14 నెలల్లో 5 వేల కోట్లు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 14 నెలల్లో 5 వేల కోట్లు!

14 నెలల్లో 5 వేల కోట్లు!

Written By ysrcongress on Thursday, February 9, 2012 | 2/09/2012

ఇదీ సిండి‘కేట్ల’ అక్రమార్జన.. ఎక్సైజ్ సర్వేలో బట్టబయలు
మంత్రులు, ఎమ్మెల్యేలకు రూ.615 కోట్లు.. ఎక్సైజ్, పోలీసు సిబ్బందికి రూ. 900 కోట్లు 
ఆదాయం కోసం కళ్లు మూసుకున్న సర్కారు.. సమీర్ శర్మ నివేదిక బుట్టదాఖలు
ఎక్సైజ్ సర్వేల్లో సిండికేట్ల బండారం బట్టబయలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు రూ.615 కోట్లు
ఎక్సైజ్, పోలీసు సిబ్బందికి 900 కోట్ల ముడుపులు
సిండికేట్ల ‘నిర్వహణ’కు 250 కోట్లు, మీడియాకూ 50 కోట్లు
ఇవి 2010 ఆగస్టు-2011 అక్టోబర్ మధ్య గణాంకాలే
ఆదాయం కోసం కళ్లు మూసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.5,125 కోట్లు. అందులో రాజకీయ నాయకుల వాటా రూ.615 కోట్లు! ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులకు దాదాపు రూ.900 కోట్లు!! మీడియా ప్రతినిధులకు మరో రూ.50 కోట్లు. సిండికేట్ల ‘నిర్వహణ’కు రూ.250 కోట్లు. ఏంటీకోట్ల కథ అనుకుంటున్నారా? రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మద్యం సిండి‘కేట్ల’ వ్యవహారంలో బయటపడుతున్న అక్రమార్జనల లెక్కలివి. మద్యం అమ్మకాల్లో నానా అక్రమాలకు పాల్పడటం ద్వారా సుమారు రూ.5,125 కోట్ల దాకా ఆర్జించినట్టు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇదంతా కేవలం 14 మాసాల కాలంలో ఆర్జించినదేనని ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు! ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు మద్యం విక్రయించడం, మార్కెట్లో బాగా డిమాండున్న మద్యం బ్రాండ్లను స్వయంగా తయారు చేసి అమ్మడం తదితరాల ద్వారా సిండికేట్లు ఇంత మొత్తాన్ని వెనకేసుకున్నారు! వాటిపై ఏసీబీ నిర్వహించిన దాడుల వివరాలు పూర్తిస్థాయిలో బయటికొస్తే.. ఈ అక్రమార్జన మొత్తం పైనా, అందులో ఎవరికెంత ముట్టిందన్న విషయంలోనూ మరింత స్పష్టత వస్తుంది.

ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల నేతలకు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు భారీగా ముడుపులిచ్చినట్టు ఖమ్మం జిల్లాలో సిండికేట్ నడుపుతున్న మద్యం వ్యాపారి నున్నా రమణ ఏసీబీకి వెల్లడించడం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొందని దర్యాప్తులో వెల్లడైం ది. మచ్చుకు కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు, స్థానిక ఎక్సైజ్, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులకు ముట్టజెప్పిన ముడుపులను లెక్కగట్టిన ఏసీబీ ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు! ఇంత భారీ దోపిడీ జరిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం కళ్లు మూసుకుంది! గత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలపై ఏపీబీసీఎల్ రూ.19,000 కోట్ల టర్నోవర్ సాధిం చింది. డీలర్ల మార్జిన్ 23 శాతాన్ని (రూ.4,300 కోట్లు) కలిపితే మొత్తం మద్యం అమ్మకాల విలువ రూ.23,300 కోట్లు. కానీ.. ఈ మొత్తం దాదాపు రూ.28,400 కోట్లుంటుందని ఎక్సైజ్ శాఖ అత్యంత రహస్యంగా జరిపిన తనిఖీల్లో వెల్లడైంది.

బయట పడిందిలా...: ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్మడమే గాక, ఏకంగా మద్యాన్నే తయారు చేసినా అమ్మడం ద్వారా సిండికేట్ రూ.5,125 కోట్లను అక్రమంగా ఆర్జించినట్టు ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ అత్యంత రహస్యంగా నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 2010 ఆగస్టునుంచి 2011 అక్టోబర్ వరకూ 14 మాసాల కాలంలో రాష్ట్రంలో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, అక్రమ మద్యం అమ్మకాలతో కలిగిన నష్టంపై సమీర్ శర్మ సర్వేలు చేయించినట్టు సమాచారం. మద్యం అమ్మకాల ముసుగులో వీలైనంతగా దండుకునే ఉద్దేశంతో, ‘ఎమ్మార్పీ ఉల్లంఘనలను పట్టించుకోవద్దు’ అంటూ ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించినా... వాటిని పక్కనబెట్టి మరీ కమిషనర్ సొంతంగా ఈ సర్వేలు చేయించారు. బాగా అమ్ముడయ్యే బ్రాండ్ల మద్యాన్ని ఎమ్మార్పీ కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువకు విక్రయించినట్లు వెల్లడైంది. పైగా పలు మద్యం దుకాణాల్లో ఏపీబీసీఎల్ నుంచి కొనుగోలు చేసిన దాని కంటే ఎక్కువ మద్యం నిల్వలున్నట్టు, ఓపెన్ మార్కెట్లో అమ్ముడవుతున్నట్టు పసిగట్టారు. దాంతో, మద్యం సిండికేట్లే స్వయంగా యంత్రాలను సమకూర్చుకుని మరీ బ్రాండెడ్ మద్యం ఉత్పత్తి చేస్తున్నారన్న నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ సహా విశాఖ, విజయనగరం, ఉభయ గోదావరి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, అనంతపూర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఈ బాగోతం సాగుతున్నట్టు నిర్ధారించారు. బాగా డిమాండున్న రెండు చీప్‌లిక్కర్, మూడు రెగ్యులర్+ బ్రాండ్లను ఇలా సిండికేట్లు సొంతంగా తయారు చేసి అమ్మడంతో ఏపీబీసీఎల్ అమ్మకాల కన్నా మొత్తం విక్రయాలు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే... ఏపీబీసీల్ గోడౌన్ల నుంచి కొనుగోలు చేసిన మద్యం కంటే ఖమ్మం జిల్లాలో 31 శాతం, విశాఖలో 28, విజయనగరంలో 24, వరంగల్, గుంటూరుల్లో 23, కర్నూలులో 19, నిజామాబాద్‌లో 18, హైదరాబాద్‌లో 23 శాతం మేరకు అధిక విక్రయాలు నమోదయ్యాయి!

ఎక్సైజ్, పోలీసుల ప్రేక్షక పాత్ర: ఇలా స్థానికంగా ఎక్కడికక్కడ యంత్రాలు సమకూర్చుకుని బ్రాండెడ్ మద్యం తయారు చేసి అమ్ముతున్న విషయం స్థానిక ఎక్సైజ్, పోలీసు సిబ్బందికి తెలిసినా, సిండికేట్ల నుంచి నెలవారీ లక్షల్లో ముడుతున్న ముడుపుల కోసం మౌనం వహించారు. అంతేకాదు, అప్పనంగా లాభాలొస్తున్నట్టు తెలిసి విశాఖలో ఓ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏకంగా రూ.2 కోట్లను మద్యం సిండికేట్‌లో పెట్టుబడిగా పెట్టారు! ఆ మొత్తం కూడా సిండికేట్ల నుంచి అందిన ముడుపులేనని తేలింది!! రాష్ట్రంలో సిండికేట్ల విశ్వరూపమేమిటో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఏసీబీ అధికారులు అంటున్నారు. అక్రమంగా మద్యం తయారు చేసి అమ్ముతున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలపైనే ఇప్పటిదాకా 10 మంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. 40 మంది దాకా సిండికేట్ నిర్వాహకులు అరెస్టయ్యారు. ఏసీబీ దాడుల కంటే ముందే సమీర్‌శర్మ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో కూడా పలు సంచలనాంశాలు ఉన్నాయని సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అది పనికొస్తుందని భావించిన సీఎం కిరణ్, ఆ నివేదిక ఆధారంగానే ఏసీబీ దాడులకు ఆదేశించారని కూడా తెలుస్తోంది. ఇక ఏసీబీ కూడా తమ దాడుల్లో బయటపడ్డ అనేక అంశాలను బయటపెట్టడం లేదు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారి ఒకరే స్వయంగా వెల్లడించారు. ‘మాకు దొరికిన ప్రతి అంశాన్నీ బయటపెడితే అనేక మంది ఘనాపాఠీలు బయటికొస్తారు. కానీ మేము ప్రభుత్వంలో భాగమే గనుక పై ఆదేశాలను పాటించక తప్పదు’ అన్నారు!
Share this article :

0 comments: