నేడు 12.10 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు 12.10 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్

నేడు 12.10 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

* రూ. 54,300 కోట్లతో వార్షిక ప్రణాళిక.. ప్రణాళికేతర వ్యయం 
* రూ. 93,378 కోట్లు.. జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లకు పెరగని కేటాయింపులు
* రీయింబర్స్‌మెంట్‌కు రూ. 4 వేల కోట్లు... విద్యుత్ సబ్సిడీకి రూ. 4,100 కోట్లు..
* అసెంబ్లీ నియోజకవర్గాల ఫండ్‌కు రూ. 385 కోట్లు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆదాయం పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలకు, జలయజ్ఞానికి ప్రభుత్వం నిధులు పెంచలేదు. పైగా వైఎస్ సంక్షేమ సూత్రానికి తిలోదకాలిచ్చి కొత్త ప్రాధాన్యతలను తెరపైకి తెచ్చింది. పన్నుల ద్వారా ఆదాయం పెంపుపై దృష్టి సారించిన సర్కారు.. పేదల సంక్షేమానికి కేటాయింపులు పెంచకుండా.. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నియోజకవర్గానికో క్రీడా ప్రాంగణం వంటి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఉపయోగపడే కేటాయింపులకు ప్రాధాన్యత ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సుమారు లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించనుంది. 

రూ. 1,47,378 కోట్ల నుంచి రూ.1,47,678 కోట్ల మధ్య బడ్జెట్‌ను శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సిద్ధమయ్యారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడ్తారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా 14 శాతం మేరకు పెంచి రూ.48,630 కోట్లు లేదా రూ.48,900 కోట్లతో రాష్ట్ర వార్షిక ప్రణాళికను రూపొందించారు. దీనికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే రూ.5,400 కోట్లను కలిపి ప్రణాళిక పద్దు కింద మొత్తం రూ.54,030 కోట్లు లేదా రూ.54,300 కోట్లను వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదించనున్నారు. 

ప్రణాళికేతర పద్దు కింద (కాంట్రా ఇంట్రెస్ట్, వేజ్ అండ్ మీన్స్‌తో కలిపి) రూ.93,378 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు ప్రతిపాదించనున్నారు. ద్రవ్యలోటు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక రాబడిలో.. రాష్ట్ర పన్నుల ఆదాయాన్ని రూ.66 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.26 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కేంద్ర పథకాల కింద, గ్రాంట్ల రూపంలో రూ.14 వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.13 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం మీద 2012-13 సంవత్సరం ముగిసేనాటికి రూ.3,700 కోట్ల రెవెన్యూ మిగులు తేలుతుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు.

కేటాయింపులు ఇలా..!
భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల రంగానికి రూ.15 వేల కోట్లనే కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ రంగానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.11 వేల కోట్లు విడుదల చేసి నాలుగు వేల కోట్లు కోత పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రణాళిక పద్దు కింద కేవలం రూ.1,600 కోట్ల కేటాయింపులతో సరిపుచ్చారు. మరో 700 కోట్లను ప్రణాళికేతర పద్దు కింద రుణాల చెల్లింపునకు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు రూ.2,300 కోట్లు కేటాయించినా.. వెయ్యికోట్ల మేరకు కోత విధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నాలుగు వేల కోట్లు కేటాయించనున్నారు. ఆరోగ్యశ్రీకి ప్రస్తుతం ఉన్నంత కేటాయింపులనే కొనసాగిస్తారు. కిరణ్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు చేరాయి. ప్రస్తుతం క్రీడా రంగం బడ్జెట్ కేవలం రూ.20 కోట్లు ఉండగా...కొత్త బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు కింద అదనంగా రూ.200 కోట్లను కేటాయిస్తున్నారు. 

పట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణకు, ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడానికి రోడ్లు, భవనాల శాఖకు కొత్తగా రూ.300 కోట్లు కేటాయిస్తున్నారు. రోడ్లు, భవనాల నిధుల కేటాయింపులో పెంపు చూపించే నిమిత్తం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద రూ.500 కోట్లు కేటాయిస్తున్నారు. అయితే ఈ కేటాయింపులు కాగితాలకే పరిమితం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణకు, ఉపాధి హామీ పథకంలో అనుసంధానం నిమిత్తం పంచాయతీరాజ్ శాఖకు రూ.200 కోట్లు అదనంగా కేటాయిస్తున్నారు. రాజీవ్ యువకిరణాలు పథకానికి రూ.150 కోట్లను, మహిళా సంఘాల వడ్డీ లేని రుణానికి రూ.550 కోట్లను, స్త్రీ నిధికి వందకోట్లు, అభయహస్తానికి రూ.325 కోట్లు కేటాయించనున్నారు. మైనారిటీ సంక్షేమానికి కేటాయింపులను పెంచడంతో ఆ మొత్తం రూ.400 కోట్లకు చేరనుంది. సీఎం విచక్షణాధికార నిధికి రూ.600 కోట్లు కేటాయించనున్నారు. పీలేరు డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రస్తుత సంవత్సరం మాదిరే రూ. 50 కోట్లు కేటాయించారు. 

బియ్యం సబ్సిడీకి రూ.3,500 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.4,100 కోట్లు కేటాయించనున్నారు. మైనారిటీలకు ప్రస్తుతం రూ.251 కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.400 కోట్లకు పెంచుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఫండ్ కింద రూ.385 కోట్లు కేటాయించారు. వార్షిక ప్రణాళికలో విద్యారంగానికి రూ.3,800 కోట్లు, ఆర్యోగానికి రూ.1990 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.18,070 కోట్లు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం రూ.6.70 లక్షల కోట్లు కాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.7.04 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

ఆరు వందల సెట్లే... 
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సాధారణంగా 1,200 బడ్జెట్ పుస్తకాల సెట్‌లను ప్రచురించి అందరికీ పంపిణీ చేసేవారు. కాని ఈసారి అంతా పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, కేవలం సీడీలు ఇవ్వాలని భావించారు. చివరి నిమిషంలో కొన్ని పుస్తకాల సెట్లను ప్రచురించాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు 1,200 సెట్‌లు కాకుండా ఆరువందల సెట్స్‌తోనే సరిపెట్టనున్నారు. ఎక్కువ సంఖ్యలో సీడీలను పంపిణీ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజావసరాలకు తగ్గట్టే బడ్జెట్: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజా సంక్షేమానికి, ప్రజావసరాలకు తగ్గట్టే బడ్జెట్ రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్ట కోసం కాకుండా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు శాసనసభ, శాసనమండలిలో ఏకకాలంలో బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ ఉంటుందని అన్నారు. చర్చకు సహకరిస్తామని అన్ని పార్టీలూ స్పీకర్‌కు తెలిపాయని మంత్రి పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతోనే బడ్జెట్ ప్రతులను సీడీల రూపంలో ఇవ్వాలని అనుకున్నామని మంత్రి వివరించారు.. టాబ్లెట్ పీసీ ద్వారా బడ్జెట్ ప్రసంగం చేయనున్నట్టు, ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో వివరాలన్నీ పొందుపరుస్తామని తెలిపారు.
Share this article :

0 comments: