దేశంలోనే అతి పెద్ద భారీ స్కామ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశంలోనే అతి పెద్ద భారీ స్కామ్

దేశంలోనే అతి పెద్ద భారీ స్కామ్

Written By ysrcongress on Wednesday, January 11, 2012 | 1/11/2012

రిలయన్స్ తదితర సంస్థలది ధనదాహం
రిలయన్స్ అవినీతిని కాగ్ బయట పెట్టినా పట్టించుకోలేదు..
చర్యలు తీసుకోబోయిన మురళీ దేవరానే తప్పించారు

నరసాపురం టౌన్ /అమలాపురం, న్యూస్‌లైన్: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో అతి పెద్ద కుంభకోణం జరుగుతోందని నర్మదా బచావో ఉద్యమకర్త, ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో మెలుగుతున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడంలేదని ఆరోపిం చారు. కేంద్రం విధానాల వల్ల రిలయన్స్ వంటి సంస్థలు ధనదాహంతో దేశాన్ని శాసించే స్థితికి చేరుకున్నాయంటూ మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు, కేంద్రం ఒక్కటయ్యాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 

‘‘సునామీ ఒక్కసారి వస్తేనే అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల కేజీ బేసిన్ పరిధిలో ఇప్పటికే స్లో సునామీ మొదలైంది. దాని ప్రభావం మున్ముందు తెలుస్తుంది. కేజీ బేసిన్ వ్యవహారాలు ప్రజలకు జీవించే హక్కునే దూరం చేస్తున్నాయి’’ అంటూ ధ్వజమెత్తారు. పరిస్థితులిలాగే కొనసాగితే నర్మదా, నందిగ్రామ్ తరహా ఉద్యమాలు దేశమంతటా సాగుతాయని హెచ్చరించారు. మంగళవారం ఆమె తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. నరసాపురంలో విలేకరుల సమావేశంలో, వైఎస్ కళాశాల అరబిందో ఆడిటోరియంలో సర్వోదయ రైతు సంఘం సదస్సులో మాట్లాడారు. 

లోక్‌శక్తి అభియాన్ యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి, ఎన్.కొత్తపల్లిల్లో ఉప్పు నీరు పోటెత్తి ముంపు బారిన పడ్డ పంట చేలను పరిశీలించారు. అనంతరం గొల్లవిల్లిలో రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘‘కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో రిలయన్స్ సంస్థ ద్వారా అవినీతి జరుగుతోందని కాగ్ పేర్కొన్నా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దారుణం. పైగా ఈ ఉదంతంలో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించినందుకు మురళీ దేవరాను మంత్రి పదవి నుంచి తప్పించారంటే ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో తేటతెల్లమవుతోంది!’’ అని దుయ్యబట్టారు. 

‘‘బోంబే హై లో రిలయన్స్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై మేం కోర్టులో పోరాడుతున్నాం. కేజీ బేసిన్‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది’’ అంటూ ప్రకటించారు. దేశంలో అవినీతి పెచ్చరిల్లిందంటూ లోక్‌పాల్ బిల్లు కోసం భారీగా ఆందోళన జరుగుతున్నా, ప్రకృతి సంపద ఇలా యథేచ్ఛగా దుర్వినియోగమవుతున్న వైనాన్ని మాత్రం చాలామంది పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రైతులు, మత్స్యకారులతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పోరాడితేనే కేజీ బేసిన్‌ను పరిరక్షించుకునే అవకాశముంటుందన్నారు. దేశంలోని అవినీతిలో ఎక్కువ శాతం కార్పొరేట్ సంస్థలు చూపుతున్న తప్పుడు లెక్కల్లోనే జరుగుతోందన్నారు.

సంపదను కొల్లగొట్టి.. హక్కులను కాలరాసి...

రిలయన్స్‌తో సహా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కేజీ బేసిన్లో చట్ట వ్యతిరేక అన్వేషణలతో వేల కోట్ల విలువైన చమురు, సహజ వాయువు కొల్లగొట్టుకుపోవడం వల్లే స్థానిక రైతులు, మత్స్యకారులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని మేధా ఆరోపించారు. ‘‘చమురు సంస్థల కార్యకలాపాలతో ఈ ప్రాంతంలో భూమి కుంగిపోతోంది. ఇందుకు శాస్త్రీయ ఆధారాలున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుసమ్మె ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంది. వరి, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బ తింటున్నాయి. మత్స్య ఉత్పత్తులు 60 శాతం పడిపోతే వారికి జీవనోపాధి ఎవరిస్తారు?’’ అని ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగం మనకు జీవించే హక్కు కల్పించింది. ప్రకృతి సంపద వృథా కాకూడదని కూడా చెబుతోంది. కానీ 30 ఏళ్లుగా గ్యాస్ నిక్షేపాల వెలికితీత వల్ల కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి తగ్గిపోరుుంది. 1.3 కోట్ల మంది మనుగడపై దుష్ర్పభావం పడుతోంది. కేజీ బేసిన్ తరహాలోనే బాంబై హై లో కూడా కార్పొరేట్ సంస్థలు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారుు. దీనిపై అక్కడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను’’ అని మేధా పాట్కర్ చెప్పారు. 

ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల కోసమే పరితపిస్తున్నాయని విమర్శించారు. ‘‘రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలకు అవి తీసుకున్న రుణాల్లో మూడేళ్లుగా కేంద్రం రూ.5 లక్షల కోట్ల రాయితీ ఇస్తోంది! మరోపక్క కష్టపడి పండించే రైతుకేమో గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు. సెజ్‌లలో కంపెనీల ఏర్పాటుకు సబ్సిడీలిచ్చేందుకు 21 చట్టాలుంటే, రైతులకు ఒక్కటీ లేదు. సెజ్‌లపై పెట్టే శ్రద్ధను రైతులను ఆదుకోవడంపై ఎందుకు పెట్టడం లేదు?’’ అని ప్రశ్నించారు. డెల్టా పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమానికి తాను సెల్యూట్ చేస్తున్నానని పాట్కర్ అన్నారు. సభికులతో రైతు అనుకూల, చమురు సంస్థల వ్యతిరేక నినాదాలు చేయించారు. కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి పనుల ప్రణాళిక ప్రజల కోరిక మేరకుండాలన్న డిమాండ్‌తో మార్చి 2న పార్లమెంటు వద్ద ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు.

పోలవరంపై పునరాలోచించాలి
ఒడిశా ఆదివాసుల నుంచి వ్యతిరేకత వస్తున్నందున పోలవరం నిర్మాణాన్ని నిలిపేయాలని మేధా పాట్కర్ డిమాండ్ చేశారు. ‘‘పోలవరంతో 5 లక్షల ఎకరాలు సాగవడం నిజమే అయినా, జిల్లాలోని ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మరో 2 లక్షల ఎకరాల కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టొచ్చు’’ అన్నారు.
Share this article :

0 comments: