అప్పగించడంతో.. చివరకు ఈ కేసు విచారణ జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లింది. అయితే జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండటంతో.. పలు అభ్యంతరాల నడుమ ఆయన కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. 

తరువాత ఈ కేసు జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలను విన్న జస్టిస్ రోహిణి.. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలన్నీ పూర్తి కావడంతో చంద్రబాబు తదితరుల పిటిషన్లపై నిర్ణయాన్ని జస్టిస్ రోహిణి ధర్మాసనం వాయిదా వేసింది. చంద్రబాబు తదితరులు పరిస్థితులను శాసిస్తుండటంతో విజయమ్మ ఈ కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Share this article :

0 comments: