అనర్హులుగా ప్రకటించండి - ప్రజల వద్దకు వెళతాం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనర్హులుగా ప్రకటించండి - ప్రజల వద్దకు వెళతాం!

అనర్హులుగా ప్రకటించండి - ప్రజల వద్దకు వెళతాం!

Written By ysrcongress on Wednesday, January 18, 2012 | 1/18/2012

 తమను అనర్హులుగా ప్రకటిస్తే ప్రజా తీర్పును కోరతామనీ మళ్లీ నోటీసులు జారీ చేయడం ఎందుకని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించారు. తన ముందు హాజరు కావాలని స్పీకర్ కొందరు ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ‘శాసనసభ సభాపతి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిన మా ఎమ్మెల్యేలందరికీ మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా మేమొక్కటే ఆయనకు స్పష్టం చేయదల్చుకున్నాం. స్పీకర్ సాక్షిగా రైతులకు, పేదవారికి మద్దతుగా వైఎస్ అభిమానులముగా విశ్వసనీయతకు కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి ఓటేసిన మాట వాస్తవం. ఇదే విషయమై గతంలో నోటీసు ఇచ్చినపుడు కూడా మేం సమాధానం ఇచ్చాం. స్వయంగా స్పీకర్‌ను కలిసి మా విధానం ఏమిటో చెప్పాం. మమ్మల్ని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా కోరాం. ప్రజా తీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. అయినా మళ్లీ నోటీసులు ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు. మీరు మళ్లీ నోటీసులు ఇచ్చినా మా విధానం మారదు. మా అభిప్రాయాలు అంతకంటే మారవు. మేం కచ్చితంగా అదే మాట మీద ఉన్నాం. మరోసారి మేమంతా ముక్త కంఠంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని విడివిడిగా కలిసి వివరణ ఇవ్వాలని కోరడం అనవసరం. వెంటనే మీరు మమ్మల్ని అనర్హులుగా ప్రకటించండి. ఎన్నికల కమిషన్‌కు తెలియ జేయండి. త్వరగా ఎన్నికలు పెట్టించండి. మేం ప్రజా తీర్పును కోరడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తేల్చి చెప్పారు. 


ప్రస్తుత పరిస్థితుల్లో తాము తాజాగా ప్రజా తీర్పు కోరాల్సిన అవసరం ఉందనీ ఎందుకంటే దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై గల అభిమానంతో రెండో సారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు జరుగుతున్నాయని బోస్ అభిప్రాయపడ్డారు. అందుకే వీటన్నింటి మీద ప్రజా తీర్పు కోరాల్సి ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు. స్పీకర్‌ను ఉద్దేశించి ‘దయచేసి మరోసారి మమ్మల్ని పిలవకండి...మేం రావడానికి సిద్ధంగా లేము...దయతో మా సభ్యత్వాలను రద్దు చేయండి’ అని బోస్ విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మళ్లీ జారీ చేసిన నోటీసులను పురస్కరించుకుని తామెవరమూ ఇపుడాయన వద్దకు వెళ్లడం లేదని బోస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్పీకర్ పిలిచినా వెళ్లక పోవడం ఆయనను అగౌరవ పర్చినట్లు కాదా? అని ప్రశ్నించినపుడు ‘స్పీకర్ మీద మాకు అత్యంత గౌరవం ఉంది. వారిని ఎపుడూ అగౌరవ పర్చం. మేం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశాం. అందుకు వారే సాక్ష్యం. మరోసారి ఆయన వద్దకు వెళ్లి చెప్పేదేముంటుంది అనేదే మా ఉద్దేశ్యం’ అని బోస్ స్పష్టం చేశారు. సమావేశానికి రాని తమ ఎమ్మెల్యేలందరితోనూ ఫోన్‌లో మాట్లాడామనీ అందరి తరపున ముక్త కంఠంతో తమను అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామనీ ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము ఎన్నికలకు ఎంత మాత్రం భయపడటం లేదనీ బహుశా ఆ భయం కాంగ్రెస్‌కు ఉందేమో వారిని అడిగితే బాగుంటుందని వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: