షాక్‌ల మీద షాక్‌లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షాక్‌ల మీద షాక్‌లు

షాక్‌ల మీద షాక్‌లు

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

కిళ్లీ కొట్లు, చిల్లర దుకాణాలపై విద్యుత్ చార్జీల వాత 
నెలకు 30 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ. 6 చొప్పున బాదుడు... 
రాష్ట్రంలో 10 లక్షల బడ్డీకొట్లపై ఏడాదికి రూ. 102 కోట్ల మేర భారం 
షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని బతుకు వెళ్లదీసే బడుగుజీవులకు కూడా కరెంట్ షాక్ ఇవ్వాలని నిర్ణయించింది. కిళ్లీ కొట్లు, చిల్లర దుకాణాలు నడుపుకుంటూ పైసాపైసా కూడబెట్టుకుని పొట్ట నింపుకునే పేద వ్యాపారులకూ ప్రభుత్వం చార్జీల వాత పెట్టింది. నెలకు 30 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే చిన్నతరహా వాణిజ్య సంస్థలకు కూడా కరెంటు ధరను యూనిట్‌కు రూ. 3.85 నుంచి ఏకంగా 6 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2011-12)లో ఏడాదికి 360 యూనిట్లకు మించి వినియోగించిన చిల్లర దుకాణలన్నింటికీ.. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త చార్జీల విధానం అమల్లోకి రానుంది. అంటే నెలకు 30 యూనిట్లకు మించి వినియోగించే అన్ని చిన్నతరహా వాణిజ్య సంస్థలన్నింటిపైనా ప్రభుత్వం కరెంటు చార్జీల భారం మోపిందన్నమాట. 0-50 యూనిట్లలోపు గృహ, వాణిజ్య వినియోగదారులకు చార్జీలు పెంచలేదని డిస్కంలు కొద్ది రోజుల కిందట విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ప్రతిపాదనలను సమర్పించిన సందర్భంగా ఘనంగా ప్రకటించాయి. పేద గృహ వినియోగదారులతో పాటు చిన్నతరహా దుకాణాలపై భారాన్ని మోపలేదని పేర్కొన్నాయి. కానీ.. వాస్తవం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 

30 దాటితే టెలిస్కోపిక్ కట్

ప్రస్తుతం గృహ వినియోగదారులతో పాటు వాణిజ్య సంస్థలకు టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో శ్లాబుల వారీగా బిల్లును వసూలు చేస్తారు. ప్రస్తుతం 0-50 శ్లాబులోని వారికి యూనిట్‌కు 3.85 చొప్పున, 51-100 శ్లాబు వారికి యూనిట్‌కు రూ. 6.20 చొప్పున, 100 యూనిట్లు దాటితే 6.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు 60 యూనిట్లు వినియోగిస్తే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ. 3.85 చొప్పున వసూలు చేస్తారు. మిగిలిన 10 యూనిట్లకు రూ. 6.20 చొప్పున వసూలు చేస్తారు. అయితే, ఏప్రిల్ 1 నుంచి మాత్రం నెలకు 30 యూనిట్లు దాటితే.. ఈ తరహా టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ఎత్తివేయనున్నారు. ఫలితంగా 30 యూనిట్లకుపైబడి వినియోగిస్తే.. ప్రతీ యూనిట్‌కు రూ. 6 చొప్పున వసూలు చేయనున్నారు. 

ఇంతకు మించి వాడొద్దు... 

నెలకు 30 యూనిట్లకు మించి వినియోగిస్తే చిన్నతరహా వాణిజ్య సంస్థలుగా పరిగణించలేమని డిస్కంలు తేల్చిచెప్పాయి. 80 వాట్స్ సామర్థ్యం కలిగిన ఒక ఫ్యాను, 40 వాట్ల సామర్థ్యం కలిగిన ఒక లైటును 8 గంటల పాటు వినియోగిస్తే రోజుకు ఒక యూనిట్ వినియోగమవుతుందని డిస్కంలు లెక్కకట్టాయి. అంటే నెలకు 30 యూనిట్లన్నమాట. ఇంతకు మించి వినియోగించే వాణిజ్య సంస్థలన్నింటినీ చిన్నస్థాయి దుకాణాలుగా పరిగణించబోమని డిస్కంలు నిర్ణయించాయి. ఒక ఫ్యాను, ఒక లైటుకు మించి వినియోగించే వాణిజ్య సంస్థలన్నింటికీ టెలిస్కోపిక్ బిల్లింగ్ పద్ధతిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి. ఫలితంగా నెలకు 31 యూనిట్లు వినియోగించే వాణిజ్య సంస్థలన్నింటికీ యూనిట్ విద్యుత్ చార్జీ ఏకంగా రూ. 3.85 నుంచి రూ. 6కు పెరిగింది. అంటే.. నెలకు 31 యూనిట్లు వాడే చిన్న దుకాణానికి ప్రస్తుతం నెలవారీ బిల్లు మొత్తం కస్టమర్ చార్జీతో కలుపుకుని రూ. 149.35 వస్తుంది. అయితే.. ఏప్రిల్ 1 నుంచి మాత్రం ఇది కాస్తా రూ. 216కు పెరుగుతుంది. అంటే 31 యూనిట్లు కాల్చే చిన్నచిన్న షాపులపై ఏకంగా నెలకు రూ. 66.65 అదనపు భారం పడుతుందన్నమాట. అదే నెలకు 50 యూనిట్లను వాడే చిన్న షాపుల బిల్లు రూ. 222.50 నుంచి రూ. 330 కు పెరగనుంది. అంటే నెలవారీ బిల్లు ఒకేసారి రూ. 107.50 పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31 యూనిట్ల నుంచి 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వాణిజ్య సంస్థలు (చిన్న దుకాణాలు) 10 లక్షల మేరకు ఉన్నాయి. వీటిపై ఏడాదికి ఏకంగా రూ. 102 కోట్ల మేర భారం పడనుంది.
Share this article :

0 comments: