రూ. 1,177 కోట్ల జరిమానాలో పైసా కట్టకున్నా ‘పన్నె’త్తని ఐటీ శాఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ. 1,177 కోట్ల జరిమానాలో పైసా కట్టకున్నా ‘పన్నె’త్తని ఐటీ శాఖ

రూ. 1,177 కోట్ల జరిమానాలో పైసా కట్టకున్నా ‘పన్నె’త్తని ఐటీ శాఖ

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012

రూ. 1,177 కోట్ల జరిమానాలో పైసా కట్టకున్నా ‘పన్నె’త్తని ఐటీ శాఖ 

నాలుగేళ్లుగా కోర్టు స్టేతోనే నెట్టుకొస్తున్న ఈనాడు అధినేత 
నగదు డిపాజిట్లు స్వీకరించినందుకు జరిమానా వడ్డించిన ఐటీ 
దాన్ని సవాల్ చేసి 2008లో భంగపడ్డ రామోజీ 
పన్ను విధించిన అధికారిపై ఆరోపణలు చేసినందుకు హైకోర్టు ఆగ్రహం 
మళ్లీ రామోజీ పిటిషన్; 2008 జూన్‌లో స్టే
2009లో తూతూ మంత్రంగా స్టే వెకేట్ పిటిషన్ వేసిన ఐటీ 
స్టే ఎత్తివేతకు ఇప్పటివరకూ ప్రయత్నాలే చేయని వైనం 
రామోజీకి పన్ను విధించిన అధికారిపై అనంతరం బదిలీ వేటు 
కేసు విచారించాల్సిన అవసరాన్ని హైకోర్టుకు చెప్పని కొత్త అధికారులు
సుప్రీంకు వెళ్లే వెసులుబాటు ఉన్నా ఉపయోగించుకోని తీరు
ఇతర కేసుల్లోనైతే యమస్పీడు.. 
రామోజీపైనైతే వల్లమాలిన ప్రేమ!! 

ఆయన ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సింది లక్షో రెండు లక్షలో కాదు. కోటీ రెండు కోట్లు కూడా కాదు. అక్షరాలా పదకొండు వందల డెభ్బై ఏడు కోట్ల రూపాయలు! 
అయితేనేం!? ఆయన నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అదేమంటే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నానంటూ ఉత్తర్వులు చూపిస్తారు. 
సరే! ఆయన వేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు స్టే ఇచ్చింది. మరి ఆ స్టేను తొలగించేందుకు ఐటీ శాఖ ప్రయత్నించాలి కదా? ‘అయ్యా! మాకు భారీ మొత్తం రావాల్సి ఉన్నా పైసా కూడా రాలేదు. కేసును కాస్త పట్టించుకోండి’ అంటూ హైకోర్టుకు చెప్పాలి కదా? ఏటా వందల కోట్ల రూపాయల వడ్డీ కోల్పోతున్నామంటూ.. కేసును తక్షణం విచారించటం ఎంత అవసరమో కోర్టుకు తెలియజేయాలి కదా? కేసు విచారణకు వచ్చేలా సంబంధిత అధికారులు శ్రద్ధ చూపాలి కదా? 
కానీ వారు ఇవేమీ చెయ్యటం లేదు. అందుకు కారణం... 
ఆ పన్ను కట్టని వ్యక్తి పేరు రామోజీరావు! ఆయన చేతిలో ‘ఈనాడు’ పత్రిక ఉంది. ‘ఈటీవీ’ చానళ్లు ఉన్నాయి. వాటిలో కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫిఫ్టీ-ఫిఫ్టీ వాటా ఉంది. వీటన్నిటికీ తోడు ఈ రాష్ట్రంలో ప్రతి పరిణామాన్నీ తమకు అనుకూలంగా నడిపిస్తున్న ఎల్లో సిండికేట్‌కు కర్త, కర్మ, క్రియ ఆయనే. అది చాలదూ!!!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో రామోజీరావు చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు. డిపాజిట్లు సేకరించటం నుంచి ఆ సొమ్మును తన సొంత నష్ట జాతక కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టటం, భారీ ఎత్తున భూములు కొనుగోళ్లు చేయటం ఇలా ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నెన్నో చట్టాలను ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘనల్లో మరో కీలకమైన ఉల్లంఘన, చట్ట విరుద్ధ కార్యకలాపం ఏమిటంటే.. డిపాజిట్లను చెక్కు, డీడీల రూపంలో కాకుండా పూర్తి స్థాయిలో నగదు రూపంలో స్వీకరించటం. ఇలా నగదు రూపంలో డిపాజిట్లు తీసుకోవటం బ్లాక్‌మనీ చెలామణికి అవకాశం కల్పించటమే కాబట్టి.. ఇలా చేయటం అక్రమమని ఐటీ చట్టం స్పష్టంగా చెప్తున్నా సరే.. వందల కోట్ల రూపాయల్ని ఇలా నగదు రూపంలో స్వీకరించటం, తరవాత ఆ డబ్బును వివిధ పేర్లతో డీడీలుగా, పే ఆర్డర్లుగా మార్చుకోవటం విచ్చలవిడిగా సాగించారు. నిజానికి ఇలా చేయటం వల్ల ఖాతాల్లో నష్టాలు చూపించి.. లెక్కల్లో లేని సొమ్మును తనకు కావలసిన చోటుకు తరలించే అవకాశం ఉంటుంది. తనకు కావలసిన మనుషులే దీన్ని డిపాజిట్ చేసినట్లుగా ఖాతాల్ని తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా వారి నల్ల ధనాన్ని తెలుపు చేయటానికి వీలుంటుంది. అందుకే ఇలా నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించటాన్ని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్‌ఎస్ నిషేధించింది. ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరిస్తే.. అలా స్వీకరించిన మొత్తానికి సరిపడా మొత్తాన్ని సెక్షన్ 271-డి ప్రకారం జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 

2006లో వెలుగులోకి... 

రామోజీరావు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రూ. 20,000 పైబడిన మొత్తాన్ని డిపాజిట్లుగా స్వీకరించటంతో పాటు.. రూ. 20,000 కన్నా తక్కువైతే చట్ట పరిధిలోకి రాబోమన్న ఉద్దేశంతో కొన్ని డిపాజిట్లను రూ. 10,000 చొప్పున మూడు నాలుగు లావాదేవీలుగా విడగొట్టి తీసుకోవటం వంటి దుర్మార్గాలకూ తెరతీశారు. ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించటానికి పెద్ద కసరత్తే చేశారు. అయితే 2006 చివర్లో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టేదాకా మార్గదర్శి అక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటపడలేదు. అందుకోసం అంతకుముందున్న ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేశాయన్నది ఊహించటానికి పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. ఎందుకంటే 2004 వరకూ దాదాపు 20 ఏళ్లపాటు స్వల్ప విరామంతో అధికారంలో ఉన్నది ఈయన అధికారంలోకి తెచ్చిన పార్టీయే. అందుకనే మార్గదర్శి ముసుగులో ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా బయటపడలేదు. 

2008లో ఐటీ శాఖ నోటీసులు...

ఉండవల్లి బయటపెట్టటంతో మార్గదర్శి అక్రమాలు పుట్టలో పాముల్లా ఒక్కొక్కటే బయటకొచ్చాయి. వాటిలో ఈ నగదు డిపాజిట్ల సేకరణ ఒకటి. అప్పట్లో సంబంధిత ఐటీ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేసిన ఈ చర్యలపై విచారణ కూడా జరిపారు. మార్గదర్శి ఉద్యోగుల్ని ప్రశ్నించారు. తొలుత నగదు రూపంలో డిపాజిట్లు తీసుకోవటం.. తరవాత వివిధ పేర్లతో ఆ నగదును బ్యాంకుల్లో డీడీలుగా మార్చటం వంటివి జరిగినట్లు తెలుసుకున్నారు. బ్యాంకు అధికారులు కూడా ఇది నిజమేనని అంగీకరించటంతో చివరకు ఇలా సేకరించిన డిపాజిట్లకు సరిపడా మొత్తాన్ని పన్నుగా చెల్లించాలంటూ నోటీసులిచ్చారు.

చట్టాలు వర్తించవంటూ పిటిషన్లు... 

ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇవ్వటంతో రామోజీ తనకు అలవాటైన మార్గాన్ని ఎంచుకున్నారు. అసలు ఈ చట్టాలేవీ తనకు వర్తించవంటూ హైకోర్టులో ఐదు రిట్ పిటిషన్లు వేశారు. అంతటితో ఊరుకోకుండా.. అప్పట్లో ఆదాయ పన్ను శాఖ 16వ రేంజ్ అదనపు కమిషనర్‌గా వ్యవహరించిన ఆర్.వి.రెడ్డిపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. సదరు అధికారి తనపై కావాలనే ద్వేషం పెంచుకుని, దురుద్దేశాలు మనసులో పెట్టుకుని తనకు నోటీసులు జారీ చేశారని, తనపై కుట్రపన్నారని, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. చిత్రమేంటంటే ఇన్ని ఆరోపణలు చేసినా.. సదరు అధికారిని ప్రతివాదిగా మాత్రం చేర్చలేదు. దీనిపై న్యాయస్థానం మండిపడింది. ఒక అధికారిపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేసి, పెపైచ్చు ఆయన్ను ప్రతివాదిగా చేర్చకపోవటం తగదని స్పష్టంచేసింది. ఇది చట్టవిరుద్ధమని మందలించింది. దీంతో సదరు పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని, కొత్తవి దాఖలు చేస్తామని రామోజీ తరఫు న్యాయవాదులు చెప్పగా.. 2008 మార్చి 11న జస్టిస్ సి.వై.సోమయాజలు, జస్టిస్ బి.ప్రకాశరావులతో కూడిన ధర్మాసనం సరేనంది. అయితే ఐదు పిటిషన్లకూ ఒకోదానికి రూ. 10,000 చొప్పున కోర్టు ఖర్చులు చెల్లించి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. 

ఐటీ చర్యలపై స్టే... 

తొలి పిటిషన్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో మళ్లీ పిటిషన్లు దాఖలు చేసుకునే అవకాశాన్ని హైకోర్టు ఇవ్వటంతో రామోజీ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఆదాయ పన్ను అధికారులు పేర్కొన్న 269 ఎస్‌ఎస్ సెక్షన్ కానీ, 271-డి సెక్షన్ కానీ తనకేమాత్రం వర్తించవని వాదించారు. కాబట్టి తనకు జారీ చేసిన ఐటీ నోటీసులు చెల్లవని, వాటికి సంబంధించి తదుపరి ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని కోరారు. ప్రస్తుతం పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టి.మీనాకుమారి నేతృత్వంలో జస్టిస్ రమేష్ రంగనాథన్‌తో కూడిన ద్విసభ్య బెంచ్.. ఇరుపక్షాల వాదనలూ విన్నాక 2008 ఆగస్టు 6న రామోజీ కోరినట్లుగా ‘స్టే’ ఇచ్చింది. 

ఏడాది తర్వాత వెకేట్ పిటిషన్... 
నిజానికి హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఆ తరవాత ఆదాయ పన్ను శాఖ దాన్ని తొలగించటానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. స్టే వెకేట్ పిటిషన్ వేసి.. అది విచారణకు వచ్చేలా కోర్టును కోరాలి. రూ. 1,177 కోట్ల విలువైన వ్యవహారం కనుక, ఏడాదికి కనీసం 120 కోట్ల రూపాయల వడ్డీ పోతుంది కనుక.. అధికారులు దీని ప్రాధాన్యాన్ని కోర్టుకు వివరించి.. విచారణకు వచ్చేలా చూసుకోవాలి. ప్రయత్నిస్తే ఇదేమీ కష్టమైన విషయం కాదు. కాకపోతే ఈ కేసులో అధికారులు ఎంత ఆలస్యమైతే అంత మంచిదని భావిస్తున్నారో ఏమో కానీ.. అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. జస్టిస్ మీనాకుమారి నేతృత్వంలోని బెంచ్ స్టే ఇచ్చిన తరవాత ఏం జరిగిందంటే..

అటు ఐటీ శాఖలో కూడా పరిణామాలు మారిపోయాయి. నోటీసులు ఇచ్చి, విచారణ జరిగినన్నాళ్లూ తాను నేరుగా హాజరై వ్యవహారాన్ని పర్యవేక్షించిన అదనపు కమిషనర్ ఆర్.వి.రెడ్డి.. సంబంధిత జోన్ నుంచి మరోచోటుకు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కొత్త అధికారి వచ్చారు. ఆ తరవాత జస్టిస్ మీనాకుమారి కూడా పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో కేసు జస్టిస్ వి.వి.ఎస్.రావు, జస్టిస్ రమేష్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ బెంచ్ సదరు కేసును కొంత విచారించాక.. వీరిరువురి బెంచ్ విడిపోవటంతో ఇద్దరూ వేర్వేరు బెంచ్‌లకు మారారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగించాలంటే సదరు న్యాయమూర్తులిద్దరితో కూడిన బెంచ్ మళ్లీ దాన్ని టేకప్ చెయ్యాలి. అలా చెయ్యాలంటే.. ఈ కేసు విచారణకు రావాల్సిన అవసరాన్ని, కేసు ప్రాధాన్యాన్ని ఐటీ శాఖ కోర్టుకు వివరించాలి. ఒకవేళ హైకోర్టు తమ అభ్యర్థనను మన్నించకుంటే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఐటీ శాఖకు లేకపోలేదు. కాకపోతే ఈ కేసును చూస్తున్న ఐటీ అధికారులకు ఇలాంటివేమీ పట్టటం లేదు. నిన్నగాక మొన్న పట్టుకున్న కేసులపై చూపిస్తున్న ఆసక్తిని ఈ కేసు విషయంలో మాత్రం చూపించటం లేదు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం కోర్టు ‘స్టే’ విధించిన పక్షంలో ఆ స్టే అమల్లో ఉన్న కాలమంతా.. జరిమానా విధించటానికి అవకాశం ఉండదు. జరిమానాపై వడ్డీని కూడా ఆశించలేం. అంటే.. ఒకవేళ రామోజీరావు తన కేసు ఓడిపోయి చివరకు రూ. 1,177 కోట్లు ఐటీ శాఖకు చెల్లించాల్సి వచ్చినా.. దానిపై ఈ నాలుగేళ్లూ వడ్డీ మిగుల్చుకున్నట్లే లెక్క. ఏడాదికి కనీసం 10 శాతం లెక్కేసినా.. ఇది రూ. 470 కోట్లు. ఒకరకంగా ఈ మొత్తమంతా ఐటీ శాఖకు వచ్చే నష్టంగానే పరిగణించాలి. ఐటీ అధికారులకైతే ఇవేమీ పట్టటం లేదు. ఎందుకంటే వారిపుడు రామోజీని వదిలేసి.. రామోజీ ఎవరి పేరు చెప్తే వారిని వేటాడే ప్రయత్నాల్లో ఉన్నారో ఏమో!?

ఐటీ నోటీసుల ప్రకారం రామోజీరావు మార్గదర్శి చెల్లించాల్సిన పన్ను.. (రూ.కోట్లలో)

2001-2002 160,09,09,500
2002-2003 224,28,03,500
2003-2004 221,88,84,000
2004-2005 303,34,62,000
2005-2006 267,40,68,000
ఐదేళ్లకుగాను మొత్తం... 1,177,01,27,000
Share this article :

0 comments: